(TTN Desk)
కరోనా వైరస్ ప్రపంచాన్నికుదిపేస్తూ ఉంది. ప్రపంచంలో ఎక్కడాలేనన్ని మారణాయుధాలు, సైనిక బలం ఉన్నఅమెరికా అగ్రరాజ్యం కంటికి కనిపించని అతి చిన్నప్రాణి భయంతో వణికిపోతూ ఉంది. శుక్రవారం నాటికి ఆదేశంలో 49మంది చనిపోయారు. అందులో 37 మంది రాజధాని వాషింగ్టన్ లోనే పోయారు. 2200 పాజిటివ్ కేసులు కనిపించాయి.
ఎవరినీ లెక్కచేయని ఆదేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇపుడు 24 గంటలూ తలపట్టుకుని ఆలోచిస్తూన్నది ఒకే ఒక్క విషయం గురించే, అదే కరోనా వైరస్. రానున్న ప్రమాదం గుర్తించి ఆయన ఏకంగా కరోనాను అడ్డుకునేందుకు నేషనల్ ఎమర్జన్సీ ప్రకటించారు.
మరొక అగ్రరాజ్యసం చైనా మొన్నమొన్నటి అతలాకుతలమయింది. సాంకేతిక అగ్రరాజ్యాలుగా ప్రపంచాన్ని శాసించిన జపాన్, సౌత్ కొరియా కరొనా వైరస్ దెబ్బతో వణికిపోయాయి. ఇపుడు యూరోప్ మొత్తం తలకిందులవుతూఉంది. మాది వేడి దేశం, మాదేశానికి రాదనుకున్న భారత్ లోకి కరోనా వైరస్ ప్రవేశించింది.
ఇది కూడా చదవండి
https://trendingtelugunews.com/english/features/corona-virus-myth-reality-and-reality/
అంతకంటే ఉష్ణ దేశమయిన కెన్యా లో కరొనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.చలి దేశం, ఉష్ణ దేశం అనే తేడా లేకుండా అన్ని దేశాలుకరోనా బారిన పడుతున్నాయి.ఇంకా కరోనా దాడి జరిగని దేశాలేమో ఎలా తప్పించుకోవాలో మార్గం తెలియక సతమతమవుతున్నాయి. తూర్పునుంచి కరోనా ఇపుడు పడమటికి పాకి పీడిస్తూ ఉంది. గ్రహాంతర వాసులను సినిమాల్లో ఓడించడంకాదు, ఇపుడు భూమండాలనికే చెందిన కరొను జయించి అమెరికా భూగోళాన్నికాపాాడాలి.
కొరనా వైరస్ పేరు జపించని మనిషేలేడీరోజున ప్రపంచంలో. ఇంతకీ ఏంటీ వైరస్? ఇదెందుకు మనిషిని ఇంతగా పీడిస్తూ ఉంది? దీనికంత శక్తి ఎలా వచ్చింది?
కరోనా వైరస్,సరస్, బర్డ్ ఫ్లూ, హెచ్ ఐవి, ఫ్లూ, పోలియో తదితర భయంకరమయిన జబ్బులు తీసుకువచ్చేది వైరస్ లు. వైరస్ అనే మాట ఎంత ప్రాచుర్యంలో ఉన్నా వైరస్ గురించి చాలా మందికి తెలిసింది చాలా తక్కువ. ఇపుడు వైరస్ అనే ఈ ప్రాణి కాని ప్రాణి గురించి తెలుసుకుందాం.
వైరస్ అంటే…
ఒక సింగిల్ వైరస్ నలుసుని విరియాన్ (virion)అంటారు. ఇది సృష్టిలో చిత్రవిచిత్రం. జీవియో, నిర్జీవియో తెలియదు. బయట ఉన్నంతవరకు నిర్జీవంగా ఉంటుంది. ఎదైనా జీవిలోకి, అదిచెట్టు కావచ్చు, జంతువు కావచ్చు, లేదా మనిషి కావచ్చు, ప్రవేశించగానే అవి జీవిలాగా ప్రవర్తిస్తాయి. అందుకే దీనిని నిర్జీవికి, జీవికి మధ్య ఉన్న బ్రిడ్జి లాంటిదని చెబుతారు. జీవి లాగా ప్రవర్తించడం అంటే ఏమిటి, అవి పెరగాలి, పరిణామం చెందాలి,సంతతి పెంచుకోవాలి. అంటే వైరస్ లు సొంతంగా ఈ పనులను చేసుకోలేవు. వీటి పరిణామం అక్కడితోనే ఆగిపోయింది. ఇవి సంతతి పెంచుకోవాలంటే మరొక ప్రాణి కణంఅవసరం. అందుకే వైరస్ లను ఆబ్లిగేట్ ఇంటర్ సెల్యులార్ పారసైట్స్ (obligate intracelluar parasites) అంటారు.
ఇవెక్కడి నుంచి వూడిపడ్డాయి
ఈ విషయం ఇంకా పూర్తిగా అర్థంకావడం లేదు. వైరస్ లో ఉన్న భాగాలను బట్టి కొంతవరకు వాటి పుట్టుపూర్వోత్తరాలను అంచనా వేశారు. వైరస్ శరీరం చాలా సింపుల్ గా ఉంటుంది. వీటి లోపల ఉండేదంతా ఒక ఆర్ ఎన్ ఎ లేదా డిఎన్ ఎ. దీని చుట్టూర ఒక ప్రొటీన్ రక్షణ కవచం ఉంటుంది. దీని మీద కొన్నింటికి లిపిడ్ కోటింగ్ ఉంటుంది.
(Like this story, share with a friend)
జీవకణాల్లో లాగా వీటిలో రైబో సోమ్ ఉండదు. అందువల్ల ఇవి స్వతంత్రగా జీవుల్లాగా బతక లేవు. తమ సంతతిని వృద్ది చేసుకునేందుకు వీటికొక జీవకణం కావాలి. ఒక విరియాన్ ఏదేని జీవకణంలోకి ప్రవేశించగానే తన డిఎన్ ఎ లేదా ఆర్ ఎన్ ఎ తనకు ఆశ్రయమిచ్చిన కణంలోకి విడుదల చేస్తుంది. అపుడు జీవకణంలో ఒక భాగంగా ఈ విరియన్ మారిపోతుంది. అప్పటి నుంచి విరియాన్ జీవకణాన్ని శాసించడం మొదలుపెడుతుంది. కణం తన పని మానేసి వైరస్ పిల్లలను తయారు చేయడం మొదలు పెడుతుంది. ఈ విధంగా వైరస్ ల సంఖ్య విపరీతంగా పెరిగినపుడు, హిరణ్య కశ్యపుడి కడుపు చించుకుని నరసింహుడువచ్చినట్లు, కణాన్ని చీల్చుకుని విరియాన్ లు బయటకు విడుదలయి, ఇతర జీవకణాల మీద దాడి చేస్తాయి.
అక్కడ కూాడా ఇలాగే పెరిగి, ఆ కణం కడుపు చీల్చుకుని కోట్లలో ఫ్యాక్టరీలో లాగా ఉత్పత్తవుతాయి. కణాన్ని చీల్చుకుని బయటకు వస్తాయి.
ఇలా వైరస్ లు తనకు ఆశ్రయమిచ్చిన కణాలను చంపేస్తాయి. ఈ విధంగా జీవి కణం నుంచి రకరకాల మార్గాల్లో బయటకు వచ్చి ఎక్కడబడితే అక్కడ వైరస్ లు వాలిపోతాయి. తమకు అనుకూలమయిన జీవకణం (చెట్టు, జంతువు , మనిషి లేదా బ్యాక్టీరియ) దొరికేదాకా ఓపిగ్గా ఎదురుచూస్తాయి. సరైన జీవకణం దొరకగానే ఇది దాని శరీరాన్ని ఛేదించుకుని ఈ కణంలోకి ప్రవేశించి విధ్వంసం మొదలుపెడతాయి.జీవి బయట నిర్జీవిగా ఉంటాయి కాబట్టి వీటిని నిర్మూలించడం కష్టం. అయితే, సబ్బుతో కడిగినపుడు, సబ్బులో వీటి రక్షణ కవచం కరిగిపోయి,నశించిపోతాయి.
వైరస్ లో ఉండేదంతా కేవలం జనెటిక్ మెటీరియలే కాబట్టి జీవకణాల కంటే ముందే పుట్టిన పదార్థాలు వైరస్ లని E V Koonin EV, Martin W అనే శాస్త్రవేత్తలు 2005 లో తాజా గా ప్రతిపాదించారు. ఆ తర్వాతే జీవకణాలు వచ్చాయని వారు చెబుతున్నారు.ఈ సిద్ధాంతాన్ని వైరస్ -ఫస్ట్ (virus-first hypothesis) సిద్ధాంతమంటారు. అంటే పరిణామం చెందక అక్కడే ఉండిపోయిన ప్రాచీన కణమే వైరస్.
రిడక్షనిస్టు సిద్ధాంతం అనేక మరొక వాదన ప్రకారం సృష్టి ఇంకా ఏకకణం స్తాయిలో ఉన్నపుడు ఆ కణం నుంచి తప్పించుకుని బయటపడిన జన్యుపదార్థమే వైరస్. అందుకే ఇది సంతతి పెంచుకోవాలంటే కణం మీద ఆధారపడాలి.
దీనిని బట్టి వైరస్ లు ఎప్పటి నుంచి ప్రాణులను పట్టి పీడిస్తున్నాయో అర్థమవుతుంది.
వైరస్ లు ఎన్నిరకాలు
వీటి సైజు, జన్యుపదార్థం, కెమికల్ ప్రాపర్టీస్ ను బట్టి 30వేల రకాల వైరస్ లను వేరు చేశారు. ఇవన్నీ 71 ఫామిలీస్ గా 164 ప్రజాతులగా 3600 జాతులుగా విభజించారు. వైరస్ కేవలం కొన్ని రకాలు మొక్కల్లోనే ప్రత్యుత్పత్తి చెందుతాయి. మరికొన్ని జంతవులకు, అందునా వెన్నెముక ఉన్నవాటికి, లేనివాటికి పరిమితమవుతాయి.అంటే అన్ని వైరస్ లు మనిషి మీద దాడిచేయలేవు. అలా చేసే శక్తి వాటికొస్తే… ఇంకేముంది, అంతా ఫినిష్.
వైరస్ పరిమాణం
ఒక మీటర్ ను విభజిస్తూ పోతే ఎన్ని ముక్కలవుతుంది. నూరు సెంటిమీటర్లు ఒక మీటరు అవుతుంది, ఒక సెంటి మీటర్ ను విభజిస్తే పది మిల్లీ మీటర్లు. ఇలా ఒక మీటర్ నుంచి చిన్నచిన్న ముక్కలు చేస్తూ చివరకు 1000000000 భాగాలుగా విభజిస్తే … ఆ చిన్న ముక్కని నానో మీటర్ అంటారు. వైరస్ సైజు 20 నుంచి 400 నానో మీటర్ల దాకా ఉంటుంది. గుండ్రంగా బంతిలాగా ఉండే కరొనా వైరస్ వ్యాపార్థం 120 నానోమీటర్లు.
వైరస్ పరిశోధన చరిత్ర
1800సంవత్సరం నాటికి బ్యాక్టీరియా గురించి శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. వైరస్ అనే మాట ప్రచారం లో ఉంది, అదొక ప్రమాదకరమయిన ప్రాణి అని తెలియదు. బ్యాక్టీరియా కాకుండా మరొక జీవులేవో ఉన్నాయన్న మొదటి ఆలోచన 1886లో వచ్చింది. పొగాకు వచ్చే జబ్బులలో మొజాయిక్ జబ్బు వొకటి. ఈ జబ్బు సోకిన పొగాకును చేత్తో నలిపి, మరొక మొక్క మీద ఆ పసరు పూస్తే చాలు మొజాయిక్ జబ్బు వస్తుందని 1886లో జర్మనీకి చెందిన అడాల్ఫ్ ఎడ్వర్డ్ మాయెర్ గుర్తించాడు.
బహుశా ఆరోజుల్లో యూరోప్ లో పొగాకు చాలా ముఖ్యమయిన పంటేమో, ఈ మొజాయిక్ జబ్బు మీద చాలా పరిశోధనలు జరిగాయి. 1892లో డిమిట్రీ ఐవనోవ్ స్కీ అనే రష్యన్ శాస్త్రవేత్త మాయెర్ పరిశోధనను మరింత ముందుకు తీసుకెళ్లారు. అపుడే ఆయన, ‘బ్యాక్టీరియాను వడకట్టే ఫిల్టర్’ లో మొజాయిక్ జబ్బు సోకిన పొగాకు పసరును వడకట్టారు. ఈ ఫిల్టర్ను పాశ్చర్ -చేంబర్ ల్యాండ్ ఫిల్టర్ అని పిలుస్తారు. దీనిని లూయీ పాశ్చర్, ఆయన సహశాస్త్రవేత్త చార్లెస్ చేంబర్ ల్యాండ్ కనిపెట్టారు.
పింగాణితో చేసిన ఈ ఫిల్టర్ తో నీళ్లను బ్యాక్టీరియా లేకుండా వడకట్టవచ్చని వారు చెప్పారు. అప్పటి వరకు మొజాయిక్ జబ్బు బ్యాక్టీరియా వల్ల వస్తుందని నమ్మే వారు. అందుల్ల మొజాయిక్ జబ్బు సోకిన పొగాకు పసరు నుంచి బ్యాక్టీరియా లేకుండా వడకడదామని ఐవనోవ్ స్కీ భావించాడు. అలాగే వడకట్టాడు. వడపోసిన పసరును ఆరోగ్య వంతమయిన పొగాకు చెట్టుకు పూసి పరీక్షించాడు. బ్యాక్టీరియా లేకపోయినా, ఈపసరు వల్ల మొజాయిక్ జబ్బు వ్యాపించింది. అంటే బ్యాక్టీరియా కాకుండా మరొకటి ఏదో ఉందని, దానిని వడకట్టలేమని, దీనివల్లే టొబాకో మొజాయిక్ జబ్బు వస్తున్నదని ఆయన భావించాడు. ఆయన అదొక ప్రాణి అనుకోలేదు. కేవలం విషపదార్థం (toxin)గా భావించాడు.
తర్వాత ఐవనోవ్ స్కీ వడగొట్టిన ద్రవం నెలల తరబడి అలా ఉంచి వాడినా అది రోగాన్ని వ్యాప్తి చేస్తున్నదని డచ్ శాస్త్రవేత్త మార్టినస్ బీజెరింక్ (Martinus Beijerinck 1898) కనుగొన్నాడు.
ఈ పసరు ద్రవానికి మరొక పేరు లేక వైరస్ అనే పేరు పెట్టారు. వైరస్ అనే మాటని అప్పటికదా విషపూరిత చిక్కటి ద్రావణానికి వాడేవారు. పొగాకు పసరు కూడా ఇలాగే ఉండటంతో దీనికి వైరస్ అనే స్థిరపడింది. మార్టినస్ ఈ ద్రవానికి పెట్టిన పేరు contagium vivum fluidum (contagious living fluid). అపుడే పొగాకు మొక్కకు ‘మొజాయిక్ జబ్బు’ తెస్తున్నందున ఈ రోగ కారకమయిన ఈ పసరును Tobacco Mosaic Virus (TMV) అన్నారు. ఇక్కడి నుంచి వైరాలజీ అనే శాస్త్రం మొదలయింది. అంటే మొదటి సారి వైరస్ ను కొనుగొన్నది మొక్కల్లో.
జంతువుల్లో వైరస్
జంతువుల్లో కూడా వైరస్ ఉందని కనుగొనేందుకు కారణం ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ వైరస్ (FMDV). 1898లో ఫ్రెడరిక్ లోప్లర్, పాల్ ఫ్రాష్లు అనే జర్మన్ శాస్త్రవేత్తలు అవుదూడలలో ఈ జబ్బు వచ్చేందుకు విష పదార్థం కాదు, ఒక కణం అనుమానించారు. ఐవనోవస్కీలాగా జబ్బు వచ్చిన జంతువుల నుంచి సేకరించిన ద్రవాన్ని వడపోసి ఈ విషయం కనుగొన్నారు. అందుకే కొంత మంది శాస్త్రవేత్తలు వైరస్ కనుగొన్నది లోఫ్లర్, ఫ్రాష్ లనే చెబుతారు. వీరు కనుగొన్న మరొక విశేషమేమిటంటే FMDV జబ్బుసోకిన జంతవులనుంచి సేకరించిన ద్రవాన్ని వేడిచేసి వైరస్ ను చంపేసి, ఇతర జంతువులకు ఎక్కిస్తే (vaccination) జబ్బురాకపోవడం.
మనుషుల్లో వైరస్
మనుషుల్లో కూడా వైరస్ ఉందన్న విషయం 1901లో తెలిసింది. దీనిని కనిపెట్టింది అమెరికా ఆర్మీ శాస్త్రవేత్త వాల్టెర్ రీడ్. అంతకుముందు క్యూబాకు వ్యాపించిన ఎల్లో ఫీవర్ మీద కార్లస్ ఫిన్ లే అనే శాస్త్ర వేత్త పరిశోధన చేశారు. వాటిమీద అధ్యయనం చేసి ఎల్లోఫీవర్ వైరస్ ద్వారా వస్తున్నది రీడ్ చెప్పారు.
కార్లస్ ఫిన్లే ఈ జబ్బు దోమ (Aedes Aegyptii) ల ద్వారా ఆఫ్రికాలో వ్యాపించిందని, ఆఫ్రికా నుంచి అమెరికా ఖండాలకు బానిసల ద్వారా వ్యాపించిందని కనుగొన్నారు. అయితే,దీని వెనక వైరస్ ఉందని ఆయన తట్ట లేదు.
ఈ జబ్బు మీద పెద్దగా పరిశోధనలు చేసేందుకు కారణం, 1890లో క్యూబాలో జరిగిన స్పానిష్- అమెరికా యుద్ధంలో గాయాల కంటే ఎల్లో ఫీవర్ సోకి అమెరికా సైనికులు పిట్టల్లా రాలిపోవడమే. ఎల్లోఫీవర్ వైరస్ తో వస్తుందని తేలడంతో హ్యమన్ వైరాలజీ మొదలయింది.