‘ఆంధ్రకు మహారాష్ట్ర మోడల్ బెస్ట్’

 

విశాఖపట్నం:   ఏపీ ప్రభుత్వం చెబుతున్న మూడు రాజధానుల వల్ల ఎలాంటి ప్రయోజనమూ లేదని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ  చెప్పారు. ప్రాంతాల మధ్య విద్వేషాలు తప్ప దీనివల్ల ఒనగూరేది ఏమీ ఉండదని ఆయన స్పష్టం చేశారు.

విశాఖపట్టణం జీవీఎంసీ సమీపంలోని గాంధీ విగ్రహం వద్ద ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ‘ఆంధ్రుడా మేలుకో’ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.

మహారాష్ట్ర మోడల్ గురించి వివరిస్తూ అక్కడ ప్రతి జిల్లాను ఒక రాజధానిగా అభివృద్ధి  చేశారని, దానితో ప్రాంతీయ విద్వేషాలకు తావు లేకుండా పోయిందని ఆయన అన్నారు.

అక్కడ తాను 22 సంవత్సరాలు పనిచేశాననిఆ అనుభవంతోనే ఈ విషయాన్ని చెబుతున్నానన్నారు.

ముంబై, పూణె, థానే, ఔరంగాబాద్, నాగ్‌పూర్, నాసిక్ చుట్టూ ఎన్నో పరిశ్రమలు వచ్చాయని, ఉద్యోగాలు పెరిగాయని అన్నారు. అక్కడి ప్రజలు ఉద్యోగాల కోసం బయటి రాష్ట్రాలకు వెళ్లరని అన్నారు.

ఆంధ్రా వాళ్లు మాత్రం ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నారని చెబుతూ ఏపీలోనూ ప్రతి జిల్లాను ఇలాగే తీర్చిదిద్దితే జాబ్స్ కు  ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం ఉండదని అన్నారు.

తమిళనాడులోనూ ప్రతి జిల్లా ఏదో ఒక రంగంలో ముందుకు వెళ్తోందన్నారు. మహారాష్ట్ర తరహాలో అమరావతిలో హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్ పెట్టి విశాఖ, కర్నూలులో బెంచ్‌లు ఏర్పాటు చేస్తే ఆయా ప్రాంతాల్లోని న్యాయపరమైన సమస్యలను అక్కడే పరిష్కరించుకునే వీలుంటుందని అన్నారు.

నాగ్‌పూర్‌లో శీతాకాల సమావేశాలు జరుగుతున్నట్టే ఏపీలోనూ విశాఖ, కర్నూలులో శీతాకాల సమావేశాలు పెట్టుకోవచ్చన్నారు.

ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే విశాఖలో రాజధాని పెట్టాలంటున్నారని, దీనివల్ల రాయలసీమకు కూడా రాజధాని కావాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారన్నారు. ఇలాంటి డిమాండ్ల వల్ల ప్రాంతాల మధ్య విద్వేషాలు తప్ప మరేమీ ఉండదని లక్ష్మీనారాయణ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *