Home English ఇంతకీ బడ్జెట్ లో ఎపికి జరిగిన అన్యాయమేమిటి?

ఇంతకీ బడ్జెట్ లో ఎపికి జరిగిన అన్యాయమేమిటి?

466
0

పార్లమెంటులో తెలుగుదేశం పార్టీ డ్రామా దాదాపు తుస్సు మంది. ఇదంతా జనం దృష్టి ఆకట్టుకునేందుకేనని  ఈ రోజు అక్కడ  పార్టీ ఎంపిలు చేసిన నినాదాలు,ప్రసంగాలు స్ఫష్టం చేస్తాయి. ఇంతకీ టిడిపి ఎంపిల ఈ రోజు పార్లమెంటు లోపుల, బయట గాంధీ విగ్రహం దగ్గిర నిలబడి నినాదాలు చేసింది దేనికి?  బడ్జెట్ లో రాష్ట్రానికి తగినన్ని నిధులు రాలేదనా లేక 2014  ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో హామీ ఇచ్చిన వన్నీ నెరవేర్చాలనా. బడ్జెట్ మీద నిరసన ఇపుడుపార్లమంటులో పునర్విభజన చట్టం అమలుకు మారిపోయింది. తర్వాత ఈ రోజు ప్రధాన మంత్రితో ఎంపిలు సమావేశమవుతారని, వారితో పాటు హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా వస్తారని చెప్పారు. అయితే, అలాంటిదేమీ జరగలేదు. అసలు మీ డిమాండ్లేమిటో ఎవరో ఒకరు వచ్చి ప్రధానికి వివరించాలని  తెలుగుదేశం పార్టీకి  ప్రధాని కార్యాలయం నుంచి వర్తమానం వచ్చింది.

మంత్రి సుజనా చౌదరి వెళ్లాలని ముఖ్యమంత్రి అదేశించారు. ఆ మేరకు సుజనా చౌదరి వెళ్లి ఇరవై నిమిషాల పాటు ప్రధానితో మాట్లాడి వచ్చారు. ఒకవైపు లోక్ సభ వెల్ లోకి చొరబడి తెలుగుదేశం సభ్యులు  పునర్విభజన చట్టం అమలు చేయాలని, ఆంధ్రకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. టిడిపి ఆందోళన స్నేహపూర్వకంగా సాగింది. ఎప్పటిలాగే ప్రధాని ఒకహామీ  ఇచ్చి సుజనా చౌదరిని పంపించారు. ఎంపిలు న్యాయం కావలని కోరారు. బడ్జెట్ మీద నిరసన మూలన పడింది, ఇప్పట్లో ఎపుడూ అమలు చేయ వీలుకాని పునర్విభజన హామీల అమలు అసలు డిమాండయి కూర్చుంది.

నిరసన తమాషా

తెలుగుదేశం నిరసన ఒక  డ్రామా లాగా సాగింది. ఫిబ్రవరి ఒకటోతేదీన బడ్జెట్ ప్రసంగం పూర్తయిందో  లేదో అనంతపురం ఎంపి జెసి దివాకర్ రెడ్డి బయటకొచ్చి ‘యుద్ధం’ ప్రకటన చేశారు. తర్వాత రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేశ్ కూడా ‘యుద్ద’ ప్రకటన పునరద్ఘాటించారు. తర్వాత చాలా మందిఎంపిలు, ఎమ్మెల్యేలు కూడా ఇక అయిపోయింది, తెగిపోయింది, బిజెపితో ఉండేలేమని అన్నారు.  దీనికి బాగా మసాలు దట్టించి మీడియా కూడా చంద్రబాబు – మోదీ ఇక తలపడతారని ప్రచారం చేసింది. విశ్లేషకులు లెక్కలు వేసి ఇక యుద్ధమే అన్నారు. అయితే అంత సీన్ లేదని ఆదివారం నాటి టిడిపి అత్యవసర సమావేశం వెల్లడించింది.  బడ్జెట్ లో పోలవరం, అమరావతి మాటలు లేకపోవడమే ఈ నిరసనకు కారణమా లేక, నిజంగా బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందా? అనే విషయాన్ని తెలుగుదేశం పార్టీ ఇంతవరకు స్పష్టం చేయలేదు.

మరీ ముఖ్యంగా బడ్జెట్ వచ్చి అరురోజులవుతున్నా బడ్జెట్ లో ఏమి తక్కువయిందో, రాష్ట్రానికి ఏదీ దొరకలేదో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నోరు విప్పనేలేదు. ముఖ్యమంత్రి అసంతృప్తి అనో, ఆగ్రహం అనో టిడిపి నేతలు అన్నారు తప్ప ఆయన ఇంతవరకు మాట్లాడక పోవడం లో ఆంతర్యం ఏమిటి?

 

తెలుగుదేశం పార్టీకి ఆర్థిక మంత్రి వున్నారు, అర్థిక నిపుణులు, సలహా దారులు ఉన్నారు, అయినా ఒక్కరును కూడా బడ్జెట్ ను ఇంతవరకు విశ్లేషించి, ఇది లోపం, ఇదీ ఆంధ్రాకు అన్యాయం అని చెప్పనేలేదు. గుడ్డిగా రాష్ట్రానికి అన్యాయమని అరవడం తప్ప బడ్జెట్ లో ఎది మిస్సయిందో ప్రజలకు చెప్పనేలేదు. ఎమర్జన్సీ మీటింగ్ లని చెప్పి తుస్సుమనిపించారు. ఇపుడు పార్లమెంటు నిరసన కూడా ఒక  హస్య  సన్నివేశంగా ముగిసింది.బడ్జెట్ ఎందుకు బాగా లేదో  ముఖ్యమంత్రి ఎందుకు బహిరంగంగా చెప్పలేకపోతున్నారో  ప్రజలకు వివరించాలి. లేకపోతే, ఇదంతా తాము కేంద్రంతో పోరాడుతున్నామని  ప్రచారం చేసుకునేందుకు వేసిన ఎత్తుగడ అని అనుకోవలసి వస్తుంది. ఈ ధోరణి ప్రజల్లో మొదలయింది.

దీనికి తగ్గట్టు గానే కేంద్రం కూాడా ఏమి అర్థం కాకుండా స్పందించింది. లోక్ సభలో టిడిపి సభ్యుల నినాదాలకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంతకుమార్ స్పందించారు. ‘ టిడిపి సభ్యులు చేస్తున్న డిమాండ్లు చాలా సున్నితమయినవి. వాటి మీద ప్రధాని మోదీ దృష్టి కేంద్రీకరించారు,’ అని అనంతకుమార్ అన్నారు. సున్నిత మయిన డిమాండ్లేమిటో అర్థం కావడం కష్టం.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here