చీర్స్: సర్కారుకు చెలగాటం, పేరెంట్స్ కి సంకటం

(వడ్డేపల్లి మల్లేశము)

కుటుంబాలకు ఆసరాగా నిలబడవలసిన యువత మత్తులోనే తేలిపోతూ ప్రమాదాలు, ఆత్మహత్యలతో మూన్నాళ్ళకే నూరేళ్ళ ఆయుష్షు నిండి కుటుంబాలకు శోకాన్ని మిగలిస్తున్నారు.
దేశంలో తాగి  డ్రైవ్ చేస్తూ చేసిన ప్రమాదాలలో తెలంగాణా రెండోస్థానంలో  ఉంది. దేశమంతా 2020లో తాగిన మత్తులో డ్రైవ్ చేస్తూ చేసిన ప్రమాదాలలో 3026 మందిచనిపోతే, ఇందులో తెలంగాణలొ 343 మంది (11 శాతం) చనిపోయింది.మొదటి స్థానం 541 మరణాలతో (17 శాతం) ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానిది. తెలంగాణలో ఈ మధ్య నిరాశాతో ప్రాణం తీసుకుంటూన్న యువకుల సంఖ్య కూడా పెరిగింది. గతంలో తెలంగాణ రాలేదని, రావడం లేదని వందలాది మంది యువకులు ఆత్మహుతి చేసుకున్నారు. తెలంగాణ వచ్చాక, ఉద్యోగాలురావడం లేని, ఉద్యోగాల నోటిఫికేషన్ రావడం లేదని యువకులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇలాంటి వార్తలు ఇతర రాష్టాల నుంచి రావడం చాలా అరుదు.
నిజం చెప్పాలంటే యువత కావాలని ప్రమాదాలను కోరుకొని ఆత్మహత్యలను స్వాగతించడం లేదు. ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా, ఆదాయమే లక్ష్యంగా, యువతను పెడదారి పట్టిస్తున్నది. పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నది. ఇది రాజ్యాంగ  ఆదేశిక సూత్రాల మేరకు ఉల్లంఘన కిందికే వస్తుంది.
మద్యపానం  వికృత పరిణామాలు, పర్యవసానాలు ,ప్రమాద ఘంటికలు, ప్రభావాలు ప్రభుత్వానికి తెలియనివి కావు. అలాంటప్పుడు ప్రభుత్వాలు ఎంత జాగ్రత్తగా ఉండాలి.  కాని, కావాలని మద్యపానాన్ని ప్రోత్సహిస్తూ, వాడవాడలా అందుబాటులో ఉంచుతూ, ఆదాయానికి మాత్రమే పరిమితమై, చౌకబారు రాజకీయాలను ప్రభుత్వాలు చేస్తున్నాయి.
యువత మద్యం రాజకీయ కుట్రలను చేదించవలసిన అవసరం ఉన్నది. లేకపోతే, మద్యం ప్రభావం  తద్వారా వేలాది కుటుంబాలు వీధిన పడే సూచన కనుచూపు మేరలో కనపడుతున్నది.
లిక్కర్ పాలసీ  10 ప్రశ్నలు

1. ప్రజలు కోరితే ప్రభుత్వాలు మద్యపానాన్ని అందుబాటులో ఉంచినవా?
లేక

2. ప్రభుత్వాలు మద్యపాన సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి కనుక ఎగబడి తాగుతున్నారా?
3. ప్రభుత్వమే తన ఆదాయమార్గంగా మద్యపానాన్ని ఎంచుకున్నదా?
4. ఆదాయ ప్రస్తావన పక్కనబెడితే మద్యపానం ద్వారా ప్రజల జీవితాలు బుగ్గిపాలు అవుతాయనే సోయి ప్రభుత్వాలకు లేదా?
5. మద్యపానాన్ని అమలు చేయడం ద్వారా కొన్ని వర్గాల ప్రయోజనాలను కాపాడుకోవడానికి ప్రభుత్వాల వెనుక అదృశ్య శక్తులు ఏమైనా ఉన్నాయా?
6. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ప్రభుత్వాలు ప్రజలకు ద్రోహం చేస్తున్నాయి కనుక రాజ్యాంగ ఉల్లంఘన కింద ప్రభుత్వాల పైన కేసులు పెట్టవచ్చా?
7.  యువత, కార్మికులు, కర్షకులు, ప్రజలు, విభిన్న వర్గాల వారు మద్యం వైపు మల్లడాన్ని ఎలా అదుపు చేయాలి?
8. ప్రజలు స్వచ్ఛందంగా నిరాకరించడం ద్వారా మద్యపాన నిషేధాన్ని అమలు చేయలేమా? నెల్లూరు జిల్లా దూబగుంటకు లో సారా నిషేధం ఉద్యమం ప్రారంభమైన ట్లుగా ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ప్రజా, మహిళా, యువజన సంఘాల పోరాటాల ద్వారా ప్రభుత్వమే మద్యపానాన్ని నిషేధించే విధంగా ఒత్తిడి చేయలేమా?
9. రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద కూలీలు కార్మికులు కర్షకులు మత్తులో ఊగుతూ ఉంటే తల్లిదండ్రులు ఆందోళనలో తమ పిల్లల భవిష్యత్తు కోసం ఆరాట పడుతూ ఉంటే మద్యం షాపుల యజమానులు కోట్ల ఆదాయం తో సంబర పడాల్సిందే నా?
ప్రభుత్వం ఇటీవల మద్యం షాపుల కోసం ఎస్సీ ఎస్టీ గౌడ కులస్తులకు తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్ ప్రకటించడం తాగుబోతులను తయారుచేసి రెచ్చగొట్టడానికి ప్రభుత్వం పన్నిన కుట్ర కాదా?
10. కలతలు, కన్నీరు, ఆత్మహత్యలు, హత్యలు, అత్యాచారాలు ,అకృత్యాలు, దోపిడీలు, కుటుంబాలు వీధిన పడడానికి కారణమైన మద్యపానాన్ని కనుమరుగు చేయలేమా? ప్రజాస్వామిక వాదులు, విజ్ఞులు, బుద్ధిజీవులు, మేధావులు, సంఘసంస్కర్తలు, సామాజిక కార్యకర్తలు, విశ్లేషకులు ప్రజల పక్షాన ఆలోచించవలసిన బాధ్యత లేదా ? లేదా బాధ్యతలను విస్మరిస్తున్నారా?
మద్యం  జీవనదిలా పారుతున్నది

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో మద్యానికి సంబంధించి ఆదాయమే మార్గంగా ముందుకు పోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రమంగా మద్యపానాన్ని నిషేధించే ప్రణాళికలో భాగంగా మద్యం షాపుల సంఖ్య తగ్గిస్తూ,ధరలు పెంచినట్లు అక్కడి ప్రభుత్వం మొదటి తనుంచి చెబుతూ వస్తున్నది. చివరకు ఏమయింది. ఆ ప్రభుత్వం కూడా చేతులెత్తేసి  ఆదాయం పెంచుకునేందుకు మళ్లీ ధరలు తగ్గించింది.

 తెలంగాణ రాష్ట్రంలో మద్యం షాపులను గణనీయంగా పెంచి 2014లో పది వేల కోట్ల ఆదాయం ఉంటే నేటికీ అది 30 వేల కోట్లకు దాటింది. అంటే తెలంగాణ లక్ష్యం ఆదాయ సముపార్జనే. ఇంకా తలవంపులు తెచ్చే సమస్య ఏమిటంటే తెలంగాణ రాష్ట్రంలో కొన్ని కులాలకు మద్యం షాపులు ఏర్పాటు చేసుకోవడానికి కూడా  రిజర్వేషన్  కల్పించడం. ఎస్సీ ఎస్టీ గౌడ కులస్తులకు రిజర్వు చేస్తూ ప్రభుత్వం అమలు చేయడం దేనికి సంకేతం?
గత సంవత్సరం కరోనా విజృంభించిన సమయంలో షాపులను మూసివేసి తర్వాత తిరిగి ప్రారంభించిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షాపుల వద్ద కొనుగోలుదారులను క్రమబద్ధీకరించడానికి అక్కడి ప్రభుత్వం ఉపాధ్యాయులను వినియోగించుకున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొక అడుగు ముందుకు వేసి పోలీసుల పహారాలో మద్యం అమ్మకాలను కొనసాగించింది. ఇదంతా మద్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వాల విధానం ఎలాంటిదో తెలియజేస్తున్నది.
ఇక దేశవ్యాప్తంగా నాలుగు ఐదు రాష్ట్రాలలో మద్యపాన నిషేధం అమలులో ఉన్నప్పటికీ పొరుగు రాష్ట్రాలలో లభించడం వలన అమలు ఖచ్చితంగా జరగకపోగా నిషేధించినా ఫలితం లేదు.
దొంగ రవాణా, అక్రమ వినియోగం ద్వారా పోలీసులు అధికారుల జేబులు నింపడానికి పనిచేస్తున్నది. దేశవ్యాప్తంగా మద్యపానాన్ని నిషేధిస్తే తప్ప దాని ఫలితాలను చూడలేము.
ఇదేదో ప్రభుత్వాలకు తెలవకుండా ప్రజలకు జరుగుతున్న మోసం అనుకోవడానికి వీలు లేదు.
ప్రభుత్వమే దగ్గరుండి అలవాటు చేసి ,ఆకర్షించి, అనుభూతి సృష్టిస్తూ, దుష్ప్రభావాలకు, దుష్పరిణామాలకు కారణమవుతున్నది.
ముఖ్యంగా యువత, వృద్ధులు దీని బారిన పడి అనారోగ్యం పాలవుతూ కుటుంబాలకు దూరం అవుతుంటే కాయకష్టం చేసుకుని అరకొరగా బతికే పేద కుటుంబాలు సైతం తమ కనీస ఆదాయాన్ని మద్యానికి ఖర్చు చేసి ఖాళీ చేతులతో ఇంటికి వెళ్తూ కయ్యా లతో భార్య పిల్లలను కడతేర్చుతున్నారు.
కొన్ని పరిశోధనలు

దేశవ్యాప్తంగా జరిగిన అత్యాచారాలలో భాగంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని సంఘటనల సందర్భంలో అత్యాచారాలకు ప్రధాన కారణం మద్యపాన మేనని మానసిక నిపుణులు నొక్కిచెప్పారు. మద్యం మత్తులో వావివరుసలు , పసి పిల్లలు వృద్ధులు అనే విషయం మరచి కూడా అత్యాచారాలకు పాల్పడి సమాజమే సిగ్గుతో తలదించుకునేలా చేస్తున్నదానికి కారణం మద్యపానం కాదా?

యువత నడుం బిగించి స్వచ్ఛందంగా బహిష్కరించాలి. తల్లిదండ్రులు యువతను నివారించాలి . అలసటను దూరం చేయడానికి ప్రత్యామ్నాయ ఔషధ పోషక పానీయాలను అందుబాటులో ఉంచాలి. ప్రజలు, మహిళా , యువజన సంఘాలు ప్రభుత్వం లిక్కర్ పాలసీని వ్యతిరేకించాలి.
కవులు, రచయితలు, కళాకారులు, మేధావులు, బుద్ధిజీవులు ప్రజల పక్షాన మద్యాన్ని చరమగీతం పాడాలి. అప్పుడే తల్లిదండ్రులు యువత ప్రశాంత జీవితం గడుపుతారు.
కుటుంబాలు వీధిన పడవు. ఆరోగ్య భారతావనిని నిర్మించవచ్చు. బాధ్యత మరిచి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్న ప్రభుత్వాలను దోషిగా నిలబెడితే తప్ప ఇది సాధ్యం కాదు.న్యాయవ్యవస్థ కూడా క్రియాశీలక పాత్ర పోషించాలి.
Vaddepalli Mallesam
Vaddepalli Mallesam
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు, సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం (చౌటపల్లి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *