ఒక ‘విశ్రాంత రైతు’తో కొద్ది సేపు…

వాహనాల మీద ఆర్మీ, ZPTC, MPTC, ప్రెస్, పార్టీ ప్రెసిడెంట్, గవర్నమెంట్ వెహికల్ అని రాసుకోవడం చూశాం. విశ్రాంత రైతు అని రాసుకోవడం ఎప్పుడయినా చూశారా…ఇదిగో ఈయన ఆపని చేసిన విశ్రాంత రైతు …(ఫోటో మధ్యలో ఉన్న వ్యక్తి)
(టి.లక్ష్మీనారాయణ)
విశ్రాంత రైతు” అని తన వాహనంపై సగర్వంగా వ్రాయించుకొన్న కా.ఎన్.వెంకటపతి(82) గారు, మా తమ్ముడు, తమ్ముని కుమార్తెతో కలిసి అమరావతి రాజధాని ప్రాంతాన్ని నిన్న (జనవరి 15) సందర్శించా.
కరవు పీడిత రాయలసీమ, ప్రత్యేకించి అనంతపురం జిల్లాకు కృష్ణా నదీ జలాలను మళ్ళించాలని డిమాండ్ చేస్తూ దశాబ్దాల పాటు సాగిన ఉద్యమాలలో పాల్గొన్న సీపీఐ సీనియర్ నాయకుడు వెంకటపతి గారు. ఆయనతో నాకు దశాబ్దాల ఉద్యమానుబంధం ఉన్నది.
ఆయన స్వగ్రామం అనంతపురం జిల్లా ఇల్లూరు. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి, సీపీఐ అగ్రనేత అమరజీవి కా. నీలం రాజశేఖరరెడ్డి గార్ల స్వగ్రామం.
అమరావతి రాజధాని పరిరక్షణ కోసం సాగుతున్న అలుపెరగని రైతాంగ ఉద్యమానికి స్పందించి, న్యాయస్థానం నుండి దేవస్థానం మహాపాదయాత్ర సందర్భంగా తమ పొదుపు మొత్తం నుండి లక్ష రూపాయలు విరాళంగా వెంకటపతి గారు అందజేసి ఉద్యమానికి అండగా నిలిచారు.
అమరావతి రాజధానిని సందర్శించాలన్న ఆయన కోరిక నిన్న సాకారమైనది. మంతెన సత్యనారాయణరాజు గారి ఆశ్రమంలో 15 రోజులు ప్రకృతి వైద్య చికిత్స కోసం విజయవాడకు వచ్చారు.
అనంతపురంకు తిరిగి వెళ్ళడానికి ముందు ఆంధ్రప్రదేశ్ శాసనసభ మరియు శాసనమండలి, సచివాలయం, హైకోర్టు భవనాలను, నిర్మాణంలో ఉన్న శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, ఐఎఎస్, ఐపిఎస్, ఉద్యోగుల నివాస భవనాలు, బలహీన వర్గాల నివాస సముదాయాలను, విట్ విశ్వవిద్యాలయం, మందడం, వెలగపూడి, తుళ్ళూరు దీక్షా శిబిరాలను ప్రాంగణాలను సందర్శనలో భాగంగా చూసి, రాజధాని నిర్మాణ పనులు అర్థాంతరంగా ఆగిపోవడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
వెంకటపతి గారిని రైలెక్కించి, రైల్వే స్టేషన్ నుండి అలా నడుచుకొంటూ చల్లపల్లి బంగళా వద్దకు వచ్చి, ఇంటికి రావడానికి సిటీ బస్సు ఎక్కా. బస్సులో మహిళ కండక్టర్ ను టికెట్ అడిగాను. నా వైపు ఆశ్చర్యంగా చూస్తూ, మీ పేరేంటి, ఏం చేస్తుంటారని అడిగారు.
లక్ష్మీనారాయణ, టీవీ చర్చల్లో పాల్గొంటుంటా, చూసుంటారేమో! అన్నాను. మా లక్ష్మన్న కదా! అంటూ ఆ మహిళ నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ క్షణంలో నాకు ఎంత ఆనందం కలిగిందో!
నేను అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ (ఏ.ఐ.ఎస్.ఎఫ్.) రాష్ట్ర కార్యదర్శిగా, జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన కాలంలో విద్యార్థి ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్న విద్యార్థిని కార్యకర్తలు నన్ను అభిమానంతో లక్ష్మన్న అంటూ పిలిచేవారు. మూడు దశాబ్ధాలు గడిచిపోయాయి. ఆమెకు పిల్లలు, పిల్లలకు పిల్లలు అంటే ఆమె ఇప్పుడు అమ్మమ్మ. ఏ.పి.ఎస్.ఆర్.టి.సి.లో కండక్టర్ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నది.
కరోనా కాలం కాబట్టి ముఖాలకు మాస్క్ లు ధరించి ఉన్నాం. నేను గుర్తు పట్టలేదు. ఆమె గుర్తుపట్టింది. ఆమె పేరు చెప్పగానే నేను గుర్తుపట్టాను. ఆశ్చర్యపోయాను.
డబ్బు తీసుకోకుండా టిక్కెట్ ఇవ్వబోతే, డబ్బు తీసుకోవాల్సిందేనని గట్టిగా చెప్పా. మా అన్న ఏం మారలేదు అంటూ అయిష్టంగానే టిక్కెట్ డబ్బు తీసుకొన్నది. ఒకవైపు కండక్టర్ బాధ్యత నిర్వహిస్తూనే, ఆమె కుటుంబ క్షేమ సమాచారంతో పాటు పంతులమ్మగా ఉద్యోగం చేస్తున్న మరొక చెల్లాయి క్షేమ సమాచారం కూడా తెలియజేసింది. సంతోషంతో అలా వింటూ వుండగానే నేను దిగాల్సిన బస్ స్టాప్ సమీపిస్తుండగా ఆమె గుర్తు చేయడంతో, దిగేశా.
విద్యార్థి ఉద్యమం, కమ్యూనిస్టు ఉద్యమం ద్వారా తెలుగు నాట, వివిధ రాష్ట్రాలలో నన్ను అభిమానించే ఎంతో మంది చెల్లెమ్మలు లభించారు. ఇలా దశాబ్దాల తదనంతరం ఎప్పుడు, ఎక్కడ తారసపడ్డా, వెంటనే గుర్తుపడతారు, ఆప్యాయంగా మాట్లాడతారు. ఈ మధురానుభూతులు వర్ణనాతీతం.
(టి.లక్ష్మీనారాయణ, సామాజిక ఉద్యమకారుడు)

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *