ఒక పోస్టు గ్రాజుయేట్ లాస్టూడెంట్ మీద అత్యాచారం చేశాడనే ఆరోపణ ఎదుర్కొంటున్న మాజీ కేంద్ర మంత్రి స్వామి చిన్మయానంద్ ను శుక్రవారం నాడు ఆరెస్టు చేశారు. ఆయనను పోలీసులు లోకల్ కోర్టులో హాజరుపర్చారు. కోర్టు ఆ స్వామీజీని 14 రోజుల జ్యుడిషియల కస్టడీకి పంపింది.
ఆరోపణలు చేసిన మహిళ చిన్మయానంద్ ని అరెస్టు చేయకపోతే ఆత్మహుతికి పాల్పడతానని హెచ్చరించడంతో ఆయనను అరెస్టు చేయాల్సి వచ్చింది. లేకపోతే, ఆయనను ముట్టుకోవడం చాలా కష్టం. అయితే, అరెస్టు వార్తలొచ్చినపుడు ప్రముఖులందరికి వచ్చినట్లే స్వామీజీకి కూడా చెస్ట్ పెయిన్ వచ్చింది. పోలీసులు ఆయన్ని కెజి ఆసుప్రతికి తరలించారు. తర్వాత ఆసుప్రతికంటే ఆశ్రమమే బాగుందని ఆశ్రమానికి వచ్చారు. ఈ ఛాతీ నొప్పి కూడా డ్రామా అనే ఫిర్యాదు దారు మరొక ప్రకటనచేశారు. దీనితో శుక్రవారం నాడు స్వామీజీని అరెస్టు చేశారు.
మూడు సార్లు ఉత్తర ప్రదేశ్ నుంచి ఎంపి అయిన ఈ స్వామీజి పలుకుబడిలో, ఆస్తులో సాటి లేని వాడు.అయితే, అమ్మాయిలతో మసాజ్ లు చేయించుకుని, అత్యాచారాలకు పాల్పడి, అపకీర్తి పాలయ్యాడు.గతంలో ఒక సారి తప్పించుకున్నా, ఇపుడు సాధ్యం కాలేదు. ముందు ముందు కేసేమవుతుందో గాని, ఇపుడయితే ఆయన్ని అరెస్టు చేశారు.హిందూ విలువలకోసం కట్టుబడిన సోషల్ వర్కర్ అని చెప్పుకునే ఈ స్వామీ జీ మీద ఫిర్యాదు చేసింది కూడా హిందువే.
చిన్మయానంద్ జీవితం ఇదే…
ఈయన పేరు విషయంలో జాగ్రత్త అవసరం. పూర్వం స్వామి చిన్మయానంద అనే ఒక స్వామీజీ ఉండే వారు. ఆయన చిన్మయ మిషన్ వ్యవస్థాపకుడు. ఆయన పూర్తి పేరు స్వామిచిన్మయానంద సరస్వతి. ఇపుడు అరెస్టయిన ఈ పెద్ద మనిషి పేరు స్వామి చిన్నయానంద్. 1947లో ఉత్తర ప్రదేశ్ లోని గోండా జిల్లాలో జన్మించాడు.
ఈయన తొలిపేరు క్రిష్ణ పాల్ సింగ్. వాజ్ పేయి మూడో ప్రభుత్వంలో దేశీయ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉండేవారు. ఉత్తర ప్రదేశ్ కు చెందిన వాడు. మొదట 1998లో మచ్లీశహర్ నుంచి, 1991లో బదౌన్ నుంచి 1999లో లోక్ సభకుఎన్నికయ్యాడు.
న్యాయ శాస్త్రం చదివాడని చెబుతారు. ఉత్తర ప్రదేశ్ ప్రాచ్య దర్శన్ మహా విద్యాలయ నుంచి పిహెచ్ డి కూడా ఉందని లోక్ సభ ప్రొఫైల్ చెబుతుంది. అవివాహితుడు. తంత్ర, తత్వశాస్త్రం, యోగ, హిందూ పురాణాలలో ఆయన స్పెషలిస్టు అనే పేరుంది. రెండు మాస పత్రికలకు (పరమార్థ్, వివేక్ రశ్మి) సంపాదకుడు. ఉత్తర ప్రదేశ్ లోని షాజహాన్పూర్ లో ఆయన కు ఒక ఆశ్రమం ఉంది. న్యాయశాస్త్ర విద్యార్థి చేసిన అత్యాచార ఆరోపణల మీద ఆయనను సిట్ శుక్రవారం నాడు ఈ ఆశ్రమం నుంచే అరెస్టు చేసింది.గత వారంలో ఆయనను చాలా సేపు విచారణ చేశాక ఇపుడు అరెస్టు చేశారు.
ఈ స్వామి ఎపుడు లైంగిక వేధింపు ఆరోపణల మధ్యే బతుకుతూంటాడు. ఆశ్రమంలో చాలా కాలం పని చేసిన ఒక బాలిక 2011 లో ఈయన మీద తీవ్రమయిన లైంగిక దాడి ఆరోపణలు చేసింది. తనను బలవంతంగా ఎత్తుకొచ్చాడని, బలత్కారం చేశాడని ఆ బాలిక ఫిర్యాదు చేసింది. ఈ కేసు చాలా కాలంలో నడిచింది. అయితే, స్వామీజీ మరీ పెద్దవాడు, బాలిక మరీ అనామకురాలు. ఈ వ్యవస్థలో ఈలాంటి కేసులు ఎలా నిలుస్తాయి?
2018లో ఉత్తర ప్రదేశ్ లోని బిజెపి ప్రభుత్వం ఈ కేసును ఉపసంహరించుకుంది. తర్వాత 2019లో ఈ స్వామిజీ నడుపుతున్న ఒక లా కాలేజీ విద్యార్థి ఆయన మీద ఇలాంటి ఆరోపణలే చేసింది. ఈ సారి ఈ అమ్మాయి పకడ్బందీగా వ్యవహరించింది. ఏకంగా కెమెరాలు అమర్చి, కథనంతా చిత్రీకరించి సోషల్ మీడియాలో విడుదల చేసింది. దీని ఆధారంగా ఆయన మీద కేసు లుపెట్టారు. ఆ అమ్మాయి తర్వాత కనుమరగయింది.
ఈయనకు కాలం కలిసొచ్చి ఒక మంచి స్వామీజీ ఏర్పటు చేసిన హిందూ ధర్మసంస్థ విద్యాసంస్థల సామ్రాజ్యానికి అధిపతి అయ్యాడు. అదెలా జరిగిందో చూద్దాం.
1940 వ దశాబ్దంలో ఉత్తర ప్రదేశ్ లోని షాజహాన్ పూర్ లో స్వామి సుఖ్ దేవానంద్ సరస్వతి అనే స్వామీజీ ఉండే వారు. భారతీయ విలువలను ప్రచారం చేయడం వల్ల మాత్రమే హిందూ సమాజం పునరుజ్జీవం పొందుతుందని ఆయన నమ్మే వాడు. ఆయన వయసుకూడా అపుడు 40 సంవత్సరాలుంటాయి.
ఏడాదిలో ఎక్కువ కాలం రిషికేష్ లో ధ్యానం చేస్తూ, శిష్య పరివారం మధ్య గడిపేవాడు. మిగతా కాలమంతా ఉత్తర భారత దేశంలో యాత్రచేస్తూ హిందూ విలువల గురించి ముఖ్యంగా హిందూ సంస్కృతి, సన్యాసం, పరిత్యాగం వంటి వాటి గురించి ఉపన్యాసాలిస్తూ ఉండేవాడు.
ఈ హిందూ విలువలను విద్య ద్వారా మాత్రమే పటిష్టమ్ చేయగలమని ఆయన నమ్మే వారు. దీనికి ఆయన తన సొంతవూరు షాజహాన్ పూర్ ను ఎంచుకున్నారు. మొదట ‘పరమార్థ్’ అనే పత్రిక స్థాపించారు. షాజహాన్ పూర్ లో 1947లో గాంధీ ఫైజ్ ఇ ఆమ్ (జిఎప్ కాలేజీ) కాలేజ్ ఏర్పాటయింది. ఇది ఇస్లామిక్ కల్చర్ ను ప్రచారం చేస్తూ ఉందని ఆయన అనుమానం. అందుచే పోటీ గా తాను దేవీ పంపత్ సాంస్క్రిట్ మహా విద్యాలయ అని ఒక విద్యాసంస్థను, స్వాతంత్య్రం వచ్చాక స్థాపించారు.
రెండేళ్ల తర్వాత 1951లో శ్రీ దేవీ సంపత్ ఇంటర్ కాలేజీ (SDSIC)ని స్థాపించారు. తర్వాత స్వామి సుఖ్ దేవానంద్ పోస్టు గ్రాజుయేట్ కాలేజీ (SSPG)ని స్థాపించారున తర్వాత సంస్కత కళాశాలను ప్రారంభించారు.
అయితే, ప్రజల్లో సంస్కృత విద్య మీద ఆసక్తి లేకపోవడంతో ఆయన అధునిక విద్య మీదకు దృష్టి మళ్లించారు. మాథ్స్, సైన్స్ ల బోధన మొదలయింది. అన్నింటికంటే ముఖ్యంగాఇంగ్లీష్ మీడియంలోకి వ్యవస్థను మార్చాల్సి వచ్చింది.
స్వామి సుఖ్ దేవానంద్ 1965లో చనిపోయారు. అప్పటికి షాజహాన్ పూర్ లో ఆయన మూడు విద్యాసంస్థలను, రిషికేష్, షాజహాన్ పూర్, హరిద్వార్ లలో మూడు ఆశ్రమాలను, అమెరికా పిట్స్ బర్గ్ లో ఒక హిందూ జైన్ మందిరాన్ని ఏర్పాటు చేశారు.వీటన్నింటిని పర్యవేక్షించేందుకు 1962లో స్వామి సుఖ్ దేవానంద్ ట్రస్టు మొదలయింది.
స్వామి సుఖదేవానంద్ మరణం తర్వాత యుపి బులంద్ శహర్ కు చెందిన స్వామి ధర్మానంద్ వారసుడయ్యాడు. ట్రస్టు బాధ్యతలు స్వీకరించారు. ఆయన 1989లో శ్రీ శంకర్ ముముక్ష్ విద్యాపీట్ (SSMV) ని స్థాపించారు. 1991లో ధర్మానంద్ చనిపోయారు. అపుడు 44 సంవత్సారాల వయసు ఉన్న, హిందూత్వ ఫైర్ బ్రాండ్ అని పేరు పడిన స్వామి చిన్మయానంద్ చేతికి ట్రస్టు వారసత్వం వచ్చింది.
చిన్మయానంద్ చిన్నపుడే ఇల్లొదిలి పోయాడు. ధర్మానంద శిష్యగణంలో చేరాడు. హిందూ ధర్మ ప్రచారంలో శిక్షణ పొందాడు.
విశ్వహిందూ పరిషత్ కు పెద్దిదిక్కలా గా ఉండిన అశోక్ సింఘల్ బతికున్న రోజుల్లో షాజహాన్ పూర్ ఆశ్రమానికి తరచూ వచ్చేవాడు. అపుడు చిన్మయానంద్ తో పరిచయం ఏర్పడింది. పెద్ద ఆశ్రమాలు, విదేశాలలో గుడి నిర్వహణ, కాలేజీల.. ఇలా చిన్మయానంద్ చేతిలో ఒక చిన్న సామ్రాజ్యం ఉండటంతో బిజెపిలో పలుకుబడి బాగా పెరిగింది.
1980 దశాబ్దంలో ఆయనని ‘రామజన్మభూమి ముక్తి సంఘర్ష సమితి’ జాతీయ కన్వీనర్ గా నియమితులయ్యారు. ఇట్లా ఆయన విద్యారాజకీయాలనుంచి మందిర్ రాజకీయాల్లోకి మళ్లారు. ఈ క్రమంలోనే ఆయన నాటి బిజెపి సీనియర్ నేత ఎల్ కె అద్వానీకి కూడా చేరువయ్యారు. 1991లో విశ్వనాథ్ సింగ్ కేంద్ర ప్రభుత్వం పడిపోయాయ ఎన్నికలొచ్చినపుడు భారతీయ జనతా పార్టీ ఆయనను బదౌన్ నియోజకవర్గం నుంచి పోటీ పెట్టింది.
ఆపుడాయన నాటి కేంద్ర మంత్రి శరద్ యాదవ్ ను 15 వేల వోట్ల మెజారిటీతో గెలిపించారు. బిజెపికి మొత్తం 119 సీట్లొచ్చాయ్. మెల్లిగా ఆయన పార్లమెంటులో కాలుపెట్టారు.
1992లో బాబ్రి మసీద్ కూల్చివేత చిన్మయానంద్ ను హీరోని చేసింది. కూల్చివేతలో ఆయనే ప్రముఖ పాత్ర పోషించారు. కూల్చివేత విచారణ జరిపిన లిబర్హాన్ కమిషన్ పేరుపెట్టిన జాయింట్ కామన్ ఎంటర్ ప్రైజ్ లో ప్రముఖుడీయనే.
కూల్చివేతకు 9 రోజుల ముందు సుప్రీంకోర్టులో ఆయనలో ఒక ఆఫిడవిట్ వేశారు. డిసెంబర్ ఆరో తేదీన నిర్వహించతలపెట్టిన కరసేవ వల్ల శాంతిభద్రతలకు భంగం ఉండదని హామీ ఇచ్చారు. దీనిని విశ్వసించి సుప్రీంకోర్టు కరసేవకు అనుమతినిచ్చింది.
2009లో బాబ్రీ మసీద్ కూల్చవేత మీద విచారణ జరిపిన లిబర్ హాన్ కమిషన్ చాలా స్పష్టంగా ‘ కర సేవ వెనక బాబ్రీ మసీదు కూల్చేయాలన్న పథకం ఉంది. దీనికి వినయ్ కతియార్, పరమహంస రామ్ చందర్ దాస్, అశోక్ సింఘల్, స్వామి చిన్మయానంద్, ఎస్ సి దీక్షిత్, బిపి సింఘల్, ఆచార్య గిరిరాజ్ నాయకత్వం వహించారు,’ అని స్పష్టంగా పేర్కొంది. బాబ్రీ మసీద్ కూల్చివేత వీళ్లందరి సమిష్టి కార్యక్రమం (Joint Common Enterprise) అని కమిషన్ స్పష్టంగా పేర్కొంది.
తర్వాత 1998లో మచ్లీ శహర్ నుంచి 1999లో జౌన్ పూర్ నుంచి స్వామి చిన్మయానంద్ లోక్ సభ కు ఎన్నికయ్యారు. మూడో సారి ఎన్నికయ్యాక ఆయనకు వాజ్ పేయి మంత్రి వర్గంలో 2003లో హోమ్ శాఖ సహాయ మంత్రిగా చోటు దక్కింది.2003లో ఆయన స్వామి సుఖ్ దేవానంద్ లా కాలేజీ ప్రారంభించారు.
ఈ ఏడాది ఆగస్టు 23న, ఈ కాలేజీలో ఎల్ ఎల్ ఎమ్ చదువుతున్న ఒక మహిళ ఒక వీడియో ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. సన్యాసులకంతా లీడర్ గా చెప్పుకుంటున్న ఒక వ్యక్తి ఈ కాలేజీలో చాలా మంది మహిళ జీవితాలను నాశనం చేశాడని, ఈ విషయాలను బయటపెడితే, కుటుంబాలను లేపేస్తానంటున్నడని వెక్కి వెక్కి ఏడుస్తూ ఆమె తన కష్టాలను బయటపెట్టింది.
ఆమె ఎవరి గురించి చెబుతున్నదో అందరికీ తెలిసిపోయింది. ‘ఆయన చాలా పలుకుబడి ఉన్నవాడు, జిల్లా కలెక్టర్, ఎస్ పిలు కూడా ఆయన్నేమీ చేయలేరు,’ అని చెబుతూ ఇక్కడ జరిగిన అన్యాయాలకు తన దగ్గిర సాక్ష్యం ఉందని కూడా ఆమె చెప్పింది. ఆ మరుసటి రోజునుంచి ఆమె కనబడకుండా పోయింది.
తర్వాత స్వామీ లీలలు చాలా బయటపడ్డాయి. ఆయన అమ్మాయిల చేత మసాజ్ చేయించుకుంటున్న వీడియో ఉందని అమర్ ఉజాలా హిందీ పత్రిక రాసింది. మసాజ్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి.
ఫిర్యాదు చేసిన ఎల్ ఎల్ ఎమ్ స్టూడెంట్ తన దగ్గిర పూర్తి వీడియో సాక్ష్యం ఉందని చెబుతూ ఉంది. సోషల్ మీడియా లో వైరలవుతున్న మసాజ్ ఫోటోలు, లా స్టూడెంట్ ఆరోపణల నేపథ్యంలో స్వామి చిన్మయానంద్ ను అరెస్టు చేయక తప్పలేదు.