కారు గరాజ్ లో ‘ఏషియన్ పెంయిట్స్’ ఇలా పుట్టింది…

ఏసియాలో 3 వ పెద్ద కంపెనీ, ప్రపంచంలో 9వ పెద్ద కంపెనీ.ఏషియన్ పెయింట్స్ అనుబంధ కంపెనీలు 22 దేశాలలో ఉన్నాయి.27 దేశాలలో తయారీ, సర్వీసింగ్ యూనిట్లు ఉన్నాయి. స్టాక్ మార్కెట్ లో రారాజు

(అహ్మద్ షరీఫ్)
కొంతమంది కలలు కంటారు. మరి కొంతమంది రంగుల కలలు కంటారు.  అయితే రంగుల్నే కలగా కంటే ఏమవుతుంది? “ఏషియన్ పెయింట్స్ “అనే సంస్థ పుడుతుంది.
ప్రతి గొప్ప విషయం మొదట్లో చిన్నదిగానే వుంటుంది. ఎంత చిన్నది గా అంటే కోట్లు ఖరీదు చేసే భవన సముదాయాల తో పోలిస్తే ఒక కారు గరాజ్ వున్నంత.  కారు గరాజీల్లో ఊపిరి పోసుకున్న ఆలోచనలు “ఇంతింతై వటు డింతయై మరియు దానింతై  నభోవీధిపై…” అన్నట్లు  ఎదిగి పోయి, ఈ రోజు మనల్ని దిగ్భ్రాంతి  పరిచే మైక్రోసాఫ్టు, హ్యూల్ పాకార్డ్, డిస్నీ, యూ ట్యూబ్, గూగుల్ మొదలైన సంస్థలు, మొదలయింది కారు గారాజీల్లోనే అంటే ఆశ్చర్యమే మరి.
HP కంపెనీ పుట్టిన గారజ్ ఇదే
HP కంపెనీ పుట్టిన గారజ్ ఇదే
డిస్నీ కంపెనీ జన్మస్థలం ఈ కారు గరాజ్
యూట్యూబ్ పుట్టింది ఈ కారు గరాజ్ లోనే
ఇలాగే, ఒక చిన్న కారు గరాజీలో,  పెయింట్ పరిశ్రమ పై నిర్బంధాలు, స్వాతంత్య్ర పోరాటాలూ, ఆర్థిక మాంద్యం, అస్థిర వాతావరణం లాంటి ప్రతిబంధకాల మధ్య  1942 లో వెలుగు చూసిన నలుగురు మిత్రుల ఆలోచనా  పర్యవసానమే ఈ రోజు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఏషియన్ పెయింట్స్. ఆ నలుగురు మిత్రులు  చంపక్ లాల్ చోక్సీ,  చిమన్ లాల్ చోక్సీ,  అర్వింద్ వకీల్, సూర్యకాంత్ దనీ.
ఏషియన్ పెయింట్స్ చిత్రమయిన వాతావరణంలో పుట్టింది. 1942 నాటికి భారత్ దేశంలో పెయింట్ పరిశ్రమ  వేళ్లూనుకోలేదు. కలకత్తాలో షాలిమార్ పెయింట్స్ అనే ఒక ఒక సంస్థ ఉంది. ఎక్కువ భాగం యూరోప్ నుంచే దిగుమతి చేసుకోవాలి. అయితే, ఆ యేడాది రెండవ ప్రపంచ యుద్ధ మేఘాలు అలుముకుంటున్నాయి.  యూరోప్ దేశాలు యుద్ధం ప్రభావంలో ఉన్నాయి. అందువల్ల దిగుమతులు కష్టమయ్యాయి. బ్రిటిష్ ప్రభుత్వం పెయింట్స్ దిగుమతులను నిలిపి వేసింది. ఇక భారత దేశంలో జాతీయోద్యమం కూాడా బలంగా ఉంది. స్వదేశీ ఉద్యమం వూపందుకుంది. విదేశీ వస్తువులను ప్రజలు బహిష్కరిస్తున్నారు. అందువల్ల ఈ నలుగురు మిత్రులు ఒక పెయింట్ కంపెనీ ప్రారంభించాలని భావించి ‘ఎషియన్  అయిల్ అండ్ పెయింట్స్’ కంపెనీ  ప్రారంభించారు. అపుడు చిన్న పరిశ్రమ కాబట్టి దానికి పెద్ద భవనం అసవరం లేదు. దానికి తోడు పెట్టుబడి కొరత కాబట్టి, వాళ్లు చౌకగా అందుబాటులో ఉన్న ఒక కార్ గరాజ్ ను తమ కంపెనీ కోసం ఎంచుకున్నారు. అలా  ఏషియన్ కంపెనీ కూడా ఒక  కారు గరాజ్ లోనే పట్టింది.
1942 లో ఏషియన్ పెయింట్స్ గా మొదలయిన సంస్థ, 1965 లో ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీ గా మారింది. ఆ తరువాత 1973 లో పబ్లిక్ లిమిటెడ్ కంపె ‘ ఎషియన్ పెయింట్స్’ గా మారింది.ఃఈ రోజు ఈ కంపెనీ 22 దేశాల్లో తన సత్తా చాటుతోంది. ఈ విజయ ప్రయాణానికి దాదాపు ఎనిమిది దశాబ్దాలు పట్టింది. ఈ విజయ రహస్యం వెనుక ఏముంది? కేవలం ఒక కల. అదీ రంగుల కల
వ్యాపార సంస్థలకీ, వినియోగ దారులకీ మధ్య సంబంధాన్ని నెలకొల్పేది వ్యాపార ప్రకటనలే. తమ వ్యాపార ప్రకటనల ద్వారా, అన్ని వ్యాపార సంస్థల్లా కాకుండా, తనకొక ప్రత్యేకతను సంతరించుకుంది ఏషియన్ పెయింట్స్.  పెయింట్లూ వాటికి సంబంధించిన ఉత్పాదకాలూ, నైపుణ్యం కలిగిన పెయింటర్ల బ్రష్షులకే అతుక్కుని వుండకుండా, సామాన్య ప్రజల మనసుల్లోకి ప్రవహించేట్లు చేసింది ఈ సంస్థ.  అది ఇతర పెద్ద పెద్ద రంగుల సంస్థల్లా  దూరంగా నిలబడి తమ  రంగుల గొప్పతనాన్ని,  వాడకాన్నీ  చెప్పకుండా, సాధారణ వినియోగదారుల జీవితాల్లోకి చొరబడి, వారి పక్కన నిలబడి , వారి సాధారణ జీవితాల్ని రంగులమయం చేసుకునే చిట్కాలను చెప్పింది.
అప్పట్లో ఏషియన్ పెయింట్స్ అనగానే అందరికీ గుర్తొచ్చేది, ఓ చేతిలో బ్రష్షూ, మరో వైపు ఓ పెయింటు డబ్బాతో, చెదిరిన జుట్టుతో నిర్లక్ష్యంగా కనిపిస్తూ నిలబడి వున్న ఒక అల్లరి పిల్లవాడి చిత్రం.
Asian Paints Gattu
Asian Paints Gattu
ఈ చిత్రం ప్రఖ్యాత కార్టూనిస్టు ఆర్. కే. లక్ష్మణ్ సృష్తించింది. ఇదే చాలా కాలం ఏషియన్ పెయింట్స్ మాస్కాటుగా నిలిచింది. ఆ పిల్ల వాడి పేరు “గట్టూ” గా చలామణి లోకొచ్చింది.  సామాన్య ప్రజానీకానికి “అరె గట్టూ మనవాడే “అనిపించేటట్లు వుండింది ఆ రూపం..
గట్టూ వచ్చిన తరువాత, ఏషియన్ పెయింట్స్ వ్యాపారం, వృత్తి నిపుణులైన పెయింటర్ల నుండి వినియోగ దారులైన ఇంటి యజమానుల వైపు ప్రయాణించింది. ఇంటి యజమానులు పెయింట్ల ఎన్నిక, కొనుగోలు లో  సొంతంగా పాలు పంచుకోవడం మొదలెట్టారు. గట్టూ ఏషియన్ పెయింట్స్ ని ప్రజలు చాలా కాలం గుర్తు పెట్టుకునేట్లు చేశాడు.
50, 60 దశకాల్లో ఈ కంపెనీ సాధారణమైన  డిస్టెంపర్లకీ, ఖరీదైన ప్లాస్టిక్ ఎమల్షన్లకీ మధ్య లో వున్న కడగటానికి వీలయిన (washable) ట్రాక్టర్ డిస్టెంపర్  వ్యాపార ప్రకటన విడుదల చేసింది.
      “మీ టెంపర్ పోగొట్టుకోకండి, ట్రాక్టర్ డిస్టెంపర్ వాడండి”   (Don’t lose your temper, use Tractor Distemper) ఈ వ్యాపార ప్రకటన  సామాన్య ప్రజలను ఆపి,  ఆలొచింప చేసింది. వారి పెదాలపై చిరునవ్వు పూయించింది. అప్పుడు చాలా మంది “అరె ఇదేదో కొత్తగా వుందే” అనుకున్నారు.

 

కొంతకాలానికి  వ్యాపార ప్రకటనల్లో ప్రజలు కొత్తదనాన్ని కోరుకుంటున్నారని గమనించింది యాజమాన్యం. గట్టూ స్థాయి నుంచి మరో మెట్టు పైకి ఎక్కాలి. తన వ్యాపార ప్రకటనల్లో ఈ సంస్థ కొత్తదనాన్ని ప్రవేశ పెట్టింది. ఆ కొత్తదనం లోని భాగాలే అప్పట్లొ మొదలయిన ఈ సంస్థ సృజనాత్మక వ్యాపార ప్రకటనలు. వాటిలో,
“మెరా వాలా బ్లూ” (నాది నీలి రంగు). రోడ్డు ట్రిప్పు కి వెళ్ళిన ఒక జంటలో,  ఆమె, “ఘర్ కి దీవార్” (ఇంటి గోడ) పెయింటు చేయడం కోసం తనకు కావల్సిన రంగు గురించి రాజస్థాన్ ఎడారుల్లో, నీలి రంగు టర్బన్  కట్టుకున్న ఓ అపరిచితుడి వెంట పడి ఆ టర్బన్ను స్వంతం చేసుకునే ఓ వ్యాపార ప్రకటన.
 అంతవరకూ ఇంటి బయటి గోడలకే పరిమితమైన రంగులు ఆ తరువాత ఇళ్ళల్లోకి ప్రవేశించాయి. వినియోగ దారులు ఏషియన్ పెయింట్ షాపులకు వెళ్ళి  “మెరా వాలా బ్లూ”, “మెరా వాలా క్రీం” అంటూ పెయింట్లను కొనడం మొదలెట్టారు
ఇళ్ళకి బయట రంగులు వేసి అందంగా కనిపించేటట్లు చేయడం ఒక ఎత్తయితే, అభిరుచికీ, మూడ్ కి తగినట్లు ఇంటి లోపల రంగుల్ని ఎలా వేసుకోవచ్చో  తెలియచేసిన ఘనత కూడా ఏషియన్ పెయింట్స్ కే చెందుతుంది అనడం లో సందేహం లేదు.   ఈ విషయం పండక్కి ఇంటికి వచ్చి ఇల్లంతా కలియ తిరుగుతూ,  ఇంటిగోడలకున్న రంగుల్ని చూస్తూ ఓ యువకుడు వెలిబుచ్చిన హావ భావల ద్వారా ఒక వ్యాపార ప్రకటనలో తలియ జేసింది ఏషీయన్ పెయింట్స్.
Har Ghar Kucch Kehta Hai
Har Ghar Kucch Kehta Hai
వీరి వ్యాపార ప్రకటనల్లో ఆ తరువాత వచ్చిన “హర్ ఘర్ కుచ్ కెహతాహై” (ప్రతి గృహమూ ఏదో ఒకటి చెబుతుంది) అనే వ్యాపార ప్రకటన బాగా ప్రాచుర్యం పొందింది. ఈ వాక్యం ఎంత ప్రజాదరణ పొందిందంటే, చివరకు ఈ పేరుతో ఒక టివి సీరియల్ కూడా వచ్చింది పాపులర్ అయింది.
Asian paints
ఇంటికి ఏషియన్ పెయింట్ కొట్టడమంటే లామినేషన్ చేసినట్లే.. కొత్త ఆలోచన
దీనిలో ఏషియన్ పెయింట్స్ మనుషుల భావోద్వేగాలను దృష్టిలో పెట్టుకుని, దీపావళి, దసరా లాంటి పండగలప్పుడు, పెళ్ళిళ్ళు, పుట్టిన రోజు వేడుకలప్పుడు మన చుట్టూ ప్రపంచాన్ని రంగులమయం చేసుకోవాలి అనే భావంతో రూపొందించిన ఈ వ్యాపార ప్రకటనలు జన సామాన్యాన్ని సంస్థ కు మరింత దగ్గర చేశాయి.  చివరకు ఎద్దుల కొమ్ములను కూడా వదల్లేదు. మహరాష్ట్ర, తమిళనాడు , ఆంధ్రలలో పశువుల పండగకు ఉన్న ప్రాశస్త్యాన్ని గమనించింది. ఈ పండగపుడు పశువుల కొమ్ములరకు రంగులేసి అలంకరిచడం  కంపెనీ గమనించింది. ఇందులో పెద్ద మార్కటింగ్ అవకాశంఉందని తెలుసుకుని కొమ్ముల అలంకరణకు ప్రత్యేకంగా చిన్న చిన్న డబ్బాలలో పశువుల పండగ  పెయింట్స్ ను విడుదల చేసి సూపర్ హిట్ చేసింది.
పశువుల పండగ లో ఏషియన్ పెయింట్స్
పశువుల పండగ లో ఏషియన్ పెయింట్స్/ pinterest
 ఇలా ప్రతి అవశాన్ని వాడుకుని ఏషియన్ పెయింట్స్  దాదాపు ఎనిమిది దశాబ్దాల ప్రయాణం లో ఈ సంస్థ తన నైతిక విలువలు నిలుపుకుంటూ ఎదిగి, పెయింట్ల వ్యాపారం లో తన ప్రత్యర్థులను వెనక వదిలేసి ఈ రోజు భారత దేశం లోనే అగ్రగామి సంస్థ గా నిలిచింది. ఏషియన్ పెయింట్ మన్నిక గురించి ఆ రోజుల్లో చాలా పాపులర్ అయిన మరొక వ్యాపార ప్రకటన

  దీనితో ఈ కంపెనీ స్టాక్ మార్కెట్ లో కూడా రారాజు అయింది. ఈ కంపెనీ షేర్ అంటే గ్యారంటీ రిటర్న్స్ అని అర్థం. దీర్ఘకాలిక ఇన్వెస్టర్ల పోర్ట్ ఫోలియో తప్పక ఉండే కంపెనీ ఎషియన్ పెయింట్స్. ఈ గ్రాఫ్ కంపెనీ షేర్ ధర  గత ఆరు నెలలో ఎలా ఉందో ఈగ్రాఫ్ చెబుతుంది.
Asian Paints 6 months graph
గత 6 నెలలలో ఏషియన్ పెయింట్స్ షేర్ ధర చూపే గ్రాఫ్/Business Standard
“కల అనేది నీకు నిద్రలో వచ్చేది కాదు, నీకు నిద్ర లేకుండా చేసేది” అన్నాడు అబ్డుల్ కలాం.
ఒక కలను పట్టుకుని సముద్రాన్ని దాట వచ్చు అన్నాడు ఒక కవి.   నిద్ర లేకుండా చేసే కలల్ని కనాలి, వాటిని సాకారం చేసుకుని సముద్రాల్ని దాటాలి. సముద్రాన్ని దాటించే కల కనడానికి, ,దానిని సాకారం చేసుకునే ప్రయత్నం మొదలెట్టడానికి ఒక కారు గరాజ్ చాలు.

(అహ్మద్ షరీఫ్,  ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్ నిపుణుడు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *