ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2022 – 23 బడ్జెట్ లో రాయలసీమ నీటి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులో అన్యాయం జరిగింది.
-మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి
నీటి పారుదల రంగానికి ప్రభుత్వం 11482 కోట్లు ప్రతిపాదించింది. ఇందులో సింహభాగం పోలవరంకే ఖర్చు చేస్తారు. మిగిలిన నిధులు రాష్ట్రంలోని నిర్మాణంలో ఉన్న , పూర్తి చేసుకున్న వాటి నిర్వహణకే సరిపోతుంది. రాయలసీమ నీటి సమస్య పరిష్కారానికి కీలకమైన గుండ్రేవుల , సిద్దేశ్వరం ఆలోచన కూడా చేయకపోవడం సీమకు తీవ్ర నష్టం.
వైసిపి ప్రభుత్వంపై రాయలసీమ ప్రజలు పెట్టుకున్న ఆకాంక్షలను ప్రతిబింబించని కేటాయింపులు.
వైయస్ రాజశేఖర రెడ్డి రాయలసీమ నీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. గాలేరు నగరి , హంద్రీనీవా పనులు వారి కాలంలో పరుగులు తీసాయి.
వైసిపి అధికారంలోకి వస్తే కీలక నీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని సీమ ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. వాటి కనుగుణంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉండటం లేదనడానికి కేటాయింపూలే నిదర్శనం.
నీటి సమస్య పరిష్కారానికి గాను పోతిరెడ్డిపాడు వెడల్పు , కాల్వల సామర్థ్యం పెంపు , గాలేరు నగరి , హంద్రీనీవాను పూర్తి చేయాలి.
ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను సీమ దుర్భిక్ష నివారణ పథకం ( SPV ) క్రింద పూర్తి చేస్తామని చెప్పి చాలా కాలం అయినా అడుగులు పడటం లేదు.
ప్రస్తుతం కేటాయించిన నిధులు పరిపాలన ఖర్చులకు మాత్రమే సరిపోతుంది. మరో వైపు నీటి సమస్య పరిష్కారానికి అవసరమైన గుండ్రేవుల , సిద్దేశ్వరం ప్రాజెక్టుల ఆలోచన కూడా చేయకపోవడం సరికాదు.
రాయలసీమ ఎత్తిపోతల పథకం అనుమతులు లేకపోవడంతో నిర్మాణం పూర్తి కావడం లేదు. మరో వైపు తెలంగాణ ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘన చేస్తూ శ్రీశైలం నీటిని విడుదల చేస్తుంటే ఏపీ మాత్రం నిబంధనలనడం సరికాదు.
బడ్జెట్ ప్రతిపాదనలలో మార్పులు చేయాలి
కేటాయింపులలో రాయలసీమ ప్రాజెక్టులలో అన్యాయం జరిగింది. వచ్చే బడ్జెట్ ఎన్నికల సమయంలో ఉంటుంది కనుక ఈ బడ్జెట్ లోనే రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయింపులు చేయాలి. గాలేరు నగరి , హంద్రీనీవా లాంటి ప్రాజెక్టులను స్పెషల్ పర్పస్ వేహికిల్ ( SPV ) క్రింద చేపడతామని చెప్పిన ప్రభుత్వం అందుకు అనుగుణంగా నిధులు వచ్చేలా చర్యలు తీసుకోవాలి.
కుందు నదిపై చేపట్టిన ప్రాజెక్టులకు సరిపడ నిధులు విడుదల చేయాలి. అన్ని అనుమతులు ఉన్న గుండ్రేవుల ప్రాజెక్టును రెండు సంవత్సరాలలో పూర్తి చేయడానికి తగిన నిధులు మంజూరు చేయాలి.
కీలకమైన సిద్దేశ్వరం ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టాలి అందుకు అనుగుణంగా నిధులు ఖర్చు చేయడానికి ఈ బడ్జెట్ కేటాయింపులలో మార్పులు చేయాలి రాయలసీమ ఎమ్మెల్యేలు ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి.
(మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి, సమన్వయ కర్త
రాయలసీమ మేధావుల ఫోరం)