ఆంధ్ర కరోనావైరస్ అప్ డేట్ : జోరుగా సాగుతున్న ఇంటింటి కరోనా సర్వే

అమరావతి మార్చి 13:  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాసుపత్రుల్లో 300,ప్రవేట్ ఆసుపత్రుల్లో 350 ఐసోలేషన్ వార్డులు,పడకలు అందుబాటులో ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సిఎస్ జవహర్ రెడ్డి వెల్లడించారు.
కరోనా వైరస్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై శుక్రవారం అమరావతి సచివాలయంలోని నాల్గవ భవనం ప్రచార విభాగంలో మీడియా సమావేశం నిర్వహించారు.కరోనా వైరస్ గురించి ఆందోళన అవసరం లేదని, కొన్నివ్యక్తిజాగ్రత్తలు పాటిస్తే ఈ వైరస్ సోకకుండా , వ్యాప్తికాకుండా జాగ్రత్త పడవచ్చని ఆయన వెల్లడించారు.
 ఆయన వెల్లడించినమరిన్ని విషయాలు :
విదేశాల నుండి వచ్చిన వారు 14 రోజులపాటు విధిగా హోం ఐసోలేషన్లో ఉండాలి
• కరోనా నియంత్రణకు వ్యక్తిగత శుభ్రత, హోం క్వారంటైన్ పాటించడం మార్గం
• ఫిబ్రవరి 10 తర్వాత విదేశాల నుండి వచ్చినవారి గుర్తింపునకు ఇంటింటా సర్వే
• కరోనా లక్షణాలు కనపడితే 104 హెల్ప్ లైన్,0866-2410978 కాల్ సెంటర్ కు తెలియజేయండి
• కరోనా పరీక్షలకై తిరుపతి,విజయవాడల్లో లేబరేటరీలు సిద్ధం
కరోనా వైరస్ పట్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలు అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నెల్లూరులో ఇటలీ నుండి వచ్చిన ఒక వ్యక్తికి పాజిటివ్ కేసు నమోదు అయింది.
జనవరి 28 నుండి విదేశాల నుండి వచ్చిన ప్రయాణీకులను విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, కడప తదితర విమానాశ్రయాలు, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం ఓడరేవుల్లో ధర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
అంతేగాక రాష్ట్ర స్థాయిలో 0866-2410978 నంబరుతో కూడిన 24 గంటలూ పనిచేసే కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయడంతో పాటు 104 నంబరుతో కూడిన హెల్ప్ లైన్ ను కూడా అందుబాటులోకి తేవడం జరిగింది.
కరోనా పరీక్షల నిర్వహణకై తిరుపతిలోని స్విమ్స్ లోను, విజయవాడలోను రెండు ల్యాబ్ లను ఏర్పాటు చేయడం జరిగింది. మరో వారం రోజుల్లో కాకినాడలో కూడా ల్యాబ్ అందుబాటులోకి రానుంది.
 అదే విధంగా రాష్ట్రంలో ప్రభుత్వ ప్రవేట్ ఆసుపత్రుల్లో 56 ఐసోలేషన్ వార్డులు, 428 ప్రత్యేక పడకలు ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవడం జరిగింది.
అంతేగాక జిల్లాకు ఒకటి వంతున 13జిల్లా ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను, 13 అంబులెన్సులను అందుబాటులో ఉంచారు.
కరోనా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తిరుపతిలో 500 పడకలతోను, విశాఖపట్నంలో 200 పడకలతో కూడిన క్వారైంటైన్ సౌకర్య కేంద్రాలు ఏర్పాటుకు గుర్తించి తగిన ఏర్పాట్లు చేశారు.
 ఇప్పటి వరకూ 55మంది నుండి శాంపిల్స్ సేకరించి పరీక్షల నిమిత్తం పూణే లోని ల్యాబ్ కు పంపగా వాటిలో 47 నెగెటివ్ ఫలితాలు రాగా నెల్లూరుకు చెందిన ఒక వ్యక్తికి పాజిటివ్ అని తేలింది.  మరో 7శాంపిల్స్ ఫలితాలు రావాల్సి ఉంది.
 పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఇటలీ నుండి రాగా అతనిని నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో ఐసోలేషన్ వార్డులో చేర్చి తగిన వైద్య చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడు. 14 రోజుల పర్యవేక్షణ అనంతరం పూర్తిగా కోలుకున్నాక అతనిని డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది.
ఆవ్యక్తి ఐదుగురు వ్యక్తులను కలవగా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వారిని గుర్తించి ఆసుపత్రి క్వారంటైన్ అబ్జర్వేషన్లో ఉంచడం జరిగింది.
ఫిబ్రవరి 10 తర్వాత విదేశాల నుండి రాష్ట్రానికి వచ్చిన వారిని గుర్తించేందుకు రాష్ట్రంలోని కోటి 40లక్షల కుటుంబాలను ఇంటింటా సర్వే ప్రక్రియ చేపట్టారు. ఇప్పటికే 89వేల కుటుంబాల సర్వే పూర్తికాగా 3వేల మంది వరకూ విదేశాలకు వెళ్లి వచ్చినట్టు గుర్తించడం జరిగింది.
 ఆవిధంగా గుర్తించిన వారికి కరోనా లక్షణాలేమైనా ఉన్నాయా అనేదానిపై పరిశీలన చేసి వారిని 14రోజుల పాటు ఇంటిలోనే ఉండి కుటుంబ సభ్యులు సహా ఎవరినీ కలవకుండా తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకునేలా సూచించడం జరుగుతోంది.
అంతేగాక వారు తినే ఆహారం ,వాడే వస్తువులు తదితరమైనవన్నీ వారే సక్రమంగా డిస్పోజ్ చేసుకోవాలని ఎవరికైనా దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి కరోనా లక్షణాలు కనపడితే వెంటనే 104 హెల్ప్ లైన్లో అందుబాటులో ఉన్న డాక్టర్ ను సంప్రందించాలని సూచించాము.
కరోనా వైరస్ ముందు జాగ్రత్త చర్యల్లో ప్రజలు చేయాల్సిన చేయకూడని(Do’s&Dont’s) చర్యల్లో భాగంగా ప్రజలు విదేశాల నుండి వచ్చిన వారి బంధువులను దగ్గరగా వచ్చి కలవడం కొంత కాలం వరకూ చేయవద్దు.
అలాగే బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మడం చేయవద్దు. ఒకవేళ దగ్గు, తుమ్ములు వంటివి వచ్చినపుడు చేతి రుమాలుతో ముక్కును మూసుకుని మాత్రమే దగ్గడం,తుమ్మడం చేయాలి.  తరచూ చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి.
ఈ సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఇన్చార్చి కమిషనర్ వి.విజయరామరాజు, వైద్య ఆరోగ్యశాఖ సంచాలకురాలు డా.అరుణ కుమారి తదితరులు పాల్గొన్నారు.