రాజా రామేశ్వరరావు చేజారిన ప్యాలెస్

వనపర్తి ఒడిలో-20

రాఘవశర్మ

అది 1970వ సంవత్సరం.
ఎనభై ఐదేళ్ళ ప్యాలెస్ చరిత్రలో అదొక పెద్ద మలుపు.
పాలిటెక్నిక్ ఉద్యోగుల జీవితాల్లో కూడా పెద్ద కుదుపు.
వనపర్తి సంస్థానాదీశుడి చేతిలోంచి అందమైన ప్యాలెస్ కాస్తా జారిపోయింది.
అటు విద్యార్థులను, ఇటు ఉద్యోగులను అయోమయంలో పడేసిన కాలం అది.
1969లో వచ్చిన ‘జై తెలంగాణా’ ఉద్యమం తెచ్చిన పరిణామం.
పాలిటెక్నిక్ ఉద్యోగుల్లో అధికులు కోస్తాంధ్ర, రాయలసీమ వారు.
అందులో కీలక పదవులూ వారివే.
విద్యార్థుల్లోనూ అధికులు ఆప్రాంతాల వారే.
‘జై తెలంగాణా’తో కోస్తాంధ్ర నుంచి వచ్చే విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది.
ఒక ఏడాది చదువు చట్టుబండలైంది.
విద్యా ప్రమాణాలూ పడిపోయాయి.
ఉద్యోగుల జీతాలకు ప్రభుత్వం 25 శాతం గ్రాంటిచ్చేది.
మిగతా 75 శాతం విద్యార్థుల ఫీజుల నుంచే యాజమాన్యం ఇచ్చేది.
వనపర్తి మాజీ సంస్థానాదీశుడు రాజా రామేశ్వరరావుకు క్యాన్సర్. చికిత్స కోసం ఆయన లండన్ వెళ్ళిపోయారు.
ఇటు ‘జై తెలంగాణ’ను సమర్థించలేక, అటు వ్యతిరేకించలేక కొంత కాలం అజ్ఞాతం లో ఉండి పోయారు.
రామేశ్వరరావు లండన్ వెళుతూ, వెళుతూ కాలేజీ ట్రస్టు బాధ్యతలను నూకల సర్వోత్తమ రెడ్డికి అప్పగించారు.

వనపర్తి సంస్థానాధీశుడు జే. రామేశ్వరరావు

అదే సమయంలో సాంకేతిక విద్యాబోర్డు ఉద్యోగుల జీతాలు పెంచింది.
విద్యార్థుల నుంచి వచ్చే ఫీజులు తగ్గిపోయాయి.
ఉద్యోగుల జీతాల చెల్లింపు ట్రస్టుకు భారంగా తయారైంది.
ప్రభుత్వం ఇవ్వాల్సిన గ్రాంటు విడుదలవుతూనే ఉంది.
సర్వోత్తమ రెడ్డి సరిగా పట్టించుకోలేదు.
ఉద్యోగులకు జీతాలు ఆగిపోయాయి.
వారు నానా అవస్థలు పడ్డారు.
కొందరు తమతమ ఊర్ల నుంచి డబ్బులు తెచ్చుకున్నారు.
కొందరు ఆస్తులు తాకట్టు పెట్టారు.
కొందరు ఆస్తులు అమ్ముకున్నారు.
ఆస్తులేమీ లేని వారు అప్పులు చేశారు.
ఎంత కాలం ఇలా!?
మాకుటుంబం కటకటలాడిపోయింది.
ఒకటా రెండా, ఎనిమిది నెలలు జీతాల్లేవు.
క్రిషి ఇంజన్లు, స్పిన్నింగ్ మిల్లు, రీలింగ్ యూనిట్లను రామేశ్వరరావు స్థాపించారు.
లాంగ్మన్ పబ్లికేషన్స్ కూడా రామేశ్వరరావు స్థాపించిందే.
ఆయన విదేశాలకు వెళ్లడంతో ఇవ్వన్నీ నష్టాల్లో నడుస్తున్నాయి.
దీంతో ఉద్యోగులను కాపాడాల్సిన బాధ్యత ప్రిన్సిపాల్ రామిరెడ్డి పైన పడింది.
కోస్తా, రాయలసీమ నుంచి చాలా మందిని తీసుకొచ్చి ఆయన ఉద్యోగాలిచ్చారు.
ఆరోజుల్లో కోట్ల విజయభాస్కరరెడ్డి ఆర్థిక శాఖా మంత్రి.
పి.వి. నరసింహారావు విద్యాశాఖా మంత్రి.
వి.నరసింగరావు ఉపముఖ్యమంత్రి.
వీరితో ప్రిన్సిపాల్ రామిరెడ్డికి మంచి సంబంధాలుండేవి.
కాలేజీ నడపలేనప్పుడు ప్రభుత్వానికిచ్చేస్తానని రాజా గతంలో రాసిచ్చారు.
ఆ కాయితం వీరికొక ఆధారంగా తయారైంది.

పై ముగ్గురు రాజకీయ నాయకుల సాయంతో కోర్టు కెళ్ళారు. కోర్టు ద్వారా ప్యాలెస్ ప్రభుత్వ పరమైపోయింది.
ఈ పరిణామంలో కోట్ల విజయభాస్కర రెడ్డి కీలకంగా వ్యవహరించారు.
రాజా రామేశ్వరరావు కోర్టులో కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఉన్నా ఆయన ఆపని చేయలేదు.
కాలేజీకి తన తండ్రి ‘కృష్ణదేవరాయ’ పేరుంటే చాలనుకున్నారు.
రామేశ్వరరావు ఎం.పి అయినా, కీలకమైన విషయాల్లో కోస్తా నాయకుల మాటే చెల్లు బాటయ్యేది.
రామేశ్వరరావుకు కాంగ్రెస్ ఎం.పి. టికెట్టు ఇవ్వాలన్నా కూడా, ఇద్దరు కోస్తా నాయకుల సిఫారసు తీసుకు రమ్మని నెహ్రూ కోరినట్టు ఒక వార్త.
ఉద్యోగుల్లో ఎక్కడ లేని ఆనందం.
అంతా ప్రభుత్వ ఉద్యోగులైపోయారు.
ఉద్యోగుల కల్చరల్ క్లబ్ భవనం ముందునుంచి తూర్పు పడమరలుగా సరళ రేఖ గీశారు.
ఆ సరళ రేఖకు ఉత్తరం వైపు ఉన్న క్వార్టర్స్ ప్రాంతం అంతా రామేశ్వరరావుకే మిగిలిపోయింది.
ప్యాలెస్ ఉన్న మిగతా దక్షిణ ప్రాంతమంతా ప్రభుత్వపరమైపోయింది.
ప్రభుత్వం ఉద్యోగుల జీతాలివ్వడం మొదలు పెట్టింది.
అంతా ఊపిరి పీల్చుకున్నారు.
బకాయిపడ్డ ఎనిమిది నెలల జీతం  ఒక్కసారిగా వచ్చేసింది.
ఉద్యోగులు అప్పులు తీర్చుకున్నారు.
తాకట్టులో ఉన్న ఆస్తులు విడిపించుకున్నారు.
‘జై తెలంగాణా’ తో నీరు గారిపోయిన ఉద్యోగుల్లో కాస్త ఆత్మ స్థైర్యం పెరిగింది.
జై తెలంగాణ ఉద్యమ సమయం (1969)లోనే 14 బ్యాంకుల జాతీయీకరణ జరిగింది.
అప్పటి వరకు సామాన్యులు పెద్దగా బ్యాంకుల్లో అకౌంట్ తెరిచేవారు కాదు.
ఒక్క సారిగా ఎనిమిది నెలల జీతం వచ్చేసరికి మానాన్నకూడా అప్పులు తీర్చుకున్నాడు.
మా నాన్నా తొలిసారిగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ లో అకౌంట్ తెరిచాడు.
అందులో డబ్బులు దాచుకున్నాడు.
పాలిటెక్నిక్ ను ప్రభుత్వ స్వాధీనం చేసుకుందన్న వార్త వెలువడగానే ఉద్యోగుల్లో ఎక్కడ లేని ఆనందం.

‘కృష్ణ దేవరాయ ప్రభుత్వ పాలిటెక్నిక్ ‘ అన్న బోర్డు తో ప్యాలస్ ప్రధాన ద్వారం

ఈ వార్త తెలిసిన వెంటనే పాలిటెక్నిక్ బోర్డు మారిపోయింది.
ప్యాలెస్ ప్రధాన ద్వారానికున్న ‘కృష్ణ దేవరాయ పాలిటెక్నిక్’ అన్న బోర్డును తీసేశారు. వర్క్ షాప్ లో
యుద్ధ ప్రాతిపదికన కొత్త బోర్డు తయారైంది.
‘కృష్ణ దేవరాయ ప్రభుత్వ పాలిటెక్నిక్’ అన్న బోర్డును తగిలించారు.
ఆ బోర్డును తయారుచేయించడంలో మా నాన్న కూడా పాలుపంచుకున్నాడు.
ఆ కొత్త బోర్డు పెడుతున్నప్పుడు నేను కూడా అక్కడే ఉన్నాను.
కొత్త బోర్డు తగిలిస్తున్నప్పుడు ఉద్యోగుల ముఖాల్లో ఎక్కడ లేని ఆనందం.
వారి బతుకులకు ఒక భరోసా వచ్చింది.
తమ తమ ప్రాంతాలకు వెళ్ళిపోవచ్చన్న ఆలోచనా మొదలైంది.
కాలేజీలో మంచి అధ్యాపకులున్నారు.
అంతా ప్రతిభావంతులు.
క్రమశిక్షణ ఉండేది.
రాత్రి పూట హాస్టళ్ళను బోధనా సిబ్బంది తనిఖీ చేసేవారు.
ఈ తనిఖీ చేయడానికి వారికి డ్యూటీలు వేసేవారు.
హాస్టల్  గదిలో ఏ విద్యార్థి అయినా లేకపోతే మర్నాడు వారి తల్లిదండ్రులకు తాఖీదు వెళ్ళేది.

ప్రిన్సిపాల్ రామిరెడ్డి, సివిల్ విభాగాధిపతి కే.ఎల్. నరసింహం

 

ఎలక్ట్రికల్ విభాగాధిపతి సోమసుందరం నాయుడు

అధ్యాపకులంటే విద్యార్థులు భయపడే వారు.
చదువు, క్రమశిక్షణ జోడెద్దులుగా సాగేవి.
ఈ కాలేజీ చోదకులు పంచపాండవుల్లా అయిదుగురు.
ప్రిన్సిపాల్ రామిరెడ్డి మంచి పాలనా దక్షులు.
సివిల్ విభాగాధిపతి కె.ఎల్.నరసింహం చాలా సౌమ్యులు.
ఎలక్ట్రికల్ విభాగాధిపతి సోమసుందరం నాయుడు కూడా అంతే.
ఈ ముగ్గురూ చాలా స్నేహంగా ఉండేవారు.
ముగ్గురూ అనంతపురం ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్నప్పుడే వీరికి స్నేహం.
త్రివేణి సంగమంలా ముగ్గురూ కలిసిమెలిసి ఉండేవారు.
మెకానికల్ విభాగధిపతి వీరభద్రాచారి.
పొట్టిగా, తెల్ల ఫ్యాంటు, తెల్ల షర్టుతో టక్ చేసుకుని ఉండేవారు.
అలాగే డీసీపీ(కామర్స్) విభాగాధిపతి కేశవ మూర్తి.
రామిరెడ్డి, సోమసుందరం నాయుడు, వీరభద్రాచారి ఇప్పుడు లేరు.
కె.ఎల్.నరసింహం అమెరికాలో స్థిరపడి, శేషజీవితాన్ని మనుమలతో గడుపుతున్నారు.
ఈ కాలేజీలో చదువుకున్న తొలితరం విద్యార్థులు మంచి ఉద్యోగాలు సంపాదించారు.
మంచి మంచి స్థానాలకు చేరుకుని జీవితంలో స్థిరపడ్డారు.
ఆనాటి విద్యార్థుల్లో కూడా ఇప్పుడు చాలా మంది లేరు.
ఇక్కడి అధ్యాపకులంటే పాత విద్యార్థులకు ఇప్పటికీ గౌరవం.

పాలిటెక్నిక్ విభాగాధిపతులు (ఎడమ నుంచి) కే.ఎల్. నరసింహం (సివిల్), వీరభద్రా చారి ( మెకానికల్), ప్రిన్సిపాల్ కే.రామిరెడ్డి, సోమసుంద రమ్ నాయుడు ( ఎలక్ట్రికల్).1970 నాటి ఫోటో.

వనపర్తి అంటే చాలు వాళ్ళకు ప్రాణం లేచొస్తుంది.
మా పెదనాన్న కొడుకు వెంకటేశ్వరరావు కూడా ఈ కాలేజీలో చదువుకున్నాడు.
1962-65 మధ్య ఎల్.ఈ. ఈ చదివాడు.
హెచ్.ఎం.టీ.లో చేస్తూ ఉన్నత స్థానంలో రిటైర్ అయ్యాడు.
ఇప్పుడు అమెరికాలో స్థిరపడ్డాడు.
దాదాపు ఎనిమిదేళ్ళ క్రితం
ఓ రాత్రి పూట కారులో వనపర్తి మీదుగా వెళుతున్నా ము.
‘ప్యాలెస్ చూద్దాం శర్మ’ అన్నాడు.
దారి పొడువునా వాళ్ళలెక్చరర్లు, విభాగాధిపతులు ఎంత మంచి వాళ్ళో చెప్పుకుంటూ వచ్చాడు.
అందరి పేర్లు గుర్తు పెట్టుకున్నాడు.
బాగా పొద్దుపోయింది.
కారు ప్యాలెస్ లోకి పోనిచ్చాం.
చదువు అయిపోయాక మళ్ళీ ఇక్కడికి రాలేదు.
అరవై ఏళ్ళ తరువాత మళ్ళీ ప్యా లెస్ లోకి వస్తున్నానన్నాడు.
మా అన్నయ్యలో చాలా ఉద్వేగం.
చీకట్లోనే కారుదిగాం.
ఆ చీకట్లోనే అంతా కలియతిరిగాడు.
‘ఈ కాలేజేనాకు తిండిపెట్టి, ఇంతటి వాణ్ణి చేసింది’ అన్నాడు.
‘ఈ కాలేజీలో చేరకపోతే నేనక్కడ ఉండేవాణ్ణి!’ అన్నాడు.
ఆ చీకట్లోనే ప్యాలెస్ ముందు మట్టిలో మోకాళ్ళపై కూర్చున్నాడు.
ఒంగి, తలను నేలకు ఆనించి, కాలేజీకి దణ్ణం పెట్టాడు.
ఆ మట్టిని బొట్టుగా పెట్టుకున్నాడు.
నేను నిశ్చేష్టుణ్ణయిపోయాను.

Aluru Raghava Sarma
(రచయిత సీనియర్ జర్నలిస్ట్, ప్రకృతి ప్రేమికుడు, తిరుపతిలో ఉంటారు. మొబైల్: 94932 26180)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *