(సాహస భరితం..హలాయుధ తీర్థం తరువాయిభాగం)
తిరుపతి జ్ఞాపకాలు-60
(రాఘవశర్మ)
ఇరువైపులా ఎత్తైన కొండలు..
కొండల అంచునకు అతికించినట్టున్న ఎర్రని రాతి బండలు..
కొండలపై నుంచి జాలువారుతున్నజలపాతాలు..
రెండు కొండల నడుమ లోతైన పచ్చని లోయ..
ఎన్ని జంతువులకు ఆవాసమో..!
ఎన్ని వృక్షజాతులకు నిలయమో..!
ఎంత అందమైనదీ చామల కోన..!!
శేషాచలం కొండలకే శిఖరాయమానమైన ఈ కోనపై శనివారం సాయంత్రమే ఓ కన్నేశాం.
ఆదివారం మధ్యాహ్నం యుద్ధగళనుంచి తిరుగు ప్రయాణమయ్యాం.
మళ్ళీ అదే రాళ్ళ దహదారి.
మళ్ళీ మా బైకులు ఎంగిరెగిరి పడుతున్నాయి.
అవి పడ్డప్పుడల్లా గుమ్మడి కాయలా దొర్లుతున్నాం.
ఎడమ వైపున కొండ, కుడి వైపున లోతైన లోయ.
పడితే ఇంకేమైనా ఉందా!
శనివారం రాత్రి చీకట్లో ఎంత సాహసం చేశాం!
ఆ రహదారి ఎంత దారుణంగా ఉందో , దాని అసలు రూపాన్ని ఇప్పుడు కానీ గమనించలేకపోయాం.
ఎండ ఏమాత్రం కనిపించడం లేదు.
ఆకాశం నిండా మబ్బులు కమ్మాయి.
మధ్యాహ్నమైనా చలి గాలులు వీస్తున్నాయి.
తల కోన వెళ్ళే దహదారి కూడలి దాటే సరికి, ఊపిరి పీల్చుకున్నాం.
అక్కడి నుంచి కాస్త మెరుగైన దారి.
మధ్యలో అక్కడక్కడా వాహనాలు దిగక తప్పలేదు.
ఎడమ వైపున కొండ అంచులను ఆనుకుని సాగుతున్న రహదారి మెలికలు తిరుగుతోంది.
కుడి వైపున లోతైన చామల కోన లోయ.
అదిగో..దూరంగా కుడివైపు కొండ అంచు.
పచ్చని కొండ కొసకు అతికించినట్టు ఎర్రటి బండల వరుస ఎంత పెద్దదో!
ముందుకుసాగిన కొద్దీ దాని అందం మరింత కనిపిస్తోంది.
కొండ అంచుకు వెళ్ళి, తొంగి చూస్తే ఆశ్చర్యం!
కింద శిథిలమైన కోట బురుజు లా ఉంది.
ఎవరో కట్టింది కాదు, సహజ సిద్ధంగా ఏర్పడింది.
కోన అందాలను వీక్షిస్తూ, కొండ అంచునే కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళాం.
దూరంగా.. ఆవలి కొండల పై నుంచి జాలువారుతున్న ఎన్ని జలపాతాలో!
ఎంత పెద్దదీ చామల కోన!
ఎదురుగుండా ఎత్తైన మరో కొండల వరుస.
ఈ కోన అందాలను సంపూర్ణంగా ఆస్వాదించాలంటే, ఒక సారి దాన్లోకి దిగి తీరాల్సిందే.
ఒక రోజు పూర్తిగా కేటాయించాల్సిందే.
మద్యాహ్నం మూడైంది.
ముందుకు సాగుతున్నాం.
అన్నదమ్ముల బండ
కుడివైపున దూరంగా అటవీ శాఖ బేస్ క్యాంప్ కనిపిస్తోంది.
సమీపిస్తున్న కొద్దీ చామల కోనలో రెండు కొండలు దగ్గరవుతున్నాయి.
అవి దగ్గరయ్యే చోట ఒక విశాలమైన బండ ఏటవాలుగా ఉంది.
ఆ బండ పైనుంచి జలపాతం జాలువారుతోంది.
ఆ జలధారంతా ముందు వైపు లోయలో పడి చామల కోనకు చేరుతోంది.
ఆ బండలపైన ఇరువైపులా జాలువారుతున్న నీళ్ళు.
వాటి మధ్య కూర్చుంటే ఎంత గొప్ప అనుభూతి!
ఇదే అన్నదమ్ముల బండ.
మంచి వర్షాలప్పుడు చూడాలి అన్నదమ్ముల బండ అందాలను.
నీటి ఉదృతి ఎక్కువగా ఉంటుంది.
ఆ నీరంతా లోయలోకి దుముకుతున్న శబ్దాలు.
అది ఎన్ని మెలికలు తిరుగుతోందో!
ఎన్ని రాగాలు పలుకుతోందో!
ఆ లోయలోకి దిగితే దాని అందాలను పూర్తిగా వీక్షించవచ్చు.
ఆ జలధార అంతా చామల కోన లోయలోకి సాగుతోంది.
సాయంత్రం నాలుగైంది.
అన్నదమ్ముల బండ నుంచి తిరుమలకు వెనుదిరిగాం.
కుమార ధార, పసుపు ధార సమీపం నుంచి, ధర్మగిరి మీదుగా తిరుమలకు చేరాం.
ఒక రాత్రి, రెండు పగళ్ళు అడవిలో ఇలా సేదదీరాం.
సాహసాలూ చేశాం.
ఆ అనుభవాలను, అనుభూతులను సెల్‌ఫోన్లలో, కెమెరాల్లో బంధించాం.
వాటిని కాంక్రీటు వనంలోకి ఇలా తీసుకొచ్చాం.
(సీరియల్ ముగిసింది)
(ఆలూరు రాఘవశర్మ, సీనియర్ జర్నలిస్ట్, తిరుపతి)