వనపర్తి ఒడిలో-6
-రాఘవశర్మ
ప్యాలెస్ కు దగ్గరలోనే అప్పర్ ప్రైమరీ స్కూల్.
ప్యాలెస్ ప్రధాన ద్వారం దాటి కాస్త నడిస్తే చౌరస్తా.
ఆ చౌరస్తాకు ఎడమ పక్కనే బస్టాండ్.
ఆరోజుల్లో బస్టాండ్ అంటే ఏమిటి?
విశాలమైన ఖాళీ జాగాలో ఎప్పుడో ఒక బస్సు వచ్చి ఆగుతుంది, వెళ్ళి పోతుంది.
బస్టాండ్ ఎదురుగా చిన్న చిన్న పాన్ డబ్బాలు.
‘మీ వాడు బాగా చదువుతున్నాడు. నాలుగులో అవసరం లేదు, ఐదులోకే సేయండి’
మా నాన్నకు సలహా ఇచ్చాడు రంగాచారి.
వేణుగోపాల స్వామి గుడిలో మూడవ తరగతి వరకే.
అప్పర్ ప్రైమరీ స్కూల్లో 5,6,7 తరగతులు.
బస్టాండ్ వెనుకవైపే అప్పర్ ప్రైమరీ స్కూల్.
అయిదవ తరగతిలో చేరడానికి వయసు సరిపోవడం లేదు.
ఏడాది ఎక్కువేయించి అయిదులో చేర్పించారు.
‘మీవాణ్ణి నేను చూసుకుంటానులే’ అన్నాడు అప్పర్ ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ నరసింహాచారి.
మంచి గాలి వెలుతురుతో E ఆకారంలో స్కూల్ భవనం చాలా బాగుండేది.
ఆ స్కూలులో చేరాకే పెన్నులు, పెన్సిళ్ళు నా చేతికొచ్చాయి.
అప్పటి వరకు పలక బలపమే.
ఆ రోజుల్లో అన్నీ ఇంకు పెన్నులే.
ఇంకుకారి చొక్కానిండా అయ్యేది.
అప్పుడే కొత్తగా బాల్ పాయింట్ పెన్నులొచ్చాయి.
అవి కారే సమస్యే లేదు.
పెన్నుల్లో ఇంకైపోతే, అయిదు పైసలకు పిల్లర్‌తో పెన్ను నిండా ఇంకు పోసేవాళ్ళు.
బాల్ పాయింట్ పెన్నులో ఇంకైపోతే!?
ఇప్పుడైతే పారేస్తాం.
ఆ రోజుల్లో బాల్ పాయింట్ పె న్నుల్లో కూడా ఇంకు ఎక్కించే వారు.
దానికి ప్రత్యేకమైన ట్యూబులుండేవి.
పరీక్షలు రాయడానికి బాల్ పాయింట్ పనికి రాదు.
ఇంకు పెన్నులతోనే పరీక్షలు రాయాలి.
వీధి బడిలో హిందీ లేదు, ఇంగ్లీషురాదు.
ఆ పుస్తకాలు నాచేతికిస్తే, అంధుడికి అద్దమిచ్చినట్టే ఉండేది.
హిందీకి చెల్లెమ్మ టీచర్ వచ్చేది.
నల్లగా, లావుగా, కుదుమట్టంగా ఉండేది.
కర్ణుడి సహజ కవచకుండలాల్లా ఆమె ముఖంలో ఎప్పుడూ నవ్వే.
పిల్లలందరినీ తన బిడ్డల్లా చూసేది.
నాలాగే చాలా మంది వీధిబడుల నుంచి వచ్చిన వాళ్ళు.
హిందీ అక్షరాలు నేర్పించాకే పాఠాలు మొదలు పెట్టింది.
బహుశా ఆరవ తరగతిలోనో, ఏడవ తరగతిలోనో ఆమే మాకు ‘మేరా నయాబచన్’ చెప్పింది.
సుభద్ర కుమారీ చౌహాన్ రాసిన ఆ గీతం నాకు కంఠోపాఠం.
ఇప్పటికీ ఆ గీతంలోని చరణాలు నా మదిలో నిలిచిపోయాయి.
జలియన్ వాలాబాగ్ దురంతంపై సుభద్ర కుమారీ చౌహాన్ ఆరోజుల్లోనే రాసిన గీతం ఈ మద్య ప్రజాసాహితిలో తెలుగులో అనువాదమైంది.
సుభద్రకుమారి చౌహాన్ పేరు వినగానే నాకు ప్రాణం లేచొచ్చింది.
మళ్ళీ నా స్కూల్ రోజులు కళ్ళ ముందు మెదలాడాయి.
వేణుగోపాలస్వామి గుడిలో కోదండం ఎక్కిన శాంసుందర్ ఇక్కడా ప్రత్యక్షమయ్యాడు.
‘అరె శాంసుందర్.. బడా బందర్.. కిదర్ హైరే !? ఇదరా.’ అని పిలిచింది.
క్లాస్‌లో వెనక కూర్చున్న శాంసుందర్ జారిపోతున్న నిక్కరును పైకి లాక్కుంటూ ‘చెప్పండి టీచర్’ అంటూ ఉత్సాహంగా ముందుకొచ్చాడు.
‘ఇం లీ లారే’ అన్నది.
శాంసుందర్ ఎప్పుడూ నడిచేవాడు కాదు.
టక..టక..టక..టక అని నోటితో డెక్కల శబ్దం చేస్తూ, చేతిలో కర్రను కత్తిలా ఊపుతూ గుర్రంలా పరిగెత్తేవాడు.
అతనొస్తుంటే విఠలాచార్య వస్తున్నాడనేవారు.
మొత్తానికి ఎక్కడో చెట్టెక్కి చింతకాయ కోసుకొచ్చాడు.
ఒక సారి మామిడి కాయ కోసుకొచ్చాడు.
ఇంత మంచి చెల్లెమ్మ టీచర్ చింతకాయలు, మామిడి కాయలు కోసుకురమ్మని
ఎందుకు పురమాయిస్తోందో!?
నిజంగా ఆ వయసులో నాకు తెలియదు, టీచర్ గర్భవతి అని.
ఒక సారి క్లాస్ జరుగుతుండగా వర్షం పడుతోంది.
స్కూలుకు దగ్గరగా రెండు కుక్కలు ఒకదాని వెనుక ఒకటి లాక్కుంటున్నాయి.
‘టీచర్.. టీచర్.. పాపం ఆ రెండు కుక్కల తోకలను తాడుతో ఎవరో కట్టేశారు టీచర్’ అన్నానంతే.
పిల్లలంతా లేచి చూడడం మొదలు పెట్టారు.
క్లాసంతా గోలగోల.
టీచర్ ఏమీ చెప్పడం లేదు, తనలో తాను నవ్వుకుంటోంది.
నాకు తెలిసి ఆమె ఎప్పుడూ పిల్లల్ని కొట్టిన పాపాన పోలేదు.
నామాలు పెట్టుకుని, ఎత్తుగా, లావుగా ఉండే నరసింహాచారి లెక్కలు చెప్పేవాడు.
బోర్డుమీద లెక్కలు వేస్తూ, ఉర్దూలో వాటిని గొణుక్కునే వాడు.
క్లాసులో మేమంతా నవ్వే వాళ్ళం.
‘ఏమ్ నవ్వుతున్నరూ!? మీలాగ తెలుగులో చదువుకోలే. ఉర్దూ స్కూళ్ళలో చదువుకున్నం’ అనే వాడు నవ్వుతూ.
ఇంట్లో కూడా ట్యూషన్లు చెప్పేవాడు.
ఆయన చదువు చెపితే బాగా వస్తుందని ఊళ్ళో చాలా మందికి నమ్మకం.
చేతిలో బెత్తం మాత్రం ఉండేది.
పాపం కొట్టేవాడు కాదు కానీ, గప్పాలు కొట్టేవాడు.
అప్పుడప్పుడూ ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడేవాడు.
క్లాసులో ఎవరి తల్లి దండ్రులు ఎంత ఆస్తి పరులో చెప్పి పొగిడే వాడు.
సైన్స్ చెప్పే బ్రహ్మయ్య సార్ సన్నగా, పొడుగ్గా ఉండేవాడు.
ఎండాకాలంలో తలకు టోపీ పెట్టుకుని ఓ.పి.నయ్యర్లా కనిపించేవాడు.
గరిమనాభి గురించి, భూమ్యాకర్షణ గురించి చాలా బాగా చెప్పేవాడు.
చాక్‌పీస్‌తో నేలపైన ఒక పొడవాటి గీత గీసి, దాని పైన నడుస్తూ, పడిపోకుండా తాడుపైన నడిచే వాళ్ళు ఎలా నడుస్తారో, ఆ గీతపైన తానూ నడుస్తూ వివరించేవాడు.
బొడ్డు కేంద్ర బిందువని, అదే గరిమనాభి అని, అక్కడి నుంచి కిందకు వేలాడే రేఖ కచ్చితంగా తాడుపైనే పడేలా నడిస్తే పడిపోరని చెప్పేవాడు.
నిజజీవితం నుంచి సైన్స్ పాఠాలు చెప్పడం, ముఖ్యంగా అప్పర్ ప్రైమరీ స్కూలు పిల్లలకు చెప్పడం చాలా అపురూపమనిపించేది.
భీమ్రావ్ సార్, ఆయన భార్య కూడా టీచర్లే.
మా ఎలిమెంటరీ స్కూలు చదువు పూర్తి కావస్తుండగా తుల్జారామ్ సైన్స్ టీచర్ గా చేరాడు.
గుండ్రటి ముఖం, గిరజాల జుట్టు, ఆకర్షనీయమైన కళ్ళు, బలంగా, పెద్ద పెద్ద మీసాలతో గంభీరంగా ఉండేవాడు.
పోలీస్ ఆఫీసర్ గా వెళ్ళాలని చాలా ప్రయత్నం చేశాడు.
దానికి సెలక్ట్ కాకపోవడంతో అన్ ట్రైన్ డు టీచర్ గా చేరాడు. ఆకారం గంభీరమైనా, మాట మెత్తన, మనసూ మెత్తనే.
లక్ష్మయ్య అనే ఒకపేదను ఇంట్లోనే పెట్టుకుని పెంచి పెద్ద చేశాడు.
కుస్తీలు పట్టే అతనొక పహెల్ మాన్ అయ్యాడు.
ఇంటర్ చదివే రోజుల్లో లక్ష్మయ్య మాకు కుస్తీ నేర్పేవాడు.
ఒక సారి పట్లునేర్పిస్తూ, ఇసుకలో వెల్లకిలా పడేశాడు.
అంతే.. ఆ దెబ్బతో కుస్తీ జోలికి మళ్ళీ వెళ్లలేదు.
నా తిక్క కాకపోతే, నాలాంటి బక్క మనిషికి కుస్తీలేమిటి!?
అతని నుంచే రోజూ వ్యాయామం చేయడం నేర్చుకున్నాను.
తుల్జారామ్ తల్లి పేరు మంగలి దాయమ్మ.
ఆరోజుల్లో మంగలి దాయమ్మ అంటే వనపర్తిలో తెలియని వాళ్ళు లేరు.
ప్రభుత్వాసుపత్రిలో పనిచేసేది.
ఇంటికి వచ్చి కాన్సులు చేసేది.
ఆ మంగలి దాయమ్మే మా అమ్మకు నాలుగుపురుళ్ళు పోసింది. మాపిన్నికి, మా అత్తయ్యకు, మా అక్కకు కూడా ఆమే.
మంగలి దాయమ్మ ఒక వారధి లాంటిది.
ఆమె చేతుల మీదుగానే ఊపిరి పోసుకుని లెక్కలేనంత మంది ఈ లోకంలో కొచ్చారు.
నాలుగు నెలల క్రితం (2022 సెప్టెంబర్) వనపర్తి వెళ్ళాను.
మేం చదువుకున్న అప్పర్ ప్రైమరీ స్కూల్ ప్రాంతాన్ని చూసి బిత్తరపోయాను.
స్కూల్ ఆనవాళ్ళు లేవు.
జెసీబితో నేలమట్టం చేసి ఉంది.
భూతంలా ఒక జేసీబీ ఇంకా అక్కడే ఉంది.
మూడు రోజుల క్రితమే కూల్చివేత మొదలు పెట్టారట.
కాసేపటి క్రితం పూర్తయ్యింది.
మనసు ఉసూరుమనిపించింది.
అక్కడంతా భవన శకలాలు పడి ఉన్నాయి.
ఆ శకలాల్లోనే నా స్కూల్ జ్ఞాపకాలను ఇలా నెవరేసుకున్నాను.
రోజూ ఇంటి నుంచి స్కూలుకు నడుచుకుంటూ వెళ్ళే వాడిని.
ప్యాలెస్ ప్రధాన ద్వారం దాటగానే, కోట గోడకు ఇరువైపులా పూడిపోయిన కందకం.
ఆ కందకానికి ఆనుకుని ఎడమ, కుడివైపుల రెండురోడ్లు వెళ్ళేవి.
కాస్త ముందుకెళితే కుడివైపున బర్రెల రామిరెడ్డి ఇల్లు.
ఎడమ వైపున ఖాళీ జాగాలో గుడిసెలేసుకుని పందులను మేపుకునే యానాదులు.
ఓ రోజు స్కూలుకెళుతుంటే, ఓ హెడ్‌కానిస్టేబుల్ కనిపించాడు.
లావుగా, ఖాకీ నిక్కరు, ఖాకీ చొక్కా వేసుకుని, తలకు ఎరుపు నీలపు రంగు చారల టోపీతో ఉన్నాడు.
పందులను మేపుకునే వారిలో ఒకతన్ని బెల్టు తీసుకుని కొడుతున్నాడు.
అతను ఏం చేశాడో తెలియదు.
ఆరవై ఏళ్ళ క్రితం పేదలపై పోలీసులు చూపించిన ప్రతాపం స్వరూపం మారినా ఇప్పటికీ దాని స్వభావం మారలేదు.
పాలిటెక్నిక్ అధ్యాపకుల్లోనే కాదు, విద్యార్థుల్లోనూ కోస్తా, రాయలసీమ వాసులే ఎక్కువ.
వారి కోసం బస్టాండ్ ఎదురుగా ఒక కొత్తగా ఉడిపి హెూటల్ వెలిసింది.
ఆ రోజుల్లో ప్లేటు ఇడ్లీ పదిపైసలు, దోశ పదిహేను పైసలు, మసాలా దోశ ఇరవై పైసలు, చాయ్ అయిదు పైసలు.
పోపుల డబ్బాలో దాచిన చిల్లర డబ్బులు తీసి మా అమ్మ నాకిచ్చేది.
జేబులో పావలా ఉంటే చాలు, ఉడిపి హెూటల్లో పండగే పండగ.
విద్యార్థులు, అధ్యాపకులతో ఆ హెూటల్ కళకళలాడేది.
ఆ ఉడిపి హెూటల్ వెలిసే వరకు ఊరంతా చాయ్ హెూటళ్ళే.
చాయ్ లో బిస్కెట్లు, బన్నులు ముంచుకు తినేవారు.
ఉడిపి హెూటల్ పక్కనే అక్బర్ పాన్ డబ్బా ఉండేది.
సిగరెట్లు, బీడీలు, అగ్గిపెట్టెలతో పాటు జర్దా కిళ్ళీలు కట్టిచ్చే వాడు.
ఆ కిళ్ళీల కోసమే పాలిటెక్నిక్ సిబ్బందిలో కొందరు అక్కడికొచ్చేవారు.
సిగరెట్ల కోసం మానాన్న కూడా అక్బర్ పాన్ డబ్బా దగ్గరకొచ్చేవాడు.
వనపర్తిలో ఉన్నంత కాలం అక్బర్ పాన్ డబ్బాలోనే సిగరెట్లు కొనేవాడు.
అతనితో ఉర్దూలో మాట్లాడేవాడు.
తెల్లని పైజామాపై రంగు జుబ్బా వేసుకునేవాడు.
అప్పుడప్పుడూ పాన్ నములుతూ, తెల్లగా, బలంగా ఉండేవాడు.
వచ్చిన ప్రతి వారితో చాలా మర్యాదగా వ్యవహరించేవాడు.
మా కుటుంబం వనపర్తి వదిలేసి తిరుపతి వచ్చేసేటప్పుడు అక్బర్ మానాన్నను కావిలించుకోవడం (అలైబలై) నేనుకళ్ళారా చూశాను. ఇంతకూ ఎవరీ అక్బర్!?
ఒకప్పటి రజాకార్లలో పనిచేసిన వాడు.
కాలం మనిషిలో ఎంత మార్పు తెస్తుంది !?
సలాం, ఖయ్యూమ్ అనే ఇద్దరు అన్నదమ్ములుండేవారు.
సలాం మా రాధ మామయ్యకు మంచి స్నేహితుడు. ఇద్దరూ కలిసి హిందీ పాటలు పాడేవారు.
పాత హిందీ పాటలు ఎంత మధురంగా ఉండేవో!
సలాంకు కాస్త మెల్లకన్నుండేది, మంచి రేడియో మెకానిక్.
ఇంట్లో రేడియో ఉంటే ఆ
రోజుల్లో చాలా గొప్ప.
మా నాన్న పెద్ద రేడియో కొనుక్కొచ్చాడు.
దానికి ఇరువైపులా రెండు స్పీకర్లు.
సరిగ్గా పనిచేసి చచ్చేది కాదు, ఎప్పుడూ రిపేర్లే.
వస్తూ వస్తూ ఆగిపోయేది.
సలాం దగ్గరకు తీసుకెళితే, ఒకసారి దాని చెంప మీద ఒక దెబ్బ కొట్టాడు.
ఆ బెబ్బకు కాస్త మోగింది.
ఇంటికి తీసుకెళితే మళ్ళీ మూగవోయింది.
దాన్ని అటొక దెబ్బ, ఇటొక దెబ్బ కొట్టి కొట్టి కసితీర్చుకున్నాం.
మా దెబ్బలకు అది పూర్తిగా మూలపడింది.
ఎలాగైతేనేమి, ఆ కొత్త రేడియోను సలాంకిచ్చేసి ఒదిలించుకున్నాం.
సలాం పాతకాలం నాటి ‘హింద్’ రేడియోను మాకిచ్చాడు.
అప్పటికే హింద్ కాలంచెల్లిన కంపెనీ.
అది చాలా బాగా పనిచేసింది.
బహుశా వనపర్తిలో ఉన్నంత కాలం అదే మా కాలక్షేపం.
బస్టాండు పక్కనే ఖయ్యూం హెూటల్ పెట్టుకున్నాడు.
ఇంటర్ చదివేటప్పుడు జేబులో పావలా ఉంటే చాలు, మరొకరితో కలిసి ఖయ్యూం హెూటల్లో వన్‌బైటూ చాయ్ తాగే వాళ్ళం.
రోజులు గుడుస్తున్న కొద్దీ బస్టాండు ఎదురుగా షాపులు పెరిగాయి.
ఊర్లో ఒక సందడి మొదలైంది.
వీధులు కళకళలాడుతున్నాయి.
మా పెరుగుదలతో పాటు ఊరూ పెరిగింది.
వనపర్తి మహా సందడిగా తయారైంది.
(ఆలూరు రాఘవశర్మ సీనియర్ జర్నలిస్టు, ట్రెక్కర్, తిరుపతి)
ఆలూరు రాఘవశర్మగారి వనపర్తి పలుకూటం (బడి) పలుకులు అరగొండ బెల్లం పలుకులు. పనసతొనలు. అప్పటి సహచర విద్యార్థులు, అయ్యవార్లు, బడి ముందర సంచార తినుబండారాల కొట్లు, నేరేడు పండ్ల నీలిమ, ఎఱ్ఱటి కనుగుడ్లను పోలు సీమచింతకాయలు, మామిడికాయల పులుపు, అన్ని బడులకూ అనుసంధిత అనుభూతులేలే.
రాఘవశర్మ గారికి రాగాంజలులు.
బుధజన విధేయుడు,
మల్లం దేవేంద్రనాధ రెడ్డి,
విశ్రాంత విద్యుత్ఎస్.ఇ,
ఎపియస్పీడిసియల్, తిరుపతి.