తొలి చూపులు.. తొలి జ్ఞాపకాలు..!

 

(రాఘవశర్మ)

తొలి చూపులు నిలిచిపోతాయి.

మనసుకున్న తలుపులను బార్లా తెరిచేస్తాయి.

తొలి జ్ఞాపకాలు మదిలో చొరబడి, ముద్రపడిపోతాయి.

పుట్టుమచ్చల్లా అవి శాశ్వతంగా ఉండిపోతాయి.

అందులో అవి పసితనపు చూపులు, పసితనపు జ్ఞాపకాలు.

మోట బావి నమూనా

అది 1959వ సంవత్సరం.
స్వాతంత్ర్యం సిద్ధించి అప్పటికి పుష్కరకాలం పూర్తయ్యింది.

నాకు ఊహ తెలిసే సమాయానికి వనపర్తిలో ఉన్నాం.

అప్పుడు నా వయసు నాలుగేళ్ళు.

వనపర్తి రాజప్రసాదం ఆవరణలోనే మా ఇల్లు.

మా ఇంటి వరండాలోకి వచ్చి చూస్తే ఎదురుగా విశాలమైన బావి.

రాతి మెట్లతో నలుచదరంగా పెద్ద కోనేరులా ఉంది.

బావికి ఒక పక్క ఎత్తైన అంచు.

కాడికి కట్టిన తాడును రెండెద్దులు భారంగా కిందకు లాక్కెళుతున్నాయి.

బావి గిలక (రాట్నం) తిరుగుతూ బరబరా శబ్దం చేస్తోంది.

నీటితో నిండిన తోలు తిత్తి బావిలోంచి పైకొచ్చేస్తోంది.

ఓ వ్యక్తి దాని తాడుపట్టుకుని లాగాడు.

ఆ తోలు తిత్తి నీటిని పైన కుమ్మరించేసింది.

నీళ్ళు కాలువలోంచి పారుతున్నాయి.

ఆ వింతను రోజూ అలా చూస్తూ ఉండిపోయేవాణ్ణి.

కాలం తెలిసేది కాదు.

ఆ మోట బావే నా తొలి చూపు.

తెలంగాణాలో దీన్ని ‘మోటకొట్టడం’ అంటారు.

రాయలసీమలో ‘కపిల తోలడం’ అంటారు.

ఇప్పుడు ఆ పదాలు భాష నుంచి కూడా నిష్క్రమించాయి.

కోస్తా జిల్లాల్లో ఏమనే వారో తెలియదు.

అక్కడది ఎప్పుడో అదృశ్యమైంది.

 


వనపర్తి జ్ఞాపకాలు-2


 

వనపర్తి ప్యాలస్
వనపర్తి ప్యాలస్

నా తొలి జ్ఞాపకం వనపర్తి ప్యాలెస్.

అదొక ఎత్తైన తెల్లని రాజసౌధం.

ఆ ప్యాలెస్ కు తూర్పున పెద్ద సింహ ద్వారం.

ఆ రాజ సౌధం ఎప్పుడూ సూర్యోదయం కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది.

ఆ సౌధానికి అర్ధచంద్రాకారంలో ఇరువైపులా రాతి మెట్లు.

మెట్లకు ముందు గంభీరవదనంతో రెండు సింహాలు.

గుండ్రటి గుండుపై కాలు మోపి గర్జిస్తున్నట్టుంటాయి.

రాత్రి పూట వాటి కళ్ళు మెరుస్తుంటాయి.

వాటి ముందు గుండ్రటి రాతి ఫౌంటెన్.

దాని మధ్యలో తెల్లని కొంగ నోట్లోంచి పైకి ఎగజిమ్ముతున్న నీటి ధార.

మెట్లెక్కగానే గ్రీకు వీరుల్లా శూలాలు పుచ్చుకుని ఇరువైపులా ద్వారపాలకులు.

తొలి అంతస్తులో విశాలమైన పోర్టికో పైభాగం.

అర్ధచంద్రాకారంలో అస్థాన మండపం.

గుండ్రటి స్తంభాలతో విస్తరించిన విశాలమైన వరండా.

గోడల అంచులపై చెక్కిన నగిషీలు.

రెండస్తుల్లో అనేక గదులు.

ఆ రాజసౌధంపై నలుదిక్కులా నాలుగు గోపురాలు.

మధ్యలో నిటారుగా నిలబడి, నీలాకాశం వేపు చూస్తున్న గుండ్రటి రాజగోపురం.

హిందూ, ముస్లిం వాస్తు రీతుల మేలుకలయిక.

ఫ్రెంచి ఇంజినీరు అలోచనలకు వాస్తవ రూపం.

విశాల మైదానం మధ్యలో వనపర్తి రాజసౌధం.

రాణి శంకరమ్మ 1885లో ఈ రాజసౌదాన్ని నిర్మించారు.

స్వాతంత్ర్యానికి పూర్వం సామాన్యులెవరూ లోనికి ప్రవేశించడానికి సాహసించ లేరు.

దేశంలోని 562 స్వతంత్ర సంస్థానాల్లో ఇదొకటి.

నిజాంకున్న మూడు అతిపెద్ద సామంత సంస్థానాలలో కూడా ఇదొకటి.

సంస్థానాలను భారత యూనియన్లో విలీనం చేయాలని స్వాతంత్య్రానంతరం ప్రధాని నెహ్రూ పిలుపిచ్చారు.

వనపర్తి  చివరి సంస్థానాదీశుడు రాజా రామేశ్వర రావు

దేశం మొత్తం పైన స్వచ్ఛందంగా విలీనమైన తొలి సంస్థానం వనపర్తి.

దాని చివరి సంస్థానాదీశుడు రాజా రామేశ్వరరావు.

కాంగ్రెస్ ఎంపి.గా రెండు సార్లు ఎన్నికయ్యారు.

నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా (1946-51) జరిగిన తెలంగాణా సాయుధ పోరాటానిక ఆర్థిక సాయం అందించిన ఆదర్శ వాది.

నవ భారత నిర్మాణం నెహ్రూకు సవాలుగా తయారైంది.

పబ్లిక్ రంగంలో అనేక పరిశ్రమలు మొదలవుతున్నాయి.

వాటిలో పనిచేయడానికి తగినంత మంది సాంకేతిక నిపుణులు లేరు.

వారిని తయారు చేయడానికి తగినన్ని సాంకేతిక కళాశాలలూ లేవు.

సంస్థానాల విలీనం తరువాత వనపర్తి రాజ వంశం హైదరాబాదుకు మకాం మార్చింది.

రాజరిక దర్పంతో ఒక వెలుగు వెలిగిన వనపర్తి కోటంతా
పాడుపడిపోయింది.

ఆవరణంతా పిచ్చి మొక్కలు పెరిగిపోయి.

రాజ సౌధం పైన పావురాళ్లు కాపు రాలు పెట్టాయి.

లోపాల అంతా గబ్బిలాల మయమైంది.

ఈ స్థితిలో రామేశ్వరరావు తన ప్యాలెస్ లో పాలిటెక్నిక్ ప్రారంభించాలనుకున్నాడు.

అప్పటి వరకు ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీలు, ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలు లేవు.

ఆ స్థితిలో పాలిటెక్నిక్ స్థాపన నిజంగా సాహసమే.

పాలిటెక్నిక్ స్థాపనకు నెహ్రూతో రామేశ్వరరావు చర్చించా రు.

కాలేజీ స్థాపిస్తే 25 శాతం జీతాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధపడింది.

మిగతా 75 శాతం విద్యార్థుల ఫీజుల నుంచి చెల్లించాలి.

‘రామేశ్వరరావు జీతాలు చెల్లించలేకపోతే!?’ అంటూ నాటి ముఖ్యమంత్రి నీలం సంజీవ రెడ్డి మెలికపెట్టారు.

ప్యాలెస్ సహా కాలేజీ మొత్తాన్ని పరిహారం లేకుండా ప్రభుత్వానికి అప్పగిచ్చేస్తానన్నా రు రామేశ్వరరావు.

రామేశ్వరరావు స్వయంగా రాసిచ్చేశారు.

వనపర్తి పాలిటెక్నిక్ను ప్రారంభించడానికి నెహ్రూ అంగీకరించారు.

రామేశ్వర్రావు తండ్రి పేరు కృష్ణదేవరాయ.

దాంతో ‘కృష్ణదేవరాయ పాలిటెక్నిక్’ పేరు ఖరారైంది.

ఉద్యోగాలకు ప్రకటిస్తే అర్హత గల అభ్యర్థులు ఏరి!?

కోస్తా, రాయలసీమలతో పోల్చుకుంటే తెలంగాణా చాలా వెనుకబడి ఉంది.

‘తెలంగాణాలోని 9 జిల్లాల్లో ఉన్న విద్యాలయాలన్నీ కలిపినా, ఒక్క గుంటూరు జిల్లాలోని విద్యాలయాలకంటే తక్కువ’ అని ‘తెలంగాణా ప్రజల సాయుధ
పోరాట చరిత్ర’లో దేవులపల్లి వెంకటేశ్వరరావు రాశారు.

తెలంగాణాలోనే కాదు, కోస్తా, రాయలసీమల్లో కూడా ఆరోజుల్లో తగినంత మంది సాంకేతిక విద్యాబోధకులు లేరు.

రామేశ్వరరావే స్వయంగా ఉద్యోగులను ఎంపిక చేశారు.

ఎక్కువ జీతాలిచ్చి తన కాలేజీకి రప్పించాడు.

ఉస్మానియా ప్రొఫెసర్ గా రిటైరైన హఫీదుల్లాను ప్రిన్సిపాల్ గా నియమించారు.

అలా వివిధ విభాగాల అధిపతులను, బోధనా సిబ్బందిని కూడా నియమించారు.

గూడూరులోని ప్రభుత్వ మైనింగ్ ఇనిస్టిట్యూట్లో మా నాన్న
ఇన్స్ట్ర క్టర్ గా చేస్తున్నాడు.

తొమ్మిది అడ్వాన్స్ ఇంక్రిమెంట్లు ఇస్తానంటే మా నాన్న గవర్నమెంటు ఉద్యోగం ఒదులుకుని వనపర్తి వచ్చేశాడు.

మా కుటుంబం అలా 1959లో వనపర్తి వచ్చింది.

అలా అనేక మంది.

ఉద్యోగుల్లో ఎక్కువగా కోస్తా, రాయలసీమ వారే.

అటెండర్లు, వాచ్ మ న్ వంటి చిన్న చిన్న ఉద్యోగాలు మాత్రమే స్థానికులకు దక్కాయి.

రామేశ్వరావు డబ్బుకు వెనకాడలేదు.

కోట ఆవరణలోని ఇళ్ళలోనే మాకు నివాసాలు ఏర్పాటు చేశారు.

వనపర్తి ప్యాలస్ లో కృష్ణ దేవరాయ పాలిటెక్నిక్ ప్రారంభ ఆహ్వాన పత్రిక. 1959 అక్టోబర్ 11 వ తేదీ.

వనపర్తిలో పాలిటెక్నిక్ ప్రారంభానికి తేదీ ఖరారైంది.

ప్రధాని నెహ్రూ హైదారబాదు వరకు విమానంలో వచ్చారు.

అక్కడి నుంచి అంబాసిడర్ కారులో వనపర్తి బయలుదేరారు.

కేవలం 149 కిలోమీటర్ల ప్రయాణానికి నాలుగు గంటలు పట్టింది.

అంతా కంకర రోడ్డే !
ఆ దుమ్ము ధూళిలోనే నెహ్రూ ప్రయాణించారు.

1959 అక్టోబర్ 11 వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు ముహూర్తం.

నెహ్రూని చూడడానికి జనం తండోపతండాలుగా వచ్చారు.

వనపర్తి కోటలోకి సామాన్యులు ప్రవేశించడం అదే తొలిసారి.

కోట ముఖ ద్వారం పట్టలేదు.
నలుదిక్కులా కోట ద్వారాలను తెరిపించారు.

అయినా సాధ్యం కాలేదు.

అక్కడక్కడా కోట గోడలను రామేశ్వరరావే పగలకొట్టించారు.

కాలేజి ఉద్యోగుల కుటుంబ సభ్యులంతా ముందు వరుసలో కూర్చున్నారు.

ఏడేళ్ళ వయసున్న మా అక్కను, ఏడాది వయసున్న మాచెల్లెల్ని, నాలుగేళ్ల వయసున్న నన్ను తీసుకుని మా అమ్మ ఈ ప్రారంభోత్సవానికి వచ్చింది.

మా ఇంటి నుంచి ప్యాలెస్ కనిపిస్తుంటుంది.

ఆ ప్యాలెస్ పోర్టికో పై నుంచి నెహ్రూ అరగంట సేపు మాట్లాడారు. ప్రసంగించారు .

రాజా రామేశ్వరరావుతో పాటు నీలం సంజీవ రెడ్డి, బ్రహ్మానంద రెడ్డి వేదికపై ఉన్నారు.

నెహ్రూ ప్రసంగించడం అయిపోయింది.

తనకు వేసిన పూల దండలను ప్రజల పైకి విసిరేశారు.

ఆ రోజుల్లో గాంధీ, నెహ్రూలంటే ప్రజలకు ఆరాధనా భావన.

నెహ్రూ విసిరేసిన పూల దండలను ప్రజలు చాలా పవిత్రంగా భావించారు.

అలా ఆ పూల దండలను మా అమ్మ కూడా ఇంటికి తెచ్చింది.

ఈ ప్రారంభోత్సవ విశేషాలను మా అమ్మ ద్వారా కొన్ని, మా నాన్న ద్వారా కొన్ని విన్నాను.

కళాశాల ప్రారంభం మాత్రం నాకు గుర్తు లేదు.

ఆ తరువాత నుంచే అక్కడి జ్ఞాపకాలు నా మదిలో ముద్రపడిపోయాయి.

(ఇంకా ఉంది)

Aluru Raghava Sarma
Aluru Raghava Sarma

(రచయిత రాఘవశర్మ సీనియర్ జర్నలిస్ట్, రచయిత, తిరుపతి.మొబైల్ నం. 91 94932 26180)

One thought on “తొలి చూపులు.. తొలి జ్ఞాపకాలు..!

  1. మధుర జ్ఞాపకాలు శర్మ గారు, నేను ఈ కాలేజి 76-79 సివిల్ పూర్వ విద్యార్థి ని . మమ్మల్ని మళ్లీ వనపర్తిలో విహరింప జేస్తున్నారు, హృదయపూర్వక ధన్యవాదములు, తిరుపతి రెడ్డి కడుకుంట్ల 🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *