-రాఘవ శర్మ
రోట్లో పాము పడుకునుంది!
పచ్చడి చేయడానికి వెళ్ళిన మా అమ్మ ఒక్క సారి ఉలిక్కిపడింది.
పచ్చడి చేయకుండానే రోకలితో వెనుతిరిగింది.
వనపర్తి ప్యాలెస్ కు అగ్నేయాన ఒక పాత ఇంట్లో ఉన్నాం.
ఆ ఇంటి వెనుక ఎత్తైన కోట గోడ.
పాములు, తేళ్ళతో నిండిన పాత కాలపు పాడుపడిన ఇల్లు.
అక్కడ మా ఇల్లు ఒంటరిగా ఉండేది.
పాము దెబ్బతో ఆ ఇల్లు ఖాళీ చేసి, ప్యాలెస్ కు ఈశ్యా దిక్కున ఉన్న మరో ఇంట్లోకి చేరాం.
ఆ పాత ఇల్లు కూలగొట్టి, తరువాత సివిల్, ఎలక్ట్రికల్ ల్యాబ్ లు కట్టారు.
ఈశాన్య దిక్కున చేరిన మా ఇంటి పక్కన మరికొన్ని ఇళ్ళున్నాయి. ఎదురుగా పెద్ద మోట బావి.
ఆ బావికి ఆవల ఒక విశాలమైన భవనం.
ఆ భవనంలోనే పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ హఫీదుల్లా ఉండేవారు.
తెల్లగా, పొట్టిగా, చిన్న పొట్టేసుకుని బట్టతలతో లావుగా ఒంటరిగా ఉండేవారు.
ఎప్పుడూ టై కట్టుకుని, కోటేసుకుని, మంచి సూటు బూటులో కనిపించేవారు.
ఒక పేద ముస్లిం కుటుంబాన్ని హఫీదుల్లా చేరదీశారు.
ఆ భవనం పక్కనే ఒక పెద్ద మర్రి చెట్టు.
కోటగోడను ఆనుకుని, మర్రి చెట్టు కింద ఉన్న చిన్న ఇంట్లో ఆ కుటుంబం కాపురముండేది.
ఆ ఇల్లాలి పేరు గోరెమ్మ. ఆమె భర్త పేరు గుర్తు లేదు.
గోరెమ్మ కూతురో, చెల్లెలో తెలియదు కానీ, మరొక యువతి పేరు సుభానీ.
(సుభానీ, గోరెమ్మ పేర్లు వెంటనే గుర్తుకు రాక పోవడంతో, చాల సేపు ఆలోచించి మా అమ్మ (91) చెప్పింది.)
గోరెమ్మ, సుభాని ఇద్దరూ కలిసి తరచూ మా ఇంటికి వచ్చేవారు.
వరండా బయటే ముడికాళ్ళపైన కూర్చుని, మా అమ్మతో కబుర్లు చెప్పేవారు.
ఏదో పండుగ వచ్చింది.
హఫీదుల్లా పెద్ద ఎత్తున స్వీట్లు చేయించారు.
ఒక పెద్ద పళ్ళెం నిండా స్వీట్లు పెట్టి, దాని పైన చాలా అందంగా అల్లిన ‘మాటీ’ గుడ్డను కప్పి, గోరెమ్మ, సుభానీతో మా ఇంటికి పంపించారు.
అలాగే ఆ క్వార్టర్స్ ఉన్న అందరి ఇళ్ళకూ పంపించారు.
ఆ స్వీట్లను చూస్తే నాకు ప్రాణం లేచొచ్చింది.
ఎప్పుడూ అన్ని స్వీట్లను చూసిన పాపాన పోలేదు.
చాలా ఇష్టంగా తిన్నాం.
మా అమ్మ ఏ మాత్రం అభ్యంతరం చెప్పలేదు.
మా పక్కింట్లో ఉన్న ఒక లెక్చరర్ (పేరు గుర్తున్నా రాయదలుచుకోలేదు) భార్య మర్నాడు మా అమ్మతో మాట్లాడుతూ, ‘మీకు కూడా స్వీట్లు పంపించారటగా! ఆ తురకాళ్ళు చేసిన స్వీట్లు.. ఎలా తింటామండీ మనం? మాపనమ్మాయికి ఇచ్చేశా’ అంది ఏదో సాహసం చేసినట్టు!
మా అమ్మ మారుమాట్లాడలేదు.
‘వాళ్ళు చేస్తే ఎందుకు తినకూడదు!? అన్నది అప్పుడే నా మదిలో మెదిలిన ప్రశ్న.
అప్పుడు నా వయసు ఐదేళ్ళు.
‘ఇంత మంచి స్వీట్లను తినకుండా వేరే వాళ్ళకు ఇచ్చేస్తారా!?’
మాపక్కింటి వాళ్ళు వైశ్యులు. వారిది కూడా మా నాన్న ఊరు బాపట్లే..
వారి తరువాత ఉన్న ఇంట్లో క్రైస్తవ మతానికి చెందిన హజరత్తయ్య స్వీట్లను తీసుకున్నారు. మా క్వార్టర్స్ లో కొందరు తిన్నారు, కొందరు పారేశారు, మరి కొందరు వేరే వారికి ఇచ్చేశారు.
‘వాళ్ళు చేసిన స్వీట్లెందుకు తినకూడదు!?”
నన్ను చాలా కాలం వెంటాడిన ప్రశ్న
ప్యాలెస్ ఆవరణంతా జనంతో కిటకిట లాడుతోంది.
కాలేజీలో రెండవ ఏడు అడ్మీషన్లు మొదలయ్యాయి.
తెల్లటి పైజమా, అరచేతుల చొక్కాతో చీరాల నుంచి మా బాబాయి దిగాడు.
సన్నగా, నల్లగా పొడుగ్గా ఉన్నాడు.
చేతిలో ఉన్న గుడ్డ సంచిలో ఒక జత బట్టలు, సర్టిఫికెట్లు.
మా బాబాయి ధర్మవరపు రాంగోపాల్ ని అదే తొలిసారి చూడడం.
మానాన్నకు పిన్ని కొడుకు.
తొలుత రంగస్థల నటుడు, తరువాత సినీ నటుడు.
గౌతం ఘోష్ తీసిన ‘మాభూమి’ సినిమాలో కార్మిక నాయకుడిగా, ప్రేమ్ చంద్ ‘కఫన్’ ఆధారంగా శ్యాంబెనగల్ తీసిన ‘ఒక ఊరి కథ’లో రెండు ప్రధాన పాత్రల్లో ఒక పాత్రలో నటించాడు.
మరి కొన్ని సినిమాల్లో కూడా నటించాడు.
నటన వృత్తి కాదు, ప్రవృత్తి మాత్రమే.
మానాన్న సిఫారసుతో పాలిటెక్నిక్ లో సీటు సంపాదించి, చదువు పూర్తయ్యే వరకు మా ఇంట్లోనే ఉన్నాడు.
ఆ వెనకాలే బందరు నుంచి మా రాధ మామయ్య దిగాడు.
రసికుడైన రాధాకృష్ణ మురళీ పూర్ణచంద్రశేఖరరావు ఎస్ఎస్ఎల్ సీ చదివి, హైయ్యర్ గ్రేడ్ టీచర్ ట్రైనింగ్లో చేరాడు.
మంచి కఠస్వరం. పాటలు, పద్యాలు చాలా బాగా పాడేవాడు.
నేను స్కూల్లో చేరే రోజులు దగ్గరపడ్డాయి.
మా ఇంటికి దరిదాపుల్లో ఎక్కడా ఎలిమెంటరీ స్కూల్ లేదు.
ప్యాలెస్ నుంచి దూరంగా వెళ్ళాలి.
ప్యాలెస్ ఆవరణ కొచ్చిన ఏడాదికి, మా చదువుల కోసం ఊరి మధ్యలో ఇల్లు తీసుకున్నారు.
మా ఇళ్ళ సముదాయానికి చుట్టూ ఎత్తైన ఒక పెద్ద ప్రహరీ గోడ.
దానికొక పెద్దగేటు; దాన్ని ‘పాటక్’ అనేవారు.
పెద్ద పెద్ద వాహనాలొస్తే తప్ప పాటక్ తెరవరు.
పాటక్ కు ఒక పక్క చిన్న గేటు.
ఆ గేటు లోంచి పెద్ద వాళ్ళు తల ఒంచుకుని బయటకొచ్చే వారు.
మా కాంపౌండ్లో చివరన మా ఇల్లు ఉండేది.
మా ఇంటి నుంచి బైటికివెళ్ళడానికి, ఒక సందులోకి చిన్న తలుపుండేది.
తలుపు తీస్తే రోడ్డు.
రోడ్డు పక్కనే తైసిల్ (తాలూకా) ఆఫీసు.
తైసిల్ దార్ లోన కూర్చుని పనిచేసుకునే వాడు.
అతని జమాను బైట కూర్చుని బీడీ తాగుతూ , ఎప్పుడూ తాడు లాగి, వదులుతుండే వాడు.
తైసిల్ దార్ కుర్చీ పైన, కప్పుకు వేలాడుతున్న విసిన కర్రలాంటి చాపకు ఆ తాడు కట్టి ఉండేది.
జమాను తాడు లాగినప్పుడల్లా తైసిల్ దార్ తలపైనున్న చాప విసిన కర్రలాతిరిగేది.
ఆరోజుల్లో అదే ఫ్యాను.
ఆఫీసులో తైసిల్ దార్ ఉన్నంత సేపు జమానుకు అదే పని.
తైసిల్ దార్ బెల్లు కొడితే , బీ డీ చెప్పు కింద రాసి ఆర్ పే సి జమాను లోపలి వెళ్ళేవాడు.
ఆ సమయంలో ఆయన తలపైన ఉండే చాప ఊగేది కాదు.
మా ఇంటి ఎదురు గుండా దట్టంగా పెరిగిన ఎత్తైన చెట్లతో అడవిలా ఉండేది.
ఆ చెట్ల మధ్యలో బావాజీ మఠం.
ఆ చెట్ల కింద రోజూ సాయంత్రం ఆర్ఎస్ఎస్ శాఖ జరిగేది.
ఏడాదిలో ఒకటి, రెండు సార్లు వాళ్ళే రెండు వర్గాలుగా ఏర్పడి ఒక గుట్ట దగ్గరకు వెళ్ళే వాళ్ళు.
ఆ రెండు వర్గాలు ఒకరితో ఒకరు పోటీపడుతూ గుట్టపైన జెండా ఎగరేయాలి.
ఇరువురి మధ్య పోటీ.
ఒకరినొకరు తోసుకుని కర్రలతో కొట్టుకునే వారు.
దెబ్బలు తగిలేవి, తలలు పగిలేవి.
జెండా ఎగరేసిన వాళ్ళు శివాజీ వర్గం అని, ఓడిన వారు ఔరంగాజేబు వర్గం కానీ, అక్బర్ వర్గం అని కానీ పేరు పెట్టుకునే వారు.
అంటే గెలిచిన వాడు హిందువు! ఓడిన వాడు ముస్లిం!
మర్నాడు ఆ దెబ్బలతోనే ఆర్ఎస్ఎస్ శాఖకు వచ్చేవారు.
ఆరోజుల్లో ఆర్ఎస్ ఎస్ నాయకుడు జడలయ్య.
ఆ రోజు పాకీ దొడ్లు ఎలా ఉండేవి!?
ఒక గదిలో రెండు గట్లు కట్టి, ఆ రెండు గట్లకు మధ్య ఏటవాలుగా నాపరాయి వేసేవారు.
ఆ నాపరాయి కింద బైటకు పెద్ద కంత ఉండేది.
మనం కూర్చున్న విసర్జితం కంత నుంచి బైటకెళ్ళిపోయేది.
రోజూ సఫాయి వాలా వచ్చేవాడు.
మానవ విసర్జితాన్ని బైట నుంచి బక్కెట్లలోకి ఎత్తేవాడు.
లోపలకొచ్చి నీళ్ళతో నాపరాయిపైన కడిగేవాడు.
ఆ మురికి నీళ్ళు సైడు కాలువలో పడేవి.
కాకీ నిక్కరు వేసుకుని, కాలర్ లేని తెల్లటి అర చేతుల చొక్కా వేసుకుని, సఫాయి వాలా సైకిల్ పై వచ్చేవాడు.
తలకు నెహ్రూ టోపీ పెట్టుకునే వాడు.
పొట్టిగా బలంగా ఉండేవాడు.
అతనికి తెలుగు రాదు. ఉర్దూలో మాట్లాడే వాడు.
మానవ విసర్జితాన్ని రెండు పెద్ద పెద్ద బక్కెట్లలో వేసుకుని, వాటిని సైకిల్ హ్యాండిల్ కు తగిలించుకుని వెళ్ళిపోయేవాడు.
అప్పుడప్పుడూ అతని భార్య వచ్చేది.
ఆ సఫాయి వాలా కాస్త ఆలస్యమైతోనో, ఒక్కొక్కరోజు రాకపోతేనో పాకీ దొడ్డి భరించరాని కంపు కొట్టేది.
లోపలకు వెళితే ముక్కుమూసుకుని కూర్చోవాల్సి వచ్చేది.
అలాంటిది, రెండు బక్కెట్ల నిండా మానవ విసర్జితాన్ని తీసుకుని ఎలా వెళ్ళే వాడో!
నాకు అశ్చర్యమేసేది, బాధనిపించేది.
ప్రతి నెలా డబ్బుల కోసం ఇంటికి వచ్చి ‘అమ్మా సఫాయి వాలా. పైసా..’ అని అరిచేవాడు.
మా అమ్మ రూపాయో, అర్ధరూపాయో ఇచ్చేది.
ఆ రోజుల్లో స్కూల్ ఫైనల్ అయిపోగానే టైప్ నేర్చుకోవడం పరిపాటి.
సాయంత్రమైతే మా బాబాయి, మా రాధమామయ్య టైప్ ఇన్ స్టీ ట్యూట్ కు వెళ్ళే వాళ్ళు.
మంచి ఫ్యాంటు, షర్టు వేసుకుని, టక్ చేసుకుని, టైప్ నేర్చుకోవడానికి ఓ వ్యక్తి వాళ్ళపక్కనొచ్చి కూర్చున్నాడు.
నవ్వుతూ ‘ఆదావర్సే సాబ్’ అన్నాడు.
‘ఎవరబ్బా’ అని మొదట్లో వీళ్ళు ఆశ్చర్యపోయారు.
‘ఆప్ కౌన్ భాయ్’ అని అడిగితే, ‘సాబ్.. హమ్ కో నహీ పె హె చాం తా?’ ఎదురు ప్రశ్నవేశా డు.
‘మై సఫాయి వాలా’ అన్నాడు మళ్ళీ తనే.
మాబాయి, రాధమామయ్య బిత్తరపోయి, షాక్ కు గురయ్యారు.
‘పాకీ వాడొచ్చి మా పక్కన కూర్చుంటాడా?’ అంటూ ఇంటికొచ్చి బాధపడిపోయారు.
నిజానికి మా బాబాయి, మామయ్య కంటే సాఫాయి వాలా మంచి గుడ్డలేసుకుని శుభ్రంగా ఉన్నాడట.
కొన్నాళ్ళకు అతను పాకిస్థాన్ వెళ్ళిపోయాడు.
‘పాకీ’ అంటే మన వాళ్ళకు ఎంత చులకన!
ఉర్దూలో ‘పాకీ’ అంటే పవిత్రం.
శుభ్రతే పవిత్రం.
మన పాకీ దొడ్లను మనం శుభ్రం చేసుకోలేం!?
మనం పుట్టుకతో వృద్ధులం కనుక! పుట్టుకతో వికలాంగులం కనుక!
పుట్టుకతో మానసిక రోగులం కనుక !
శుభ్రం చేసే వాళ్ళను మనుషులుగా చూడం!?
మనం అసలైన మనుషు లం కాదు కనుక!
చాలా కాలం క్రితం పాకీ వ్యవస్థను నిషేధించాక సెప్టిక్ ట్యాంకులతో ఆధునిక మరుగు దొడ్లు వచ్చాయి.
అయినా మన దొడ్లను మనం శుభ్రం చేసుకోలేం!
వాటిని కూడా పని వాళ్ళే శుభ్రం చేయాలి!
‘పరాధీనం వృథా జన్మ’
‘పాటక్’ తెరుచుకుని రోడ్లో కొస్తే, రోడ్డుకు అవలివేపు అవకాయ మామ్మ ఉండేది.
ఒక ఏడాది మా ఇంటికి వచ్చి ఆవకాయ పెట్టింది.
అందుకుని ఆమె ఆవకాయ మామ్మ అయిపోయింది.
గుండు కొట్టించుకుని, తెల్ల చీర కట్టుకునుండేది.
బ్రాహ్మణ కుటుంబాలలో విధవరాళ్ళు గుండు కొట్టించుకుంటే తప్ప, పండుగల్లో, తద్దినాల్లో మడివంటకు అనుమతించరు.
విధవ రాళ్ళపట్ల ఎవరూ ఆకర్షితులు కాకూడదనే ఆచారాన్నిలా అడ్డం పెట్టారు!?
‘తలలు బోడులైన తలపులు బోడులౌనా?’
వేమన ఏనాడో ప్రశ్నించాడు.
అవకాయ మామ్మలాగా గుండు కొట్టించుకున్న వృద్ధురాలిని చివరి సారిగా 1974లో తిరుపతిలోనే చూశాను.
ఆవకాయ మామ్మకు ఒక మనవడుండే వాడు.
పొట్టిగా, లావుగా ఉంటూ, ఫైజామా వేసుకునేవాడు.
ఆవకాయ మామ్మ తన మనవణ్ణి చాల ప్రేమగా చూసేది.
తరచూ ఫిట్స్ వచ్చి, అతను ఎక్కడపడితే అక్కడ పడిపోయేవాడు.
వెంటనే అతని చేతిలో తాళం చేతులు పెట్టేవాళ్ళు.
కాసేపటికి లేచి కూర్చుకునే వాడు.
ఫిట్స్ వచ్చిన వారికి ఇలా చేయడం వల్ల ఎలాంటి ఉపయోగమూ లేదు.
గాలి వెలుతురు వచ్చేలా పడుకోబెడితే చాలు, కాసేపటికి లేచి కూర్చుంటారు.
కొందరు నోట్లో నీళ్ళు పోస్తారు.
అలా అస్సలు పోయకూడదు.
చాల మంది ఇప్పటికీ దాన్నే అనుసరిస్తున్నారు.
ఆవకాయ మామ్మ మనవడు వేణుగోపాల స్వామి గుడిలో మాతోపాటు చదువుకునే వాడు.
అతను చదుకోకపోయినా పెద్దగా పట్టించుకునే వారు కాదు.
అతని పేరేమిటో ఎవరికీ తెలియదు.
అంతా అతన్ని ‘వాయుబొర్ర’ అనే వాళ్ళు.
మేం మాత్రం ఆవకాయ మామ్మ మనవడనే వాళ్ళం.
అది 1962. నేను రెండవ తరగతి చదువుతున్నాను. భారత-చైనా యుద్ధం మొదలైంది.
నిజానికి ఆ వయసులో నాకు యుద్ధం గురించి పెద్దగా తెలియదు. మళ్ళీ సైన్యంలో చేరమని మా నాన్నకు పిలుపొచ్చింది.
మానాన్న బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో సాధారణ సైనికుడిగా చేరాడు. అది రెండవ ప్రపంచ యుద్ధ సమయం.
యుద్ధంలో గాయపడి జపాన్ సైనికులకు పట్టుబడ్డాడు.
మూడు నెలల పాటు వారి వద్ద యుద్ధ ఖైదీగా గడిపాడు.
ఖైదీల పట్ల అత్యంత కౄరంగా వ్యవహరించే దేశాలలో జపాన్ అగ్రగామి.
యుద్ధంలోను, యుద్ధ ఖైదీలుగాను ఎంతో మంది మరణించారు.
బతికి బైటపడ్డ వాళ్ళలో మా నాన్న కూడా ఒకడు.
రెండవ ప్రపంచయుద్ధంలో పాల్గొన్నందుకు, జపాన్ యుద్ధ ఖైదీగా ఉండి బైటపడినందుకు బ్రిటిష్ ప్రభుత్వం మా నాన్నకు రెండు సత్తు మెడళ్ళిచ్చింది.
అవి ఇప్పటికీ ఉన్నాయి.
స్వాతంత్ర్యానంతరం కూడా భారత సైన్యంలో పనిచేశాడు.
గాంధీజీ హత్య జరిగినప్పుడు ఢిల్లీలో బందోబస్తు డ్యూటీలో ఉన్నాడు.
రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ సైన్యం తరపున పనిచేసిన సైనికులకు వారి సర్వీసు కాలంతో సంబంధం లేకుండా పెన్షన్ ఇమ్మని బ్రిటిష్ రాజ్య వ్యవస్థ స్వతంత్ర భారత ప్రభుత్వానికి పెద్దమొత్తంలో డబ్బిచ్చింది.
కానీ ఆ డబ్బుఏమైందో ఎవరికీ తెలియదు.
బ్రిటిష్ ప్రభుత్వంతో, భారత ప్రభుత్వంతో మా నాన్న చాలా ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపాడు.
డబ్బిచ్చినట్టు బ్రిటిష్ ప్రభుత్వం నుంచి సమాధానం వచ్చింది.
భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు.
ఆ ఉత్తర ప్రత్యుత్తరాలు ఎంతో విలువైనవి.
వాటి ప్రాధాన్యత తెలియక భద్రపరచకపోవడం పొరపాటు.
ఆ డబ్బును మన ‘స్వతంత్ర’ ప్రభుత్వంలోని పెద్దలు స్వాహా చేశారు!?
దాని పైన విచారిస్తే పెద్ద పెద్ద తలకాయలు బైటపడతాయి.
చాలా మంది పీఠాలు కదులుతాయి.
అంత స్వతంత్రంగా విచారించే అధికార వ్యవస్థ కానీ, న్యాయయవ్యవస్థ కానీ మనకెక్కడుంది!?
చైనాతో జరుగుతున్న యుద్ధంలో పాల్గొనాలని మా నాన్న తెగ ఉబలాటపడియాడు.
యుద్ధానికి వెళ్ళిన వాడు తిరిగి వస్తాడన్న నమ్మకం లేదు.
మా అమ్మ నన్ను, మా అక్కను, చెల్లెలిని దగ్గరకు తీసుకుని ఏడవడం నాకు బాగు గుర్తు.
పిలుపునందుకున్న మా నాన్న హైదరాబాదులోని ఈఎంఈ ఆర్మీ హెడ్ క్వార్టర్ కు వెళ్ళాడు.
మెడికల్ చెకప్ పూర్తయ్యి సరిహద్దులకు బయలు దేరుతున్న సమయంలో చైనా యుద్ధం ఆగిపోయిందన్న వార్త వచ్చింది.
అంతే, మానాన్న ఇంటికి తిరిగి వచ్చేశాడు.
ఇంట్లో మా అమ్మతోపాటు మా బాబాయి, మామయ్య లకు చెప్పనలవి కాని ఆనందం.
జీత భత్యాలు ఇస్తున్నామని, చస్తే సత్తు మెడళ్ళిస్తామని, యుద్ధంలో మిడత దండులా పడి చచ్చిపొమ్మని అడిగే నైతిక హక్కు, ఈ అవినీతి పాలకులకెక్కడిది!? సైనికుల (కార్గిల్) శవపేటికల్లో కూడా కమీషన్లకు కక్కుర్తిపడే మన ‘స్వతంత్ర’ ప్రభువుల సంస్కారానికి నమస్కారాలు.
(ఇంకా ఉంది)
(ఆలూరు రాఘవశర్మ, జర్నలిస్టు, రచయిత, ట్రెక్కర్)