Home Entertainment ఆకాశతింటే నిరమ్: పాత మూవీ కొత్త రివ్యూ

ఆకాశతింటే నిరమ్: పాత మూవీ కొత్త రివ్యూ

245
4
Aakashathinte Niram

(శారద శివపురపు)

అనుభూతికి భాష అవసరమా?  దుఃఖానికి స్పర్శ అవసరమా ? స్పర్శకి వాక్యం అవసరమా?  కానీ వాక్యం వాచ్యం అయితే దాని సందర్భాన్ని బట్టి అందులో ఏంనింపినా, అంటే ప్రేమా, కోపం, దుఃఖం, ద్వేషం, పగా ఏదైనా పండుతుంది.  అదే ఒక సినిమా కోసం అయితే మరీ బాగా పండుతుంది. అయితే ఇవేవీ అసలు అవసరమే కాదన్నట్టు, అన్ని ఇమోషన్స్ నీ కేవలం కళ్ళతోనే, బాడీ లాంగ్వేజ్ తోనే పండించగలగటం మలయాళ సినిమా డైరెక్టర్ల కి బాగా వచ్చు.

హీరోయిన్ ఉంది అని అనుకుంటే ఆ అమ్మాయి మూగ, most unglamorous dressing, no make up  తో ఉంటుంది.  వయసులో  ఉన్నాడు కదా అని హీరో అనుకుంటే అతనికి పట్టుమని పది డైలాగ్స్ కూడా ఉండవు. పైగా అతను ఒక జేబు దొంగ. చివరికి అసలు హీరో ఆ ముసలి కేరక్టర్ అని అనిపిస్తుంది.  అసలు అందులో అందరూ హీరోలేనేమో అనిపిస్తుంది. ఎందుకంటే, ఏ వయసులో ఉన్నా జీవితం సరిగా అర్థం చేసుకున్నవాడే కదా అసలు హీరో.

ఆకాశతింటే నిరమ్ ( Akasathinte Niram)  ప్రైమ్ లో చూడచ్చు. నెడుమూడి వేణు అనే తన కేరక్టర్ పేరుతోనే గుర్తింపు పొందిన, 500 కి పైగా సినిమాల్లో నటించిన కేశవన్ వేణుగోపాల్, ఇంద్రజిత్, అమలా పాల్, ఇంకా  సపోర్టింగ్ రోల్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన చిత్రం.

దర్శకుడు డా. బిజు, లేక బిజుకుమార్ దామోదరన్, దర్శకుడిగా మారిన హోమియో డాక్టర్.  2012 లోనే తీసిన ఈ సినిమా, షాంఘై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శింపబడింది, మరెన్నో పురస్కారాలు గెలుచుకుంది.  ఇంత పాత సినిమాకి ఇప్పుడు రెవ్యు అవసరమో లేదో మరి.

 


మళయాళ ప్రేక్షకుల మాటెలా ఉన్నా తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా గురించి తెలియటం అవసరం


సినిమా అంతా అందమైన అండమాన్లోని ఓ చిన్న నిర్మానుష్య ద్వీపంలో జరిగే కొన్నాళ్ల కథ.  అద్భుతమైన లొకేషన్లలో అత్యద్భుతమైన సినిమాటోగ్రఫీ.  సినిమా అర్థం అయినా కాకున్నా అండమాన్ అందాలు ఆస్వాదించడానికి భాష రానక్కర్లేదులే అని మొదలెట్టా.   అయితే ఇంగ్లీష్ లో సబ్ టైటిల్స్ ఉన్నాయి, కానీ అవి చదివే అవసరం కూడా పెద్దగా రాలేదు.

ప్రకృతి సమక్షంలో మౌనమే ధ్యానం,  ధ్యానంలోనే జ్ఞానోదయం.  టూకీగా చెప్పాలంటే ఇదే సినిమా.

వినేవారెవరూ లేకపోయినా నిరంతరం తీరం తాకుతూ ఘోష పెట్టే నీలిసముద్రం.  బంగారం పొడి చేసి రాశిగా పోసినట్టుగా స్వచ్ఛమైన ఇసుక తీరం. తీరాన్నానుకుని, చుట్టుపట్ల  పచ్చటి చెట్ల మధ్య ఇంకేమీ కనిపించకపోయినా ఓ చక్కని అందమైన కుటీరం అన్ని సౌకర్యాలతో.  నెడుమూడి వేణు ఒక వృద్ధుడు, శిల్పి, కళాకారుడు, జీవితానుభవంతో పాటు ఎన్నో పుస్తకాలు చదివిన జ్ఞానం.   తాను తయారు చేసిన కళాఖండాలు దగ్గరలోని హార్బర్ వద్ద ఉన్న షాప్ లో అమ్మి ఆ వచ్చిన డబ్బుతో కావాల్సిన సరుకులు కొనుగోలు చేసి తన మోటార్ బోట్లో వెనక్కి వెళ్తుంటాడు. వృద్ధుడిని బెదిరించి అతని బోటులో అతని దగ్గరున్న డబ్బు బలవంతంగా లాక్కోవడానికి విఫలంగా  ప్రయత్నిస్తాడు ఈ దొంగగా నటించే ఇంద్రజిత్.

అయితే ఈ ఇంద్రజిత్  స్విమ్మింగ్ రాక, ఇటు బోటునీ నడపలేక నిస్సహాయంగా  ఇరుక్కుపోయి వృద్ధుడితో పాటు బలవంతంగా  ఆ చిన్న ఐలాండ్ లోని ఆ ఇంటికి వెళ్లాల్సి వస్తుంది.  వెళ్లిన తర్వాత అక్కడకి ఎందుకు తీసుకువచ్చాడో ఎప్పుడు తిరిగి వెళ్ళనిస్తాడో, అంతా అనిశ్ఛితి.  ఎవరూ ఏమీ మాట్లాడరు. ఇందులో ఎవరికీ పేర్లు లేవు. ఎవరూ ఒకరినొకరు పేరు పెట్టి పిలుచుకోరు. అసలు ఎక్కువగా మాట్లాడరు.

వంట పని తోట పని చేస్తూ అక్కడ ఇంకా ఒక వయసులో ఉన్న అమ్మాయి ఇంకొక ఆరోగ్యంగా ఉండే ఒక మూగ కాదు కానీ బాగా నత్తిగా మాట్లాడే మధ్య వయస్కుడు, ఇంకొక ఆరేడేళ్ల పిల్లవాడు వృద్ధుడితో పాటు ఉంటారు.  ఎవరూ ఎవరికీ ఏమీ కాకున్నా అన్నీ అయినట్లు ఉంటారు. దొంగతనం చేస్తూ పట్టుబడ్డ కారణంగా అనుకుంటా ఇంద్రజిత్   గట్టిగా ఏమీ చెప్పలేక తనకి ఇచ్చిన రూమ్ లో మౌనంగా ఉంటాడు. కోపంతో ఆ రూమ్ లో ఉన్న కళాఖండాలని నేలకేసి కొట్టి పగలగొడతాడు. వృద్ధుడు ఏమి మాట్లాడకుండా నవ్వి ఊరుకుంటాడు.

అసలు వీళ్ళు ఎవరూ, ఏంటి వాళ్ళ జీవితం అర్థం కాక జుట్టు పీక్కుంటుంటాడు. నువ్వు వెళ్ళే సమయం వచ్చినప్పుడు పంపిస్తా అన్న  వృద్ధుడు ఎప్పుడూ కూడా తనను వదిలేసి వెళ్లిపోవడం  కోపం తెప్పింస్తుంటుంది. ఓ రోజు ఓ శవ పేటిక తీసుకొస్తారు. తెరిచి చూస్తే శవం ఉంటుంది. బెదిరిపోతాడు. మొదట్లో అందరితో పోట్లాడిన వాడు తర్వాత కొంత సర్దుబాటు చేసుకుంటాడు.  పిల్లవాడితో కొంత మాట్లాడుతాడు, ఆడతాడు.  వంట చేసే అమ్మాయితో తోట పనిలో సాయపడటానికి ట్రై చేస్తాడు. ఓ రోజు  వృద్ధుడు తనతో పాటు మోటర్ బైక్ మీద ఇంకోచోటకి తీసుకెళ్తాడు.  అది ఇంకొక ఇల్లు.  అక్కడ చాలా మంది వ్యక్తులు ఉంటారు. అంతా వృద్ధులయినా అందరూ పని చేస్తుంటారు. సాయంత్రం అయేప్పటికీ మందు వేసుకొని ఆట డాన్స్ లతో ఆనందిస్తుంటారు. రాత్రి అంతా నేల మీద హాయిగా పడుకుంటారు.   ఇతనికి ఏమీ అర్థం కాదు. అప్పుడు అక్కడికి పృథ్వీరాజ్ సుకుమారన్  వ‌స్తాడు.   అతను డాక్టర్ అని అర్థమవుతుంది.  అందరికీ బీపీ చూస్తాడు, మందులు రాస్తాడు, ఏం తినాలి, ఏం చేయాలి చెప్తాడు.  వాళ్ళతో కాసేపు ఆటలాడుతాడు.  నాలుగు మాటలు మాట్లాడుతాడు.  విషయం ఏంటంటే అక్కడ ఉన్న వృద్ధులు అంతా నయం కాని జబ్బులతో బాధపడుతూ ఎప్పుడు పోతారో తెలియనివారు.   ఇంద్రజిత్ ఆశ్చర్యపోతాడు. వాళ్లంతా పగలంతా కష్టపడి వాళ్ళకి కావలసిన కూరలు వాళ్లే పండించుకోవడం, బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా ఆనందంగా శేష జీవితాన్ని గడపడం చూశాక వారికి ఒక డిగ్నిఫైడ్ డెత్ ఇవ్వడం కోసం  ఇక్కడికి తీసుకొచ్చి వృద్ధుడు ప్రయత్నిస్తున్నాడని అర్థమవుతుంది. అక్కడ ఎవరికి నచ్చిన పని వారు చేస్తుంటారు. ఒకాయన కవిత్వం రాస్తాడు, అతనికి మాత్రం డిస్టర్బ్ చేయొద్దు అంటారు. ఆయన పెయింటింగ్స్ కూడా వేసి అక్కడ అందరికీ గిఫ్ట్ ఇస్తుంటాడు.

అలా ఉండగా ఒక రోజు ఒక వృద్దుడు కాలం చేస్తాడు. అందరూ అతనికి  గౌరవమైన వీడ్కోలు చెప్తారు. మొదట్లో తోట పని చేయడానికి ఇష్టపడని ఇంద్రజిత్  ఉరఫ్ దొంగ తర్వాత అన్నీ ఇష్టంగాచేయడం మొదలుపెడతాడు. అక్కడ కొన్ని రోజులు ఉన్నాకా మళ్ళీ మొదటి ఇంటికి తీసుకొస్తాడు వృద్ధుడు. అక్కడ అందరూ దొంగలో ఎంతో మార్పు గమనిస్తారు.  మౌనంగా వాళ్ళ జీవితాన్ని,  జీవనశైలిని గమనిస్తూ తన జీవితానికి ఇక్కడ జీవితానికి ఉన్న తేడా గమనిస్తూ దొంగ చివరికి అక్కడ మనుషులందరినీ ఇష్టపడ్డం మొదలుపెడతాడు. అలాంటి టైంలో వృద్ధుడు నువ్వు ఇంక వెనక్కి వెళ్ళే టైమ్ వచ్చిందని బోట్ ఎక్కించి టౌన్ కి తీ‌స్కెళ్ళి కొంత డబ్బు చేతిలో పెట్టి దొంగగా బతకవద్దని చెప్పి వచ్చేస్తాడు. బోట్ తిరిగి ఇంటికి వచ్చినప్పుడు అందులోంచి హీరో ఇంద్రజిత్ కూడా దిగి నప్పుడు అంతా సంతోషిస్తారు. మూగ పిల్ల కళ్ళల్లో  ప్రత్యేకంగా మెరుపులు కనిపిస్తాయి. సినిమా ప్రైమ్ లో ఇనీషియల్ ఆఫర్ గా ఫ్రీగా చూడచ్చు ఒకవేళ మీరు సబ్స్క్రయిబ్ చేసుకోకపోతే.

మళయాళ సినిమా ఇండస్ట్రీ మీనింగ్ఫుల్ సినిమాని ప్రేక్షకులకందించడంలో ఇంత ముందుంటే, తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే ఓనమాలు దిద్దుతోంది.  ఇప్పుడు కొన్ని మంచి సినిమాలు ఓటీటీ ప్లాట్ ఫామ్ లో మెరవడం ఓ శుభారంభం.

(శారద శివపురపు, రచయిత్రి, బ్లాగర్. బెంగళూరు)

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here