అంగన్వాడీల మీద సుప్రీం సంచలన తీర్పు

*అంగన్వాడీ ఉద్యోగుల పని పరిస్థితిని మెరుగు పరచాలని సర్కార్లకు సుప్రీంకోర్టు సూచన!

*అంగన్వాడీ సెంటర్లు షాప్స్ & ఎస్టాబ్లిష్మెంట్స్ చట్టం పరిధి క్రిందికి వస్తుందని సుప్రీంకోర్టు స్పస్టికరణ!

*అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ గ్రాట్యుటీకి అర్హులంటూ తీర్పు!

*మూడు నెలలలో గుజరాత్ ప్రభుత్వం అర్హులకు గ్రాట్యుటీ చెల్లించాలని ఆదేశం!

*దేశ భవిష్యత్ కి ఆధారమైన 15 కోట్ల 80 లక్షల మంది పిల్లలకు సేవలు చేసే అంగన్వాడీ ఉద్యోగుల శ్రేయస్సు సామాజిక బాధ్యతగా సుప్రీంకోర్టు భాష్యం!

*సామాజిక బాలల సంరక్షణ కేంద్రాలైన అంగన్వాడీ సెంటర్లు శిశు పోషణ, సంరక్షణ భారాల నుండి స్త్రీలకు విముక్తి కలిగిస్తాయని సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యానం!

*తాజా తీర్పు ఆధారం గా నూతన పోరాటాలకి పదును పెట్టుకునే ఒక సానుకూల కాలమిది.*

***

అంగన్వాడీ రంగంలో పనిచేసే ఉద్యోగ వర్గానికి కొత్తగా ఒక సానుకూల అవకాశం కలిసొచ్చింది. అదే నిన్న 25-4-2022న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు!

జస్టిస్ అజయ్ రస్తోగి & జస్టిస్ అభయ్ AK ఓఖా లతో కూడిన సుప్రీం కోర్టు బెంచ్ అంగన్వాడీ సెంటర్లు షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ చట్టం పరిధిలోకి వస్తాయని సంచలనాత్మక తీర్పు చెప్పింది. వారి పని పరిస్థితుల్ని మెరుగు పరచాలని కూడా సూచన చేసింది. పై చట్టం ప్రకారం అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు గ్రాట్యుటీ పొందే అర్హులని తీర్పు ఇచ్చింది.

గతంలో గుజరాత్ హైకోర్టుకు అంగన్వాడీ ఉద్యోగులు వెళ్లారు. సింగిల్ బెంచ్ వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దాన్ని సవాల్ చేస్తూ గుజరాత్ సర్కార్ అప్పీల్ చేసింది. సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ కొట్టివేసింది. దాన్ని సవాల్ చేస్తూ అంగన్వాడీ సంఘాలు సుప్రీంకోర్టు కు వెళ్లాయి. దానిపై వచ్చిందే నిన్నటి తాజా తీర్పు!

ఈ తీర్పు పై సమగ్ర స్పందన కాదిది. అది 72 పేజీల తీర్పు! పూర్తిగా చదవకుండా విశ్లేషణ చేయడం సాధ్యం కాదు. అందులో మంచిచెడుల్ని సమతుల్యతా దృష్టితో విశ్లేషించాల్సి వుంటుంది.

ఇది తక్షణ ప్రాధమిక స్పందనతో రాస్తున్నది. ఒక సందేశ రూపంలో సంబంధిత అంగన్వాడీ ఉద్యోగుల దృష్టికి తెచ్చే పరిమిత ప్రయోజనంతో చేసే ప్రయత్నమిది.

ఇది గ్రాట్యుటీ చట్టం (PAYMENT OF GRATUTY ACT-1972) మరియు దుకాణాలు, సంస్థల చట్టం (SHOPS & ESTABLISHMENTS ACT) ల పరిధిలో ఇచ్చిన తీర్పు! ఒక చట్టం ప్రకారం అంగన్వాడీ కేంద్రాలు ఆ చట్టం పరిధిలోకి వస్తాయి. మరో చట్టం ప్రకారం అంగన్వాడీ ఉద్యోగులు గ్రాట్యుటీకి అర్హులౌతారు. సుప్రీంకోర్టు ఈ రెండింటిని పరిగణనలోకి తీసుకొని గ్రాట్యుటీతో పాటు అనేక అంశాలపై స్పందించి ఇచ్చిన తీర్పు యిది.

అంగన్వాడీ ఉద్యోగులకి ప్రభుత్వాలు వేతనాలు (wages) చెల్లించడం లేదని గుజరాత్ సర్కార్ వాదన! కార్మిక చట్టాలు కేవలం వేతనాలు పొందే వారికే వర్తిస్తాయనేది గుజరాత్ సర్కార్ వాదన! గౌరవ వేతనాలు పొందే అంగన్వాడీ ఉద్యోగులకు కార్మిక చట్టాల వర్తించవని వాదన చేసింది. గుజరాత్ సర్కార్ వాదనల్ని కౌంటర్ చేస్తూ, అంగన్వాడీ కేంద్రాలు షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ చట్టం పరిధిలోకి వస్తాయని సంచలన అన్వయింపుకి సుప్రీంకోర్టు పూనుకుంది. అది కాంట్రాక్టు కార్మిక చట్టంలో క్లాజుల్ని కూడా ప్రస్తావన చేసింది. దీంతో షాప్స్& ఎస్టాబ్లిష్మెంట్స్ చట్టం ప్రకారం అనేక చట్టబద్ద సౌకర్యాలు అమలు జరగాల్సి ఉంది. ఒక్కసారి అంగన్వాడీ సెంటర్లు పై చట్ట పరిధి క్రిందికి వస్తే, పరిస్థితి మారిపోతుంది. ఒక్క గ్రాట్యుటీ మాత్రమే కాక, PF, ESI వంటి చట్టబద్ద సౌకర్యాలు వర్తిస్తాయి.

గ్రాట్యుటీ, PF, ESI, పింఛన్ వంటి చట్టబద్ద డిమాండ్ల కోసం చాలా ఏళ్లుగా అంగన్వాడీ ఉద్యోగ వర్గాలు ఆందోళన చేస్తున్నాయి. అట్టి సుదీర్ఘ ఉద్యమాలకు ఉపకరించే తీర్పుగా భావిద్దాం.

రిటైర్మెంట్ సమయంలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకి పని చేసిన సర్వీస్ ని లెక్కించి, ఒక్కొక్క ఏడాదికి 15 రోజుల చొప్పున జీతాల్ని చెల్లిస్తారు. అదే గ్రాట్యుటీ! ఉదాహరణకు 25 ఏళ్ళు పనిచేసి ఒక వర్కర్ లేదా హెల్పర్ రైటర్ అయ్యారని అనుకుందాం. రిటైర్ అయ్యే నాటికి వేతనాలు రోజుకు ₹400 ఉందని అనుకుందాం. (తాజా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నేడు వారు పొందేది గౌరవ వేతనం కాదు, వేతనమే) ఈ లెక్కన 25 ఏళ్ల సర్వీసుకు ఏటా 15 రోజుల జీతాల్ని గ్రాట్యుటీ గా చెల్లించాలి. ఏటా 15 రోజుల వేతనం అంటే, 6000 రూపాయలు గ్రాట్యుటీగా చెల్లించాలి. 25 ఏళ్ల సర్వీసుకి మొత్తం ఒకటిన్నర లక్షల రూపాయల్ని చెల్లించాలి.

ఇక్కడ ఒక మతలబు కూడా ఉంది. సుప్రీంకోర్టు తాజా తీర్పు అమలులోకి వస్తే, అంగన్వాడీ రంగంలో గౌరవ వేతనాల రూపంలో ప్రభుత్వాలు సాగించే నేటి వెట్టి చాకిరి విధానం రద్దువుతుంది. వాటి స్థానంలో వేతన విధానం అమలులోకి వస్తుంది. సహజంగానే కార్మిక చట్టాల ప్రకారం కనీస వేతనాలు కొత్తగా అమలులోకి వస్తాయి. కనీస వేతనం నేడు నెలకి సుమారు ₹15,000 వరకు వుంది. అంటే రోజు వేతనం ₹500 ఉంటుంది. ఈ లెక్కన 15 రోజుల వేతనం చొప్పున ఏటా ₹7,500, 25 ఏళ్ల సర్వీసు లో ₹1,87,500 గ్రాట్యుటీ గా చెల్లించాలి.

నేడు కార్మిక సంఘాలు నెలకు ₹26,000 కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. మొన్న జనవరి 28, 29 లలో సార్వత్రిక సమ్మెలో అంగన్వాడీ ఉద్యోగులు పాల్గొన్నారు. ఆ సమ్మె డిమాండ్లలో నెలకు ₹26,000 డిమాండ్ ఉండటం గమనార్హం! ఆ లెక్కన ఏటా ₹13,000 చొప్పున 25 ఏళ్లకు ₹3,25,000 వరకు గ్రాట్యుటీ పొందుతారు. హెల్పర్లు కూడా తమ వేతనాల దామాషాలో గ్రాట్యుటీ పొందుతారు.

ఈ తీర్పు ఇచ్చిన తేదీ నుండి మూడు నెలల్లో గుజరాత్ రాష్ట్రంలోని అర్హులైన అంగన్వాడీలకి సంబంధిత అధికార్లు గ్రాట్యూటీ చెల్లింపుకు చర్యలు తీసుకోవాలని కూడా సుప్రీం కోర్టు ఆదేశించింది. పైగా గ్రాట్యుటీ చట్టంలోని క్లాజ్ 3A ప్రకారం ఇప్పటి వరకు చెల్లించని కాలానికి, ఏటా 10శాతం చొప్పున వడ్డీతో బకాయిల్ని చెల్లించాలని కూడా ఆదేశించింది.

హిందువుల తరపున బిజెపి వకాల్తా తీసుకొని పబ్లిసిటీ చేసుకోవడం తెల్సిందే! బీజేపీ చేపట్టే హిందుత్వ పరిపాలనకి ఒక నమూనా రాష్ట్రమే గుజరాత్! ఆ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగుల్లో 90 శాతానికి పైగా హిందూ మహిళలే! ఆ హిందూ స్త్రీఉద్యోగులకు ఎలాంటి గౌరవ వేతనం అమలులో ఉందొ తెలిస్తే, దిగ్భ్రాంతికి గురౌతాం. గుజరాత్ లో అంగన్వాడీ వర్కర్ కు నెలకు ₹7800; హెల్పర్ కి ₹3950; మినీ వర్కర్ కి ₹4400.

మరో దిగ్భ్రాంతికర విషయం కూడా చెప్పాలి. సుప్రీం కోర్టు వాదనల్లో గుజరాత్ ప్రభుత్వ న్యాయవాది ఆస్థా మెహతా ఇలా అన్నాడు.

*సుప్రీంకోర్టు ప్రకారం ఒకవేళ అంగన్వాడీలకి గ్రాట్యూటీ చెల్లిస్తే, గుజరాత్ ప్రభుత్వం పై ₹25 కోట్ల ఆర్ధిక భారం పడుతుంది. ఇంతటి భారాన్ని మోయడం గుజరాత్ సర్కార్ కి సాధ్యం కాదు.*

బడా కార్పొరేట్లకు వందలు, వేలు, లక్షల ₹కోట్ల పన్ను రాయితీలు, ప్రోత్సాహకాల్ని బిజెపి ప్రభుత్వం ఇస్తోంది. కార్పొరేట్ రాబంధులకు లక్షల కోట్ల సొమ్ముల్ని రాయుతీగా ఇస్తుంది. హిందు మతాచారాల్ని పాటించే అంగన్వాడీ మహిళా ఉద్యోగులకు మాత్రం పంగనామాల్ని పెడుతుంది. కేవలం ₹25 కోట్ల భారం మోయలేదట! అంబానీ, ఆదానీ వంటి కార్పొరేట్ల లాభాల కోసమే తప్ప అంగన్వాడీల శ్రేయస్సు అక్కర్లేదు. హిందుత్వ సారం యిదే!

పైన పేర్కొన్న గుజరాత్ సర్కార్ వాదనల్ని తోసి పుచ్చుతూ సుప్రీంకోర్టు తాజా తీర్పు ఇచ్చింది.

అంగన్వాడీ ఉద్యోగులు నాసిరకం గౌరవ వేతనం పొందుతున్నారని, సమాజానికి ఉపకరించే సేవలు చేసే అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ అనుభవించే బాధల్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సమన్వయంతో సీరియస్ గా చర్యల్ని చేపట్టాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానం చేసింది.

అంగన్వాడీ ఉద్యోగుల పని పరిస్థితుల్ని మెరుగు పరచాలని (BETTER WORKING CONDITIONS) కూడా ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు సూచించింది.

దేశ భవిష్యత్తు ఏ పిల్లలపై ఆధారపడి వుందో, అలాంటి 15 కోట్ల 80 లక్షల మంది పిల్లల పోషణలో అంగన్వాడీల భాగస్వామ్యం ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానం చేసింది. అట్టి సామాజిక సేవలు చేసే అంగన్వాడీ ఉద్యోగుల శ్రేయస్సు పట్ల ప్రభుత్వాలు బాధ్యతగా స్పందించాలని కూడా సుప్రీంకోర్టు సూచించింది.

పిల్లల కోసమే కాక, ఆ పిల్లల్ని కనే తల్లుల కోసం కూడా అంగన్వాడీ రంగం ఉపకరిస్తుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అంగన్వాడీ సేవలను పిల్లలతో పాటు స్త్రీలకు కూడా అందిస్తున్నట్లు సుప్రీంకోర్టు గుర్తుచేసింది. *సామాజిక పిల్లల సంరక్షణ కేంద్రాలనేవి పిల్లల ఆలనాపాలనా చూసే భారం నుండి స్త్రీలని విముక్తుల్ని చేస్తున్నాయి* అంటూ సుప్రీం కోర్టు వ్యాఖ్యానం చేసింది.

సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినంత మాత్రాన నేటి ప్రభుత్వాలు ఆటోమేటిక్ గా అమలు చేస్తాయనే ఆశలు పెంచుకోరాదు. సుప్రీంకోర్టు చెప్పినట్లు పని పరిస్థితుల్ని వెంటనే మెరుగు పరుస్తాయని గానీ, అంగన్వాడీ సెంటర్లని షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ చట్టం పరిధిలో గుర్తిస్తారని గానీ, గ్రాట్యుటీని చెల్లిస్తారని గానీ, లేనిపోని భ్రమల్ని సర్కార్లపై పెంచుకోరాదు. అట్టి ఆశలు పెంచుకొని, అవి ఒకవేళ సకాలంలో నెరవేరకపోతే నిరాశకు కూడా గురిచేస్తాయి. బడా కార్పొరేట్ల సేవల్లో మునిగి తరించే పాలక వర్గాలు ఎన్నెన్ని ఆటంకాల్ని పెడతాయో! ముఖ్యంగా మోడీ ప్రభుత్వ విధానం అత్యంత వ్యూహాత్మక దృష్టితో కార్పొరేట్ల సేవకి అంకితమైనది.

సుప్రీంకోర్టు మాట కంటే, అంబానీ, ఆదానీ వంటి కార్పొరేట్ల ఆజ్ఞలకు తలవంచి అమలుచేసే నేటి సర్కార్లుపై ఆశలు గానీ, భ్రమలు గానీ పెంచుకోకుండా, పోరాట చైతన్యం ప్రదర్శించడం అంగన్వాడీ ఉద్యోగ వర్గాల తక్షణ కర్తవ్యం!

చరిత్ర గమనాన్ని నిశితంగా పరిశీలిస్తే, పోరాటాల నుండే చట్టాలు పుట్టాయని అర్ధమౌతుంది. చట్టాల నుండి పోరాటాలు పుట్టలేదు. చట్టాల అమలు కోసం కూడా పోరాటాలే అంగన్వాడీ ఉద్యోగ వర్గానికి శరణ్యం! అట్టి పోరాట నేపధ్య చరిత్ర అంగన్వాడీ ఉద్యోగ వర్గాలకు ఉంది. మరోసారి అట్టి పోరాట కార్యాచరణకి సరైన సమయమిది. అది వివిధ అంగన్వాడీ యూనియన్ల విశాల ఐక్య కార్యాచరణ ద్వారానే సాధ్యం! దానికై అంగన్వాడీ యూనియన్లు సిద్ధం కావాలి. ముఖ్యంగా అంగన్వాడీ శ్రామికవర్గం ఉద్యమ దీక్ష వహించడం అన్నిటికంటే అత్యంత ముఖ్యమైనది. రేపటి 136వ మేడే దానికొక సరైన సందర్బం!

పి. ప్రసాద్ (పిపి)

రాష్ట్ర అధ్యక్షుడు,

భారత కార్మిక సంఘాల సమాఖ్య, (ఇఫ్టూ).

గమనిక:–ఈ తీర్పుపై స్పందించి, వివరాలు కోరుకునే అంగన్వాడీ సోదరీమణులకు ఒక విజ్ఞప్తి! ఇఫ్టూ AP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి K. పొలారిని గానీ; కొత్తగా ఏర్పడ్డ ఇఫ్టూ అనుబంధ *ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్* గౌరవ అధ్యక్షులు, ఇఫ్టూ రాష్ట్ర కార్యదర్శి R. హరికృష్ణ గారిని గానీ కాంటాక్ట్ చేస్తే వివరాలు తెల్సుకోవచ్చు.
పొలారి గారి ఫోన్ నెంబర్లు.
9440417550
&
9110797712

హరికృష్ణ గారి ఫోన్ నెంబర్లు.
9490300766
&
9989991610

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *