ఆర్టిస్టుల ఆరో ప్రాణం స్టోన్‌ఫోర్డ్ ఆర్ట్ మ్యూజియం!
–అమరయ్య ఆకుల
కళకి ప్రకృతి మూలమంటారు చిత్రకారులు. స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ ఆర్ట్ మ్యూజియంలోకి అడుగు పెట్టబోయే ముందు ఓ శిల్పం ఉంది. పేరు త్రీషేడ్స్. కళను ఆస్వాదించడం తప్ప అర్థం చెప్పే స్థాయి కాదు నాది. మోడరన్ ఆర్ట్ తెలిసినోళ్లు ఏమి చెబుతారో గాని నామటుకు నాకు ఆ ’త్రీషేడ్స్’… ఒకే మాదిరి ఆలోచించే ముగ్గురు మగాళ్లు ఓ పాయింట్ వద్ద ఏకాభిప్రాయానికి వచ్చినట్టుండే శిల్పసముదాయం. ఈ ముగ్గురూ తలలు వంచి మెడ, భుజాలు ఒకే లైన్లో ఉన్నట్టుగా ఉండి వాళ్ల చేతులు– మధ్యలో ఉన్న వ్యక్తి– తొడలపై ఉంచినట్టుందీ ఆ శిల్పం. ఫ్రెంచ్ శిల్పి, ఆధునిక శిల్పశాస్త్ర పితామహుడు ఫ్రాంకోయిస్ అగస్టే రెనో రోడిన్ 1886లో ఈ శిల్పాలను మలిచారు. దీని తయారీకి ముందు అనేకమందిని కలిసి ముఖాముఖి మాట్లాడి ఈ బొమ్మను చేశారట.
స్టాన్‌ఫోర్డ్ ఆర్ట్ మ్యూజియం…
పాత పేరు స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ ఆర్ట్ మ్యూజియం. కొత్త పేరు ఐరిస్– బి. గెరాల్డ్ కాంటర్ సెంటర్ ఫర్ విజువల్ ఆర్ట్స్. ఒక్కమాటలో కాంటర్ ఆర్ట్ సెంటర్. గ్రౌండ్ ఫ్లోర్‌తో కలిపి మూడంతస్తులు, లక్షా 30 వేల చదరపుటడుగుల విస్తీర్ణం. దేశదేశాల కళాకృతులు, వందల ఏళ్ల నాటి ఫోటోలు, పెయింటింగ్‌ల వంటివనేకం. మ్యూజియం ముందున్న విశాల మైదానంలో శిల్పతోరణాలు, 24 గ్యాలరీలున్నాయి. 5వేల ఏళ్ల నాటి శిల్పాలు, విగ్రహాలు, నిన్న మొన్నటి పికాసో బొమ్మలు, 220 ఏళ్ల నాడు జపాన్, చైనా, అమెరికా మధ్య జరిగిన వాణిజ్య ఒప్పంద చిత్రాలు, పెయింటింగ్‌లు, రెండో ప్రపంచ యుద్ధంలో పెరల్ హార్బర్‌పై జపాన్ దాడి, హీరోషిమా, నాగసాకిపై అమెరికా బాంబు దాడి చిత్రాలు, ఈస్ట్ వెస్ట్ ఆర్ట్ సొసైటీ, తృతీయ ప్రపంచ ఆర్టిస్టుల సంఘం ఏర్పాటు, జపాన్ వాళ్లను నిర్బంధ క్యాంప్‌లకు తరలించమంటూ 1942 ఫిబ్రవరి 19న అమెరికా అధ్యక్షుడు రూజ్‌వెల్ట్ ఇచ్చిన ఆర్డర్ ప్రతి, యూరోపియన్ నుంచి బ్రిటన్ వైదొలగడాన్ని ఎకసెకం చేసే ఆయిల్ కాన్వాస్‌లు, ఉత్తుంగ శైల శృంగాలు, శృంగారాలు, పచ్చని లోయలు, ప్రవహించే సెలఏళ్లు.. ఇలా ఎన్నో, మరెన్నో ఉన్నాయి ఈ మ్యూజియంలో.. బాపు సినిమా ముత్యాలముగ్గులో రావు గోపాలరావు చెప్పినట్టు కూసింత కళా పోషణుంటే ఈ రంగుల రాగాలకు మనసు ఎక్కడోచోట మూలగ కుండా ఉండదు.
‘గేట్స్ ఆఫ్ హెల్’ ప్రత్యేక ఆకర్షణ…
ఆర్ట్ గ్యాలరీకి ఓ వైపు పచ్చిక మైదానంలో పేరున్న చిత్రకారులు తీర్చిదిద్దిన శిల్పాలున్నాయి. అది దాటి ముందుకొస్తే మెయిన్ లాబీ. అక్కడే రిసెప్షన్. పేర్లు నమోదు చేసి కుడిపక్కకు వెళ్తే ఓషియానిక్ ఆర్ట్, ఎడమ పక్కకు వస్తే రోడియన్ శిల్పశాల. మధ్యలో స్టాన్‌ఫోర్డ్ కుటుంబ గది. అవి చూసి లిఫ్ట్‌లో తొలి అంతస్తుకి వెళ్తే ఒక వైపు ఆఫ్రికన్ ఆర్ట్ మరోవైపు ఆసియన్ ఆర్ట్ గ్యాలరీలు. ఆడిటోరియం, కాఫీషాప్, మీయర్ ఫ్యామిలీ గాలారియో ఉంది. రెండో అంతస్తులో యూరోపియన్, అమెరికన్ ఆర్ట్, తొలినాళ్లలో యూరోపియన్ ఆర్ట్, నేటివ్ అమెరికన్ల కళ, సమకాలీన కళల ప్రదర్శన, మీటింగ్ హాళ్లు, ఔత్సాహిక కళాకారులు, సంఘాలు తమ సేకరణలను ప్రదర్శించుకునేందుకు స్థలాలు, మేడపైన శిల్పాల ప్రదర్శనకు ఏర్పాటు వంటివి ఉన్నాయి.
ఈ ఆర్ట్స్ సెంటర్‌లో ప్రత్యేక ఆకర్షణ అగస్టే రోడిన్ శిల్పాలు. ఏవైతేనేం 199 వరకు ఉంటాయట. చాలా వరకు కాంస్యంతో తయారు చేసినవే. మరికొన్ని ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో చేసినవి. ఇటాలియన్ శిల్పశైలి నుంచి స్ఫూర్తిపొందిన రోడిన్ 37 ఏళ్ల వయసులో ’ది గేట్స్ ఆఫ్ హెల్ (పాతాళానికి ద్వారాలు)’ ఈ అద్భుత శిల్పాలను సృష్టించారు. ఇందులో ది కిస్, ది త్రీషేడ్స్, ది థింకర్ వంటి శృంగార భావస్పోరక శిల్ప సముదాయం ఉంది.
కుటుంబ వారసత్వాన్ని చాటే ఆసియా గ్యాలరీ..
మన మాదిరే చాలా ఆసియా దేశాల్లో ఇళ్ల ముందు ఏదో ఒక బొమ్మను తగిలిస్తారు. కొందరు దిష్టి పేరిట పెడితే మరికొందరు తమ కుటుంబ చరిత్ర తెలిపేందుకు పెట్టుకుంటారు. మంచి చెక్కను చిత్రికపట్టి రకరకాల రూపాలలో రంగు రంగుల్లో ఉంచుతారు. ఫీచర్డ్ ఆర్ట్ వర్క్స్‌లో హౌస్‌పోస్టులు మనల్ని ఆకట్టుకుంటాయి. గడపలకు రంగులు, లెంటిల్స్ పైన పాములు బుసలు కొడుతున్నట్టుండే చిత్రవిచిత్రమైన బొమ్మలు వేయిస్తుండడం చూస్తుంటాం కదా. అవే ఈ హౌస్‌పోస్టులు. గోడలకు తగిలించే మాస్కులు మీయర్ ఫ్యామిలీ గ్యాలరీ ప్రత్యేకం. షారా లవ్ మీడివల్ గ్యాలరీలో స్టాన్‌ఫోర్డ్ కుటుంబం సేకరించిన 700 వస్తువులను భద్రపరిచారు. ఆఫ్రికన్ ఆర్ట్ మనకు దగ్గరగా ఉంటుంది.
ఏడాది ముందే కార్యక్రమాల షెడ్యూల్…
ఏ నెలలో ఏమేమి కార్యక్రమాలు జరుగుతాయో కనీసం ఆర్నెల్ల ముందే ప్రకటిస్తారు. 2023 క్యాలెండర్‌ను నవంబర్‌లోనే విడుదల చేశారు. మేము వెళ్లినప్పుడు ఈస్ట్ ఆఫ్ ది ఫసిఫిక్ పేరిట ప్రదర్శన జరుగుతోంది. అందులో– ప్రకృతితో మమేకం– పేరిట ముగ్గురు మహిళల స్నాన దృశ్యం చూపరుల మతిపోగొడుతుంది. సెలవైతే తప్ప ఎప్పుడూ తెరిచే ఉంటుంది. ఎటువంటి ప్రవేశ రుసుం ఉండదు.
పడి లేచిన కెరటం ఈ మ్యూజియం..
నిజానికిదో అసాధారణ మ్యూజియం. పడి లేచిన కెరటం. రెండు సార్లు భూ కంపాల్నీ, మరెన్నో తుపాన్లను ఎదురొడ్డి నిలిచిన భూత భవిష్యత్ వర్తమానాల చిత్రమిది. 1894లో తొలిసారి తెరిచినప్పుడే ఇందులోని కళారూపాలను చూసి అబ్బురపడిందట ఆర్ట్స్ ప్రపంచం. ఓ ప్రైవేటు మ్యూజియను ఇంత బాగా నిర్వహించవచ్చా! అని కళాభిమానులు ముక్కునవేలేసుకున్నారట. లేలాండ్ స్టాన్‌ఫోర్డ్, ఆయన భార్య జేన్ స్టాన్‌ఫోర్డ్ ఏళ్ల తరబడి సేకరించిన అమెరికన్, యూరోపియన్ ఓల్డ్ మాస్టర్స్ పెయింటింగ్స్‌తో పాటు ఈజిప్ట్, గ్రీస్, రోమ్, ఆసియా, అమెరికాల్లోని పురాతన వస్తువులు ఇందులో ఉన్నాయి. ఒక్కమాటలో ఈ మ్యూజియం పెద్ద పురావస్తు ప్రదర్శనశాల. ఎథ్నోలాజికల్ హోల్డింగ్‌లతో పాటు ఇతర కళల నిలయం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ మ్యూజియం.
1906 భూకంపంతో కుదేలు…
1906 శాన్ ఫ్రాన్సిస్కో భూకంపంతో మ్యూజియం కుదేలైంది. రోమన్, ఈజిప్షియన్, ఆసియన్ గ్యాలరీలు ధ్వంసమయ్యాయి. మరమ్మతుకీ వీల్లేకుండా మూడొంతుల భవనం దెబ్బతింది. కళాహృదయులెందరెందరో చూసి ఘొల్లుమన్నారు. 1917లో స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీకి వచ్చిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ (లండన్) పురావస్తు, భాషా శాస్త్ర నిపుణులు ప్రొఫెసర్ ఆర్కిబాల్డ్ సేస్ తన సందర్శనను గుర్తు చేసుకుంటూ, ‘విశాలమైన మ్యూజియం నామరూపాల్లేకుండా పోయింది. మొండి గోడలు, అడ్డదిడ్డంగా పడున్న రాళ్లు, రప్పలు ఇప్పటికీ నా కళ్ల ముందు మెదులుతున్నాయి. ఒకప్పుడున్న అద్భుతమైన గ్రీకు పెయింటింగ్‌లు కనపడకుండా పోయాయి. ఈజిప్ట్ మమ్మీలు చెల్లాచెదరయ్యాయని’ భావురుమన్నట్టు చరిత్ర. అందరూ కష్టాల్లో ఉన్నప్పుడు కాలానికి వదిలేయం తప్ప చేయగలిగేదే ముంటుంది. ఏవైపు నుంచి సాయం అందే పరిస్థితి లేదు. యూనివర్శిటీయే నేలమట్టమైనప్పుడు మ్యూజియం పునరుద్ధరణపై ఎవరికి ఆసక్తి ఉంటుందీ? కానీ, మ్యూజియమంటే పడి చచ్చే డైరెక్టర్ పెడ్రో జోసెఫ్ డి లెమోస్ పంటి బిగువన కొంతకాలం నడిపారు. చేసేది లేక 1945లో ఆయనా తప్పుకున్నారు. నిర్వహించే నాధుడు లేకపోవడంతో మ్యూజియంను తొలిసారి అధికారికంగా మూసేశారు.
కళ కళ కోసమా, ప్రజల కోసమా…
కళ.. కళ కోసమో కాసుల కోసమో కాదు. ప్రజల కోసం. భావితరాల కోసం కూడా కదా. అలా అనుకున్న యూనివర్శిటీ ఆర్ట్ విభాగం ఎలాగైనా సరే మ్యూజియంను తెరవడానికి నడుంకట్టింది. దీని కోసం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. సౌందర్య యోగ్యత లేని కళాకృతుల్ని ఏరి పక్కనపెట్టింది. అసలు సిసలైన వాటితో నడపాలనుకుంది. నామమాత్రంగా నిధుల్ని సేకరించింది. చివరకు 9 ఏళ్ల తర్వాత 1954లో మ్యూజియం తలుపులు తిరిగి తెరుచుకున్నాయి. మళ్లీ పూర్వ వైభవం రావడానికి 25 ఏళ్లు పట్టిందట. అందుకు ప్రత్యేకంగా ఆనాటి మానవీయ శాస్త్రాల విభాగం డీన్ రాబర్ట్ ఆర్.సీయర్స్‌కు, ప్రొఫెసర్ లోరెంజ్ ఇత్నేర్‌కు కృతజ్ఞతలు చెబుతుంటారు మ్యూజియం స్టాఫ్.
ముందుకొచ్చిన దాతలు…
1985లో అనుకోని పరిణామం ఒకటి జరిగింది. ఈ మ్యూజియానికి అవసరమైన నిధులు సమకూర్చుతామంటూ షేర్ల లావాదేవీలు నిర్వహించే ఓ సంస్థ వ్యవస్థాపకుడు బి.గెరాల్డ్ కాంటర్, ప్రొఫెసర్ ఆల్బర్ట్ ఎల్సెన్, మరికొందరు దాతలు ముందుకొచ్చారు. దీంతో కాంటర్, రోడిన్ పేర్లు కలిసొచ్చేలా ఆర్ట్ మ్యూజియంను బి.గెరాల్డ్ కాంటర్ రోడిన్ ఆర్ట్స్ మ్యూజియంగా మార్చారు.
1989లో మళ్లీ భూకంపం…
ఈ ముచ్చట నాలుగేళ్లు సాగిందో లేదో 1989లో వచ్చిన భూకంపం ఈ మ్యూజియం పాలిట శాపమైంది. రెండోసారి మూతపడింది. ఇక లాభం లేదనుకుని నిర్వాహకులు అసలు మ్యూజియం బిల్డింగ్‌నే తిరిగి కట్టాలని నిర్ణయించి ఓ కాంట్రాక్ట్ సంస్థకు అప్పగించారు. 36 లక్షల 8 వేల డాలర్ల ఖర్చు, నాలుగేళ్ల గడువు. 1995 అక్టోబర్ 26న ఈ భవనానికి శంకుస్థాపన జరిగింది. నాలుగేళ్లలో భవనం పూర్తయింది. తుపాన్లు, భూ కంపాలను తట్టుకునేలా కట్టారు. ఎగ్జిబిట్ ఫ్లోర్ గోడల్ని గట్టిగా కట్టినట్టున్నా ఎటుపడితే అటు మార్చుకోవచ్చు. వెన్నెల్లాంటి వెలుతురులో బొమ్మల్ని చూడొచ్చు. సహజ కాంతి వచ్చేలా క్లెరెస్టరీ కిటికీలను పైన అమర్చినట్టు చెబుతారు.
38వేల కళకృతుల నిలయం…
కాంటర్ ఆర్ట్స్ సెంటర్‌లో ఏవైతేనేం 38వేల చిత్రాలున్నాయి. ఆఫ్రికన్ ఆర్ట్, అమెరికన్ ఆర్ట్, ఏన్షియంట్ ఆర్ట్ మొదలు ఆండీ వార్హోల్ ఫోటోగ్రఫీ ఆర్కైవ్, ఆర్ట్ ఆఫ్ ఆసియా, ఓషియానియా వరకు ఇందులో చూడొచ్చు. కళాభిమానులు–హ్యారీ డబ్ల్యూ, మేరీ మార్గరెట్ ఆండర్సన్, ఆమె కుమార్తె మేరీ పాట్రిసియా అండర్సన్ పెన్స్ విరాళంగా ఇచ్చిన 121 పెయింటింగ్‌లు రెండో ప్రపంచ యుద్ధానంతర కాలానికి అద్దం పడతాయి. అనేక ఆర్టులు, ఫోటోలు, ప్రింట్లు, డ్రాయింగ్‌లు, స్కెచ్‌బుక్స్, శిల్పాలు, పురాతన వస్తువులు, పూర్వకాలపు లేఖల్ని ప్రత్యేకంగా భద్రపరిచారు. భావితరాలకు చూపుతున్నారు.
ఆసియన్, అమెరికన్ కళలపై ప్రత్యేక దృష్టి..
జనవరి 2021లో, కాంటర్ ఆర్ట్స్ సెంటర్ – ఆసియన్ అమెరికన్ ఆర్ట్ ఇనిషియేటివ్ (ఏఏఏఐ) ఏర్పాటైంది. ఆసియన్ అమెరికన్ ఆర్టిస్టుల పెయింటింగ్‌లు, వాటిపై అధ్యయనం, సేకరణ, సంరక్షణ ఈ సంస్థ ప్రధాన ఉద్దేశం. ఆసియన్ ఇన్షియేటివ్ అన్నారు కదా అని ఇండియా కళాకారుల చిత్రాలు ఎక్కడైనా ఉంటాయోమోనని వెతికా. ఒక్కటీ కనిపించలేదు.
ఆర్ట్ పవర్ అంతా ఇంతా కాదు…
శబ్దానికంతకూ నిశ్శబ్దం మూలమైనట్టే ప్రకృతిశిల్పి అస్తవ్యస్త ప్రకృతిని అద్భుత రూపాల సృష్టిలోకి మార్చేసే రూపాంతరీకుడంటారు మన ప్రముఖ చిత్రకారుడు సంజీవదేవ్. కళ కుండే శక్తి అంతా ఇంతా కాదు. అవగాహన కల్పిస్తుంది. అర్థం చేయిస్తుంది. అనుమానించమంటుంది. అందుకే దానికంత పదును. ఓ బొమ్మ వేయి పదాలపెట్టు. ఆ పని స్టోన్‌ఫోర్డ్ ఆర్ట్ మ్యూజియం చేసింది. హ్యారీ ఆండర్సన్ చెప్పినట్టు ఇదో వరం. నిరంతర ప్రవాహం. కళా ప్రేమికులకు, ఆధునిక, సమకాలీన కళలకు, భావి కళాకారులకు ఓ గమ్యస్థానం.
(అమరయ్య ఆకుల, సీనియర్ జర్నలిస్టు, మొబైల్
+919347921291)