ఆమె లేకపోవచ్చు, ఆమె వేసిన బాట ఉంది !

వెలుగునీడల కమ్యూనిస్టు ఉద్యమ ప్రస్థానానికి గుర్తుగా

మల్లు స్వరాజ్యం రాజకీయ జీవితమూ ఇఫ్టూ ప్రసాద్ (పిపి) ఆశావహ సమాలోచన!

 

తెలుగునాట వీరోచిత కమ్యూనిస్టు విప్లవోద్యమ చరిత్రలో అపురూపమైన వెలుగుజిలుగుల దశకు ఒక ప్రతీకగా వెలుగొందిన నారీదీపం ఆరిపోయింది. ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలోనే ఉజ్వల, మహోజ్వల, ప్రజ్వలిత కాంతులతో ప్రకాశించిన తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రభవించిన ఒకతార రాలిపోయింది. ఔను, మల్లు స్వరాజ్యం గారు భౌతికంగా మరణించారు. మన నుండి శాశ్వతంగా శెలవు తీసుకున్నారు. ఆమె సమర జీవితపు అమర జ్ఞాపకాలు సదా వర్తమాన వర్గసమాజంలో వెలుగొందుతాయి. భావి సమాజంపై ప్రతిబింబిస్తూ ఉంటాయి. వర్గదోపిడీ ఉన్నంతకాలం, శ్రామికవర్గ విప్లవాలకు ప్రాసంగీకత ఉన్నంత వరకు, సాయుధ సమరాంగణంలో సమర జ్యోతియై వెలుగొందిన ఆ అమరజీవి రాజకీయ జీవితం విప్లవ వెలుగుల్ని విరజిమ్ముతుంది. నేడు భౌతికంగా చేజారిన ఓ ఆరిపోని దీపమా, ఇవిగో మా వీర విప్లవ వినమ్ర నివాళులు! అమ్మా ఇవే మా కొన్నెత్తుటి జోహార్లు!

మల్లు స్వరాజ్యం

ఓ లెక్కన ఆమె మనల్ని శాశ్వతంగా వీడారు. మరో లెక్కన మన మనస్సుల్ని శాశ్వతంగా ఆవహిస్తారు. మొదటిది పాక్షిక సత్యం. రెండోది పూర్ణ సత్యం. ఔను, ఆమె మనల్ని వీడిపోలేదు. వీడరు కూడా! వీడనివ్వని ఓ బంధం మనకూ ఆమెకూ మధ్య ఉంది. వుంటుంది కూడా! అది కొనసాగుతూ వుంటుంది. ఇక ముందూ ఆమె మన మధ్య నిలిచి వెన్నుతడుతుంటారు. మనం నిద్రిస్తే లేపుతారు. బద్దకిస్తే హెచ్చరిస్తారు. అలసిపోతే, పురికొల్పి కదిలిస్తారు. దారితప్పితే బుద్ది చెబుతారు. లక్ష్యం నుండి సన్యసిస్తే, ఛీఛీ పోపో అని శపిస్తారు. ఔను, రాజకీయంగా మరణించనివ్వకుండా ఆమె మనకు కాపలా వుంటారు. ఆమె సదా జీవిస్తూనే మనల్ని కూడా జీవింప జేస్తుంది. ఆమె జ్వలిస్తూనే మనల్ని సైతం జ్వలింప జేస్తుంది. దోపిడీ దుష్ట సామాజిక వ్యవస్థని దగ్ధం చేసే బాధ్యత మనకి ఉందని కర్తవ్యోపదేశం చేస్తుంది. మనం నిత్యం అగ్గి బరాటాలై మండక పోతే, దోపిడీ వ్యవస్థని దగ్ధం చేయలేమని ఆమె మనల్ని హెచ్చరిస్తుంది. అందుకే, జీవించే మన తరం చేజారిన ఆరిపోని దీపకాంతుల్ని నిరంతరం ఆస్వాదిద్దాం. మన భౌతిక రాజకీయ జీవితాల్ని సదా ప్రజ్వలితంగా ఉంచడమే ఆమె అమర స్మృతికి నిజమైన విప్లవ నివాళి!

ఆమె 75 ఏళ్ల రాజకీయ జీవితంలో ఐదేళ్ల గెరిల్లా జీవితం మండే పదార్ధమే. నిత్య దహనశీలత గలదే. గాలిలో భాస్వరం వలే, ఫ్యూడల్ గడీలపై పడి నాడు మండింది. అది పితృస్వామ్య పునాదుల్ని గునపమై పెకల్చింది. ఓ ఇరవై ఏళ్ల తర్వాత ఆమె నిర్మలలోనూ రాజకీయ పరకాయ ప్రవేశం చేసింది. స్నేహలతలకు విప్లవ స్ఫూర్తిదాతై వర్ధిల్లింది. అంతే కాదు, ఫాసిజంపై రేపటి అనివార్యమైన సుదీర్ఘ, సుసంఘటిత, సువిశాల, సువ్యవస్థిత, సమరశీల పోరాటంలో కూడా ఆమె రాజకీయ పరకాయ ప్రవేశం చేసి తీరుతుంది. ఎప్పటికీ ఆమెకి మరణం లేదు. ఆమె సదా జీవిస్తుంది. మనల్ని జీవింపజేస్తుంది.

స్వరాజ్యం గారు 91వ ఏట మరణించారు. ఆ 91 లో 75 ఏళ్ల పైబడి రాజకీయ జీవితమే. పైగా ఎర్రజెండా జీవితమే. 75 ఏళ్ల క్రితమే ఒక మహిళగా సాయుధ గెరిల్లా పాత్రతో రాజకీయ రంగ ప్రవేశం చేయడం ఓ అపురూప సన్నివేశమే. ఆ 75 ఏళ్ళ కాలంలో తొలి ఐదేళ్లు సాయుధ గెరిల్లా పాత్రని పోషించారు. ఫ్యూడల్ భూస్వామ్య వ్యవస్థపై సాగిన నాటి సాయుధ విప్లవ పోరాటంలో ఆమె జ్వలించారు. ఫ్యూడల్ కోటల్ని దహించారు. నాటి నిజాం పాలన పై పులిలా గాండ్రించారు. ఫ్యూడల్ దొరల జులుంపై తుపాకీ ఎత్తారు. దోపిడీ కోటలపై మర ఫిరంగిలా పేలారు. తొలి ఐదేళ్లు పోగా మిగిలిన 70 ఏళ్ళ రాజకీయ జీవితాన్ని తాను నమ్మిన ఎర్రజెండా క్రిందనే కొనసాగించారు. ఇలా తెలంగాణలో ఒక మహిళా రాజకీయ వేత్త 75 ఏళ్ల పైబడి రాజకీయ బరిలో నిలబడటం మరో అపురూప విశేషమే. మరీ ముఖ్యంగా స్వరాజ్యం రాజకీయ జీవితంలోని ఐదేళ్ల ప్రజ్వలిత గెరిల్లా దశ రేపటి స్త్రీ జాతికి విప్లవస్ఫూర్తిని ఇస్తుంది. మున్ముందు సైతం ఆమెని రాజకీయసంగా మనం బ్రతికించుకుందాం. ఔను, తద్వారానే రాజకీయంగా మనం కూడా జీవిద్దాం.

 

 

నాటి తెలంగాణ భౌతిక స్థితిగతులు స్త్రీలని రాజకీయ రంగప్రవేశం చేయనివ్వ లేదు. ఆ నేల కోటిరత్నాల వీణయే. కానీ ఆ వీణ మోగని కాలమది. వీణాతంత్రుల్ని ఆనాడు వేళ్ళతో మీటి మోగించే పరిస్థితి ఇంకా పరిపక్వత చెందలేదు. అదృశ్యంగానో అరుదుగానో వీణని మీటే వారున్నా, అది పలికించే శ్రావ్య ధ్వనుల్ని స్త్రీలు ఇంకా ఆస్వాధించే స్థితిలో లేరు. ఆ అరుదైన స్థితిలో తెలంగాణలో అరుదైన రాజకీయ సన్నివేశమే ఒక యుక్త వయస్సు యువతి తుపాకీ ధరించడం! ఏది ఏమైనా స్వరాజ్యం గారి ద్వారా సాయుధ పోరులో అడుగిడిన తెలంగాణ స్త్రీ కోటి రత్నాలవీణకు నాడు కొత్త శోభను తెచ్చింది.

సాయుధ పోరాటంలో స్వరాజ్యం గారు ఒక ఐకాన్! స్త్రీల సమీకరణ కోసం నాడు కమ్యూనిస్టు పార్టీ చేసిన కృషికి ఆమె స్ఫూర్తిదాత! ఆమె గెరిల్లా పాత్ర ఒక ఉత్ప్రేరకం! మరపురాని రాజకీయ అనుభవమది. సదా అది విప్లవానుభూతిని ఇస్తూ వుంటుంది. ఆమె అమర స్మృతిని నిత్యం స్మరిద్దాం.

ప్రకృతి నియమం ప్రకారం మానవ జీవిత కాలం నూరేళ్లు! 100 లో 90 ఏళ్ల పైబడి మనిషి జీవించి మరణించడం ప్రకృతి నియమం ప్రకారం సకాల మరణమే. ఆమె మరణం పై భౌతికవాద సూత్రాల ప్రకారం సూటిగా మాట్లాడుకుందాం. ఔను, సెంటిమెంట్లును వదిలేసి మాట్లాడుకుంటే మంచిది. ఆమెది అకాల మరణం కాదు, సకాల మరణమే. ప్రకృతిపరంగా సకాల మరణమైనప్పుడు ఆమె మరణం విచారించేది కాదు. విషాదం అసలే అక్కర్లేదు. ఆమె భౌతిక కాయాన్ని కడసారి చూసి దుఃఖించే సందర్భం కానే కాదిది. భౌతికకాయం పై పడి బోరున విలపించే సమయం కూడా కాదిది. ఐతే మరి ఏడుపు రాదా? కమ్యూనిస్టులు కూడా మనుషులే. ఔను మనం మనుషులమైతే ఏడుపు వస్తుంది. ఐతే అది రెండు విధాలుగా వుంటుంది.

మనమూ మనుషులమే ఐనందున మన రాజకీయ ఆత్మీయ మనస్సులు కొన్ని కన్నీటి ఆశ్రువుల్ని రాల్చుతాయి. ఆమె ఇంకా జీవించే కాలం ఉందనేది మన బాధకు కారణం కాదు. మా నుండి మీరు అప్పుడే వీడారా అనేది మన బాధకు మూలం కాదు. ఆమెతో మన గత అమర జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి మాత్రమే. ఆమె గత ఉజ్వల చరిత్ర స్మృతుల్ని గుర్తుకొచ్చి కొన్ని కన్నీటి చుక్కల్ని కార్చుతాం. అవి న్యాయమైన మానవీయ కన్నీళ్లు! అవి బలహీనతకి గుర్తు కాదు. మనకి రేపటి రాజకీయ బలాన్ని ఇచ్చే ఉపయుక్తపు కన్నీళ్ళవి.

మరోరకం కన్నీళ్లను కూడా ఆమె మరణం మనకు తెప్పిస్తుంది. సెంటిమెంటు వదిలేసిన మన కమ్యూనిస్టులు సైతం ఏడ్చే సందర్భమిది. ఆమె భౌతికకాయం చూసి కుమిలి పోతాము. మన కళ్ళు ఊటబుగ్గలై కన్నీరు మున్నీరై ప్రవహిస్తుంది. గుండెలు కోతకు గురై తరుక్కు పోతాయి. ఎందుకు? కారణముంది.

 

ఏవి తల్లీ నిరుడు పండిన పసిడి పంటల్? ఏవితల్లీ నాడు మండిన పేద గుండెల్? ఏవి తల్లీ మొన్న రగిలిన సమర జ్వాలల్? ఏవి తల్లీ నాడు కదిలిన జన సమూహాల్? ఏవి తల్లీ నాటి నిర్మిత కంచు కోటల్? ఏవి తల్లీ నిరుడు పూసిన ఎర్ర మందారాల్? అంటూ మానసిక వేదనకు మనం గురవుతాం. ఆమె భౌతిక మరణం ఈ ఆత్మశోధనకి మనల్ని గురిచేస్తుంది.

శ్రామికవర్గ రాజ్యం కోసం నాటి తరం తమ ప్రాణాలు అర్పించింది. నెత్తుర్లు ధారపోసింది. అసాధారణ త్యాగాలు చేసింది. ఫలితంగా చేజిక్కించుకున్న మహత్తర రాజకీయ ఫలాలు తదనంతర కాలంలో నిలబడలేదు. స్వయం కృతాపరాధాల వల్ల అవి చేజారాయా? సహజ వైఫల్యంతోనే అవి చేజారాయా? అదేదో కర్మఫలమా? కర్తఫలమా? ఇదో సమగ్ర సమీక్షకి దారి తీయాలి. ఆమె మరణం అందుకొక సముచిత సందర్భం కావాలి.

నాటి సామ్యవాద తోటల్లో పూసిన మందార మధుర మకరందపు జాడలేవీ కనబడటం లేదు. కంచుకోటలు లేవు. రాజకీయ పసిడి పంటలు లేవు. ఎత్తైన శిఖరాలపై నుండి మనం ఒక లోతైన ఊబిలో జారిపడ్డాం. నేడు మనం అక్కడి నుండి గొంతెత్తి పిలిస్తే పలికే వేల గొంతులు లేవు. ఊబిలో పడితే చెయ్యిచ్చి పైకి లేపే తోడులేదు. అందుకే ఆమె భౌతికకాయాన్ని చూస్తే ఏవి తల్లీ అని విషాద గీతం ఆలపించే పరిస్థితి నేడు మనది. ఈ సమగ్ర సమీక్షకి ఏది ప్రాతిపదిక?

కోల్పోయిన ఫలాలు ఏడిస్తే తిరిగి చేజిక్కవు. కూలిన కంచుకోటలు విలపిస్తే తిరిగి నిర్మాణం కావు. అలాంటి ఏడుపు, బాధలు అర్ధం లేనివి. పైగా అది వైరాగ్యానికి దారితీస్తుంది. ఆచరణలో అది నైరాశ్యానికి కారణం అవుతుంది. అలా అర్ధం లేని వ్యర్ధ సమీక్షలు వద్దు. ఇప్పుడు చేయాల్సింది శాస్త్రీయ సమగ్ర సమీక్ష! అట్టి శాస్త్రీయ సమీక్షే శాస్త్రీయ గుణపాఠాల్ని ఇస్తుంది. అవే శాస్త్రీయ కర్తవ్యాలకి దారి తీస్తుంది.

ఎక్కడ సాధించాం? ఎక్కడ కోల్పోయాము? సమీక్షకు ఇదో ప్రధాన అంశం కావాలి. మనం జనావాసాల్లో అశేష త్యాగాలతో శ్రమించి నిర్మించిన కంచుకోటల్ని లెనిన్ చెప్పినట్లుగానే పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా మరింత పటిష్ట పరుచుకోగలిగామా? లేదంటే, జనక్షేత్రాల్లో నిర్మించుకున్న కోటల్ని పార్లమెంటరీ వ్యస్వస్థకి బలిపెట్టామా? దీనికి దానిని ఉపయోగించుకో గలిగామా? లేదంటే దాని ప్రయోజనాల కోసం దీనినే ఉపయోగించామా? ఈ రెండింటిలో ఏది సత్యం? ఏది అసత్యం? ఇదే మన సమగ్ర సమీక్షకి ప్రాతిపదిక కావాలి. మల్లు స్వరాజ్యం మరణం అందుకు ఒక సముచిత సందర్భం!

రూపం ఎలా వున్నా, మల్లు స్వరాజ్యం గారు పాల్గొన్న సాయుధ పోరాటానికి ఈనాటికీ రాజకీయ ప్రాసంగీకత ఉంది. అది పునరావృతం కాకతప్పదు. శాంతియుత పరివర్తనతో శ్రామికవర్గ రాజ్యాధికారం సిద్దించదు. నిజాం కాలం నాటి కంటే శ్రమదోపిడీ వ్యవస్థ నేడు అనేకరెట్లు బలపడింది. మౌలికంగా పార్లమెంటరీ వ్యవస్థ శ్రమదోపిడీ వ్యవస్థను పటిష్టపరిచి సుస్థిర పరుస్తుంది. దాని 70 ఏళ్ల చరిత్ర నిరూపించే నిప్పులాంటి నిజమిది. అది కొత్తగా ఫాసిజం వైపు కూడా నేడు ప్రయాణం చేస్తోంది. నేడు కాకపోతే రేపైనా, రేపూ కాకపోతే ఎల్లుండైనా, లేదంటే ఆ తర్వాతనైనా చరిత్ర చెప్పే పాఠం సుస్పష్టమే. మల్లు స్వరాజ్యం గారి గతకాల విప్లవ మార్గాన్ని తిరిగి అనుసరించక తప్పదు. శ్రమజీవులు కార్చే చెమట నెత్తుర్లపై గుట్టలుగానూ కొండలుగానూ పొగుపడే పెట్టుబడుల సంపదతో బూర్జువా వర్గం మరింత బలపడి తీరుతుంది. అది రాజ్యాధికారాన్ని మరింత పటిష్టం చేసుకుంటుంది. అట్టి రాజ్యాధికారాన్ని శాంతంగా శ్రామికవర్గం స్వాధీనం చేసుకోలేదు. ఈ చారిత్రక సూత్రాన్ని పార్లమెంటరీ వ్యవస్థ తిరగరాయలేదు.

గుడ్డుని మూడో రోజో ఏడోరోజో పగలగొడితే పిండం తప్ప పిల్ల రాదు. విప్లవం పిల్లకాయల ఆట వంటిది కాదు. ఆవేశంతో సాధించేది కాదు. అట్టి అపరిపక్వ, అపరిపూర్ణ పద్ధతుల్లో విప్లవ సాధనని ఆశించడం వైకుంఠ పాళీ క్రీడ వంటిదే. ఇది నిజమే. అదే సమయంలో గుడ్డుకి తగిన ఉష్ణాన్ని అందించే రాజకీయ కర్తవ్యాన్ని వదిలేయడమూ చారిత్రక అపచారమే! అంతేకాక రాజకీయ అపరాధమూ! మనం వాస్తవంగా గుడ్డు పొదిగే స్థలాన్ని వదిలేసి, బయట పార్లమెంటరీ స్ధలాలకు ప్రధానంగా పరిమితమైతే గుడ్డు పొదగదు. పుట్టేది పిల్ల కాదు. అదే చరిత్ర!

ఉరుకులూ పరుగులతో ప్రజాఉద్యమ కంచుకోటల నిర్మాణం జరగదు. మనం నిలకడగా నిలబడి నిర్మిస్తే నేటికీ కోటల నిర్మాణం జరిగి తీరుతుంది. ప్రజలు అజేయులు. వారు చరిత్ర నిర్మాతలు! నేడు మనకు అసాధ్యంగా సుదూర స్వప్నాలుగా అనిపించే అసాధారణ విప్లవాలను సుసాధ్యం చేసే బలవత్తర శక్తి శ్రామికవర్గంలో ఉంది. జనం మధ్య మమేకమై జనంతో నిర్మించేవే వాస్తవ ప్రజోద్యమ కంచుకోటలు! స్త్రీలని అబలలుగానే భావించే కాలంలో వారు సబలలని ముందుకొచ్చిన మల్లు స్వరాజ్యం గారి రాజకీయ జీవితం మనకు నిరూపించిన సత్యమిది.

ఆనాడు ఆమె జనం మధ్యకి వెళ్లారు. జనం మధ్య జీవించారు. ఆమె ఎత్తిన తుపాకీ ఆమెది కాదు. అది జనం కంటికి రెప్ప వంటిది. నాడు జనంతో సంబంధం లేని ఆయుధం కాదది. మనం జనంతో ప్రజోద్యమ కేంద్రాల్ని నిర్మిస్తే, మనకు అవే ఉపాధ్యాయ పాత్ర తీసుకొని బోధిస్తాయి. ఏ సమయంలో ఏ కర్తవ్యం చేపట్టాలో ఆనాటి ప్రజా ఉద్యమ కేంద్రాలే మనకు కర్తవ్యోపదేశం చేస్తాయి. మల్లు స్వరాజ్యం గారి రాజకీయ జీవితం నుండి నేర్చుకునే గుణపాఠమిది.

ఫాసిస్టు రాజకీయ రాజ్యాంగాన్ని కూడా రద్దు చేసి దేశాన్ని ఫాసిజం వైపు నడిపిస్తున్నాయి. ఓ ప్రగతిశీల విప్లవం ద్వారా కన్నీళ్లు లేని సమాజాన్ని స్థాపించే లక్ష్యంకై మల్లు స్వరాజ్యం గారి వంటి వారు ఎందరో పోరాడారు. మనం ఆశించిన సుందర సమాజ స్థాపన మధుర స్వప్నంగా మిగిలింది. కానీ ఓ ప్రతీఘాతుక విప్లవానికి ఫాసిస్టు నెత్తుటి కుట్రలు నేడు సాగుతున్నాయి. ఫాసిస్టు పాలనా రాజకీయ శక్తులకి ప్రజానాడి ప్రతికూలంగా ఉందంటే, పుల్వామా వంటి స్టేజి కూప్స్ చేపట్టి ప్రజలపై అధికారాన్ని సుస్థిరం చేసిపెట్టే డీప్ స్టేట్ సహకారం కూడా వాటికి లభిస్తుంది. ఈ పరిస్థితుల్లో సాంప్రదాయ ఉద్యమ, ఆందోళన, ప్రచార రూపాలకే మనం పరిమితం కారాదు. ప్రజా ఉద్యమ పునాదుల్ని నిర్మించుకునేందుకు తొలి దశలో మల్లు స్వరాజ్యం గారి వంటి కమ్యూనిస్టుల ఉద్యమ నిర్మాణ కృషిని ఆదర్శంగా తీసుకోవాలి.

మనం ప్రజల విశ్వాసం పొందాలంటే, అంతకంటే ముందుగా ప్రజల పట్ల మనకు దృఢ విశ్వాసం ఉండాలి. ప్రజలే చరిత్ర నిర్మాతల చారిత్రిక సూత్రాన్ని మొక్కుబడిగా నమ్మితే, ప్రజలు కూడా మన పట్ల మొక్కుబడి సానుభూతి చూపించి వదిలేస్తారు. మనం ప్రజల విశ్వాసాన్ని పొందాలంటే మరో ప్రాతిపదిక కూడా ఉంది. మన రాజకీయ జీవితాల పట్ల ప్రజలకు విశ్వాసం ఏర్పడి తీరాలి. కమ్యూనిస్టు విలువల నుండి ఒకవేళ మనం దారితప్పితే ప్రజలు గుర్తిస్తారు. ప్రజలు గుడ్డి వాళ్ళుకాదు. మనం నమ్మే శ్రామికజనాల విశ్వాసాన్ని పొందలేని దర్జా జీవితాల్ని మనం గడిపితే, ప్రజలు కనిపెడతారు. ఒకవేళ తమ తక్షణ అవసరాల కోసం మన వర్గ సంఘాల్లో ఉంటూనే చెప్పాల్సిన గుణపాఠాలు మనకి చెబుతారు. అదే చరిత్ర!

మనం నిరాడంబరంగా, నీతిగా, నిజాయితీగా, నిస్వార్థం గా జీవించాలి. మనం నమ్మి అనుసరించే మహోన్నత కమ్యూనిస్టు సిద్ధాంతాల కంటే మన రాజకీయ కార్యాచరణ ప్రజల్ని ముందుగా ఆకర్షిస్తుంది. మనం ఈ ప్రాతిపదికన శాస్త్రీయ సమగ్ర సమీక్ష చేద్దాం. ఆ వెలుగులో తీసుకునే గుణపాఠాలు, కర్తవ్యాల ద్వారా ముందడుగు వేద్దాం. అదే మనం మల్లు స్వరాజ్యం గార్కి ఇచ్చే నిజమైన విప్లవ నివాళి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *