శేఖర్ రెడ్డి జగన్ మనిషా? చంద్రబాబు మనిషా?

చెన్నై శేఖర్ రెడ్డి అనే పేరు వినబడగానే అపుడే కొత్తగా ముద్రించి, ప్రెస్ నుంచి బయటకు తీసుకువచ్చి, పెళపెళమని సౌండ్ చేస్తూ ఇంకా సెక్యూరిటీ ప్రెస్ వాసన కూడా వీడని మోదీ గారి రెండు వేల రుపాయల నోట్లు గుర్తు కొస్తాయి.
దేశంలో జనానికి ఒక్క నోటు కూడా దొరకక ఎటిఎం ల దగ్గిర, బ్యాంకుల దగ్గిర రేయింబగళ్లు వచ్చీ రాని నోటు కోసం పడిగాపులు  కాస్తున్నపుడు చెన్నై కి చెందిన కాంట్రాక్టర్  ఎజె శేఖర్ రెడ్డి అనే పెద్దాయన ఇంట్లో ఐటి అధికారులు జరిపిన దాడులలో దాదాపు 10 కోట్ల కొత్త రెండువేల రుపాయల నగదు కట్టలు కట్టలు దొరికాయి.దేశం విస్తుపోయింది. తెలుగువాడు కావడంతో తెలుగువాళ్లంతా అవాక్కయ్యారు  ఆ నోట్ల కట్ట కట్టలు చూసి. ఎందుకంటే ఏ బ్యాంకు  కూడా ఎవరికీ రు. 24 వేల  మించి విత్ డ్రా చేసుకోకుండా నిషేధం ఉన్న రోజులవి.
అవి ఎలా వచ్చాయో, ఎవరిచ్చారో, ఏ బ్యాంకు నుంచి వచ్చాయో లేక   ఏకంగా నాసిక్ సెక్యూరిటీ ప్రెస్ నుంచి శేఖర్ రెడ్డి ఇంటికి వచ్చాయో… ఇంకా ఎవరికీ తెలియదు. అధికారులు గాని, పోలీసులు గాని ఈ విషయాన్ని బయటకు పొక్కనీయలేదు.
రెండు రోజులు పత్రికలు శేఖర్ రెడ్డి గురించి తెగరాశాయి. ఐడి దాడులు, భారీగా కొత్త నోట్ల నగదు దొరకడం, వివిధ సెక్షన్ల కింద ఆయన మీద కేసులు పెట్టడం… వాటి మీద జరిగే ప్రచారంతో తత్తరపడిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన్ని టిటిడి బోర్డు నుంచి తొలగించారు. ఆయన్నెలా ఏడుకొండల వాడి సేవలకు నియోగించారో సమర్థించుకోలేక చంద్రబాబు నానాయాతన పడ్డారు.
శేఖర్ రెడ్డి చంద్రబాబు బినామీ అన్నారు ఎగస్పార్టీ వాళ్లు. చాలా మంది నిజమే అనుకున్నారు. ఎందుకంటే టిటిడి బోర్డు మెంబర్ కావాలంటే ముఖ్యమంత్రి (అదెవరైనా సరే)రి బాగా దగ్గరయుండాలి. శేఖర్ రెడ్డితో తను అనుబంధాన్ని చంద్రబాబు దానిని ఖండించలేక, సమర్థించనూ లేక  నానా అగచాట్టు బడ్డారు.
తర్వాత శేఖర్ రెడ్డిని, పెళపెళలాడే ఆయన కొత్త నోట్ల కట్టలను అంతా మర్చిపోయారు.
అయితే ముఖ్యమంత్రి జగన్ మాత్రం అయన్ని మర్చిపోలేదనిపిస్తుంది.
 శేఖర్ రెడ్డి గొప్పతనం కూడా అదే. ఆయన అందరికి అయిన వాడు. ఆయన్ని ఎవరూ దూరం చేసుకోలేరు.ఆయన దూరం జరిగితే సహించలేరు. అందుకే వార్తల్లో లేకుండా పోయినా శేఖర్ రెడ్డికి ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి ఆయనకు న్యాయ చేయాలనుకున్నారు. ఆయన పేరు ఎ జె శేఖర్ గా మార్చి టిటిడి బోర్డులోకి తీసుకువచ్చారు. కాకపోతే, ప్రత్యేకాహ్వానితుడని సరికొత్త గౌరవం కల్పించారు.
శేఖర్ రెడ్డి ఇసుక నుంచి డబ్బు పుట్టించిన వాడు. ఆయన ఇసుక వ్యాపారి. దేశంలో  ఇసుక ద్వార పెద్ద వాడయిన వాళ్లలో ఆయనొకరు
జగన్ ప్రభుత్వం టీటీడీ పాలకమండలిలో 24 మంది కొత్త సభ్యులను నియమించిన సంగతి తెలిసిందే. ఇందులో ఏడుగుర్ని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు. వీరిలోతిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఒక్కరు మాత్రమే ఏపీకి చెందినవారు. మిగతా వారంతా బయటి వారు. రాకేశ్ సిన్హా (ఢిల్లీ), చెన్నైకి చెందిన ఏజే శేఖర్‌ (ఛైన్నై), ఉపేందర్‌ రెడ్డి (బెంగుళూరు), గోవింద హరి (హైదరాబాద్), దుశ్మంత్‌ కుమార్‌ దాస్‌ (భవనేశ్వర్ ), అమోల్‌ కాలే(ముంబై) .
సభ్యుల లాగా ప్రత్యేక ఆహ్వానితులు కూడా టీటీడీ బోర్డు సమావేశాలకు హాజరవుతారు. వారికి బోర్డు సభ్యులతో సమానంగా ప్రోటోకాల్ ఉంటుంది, గౌరవ మర్యాదలుంటాయి. కాకపోతే, టీటీడీ పాలకమండలి తీర్మానాల పుడు ఎలాంటి ఓటు హక్కులు ఉండవు. ఓటు దాకా ఏ తీర్మానం రాదు.
నేరస్థుడని ముద్రపడటంతో బయటకు పోయిన  శేఖర్ రెడ్డి మళ్లీ లోపలికి రావడమే ఆశ్చర్యం. టిడిపి హయాంలో చదలవాడ కృష్ణమూర్తి టీటీడీ చైర్మన్‌గా ఉన్నప్పుడు శేఖర్‌ రెడ్డి పాలకమండలి సభ్యుడిగా నియమించారు.
ఇపుడు శేఖర్ రెడ్డిని టీటీడీ పాలక మండలిలో ప్రత్యేక ఆహ్వానితుడిగా జగన్ సర్కారు నియమించడాన్ని తెలుగుదేశం ప్రశ్నిస్తూ ఉంది. శేఖర్ రెడ్డిని చంద్రబాబు బినామీ అని విమర్శించిన వాళ్లే ఇప్పుడు ఆయనకు పాలక మండలిలో అవకాశం కల్పించడంలో రహస్యం ఏమిటి, శేఖర్ రెడ్డి ఎవరికి బినామీ అని వారు ప్రశ్నిస్తున్నారు.