కేరళ లోని ఒక పాఠశాల వేసవి సెలవులు ప్రకటిస్తూ తల్లితండ్రులకు ఒక లేఖ రాసింది.ఆ లేఖ సారాంశాన్ని తర్జుమా ఇది
ప్రియమైన తల్లితండ్రులారా!
గత పదినెలలుగా మీ పిల్లల్ని చక్కటి పౌరులుగా తీర్చిదిద్దడానికి మా శాయశక్తులా కష్టపడ్డాం. పిల్లలు పాఠశాలకు రావడానికి తహతహలాడేలా చేయడంలో విజయం సాధించాం అని చెప్పుకునే స్థాయికి చేరుకున్నాం._ రాబోయే రెండు నెలలు, తల్లిదండ్రులుగా మీరు, పిల్లల సంరక్షకులు (guardians) వారితో గడుపుతారు. పిల్లల్ని తీర్చిద్దిడానికి కొన్ని ఉపయోగపడే కొన్ని చిట్కాలు మీతో పంచుకుంటున్నాము వారి సెలవులు ఆనందంగా, ఉపయుక్తంగా ఉండడానికి.
1. రోజూ రెండు పూటలా వారితో కలిసి భోజనం చేయండి. వారికి రైతులు పడే కష్టాలను వివరించండి. ఎంత శ్రమిస్తే పంట చేతికి వస్తుందో తెలియచేయండి. పదార్థాలు వృధా చెయ్యకుండా తర్ఫీదు ఇవ్వండి.
2. వాళ్ళు తిన్న భోజనం ప్లేటు వాళ్ళే ఎత్తడం, కడుక్కోవడం నేర్పించండి. వాళ్లకు శ్రమ విలువ తెలుస్తుంది. పని విలువ అర్ధమవుతుంది. మనపని మనం చేసుకోవడం నామోషీ కాదని తెలుస్తుంది.
3. పిల్లల్ని వంటింట్లోకి రానివ్వండి. వంటపనుల్లో పెద్దలకు సహాయం చేయనివ్వండి. వాళ్ళ సలాడ్స్ వాళ్లనే చేసుకోనివ్వండి.
4. ప్రతిరోజూ ఐదు కొత్త ఆంగ్ల పదాలు, ఐదు కొత్త తెలుగు పదాలు, సామెతలూ నేర్చుకునేటట్టు చూడండి.
5. మీ ఇంటి చుట్టుపక్కల వారితో పరిచయం చేసుకోమనండి. వాళ్ళతో ఒక అనుబంధం ఏర్పడనివ్వండి.
6. అమ్మమ్మ, బామ్మ , తాతగార్లతో కొన్నిరోజుల పాటు గడపనివ్వండి. పెద్దవారితో ఒక చక్కటి అనుబంధం ఏర్పడనివ్వండి. పెద్దవారి ప్రేమాభిమానాలు, అనుభవాలు, అలాగే వారు చెప్పే కథలు వారికి చాలా ఉపయోగం.
7. మీ పిల్లల్ని మీరు పనిచేసే చోటుకు తీసుకెళ్లండి. అక్కడ రోజూ మీరెంత కష్టపడి పనిచేస్తున్నారో చూస్తారు, అంతేకాకుండా… మీ కష్టార్జితపు విలువ కూడా వారికి తెలుస్తుంది.
8. రకరకాల వ్యాపారాలుండే బజార్లకు లేదంటే, వారం వారం జరిగే సంతకు తీసుకెళ్లండి. జాతర ఉంటే చూపించండి.
9. వాళ్ళతో మొక్కలు నాటించడం, మొక్కలను సంరక్షించడం.. లాంటి పనులు చేయించండి. పెరట్లో కానీ కుండీలలో కానీ విత్తనాలు నాటించండి. వాళ్లకు రకరకాల చెట్ల గురించి, వాటి ప్రాముఖ్యత గురించి తెలియచేయండి. చెట్లు వృక్షాలు మనందరి జీవితాల్లో అంతర్భాగం అనే అవగాహన ఏర్పరచండి.
10. మీ చిన్ననాటి అనుభవాలను వారికి తెలియచేయండి. మీ కుటుంబ చరిత్ర గురించి అవగాహన కల్పించండి.
11. పిల్లలు సెలవురోజుల్లో పూర్తిగా ఇంట్లోనే ఉండకూడదు , బయటకెళ్ళి ఆడుకోవాలి. అలా ప్రోత్సహించండి. పిల్లలు ఆటల్లో గాయపడడం సహజం, అలాగే ఆటలాడితే మురికిగా అవ్వడం కూడా సాధారణం. వాళ్ళకి నొప్పి తెలియనివ్వండి. అస్తమానం సోఫాల్లో, కుర్చీల్లో కూర్చుంటే, లేదా బెడ్లమీద పడుకొని ఉంటే.. బద్దకస్తులుగా తయారవుతారు.
12. పెంపుడు జంతువులను పెంచుకోనివ్వండి.
ఈ లేఖ చదివాక అలాంటి మంచి విద్యాబుద్ధులు నేర్పించే పాఠశాలలోనే మన పిల్లల్ని చదివించాలి అనిపిస్తోందికదా!
*సేకరణ: వెలిశెట్టి నారాయణరావు, విశ్రాంత సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు