శబరిమల వెళ్లి తీరతానంటున్న తృప్తి దేశాయ్, ఇంతకీ ఎవరీ తృప్తి దేశాయ్?

ప్రార్థనా స్థలాల్లో మహిళల ప్రార్ధించేందుకు హక్కుండాలని ఉద్యమిస్తున్న మహిళ తృప్తి దేశాయ్.
2010లో  భూమాత రణరంగిణి సేన (Bhumata Ranrangini Brigade) ప్రారంభించి దేవాలయాల్లోకి ఎలాంటి వివక్ష లేకుండా మహిళలను కూడా అనుమతించాలని ఆమె ఉద్యమం నిర్వహిస్తున్నారు.
మహారాష్ట్ర-కర్నాటక సరిహద్దున ఉన్న నిపానీ తాలూకాలో తృప్తి దేశాయ్ 1985లో జన్మించారు. ఆమె ఎనిమిది సంవత్సరాలవయసున్నపుడే కుటుంబం పూనే కి వలస వెళ్లింది. తలితండ్రుల ముగ్గురు సంతానంలో పెద్దయిన తృప్తి అమ్మతరఫున పట్టణమయిన కోల్లాపూర్ ప్రాథమిక విద్యనభ్యసించారు.
తర్వాత శ్రీమతి నధిబాయ్ దామోదర్ థాకెర్సీ కాలేజీలో హోం సైన్స్ డిగ్రీ కోర్సులో చేరారు. అయితే, కుటుంబ పరిస్థితుల కారణంగా ఆమె చదువు కొనసాగించలేకపోయారు.
ఆమె మనసు ఉద్యమాల వైపు, హక్కుల పోరాటం వైపు మళ్లింది. 2003లో క్రాంతివీర్ జోఫ్డీ వికాస్ సంఘ్ అధ్యక్షురాలిగా ఉన్నారు. అనేక మంది మురికివాడల కుటుంబాల పునరావాసం కోసం  ఆమె పోరాడారు.
ఇది ఆమెను ఉద్యమకారిణిగా మార్చింది.
ఇపుడామె శబరి మలై గుడి కి వెళ్తానని చెబుతున్నారు. ఇలాంటి ప్రయత్నం ఆమె 2018 లో నవంబర్లో కూడా చేశారు. ఒక ఆరుగురు సహచరులతోకలసి నవంబర్ 17 గుడికెళ్లేందుకు ప్రయత్నించారు.
రాజ్యంగం తమకు అయప్పస్వామిని దర్శించే హక్కు ఇచ్చింది. దాని ప్రకారం తాము గుడిలో ప్రవేశిస్తామని ప్రకటించారు.
సుప్రీంకోర్టు ను ఈ హక్కును గుర్తించింందని, మహిళలను ఆలయంలోకి రాకుండా నిషేధించడాన్ని చెల్లదని కొట్టివేసిందని చెబుతూ తాము ఈ హక్కును వినియోగించుకోవాలనుకుంటున్నట్లు ఆమె చెప్పారు.
అయితే, ఆమె ప్రయత్నం ఫలించలేదు.
గత ఏడాది సెప్టెంబర్ 28న సుప్రీంకోర్టు శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును ఆయుధంగా వాడుకుని ఆమె కేరళ వెళ్లారు. కొచ్చి విమానాశ్రయం లో దిగారు. అయితే, రాష్ట్రంలో చెలరేగిన భారీ నిరసన కారణంగా ఆమె అంతకు మించిముందుకు పోలేకపోయారు.
అందువల్ల ఇపుడామె మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఒకప్రయత్నం చేస్తున్నారు.ఈనెల 20 తర్వాత మరొక నలుగురితో కలసి తాను శబరిమల ఆలయానికి వెళ్తున్నట్లు ప్రకటించారు.
శబరిమల ఆలయంలోకి 10-50 సంవత్సరాల మధ్య వయసున్న మహిళ ప్రవేశం మీద విశ్వాసపర నిషేధం ఉంది. ఈ నిషేధాన్ని కోర్టు ఎత్తి వేసింది.
అయితే, మొన్న ఈ తీర్పున పున: కేసును పరిశీలించాలన్న పిటిషన్ ను సుప్రీమ్ కోర్టు పెద్ద ధర్మాసనం పరిశీలనకు వెళ్లింది.
ఈ లోపు తృప్తి దేశాయ్ మాత్రం శబరిమలై వెళ్ళాలని నిర్ణయించుకున్నారు.
అయితే, యాక్టివిస్టు మహిళలు శబరిమలకు వస్తే భద్రత కల్పంచేది లేదని కేరళ వామపక్ష ప్రభుత్వం స్పష్టం చేసింది. 2018లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి పూర్తిగా వ్యతిరేకం. అపుడు ప్రభుత్వం మహిళలకు పూర్తిగా రక్షణ కల్పించింది.ఇది రాజకీయ వివాదం కావడం, దానిని ఓట్లకు ఉపయోగించుకునేందుకు భారతీయ జనతాపార్టీ ప్రయత్నిస్తూ ఉండటంతో మునుపటి ఉత్సాహాన్ని కమ్యూనిస్టు ప్రభుత్వం ప్రదర్శించడంలేదు.
శబరిమల ఉద్యమాల వేదిక కాదని, ప్రచారం కోసం ఆలయంలోకి ప్రవేశించాలనుకునేవారికి తమ ప్రభుత్వం భద్రత కల్పించదని కేరళ దేవస్థానాల మంత్రి కడకం పల్లిసురేంద్రన్ చాలా స్పష్టంగా ప్రకటించారు.
అయితే, ఇపుడేమవుతుందో చూడాలి. ఎందుకుంటే ఆలయంలోకి ప్రవేశించడం తన రాజ్యంగ హక్కు అని తృప్తి దేశాయ్ చెబుతున్నారు.
రాజ్యంగ హక్కును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, పోలీసులమీద, కోర్టుల మీద ఉందని చెబుతూ
కేరళ ప్రభుత్వ దోరణిని ఆమె వ్యతిరేకిస్తున్నారు.
ఆలయానికి వచ్చే వారిని భక్తులని, ఉద్యమకారులని ఎలా విడదీస్తారని ఆమె ప్రశ్నిస్తున్నారు.
గతంలో ఆమె మహారాష్ట్ర అహ్మద్ నగర్ జిల్లా శనిశింగాపూర్ గుడిలోకి, ముంబై లోని పీర్ హాజీ అలీ దర్గాలోకి, కోల్లాపూర్ లోని  మహాలక్ష్మి గుడి, నాసిక్ త్రయంబకేశ్వర శివాలయంలోకి మహిళలను అనుమతించాలని ఉద్యమించారు.