జడ విసిరేసి సిఎం నేదురుమల్లికి సవాల్ విసిరిన బెబ్బులి
(రాఘవ శర్మ)
అదొక ప్రజా ఉద్యమం.
ఎక్కడో మారు మూల పుట్టింది.
దూబ గుంటలోనో, సర్వేపల్లి దళిత వాడలోనో.
సామాన్యుల నుంచి పుట్టుకొచ్చిన సారా వ్యతిరేక ఉద్యమం.
నెల్లూరు జిల్లాను ఉప్పెనలా ముంచెత్తింది.
రాష్ట్రమంతా వ్యాపించింది.
అసలు ఎందుకొచ్చిందీ ఉద్యమం? ఎలా వచ్చింది?
అందరిలోనూ ఆసక్తే!
అది 1991-92 ప్రాంతం.
జాతీయమీడియా వచ్చింది.
ఫ్రంట్‌లైన్ నుంచి వచ్చిన గౌరీ నేరుగా నా గదికే వచ్చేశారు.
సుప్రభాతం నుంచి వచ్చిన మల్లేపల్లి లక్ష్మయ్య నా గదిలోనే దిగారు.
నేనక్కడ ఆంధ్రభూమి స్టాఫ్ రిపోర్టరుగా పనిచేస్తున్నాను.
సారావ్యతిరేక ఉద్యమ సంఘీభావ కమిటీలో నేను సభ్యుణ్ణి.
ఉద్యమం ప్రారంభమైనప్పుడు ఏర్పడిన తొలి కమిటీ అది.
సామాజిక స్పృహ కలిగిన వారందరికీ నెల్లూరు దర్శనీయ ప్రాంతమైపోయింది.
వావిలాల గోపాలకృష్ణయ్య వచ్చారు.
“కల్లు మానండోయ్..కళ్ళు తెరవండోయ్” అన్న నినాదంతో గాంధీజీ తెచ్చిన ఉద్యమాన్ని గుర్తు చేశారు.
దానికి, దీనికి మధ్య పోలికలను పరిశీలించారు.
ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన రెడ్డి నెల్లూరులోని ఎసీ సుబ్బారెడ్డి స్టేడియానికి వచ్చారు.
ఉద్యమ కారులైన మహిళలు ఆయనను చుట్టుముట్టారు.
“సారా ఆపండడి “అన్నారు మహిళలు.
“సారా ఆపితే సంక్షేమ పథకాలు ఆగిపోతాయి ” అన్నారు ముఖ్యమంత్రి.
“పోనీ నాటు సారా ఆపండి” అన్నారు.
“నాటు సారా ఆపడం నా వల్ల కాదు” అనేశారు.
“దిసీజ్ నాట్ ఫర్‌ద ప్రెస్ “అన్నారు నావైపు వేలు చూపిస్తూ.
అయినా రాసిపారేశా.
ఉదయం తప్ప అన్ని పత్రికల్లో అదే బ్యానర్.
నేదురుమల్లి జనార్ధన రెడ్డి బైటికి వచ్చాక జక్కా వెంకయ్య అడ్డతగిలారు.
“మీకు చేతకాకపోతే మేం చేసి చూపిస్తాం” అన్నారు జెక్కా.
“మీకు అధికారం ఇవ్వాల్సింది నేను కాదు వెంకయ్యా ప్రజలు” అన్నారు సీఎం.
ఆ తరువాత ఒక రోజు సాయంత్రం బహిరంగ సభ.
ఉద్యమ కారులతో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియ్ కిటకిటలాడిపోతోంది.
సభలో మల్లు స్వరాజ్యం మట్లాడడం మొదలు పెట్టారు.
నేనదే ఆమెను మొదటి సారి చూడడం.
ఆజానుబాహురాలు.
ఆమె జడ దాదాపు మోకాళ్ళ వరకు ఉంటుంది.
మల్లు స్వరాజ్యం మాట్లాడడం మొదలు పెట్టారు.
“జనార్ధన్‌రెడ్డి.. సారా అమ్మి మా కొంపలు ఎందుకు కూలుస్తావ్?
మా కొంపలు కూల్చి ఏం సంక్షేమం సాధిస్తావ్?
మా కొంపలు కూల్చి నీవు చేసే సంక్షేమం మాకొద్దు.
సారా డబ్బుతో తప్ప వేరే మార్గంలో పరిపాలించడం నీకు చేతకాకపోతే చెప్పు.
నీకు గతి లేకపోతే చెప్పు.
మా ఆడవాళ్ళ జుట్టుపైన పన్ను వెయ్యి మేం కడతాం.:
అంటూ వెనక నున్న జడను కుడి చేత్తోవేదికవైపు విసిరేశారు.
అంతే.. సభంతా చప్పట్లతో మారుమోగిపోయింది.
ఆ దృశ్యాన్ని నేనెప్పుడూ మరిచిపోలేను.
తెలంగాణా సాయుధ పోరాట యోధురాలు.
ఆ పోరాటంలో పుట్టిన యోధురాలు.
శనివారం ఆమె తుదిశ్వాస విడిచారు.
ఇది తెలియగానే ఆమె మట్లాడిన దృశ్యం మళ్ళీ కళ్ళముందు మెదలాడింది.
కళ్ళు చెమర్చాయి ఆశ్రునివాళిగా.
(రాఘవ శర్మ, సీనియర్ జర్నలిస్టు,తిరుపతి)