జూలై 3: అంతర్జాతీయ ప్లాస్టిక్ సంచుల వాడక నిషేధ దినం

(డాక్టర్. జె.వి.ప్రమోద్ కుమార్*)
ఆధునిక నాగరిక ప్రపంచంలో ప్లాస్టిక్ ఆవిష్కరణ మానవజీవితాన్ని ఎంతో సౌకర్యవంతంగా మార్చింది. గతంలో వాడిన లోహ పాత్రలు, చెక్క ఫర్నీచర్ స్థానంలో ప్లాస్టిక్ వస్తువులు వచ్చి చేరాయి. మార్కెట్ కు వెళ్లి ఏ వస్తువు కొనుగోలు చేసిన గతంలో పేపర్ లో కట్టి ఇచ్చేవారు. ఇప్పుడు ప్లాస్టిక్ కవర్లు లో వేసి ఇస్తున్నారు. ప్లాస్టిక్ కవర్ల వాడకం ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయింది. దాని వల్ల ప్లాస్టిక్ చెత్త పెరిగిపోయింది. చివరకు అది మానవాళికి ముప్పు కలిగించే వాతావరణ కాలుష్యం కలిగిస్తుంది. దీనితో ప్లాస్టిక్ వదిలించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.
World Count Facts  ప్రకారం ఏటా ప్రపంచంలో 5 ట్రిలియన్ ప్లాస్టిక్ బ్యాగులు వాడుతున్నారు. అంటే సెకండ్ కు 1,60,000 బ్యాగులున్నమాట. ఈ బ్యాగులన్నింటిని ఒక చోట కుప్ప పోస్తే ఫ్రాన్స్ దేశమంతా భూభాగాన్ని ఆక్రమిస్తాయన్నమాట.
ఒక లెక్కప్రకారం ఒక బ్యాగ్ ను  మనం 25నిమిషాలకంటే ఎక్కువ సేపు వాడం. తర్వాత పడేస్తాం.అదిచెత్తలోకి చేరుతుంది. కుళ్లిపోయి మట్టిలోకలిపిపోయేందుకు 100 నుంచి 500 సంవత్సరాలు పడుతుందని చెబుతున్నారు. సముద్రంలో తేలే చెత్తలో 80 శాతం ప్లాస్టికే.
అందువల్లే ఈ స్పృహ ప్రజలలో కలిగించేందుకే  అంతర్జాతీయ ప్లాస్టిక్ సంచుల వాడక నిషేధ దినం (International Plastic-bag Free Day) ఏటా జూలై 3 న పాటిస్తున్నారు. అంతర్జాతీయ ఎన్జీవోల కూటమి Break Free from Plastic ఆధ్వర్యంలో ఈ దినం పాటిస్తున్నారు.
ప్లాస్టిక్ ఎలా వచ్చింది
ప్లాస్టిక్ అనేది ప్రమాదవశాత్తు తయారయింది.  1933లో  ఇంగ్లండ్ నార్విచ్ లో ఒక కెమికల్ ప్లాంట్ లో తయారయిది. అక్కడి ICI Walltescote ప్లాంట్ లో పాలిమర్స్ మీద చేస్తున్న ఒక ప్రయోగం విఫలమయింది. ఫలితంగా తెల్లగా మైనం వంటి పదార్థం తయారయింది. ఇది పాలిఇథైలీన్. దీనినే పాలిథీన్ అంటారు.ఈ మైనం లాంటి పదార్థం తయారుకావడం ఆరోజు నైట్ డ్యూటీ లో ఉన్న జార్జ్ ఫీకెమ్ అనే కుర్ర కెమిస్టు పసిగట్టాడు. తను ప్రయోగం లోవచ్చిన పదార్ధం చూస్తుండగానే ప్రపంచాన్ని జయిస్తుందని జార్జి వూహించలేదు. జార్జి ఫ్లాస్టిక్ కనిపెట్టిన విషయం 2009లో తెలిసింది. ఆయన కు సంబంధించిన పాత సామాన్లను శోధిస్తూన్నపుడు ఒక చిన్న ముక్కోణపు బిల్ల కనిపించింది. దాని మీద జిఎఫ్ అనే అక్షరాలున్నాయి. తాను డ్యూటీలో ఉన్నపుడు తయాయిన మైనపు బిల్ల ఇది. దీనిని ఆయన గుర్తుగా చాలా జాగ్రత్తగా దాచుకున్నాడు. దీనిని అతని మనవడుబిబిసి హిస్టరీ ప్రాజక్టు వారికి ఇచ్చాడు. తీరా చూస్తూ అదే పాలిధీన్. అయితే, ఈ కీర్తి ఎరిక్ ఫాసెట్ (Eric Fawcet),  రెజినాల్డ్ గిబ్సన్  (Reginald Gibson) అనే శాస్త్రవేత్తలకు దక్కింది.వాళ్లు కూడా పొరపాటుగా నే ప్లాస్టిక్ తయారు చేశారు. అయితే,  దీనిని పర్ ఫెక్ట్ గా తయారు చేసేందుకు ICI  కంపెనీకి అయిదేళ్లు పట్టింది. 1938 నాటికి పాలిధీన్ తయారు చేయడం మొదలయింది.
దీన్నుంచి ప్లాస్టిక్ బ్యాగ్ తయారు కావడానికి మరొక 25 సంవత్సరాలు పెట్టింది. మొట్టమొదట ప్లాస్టిక్ బ్యాగ్ తయారు చేసింది స్వీడెన్ కు కెందిన సెల్లోప్లాస్ట్ అనే కంపెనీ. దీనికిమొదటి పేటెంట్ వచ్చింది. దీనిని డిజైన్ చేసిన వ్యక్తి  స్టెన్ గుస్తాఫ్ థూలిన్ (Sten Gustaf Thulin). అంతకు వరకు యూరోప్ లో వాడుకలో ఉన్న బట్టసంచులను అదే చేసంచులను ప్లాస్టిక్ సంచులు తరిమేయడం మొదలయింది. ఈబ్యాగులు 1979లో అమెరికాలో ప్రవేశించాయి. 1982లో సేఫ్ వే ,క్రోగర్ సూపర్ మార్కెట్ లో అమెరికాలో ఈ ప్లాస్టిక్ బ్యాగ్ లను ప్రవేశపెట్టి పాపులర్ చేశాయి. 1997లో చార్లెస్ మూర్ అనే నావికుడు, శాస్త్రవేత్త సముద్రంలో చెత్తలోకి పెద్ద ఎత్తున ప్లాస్టిక్ (Great Pacific Garbage Patch) వచ్చిచేరుతూ ఉందని, అది సముద్ర జీవులకు హానికలిగిస్తూ ఉందని చెప్పారు
ఒకపుడు ప్లాస్టిక్ బ్యాగ్ చేతిలో పట్టుకుని తిరగడం ఫ్యాషన్. అది ముదరడంతో ముప్పు వస్తూ ఉంది. అందుకే ప్లాస్టిక్ సంచుల వాడకం ఆపాలని ఈ రోజున ప్రచారం చేస్తూ, వస్త్రం తో తయారైన సంచులు వాడకం ప్రోత్సహిస్తున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా దేశాలు, రాష్ట్రాల ప్రభుత్వాల అధికార ప్రతినిధులు పర్యావరణవేత్తలు ప్లాస్టిక్ వినియోగం వలన కలిగే అనర్థాలను చర్చిస్తూ ప్లాస్టిక్ రహిత సమాజాన్ని ఏర్పాటుచేస్తామని వాగ్దానాలు ఇస్తున్నారు. కానీ వాటిపై ఖచ్చితంగా నిలబడి అమలుచేయడం లేదు. ప్రపంచీకరణ నేపధ్యంలో బాగంగా శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం పెరుగుదల వలనే ప్లాస్టిక్ వినియోగం పెరిగి పర్యావరణ కాలుష్యము ఏర్పడుతుంది.
 మహాసముద్రం లో వదిలేస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలలో 60 శాతం వాటా భారత దేశానిదే అన్న విషయం ఆందోళన కలిగిస్తుంది. పాలకులు 2022 నాటికి ప్లాస్టిక్ రహిత సమాజానికి కృషి చేస్తామని హామీలు మాత్రమే పరిమితం అవుతున్నారు.  భారత కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి గణాంకాల ప్రకారం రోజు 1500 టన్నుల ప్లాస్టిక్ వ్యర్ధాలు ఉత్పన్నమవుతుంది, 900 టన్నులు రీ సైకిలింగ్ కు తరలిస్తే, మిగతా 600 టన్నులు కాలువలు, నదులలో డంపింగ్ చేయడం జరుగుతుంది.
2050 నాటికి సముద్రాలలో ప్లాస్టిక్ వ్యర్ధాలు అక్కడే ఉండే సముద్ర చరాలను మించివుంటాయని నిపుణుల అంచనా. మానవుడు సుఖవంతమైన జీవన విధానానికి అలవాటుపడి ముప్పు తెచ్చుకుంటున్నాడు. ప్లాస్టిక్ వినియోగం రోజురోజుకు పెరుగుతోంది.
మార్కెట్ కి వెళుతున్నప్పుడు కూడా చేతి సంచిని తీసుకువెళ్లి సరుకులు తెచ్చుకోవడం నేర్చుకోవాలి. మన చుట్టుప్రక్కల ఎటువంటి కార్యక్రమం జరిగినా విపరీతంగా ప్లాస్టిక్ ప్లేట్లు,గ్లాసులు,కప్పులు,సీసాలు వాడడం జరుగుతుంది. దీనికి ప్రత్యామ్నాయం పై అందరూ దృష్టి పెట్టాలి. కాగితపు గ్లాసులు అందుబాటు లోకి వచ్చాయి.
ప్లాస్టిక్ ను తగ్గించి పేపర్ తో తయారుచేసిన వాటిని ఉపయోగించాలి. దీనికి మనమందరం నడుంకట్టాలి. ప్రతి ఒక్కరూ విధిగా తమ భాద్యతగా అనుకోవాలి. ప్లాస్టిక్ గ్లాస్ లలో వేడి వేడి ద్రవాలు సేవించడం పై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన చెందుతుంది. తద్వారా క్యాన్సర్ వ్యాధి బారిన పడడానికి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజలు మీది మీది జ్ఞానంతో ఏమి కాదులే అనుకుంటూ ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారు. అలాగే ప్లాస్టిక్ వ్యర్ధాలను కాల్చివేసే ప్రక్రియలో వెలువడే విషపూరిత వాయువులు పీల్చితే ప్రాణాపాయం నకు దారితీస్తుంది. కాలుష్య నియంత్రణ చర్యలలో భాగంగా ప్లాస్టిక్ వినియోగం తగ్గించే దిశలో మన కార్యాచరణ ఉండాలి.
డాక్టర్. జె.వి.ప్రమోద్ కుమార్, పైడిమెట్ట. 9490833108