(సలీమ్ బాషా)
38 ఏళ్ల క్రితం అంటే 1983 జూన్ 25 సాయంత్రం 3-4 గంటల ప్రాంతంలో అనుకుంటా నేను మా తమ్ముళ్లతో కలిసి రేడియో క్రికెట్ కామెంటరీ వింటున్నాను. ఉన్నట్టుండి కృష్ణమాచారి శ్రీకాంత్ సిక్స్ కొట్టాడు. మా తమ్ముడు రేడియో సౌండ్ పెంచాలని వెళ్లి టేబుల్ మీద ఉన్న గడియారం పడగొట్టడం నాకింకా గుర్తుంది.
అలా ఆ మధ్యాహ్నం నుండి సాయంత్రం దాకా ఇండియా బ్యాటింగ్ మొత్తం విన్నాము! చూసే అవకాశం లేదు కనుక. అప్పటికి ఇంకా కర్నూల్ కి టీవీ రాలేదు. ఆ ఫైనల్ కోసం ఒకరోజు ముందుగానే ప్రిపేర్ అయ్యాము. పల్లీలు తిను కుంటూ అందరూ కలిసి కామెంట్రీ వినాలని.
ఒక ప్రపంచకప్ లో భారతదేశం భారత జట్టు మొదటిసారి ఫైనల్స్ ఆడుతోంది అన్న విషయం మాకు సంతోషంగా, థ్రిల్లింగా అనిపించింది. వెస్టిండీస్ బ్యాటింగ్ మొదలయ్యాక రిచర్డ్స్ వచ్చేంతవరకూ బాగానే ఉండింది. రిచర్డ్స్ బాదడం మొదలయ్యాక బోర్ కొట్టింది. అయితే నిరుత్సాహం అనిపించింది. రిచర్డ్స్ ముప్ఫై ఓవర్లలోనే మ్యాచ్ ముగించేస్తాడనిపించింది. పైగా అంతవరకు బాగానే మోగిన రేడియో గురగుర అనడం మొదలెట్టింది. దాంతో ఎలాగూ ఇండియా ఓడిపోతుంది కాబట్టి వినడం ఎందుకని రేడియో కట్టేసాం. ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళి పోయి నిద్ర పోయాము. పొద్దున లేటుగా లేవడం వల్ల ఇండియా గెలిచింది అన్న విషయం తెలియలేదు. తెలిసిన వెంటనే సెంటర్ కు వెళ్లి దొరికిన న్యూస్ పేపర్లన్నీ కొనేసాను. అంత పిచ్చి ఉండేది క్రికెట్ అంటే.
ప్రతి పేపర్లో ఏం రాశారో అని ఒకటికి రెండు సార్లు చదివేశాను. చాలా కాలం వరకు ఆ పేపర్ కటింగ్ లు నా దగ్గర ఉండేవి. ఇప్పుడు లేవు. ఎక్కడో పోయాయి. అన్ని పేపర్లలో ఏం రాశారో గుర్తులేదు గానీ, ది “”హిందూ” ఇంగ్లీష్ పేపర్ లో పెట్టిన హెడ్డింగ్ “India sets lords ablaze” మాత్రం ఇంకా కళ్ళ ముందే ఉంది.
ఇక్కడ ఇంకో విషయం కూడా ప్రస్తావనార్హం. 1987 లో ఆంధ్ర కర్ణాటక ల మధ్య కర్నూల్లో రంజి ట్రోఫీ మ్యాచ్ జరిగింది. అప్పుడు మీడియా కోఆర్డినేటర్ స్థాయిలో నేను మిత్రుడు టీ.ఎన్.నాగరాజు(ఇప్పుడు అమెరికాలో ఉంటున్నాడు.)తో కలిసి 1983 భారత క్రికెట్ జట్టు సభ్యుడు రోజర్ బిన్నీ తో కలిసి మాట్లాడే అవకాశం కలిగింది. ఆ మ్యాచ్ గురించిన చాలా విషయాలు అతను చెప్పాడు. అలాగే మళ్ళీ డిసెంబర్లో 2001 లో ఆంధ్ర కర్ణాటక ల మధ్య కర్నూల్లో మరోసారి రంజి ట్రోఫీ మ్యాచ్ జరిగింది. అప్పుడు1983 భారత క్రికెట్ వికెట్ కీపర్ ఎస్,ఎం,హెచ్ కిర్మాణీ తో కూడా మాట్లాడటం జరిగింది. అతను ఆ ఫైనల్ మ్యాచ్ గురించి చాలా విషయాలు నాతో పంచుకున్నాడు.!
38 సంవత్సరాల తర్వాత 83 సినిమా చూస్తుంటే మళ్లీ థ్రిల్లింగ్ గా అనిపించింది (ఫలితం తెలిసినప్పటికీ) మళ్లీ కొత్త గా చూస్తున్నట్టు అనిపించింది. అప్పుడు క్రికెట్ కామెంట్రీ విన్న వాళ్లకి,వినని వాళ్లకి, టీవీ చూసిన వాళ్లకి చూడని వాళ్లకి, ఆ తరం వాళ్ళకి, ఈ తరం వాళ్ళకి, కుర్రకారుకి కూడా థ్రిల్లింగ్ గా సినిమాని తీయడం లో దర్శకుడు కబీర్ ఖాన్ పూర్తిగా సఫలం అయినట్లే. నేను ఈ సినిమా చూసినప్పుడు థియేటర్ లో నాలాంటి వాళ్ళు పదుల సంఖ్యలో ఉన్నారు. మిగతావాళ్లంతా ఈ తరం వాళ్లు, కుర్రకారు . ఓ పెద్ద హీరో కమర్షియల్ సినిమా లెవల్లో వాళ్లు ఆసాంతం దీన్ని ఎంజాయ్ చేశారు
ఈ మధ్యకాలంలో క్రీడా నేపథ్యంలో వచ్చిన సినిమాల్లో ఇది మొదటి స్థాయిలో ఉంటుంది. ఈ సినిమా గురించి ఇంకా కొంత చెప్పటానికి ముందు ఒక మాట చెప్పాలి. ఇంతవరకు నేను చూసిన ఇలాంటి సినిమాల్లో (ధోని, ఇక్బాల్, అజర్, లగాన్, జెర్సీ, మజిలీ, గోల్కొండ హైస్కూల్, కౌసల్య, మజిలీ, లాంటివి అన్నమాట. అందులో మొదటి మూడు బయోపిక్ లు) నాకు ఇది బాగా నచ్చింది. నాతో పాటు చాలా మందికి ఇదే బాగా నచ్చి ఉండొచ్చు.
ఎన్నో సినిమా రివ్యూలు రాసిన నాకు(దాదాపు అందరూ రివ్యూ రైటర్స్ కి) ఒక సినిమా చూసేటప్పుడు నాకు తెలియకుండానే కొంత వరకు రివ్యూయాంగిల్ లోనే సినిమాలు చూస్తాను. ఒక సాధారణ ప్రేక్షకుడి లాగా ఎంజాయ్ చేయలేను. అయితే ఈ సినిమాలో నేను పూర్తిగా మునిగి పోయి ఆస్వాదించాను. క్రికెట్ నాకిష్టమైన ఆట కాబట్టి కొంత వరకు కారణం అయి ఉండొచ్చు కానీ, నేను సినిమా లో పూర్తిగా నిమగ్నమై పోవటానికి చాల అంశాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.
కథ భారత కెప్టెన్ కపిల్ దేవ్ బయోపిక్ అని అందరికీ తెలిసిందే. ముగింపు కూడా అందరికి తెలిసిందే. అయినప్పటికీ కథనం బాగుండడం వల్ల సినిమా అందరూ చూడగలిగే స్థాయిలో ఉంది.
ఈ సినిమా కోసం కబీర్ ఖాన్ బృందం చాలా పరిశోధన చేసింది. అందువల్ల ప్రతిదీ డీటెయిల్ గా చూపించగలిగారు. వారి కష్టం వృధా పోలేదు చాలా సన్నివేశాలు నిజంగా జరిగినవే. అలాగే భారత జట్టు సభ్యుల మధ్య జరిగే సంభాషణలు, ఇతర జట్ల సభ్యులతో జరిగే సంభాషణలు కూడా. దాంతో సినిమాకు క్రెడిబిలిటీ పెరిగింది.
ఈ సినిమాకు ఉన్న మరో బలం రన్వీర్ సింగ్. కపిల్ దేవ్ లాంటి పాత్ర పోషించడం అలాంటి హీరోకి కొంచెం కష్టమే. అయితే రన్వీర్ సింగ్. తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. అతను కూడా ఈ పాత్ర కోసం చాలా కష్టపడ్డాడు అని తెలుసు. అతని కష్టం కూడా వృధా పోలేదు. తన నటనతో సినిమాను చాలావరకు నడిపించాడు. అలాగే కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్రలో నటించిన తమిళ నటుడు జీవా కూడా శ్రీకాంత్ పాత్రను సమర్థంతంగా పోషించాడు.
ఫోటోగ్రఫీ ఈ సినిమాకు జీవం పోసింది. సినిమా చూసే ప్రేక్షకులు మైదానంలో ప్రేక్షకులు అయ్యేలా చేసింది. మ్యాచ్ ల కవరేజ్ లో ఫోటోగ్రఫీ ఉన్నత స్థాయిలో ఉండడం సినిమాకున్న మరో బలం.
ఈ సినిమా నటీనటుల ఎంపికలో విజయం సాధించింది. భారత జట్టు సభ్యులే కాకుండా, ఇతర జట్టు సభ్యుల ఎంపిక కూడా చాలా జాగ్రత్తగా చేసినట్టు అనిపిస్తుంది. ఈ ఘనత కాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ దే.
కొన్ని సన్నివేశాలు, డైలాగులు ప్రేక్షకుల్లో భావోద్వేగాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా భారత జట్టు మేనేజర్ మాన్ సింగ్ (పంకజ్ త్రిపాఠి) లార్డ్స్ మైదానంలో ప్రవేశానికి విఐపి పాస్ కోరినప్పుడు, అక్కడ అధికారి ” భారత జట్టు ఫైనల్స్ కు చేరినప్పుడు ఇస్తాను” అని వ్యంగ్యంగా చెప్పడం, బాధపడి బయటికి వచ్చిన మాన్ సింగ్ కెప్టెన్ కపిల్ దేవ్ తో ” మనం స్వాతంత్రం సంపాదించాం. ఇప్పుడు గౌరవాన్ని సంపాదించుకోవాలి” అని చెప్పడం బాగుంది.
ఈ సినిమాలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. అందులో ఒకటి సినిమా నిడివి. మ్యాచులు చూపించేటప్పుడు చాలా భాగం ప్రేక్షకుల స్పందనని చూపించడం వల్ల ఆటగాళ్ళ ఉద్వేగాలను, ఆటను కొంత తక్కువ సమయం మాత్రమే చూపించారు. ఇలాంటి చిన్న చిన్నవి కొన్ని ఉన్నాయి. అయితే వాటిని మరిపించి సినిమాని ఆస్వాదించగలిగే విధంగా తీయటం ఈ సినిమా కు ప్లస్ పాయింట్.
ఈ పాత్ర పోషించిన రన్వీర్ సింగ్ కూడా ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ లో భావోద్వేగానికి లోనయ్యాడు ఈ సినిమా చూసిన ప్రేక్షకులు చాలామంది భావోద్వేగానికి లోనైన కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు అని వార్తలు వస్తున్నాయి.
సినిమా చివర్లో ఒక పత్రికా విలేకరి తో కలిసి స్టేడియం కు వచ్చిన వాంఖడే (ఈయన పేరు మీదనే ముంబై లో వాంఖడే స్టేడియం ఉంది) భారత జట్టు పరిస్థితి చూసి ” మీటర్ ఆన్ లోనే ఉంచు. ఇప్పుడే వస్తాం. ఇండియా ఎలాగూ ఓడిపోతుంది” అని డ్రైవర్ కు చెప్పి లోపలికి వెళతాడు. భారత జట్టు గెల్చిన తర్వాత బయటికి వచ్చి టాక్సీ మీటర్ ఎంతయ్యింది అని అడిగితే, డ్రైవర్ 300 పౌండ్లు అని చెప్తాడు ! అప్పుడు వాంఖడే నవ్వి “Its worth it”అని డబ్బులు ఇచ్చేస్తాడు. ఓ వందో, రెండొందలో పెట్టి టికెట్ కొన్న వాళ్ళు కూడా సినిమా చూసిన తర్వాత అలాగే అనుకుంటారు. అదే సినిమా సాధించిన విజయం.
(సలీమ్ బాషా, స్పోర్ట్స్ జర్నలిస్టు, పర్సనాలిటి డెవెలప్ మెంట్ కోచ్(