మానవ హక్కులు, ప్రజాస్వామ్యం ఎక్కడ?
(చలసాని నరేంద్ర)
ఇటీవల, జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) 28వ వ్యవస్థాపక దినోత్సవంలో మాట్లాడుతూ, హక్కులను చూసే రాజకీయ కోణం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ఎత్తి చూపడం సరైనదే. ఆ విధంగా, తన ప్రభుత్వం మానవ హక్కుల ‘రక్షణ’ కంటే ‘రాజకీయ ప్రభావం’పైనే ఎక్కువ శ్రద్ధ చూపుతోందని ఆయన స్పష్టం చేసిన్నట్లయింది.
Human rights are grossly violated when they are viewed with a political color, through a political lens, and with an eye on political loss and gains. Such selective behavior is equally harmful to democracy. We find that some people try to tarnish the image of the country in the name of human rights violations through their selective behaviour. The country also has to be careful with such people.
(source: narendramodi.in)
యాదృచ్ఛికంగా, అదే సందర్భంలో, మానవ హక్కుల పరిరక్షణ, ప్రోత్సాహానికి సంబంధించిన ప్రధాన జాతీయ యంత్రాంగానికి నాయకత్వం వహిస్తున్న ఎన్‌హెచ్‌ఆర్‌సి చైర్‌పర్సన్ అరుణ్ కుమార్ మిశ్రా, మానవ హక్కుల పరిరక్షణపై దేశానికి హామీ ఇవ్వడం కంటే మోదీ పాలనను ప్రశంసించడం పట్ల ఆసక్తి చూపారు.
అంతకు ముందు, సెప్టెంబరు, 2021 చివరి వారంలో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగిస్తూ భారతదేశాన్ని “అన్ని ప్రజాస్వామ్యాలకు తల్లి” (“India is proud to be known to be the mother of democracy.)”అని ప్రధాని పేర్కొన్నారు. ప్రపంచంలో ప్రజాస్వామ్య వ్యవస్థకు భారత్ ను ఒక స్ఫూర్తిగా చూపే ప్రయత్నం చేశారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో సాధారణ ప్రజల మానవహక్కులు హామీ ఇవ్వడం అత్యవసరం. నిరంకుశ వ్యవస్థలలో అటువంటి పరిస్థితులను ఉహింపలేము. సాధారణ ప్రజలు ఏమోగానీ కీలక స్థానాలలో ఉన్నవారు సహితం హక్కుల ఉల్లంఘన జరిగితే నిస్సహాయంగా మిగలవలసి వస్తుంది.
“All Human, All Equal” is this year’s slogan for Human Rights Day.
అందుకు తాజా ఉదాహరణ మన నరసాపురం లోక్‌సభ సభ్యుడు రఘురామకృష్ణరాజు మనముందున్నారు. తనను ఏపీ సిఐడి పోలీసులు `అక్రమంగా’ అరెస్ట్ చేసి, చిత్రహింసలకు గురిచేశారని, భౌతికంగా తనను హింసించారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. బహుశా స్వతంత్ర భారత దేశంలో మరే పార్లమెంట్ సభ్యుడు అటువంటి ఆరోపణలు చేసి ఉండరు.
హైకోర్టు జోక్యం చేసుకొని, బెయిల్ ఇవ్వడంతో ఆయన జైలు నుండి బైటకొచ్చినా, చిత్రహింసలకు గురిచేసిన్నట్లు భారత రాష్ట్ర పతి, ప్రధాన మంత్రి, కేంద్ర హోమ్ మంత్రి, లోక్‌సభ స్పీకర్ లతో పాటు తన ఆవేదనను వ్యక్తం చేస్తూ వ్యక్తిగతంగా ఫిర్యాదులు చేశారు. అయితే ఆరునెలలు దాటుతున్నా ఇప్పటివరకు ఎవ్వరు ఆయన ఫిర్యాదులపై ఎటువంటి చర్య తీసుకోలేదు. కనీసం లోక్ సభలో హక్కుల ఉల్లంఘన కింద ప్రస్తావించే అవకాశం కూడా ఇవ్వలేదు.
ఒక పార్లమెంట్ సభ్యుడి పరిస్థితి ఈ విధంగా ఉంటే, ఇక సాధారణ పౌరుల గోడు పట్టించుకొనేవారెవ్వరు? ఈ మధ్యనే నాగాలాండ్ లో భద్రతా దళాల తూటాలకు సాధారణ పౌరులు అనవసరంగా బలయ్యారు. ఈ సంఘటనపై అమిత్ షా విచారం వ్యక్తం చేయడం తప్పా కఠినంగా మాట్లాడలేక పోయారు. ఈ సంఘటనతో జమ్మూ, కాశ్మీర్ తో పాటు ఈశాన్య రాష్ట్రాల ప్రజల పాలిట అశనిపాతంగా మారిన సాయుధదళాల ప్రత్యేక అధికారాల చట్టం (AFSPA) మరోసారి చర్చనీయాంశం అవుతున్నది.
తాత్కాలిక చర్యగా 1950వ దశకంలో వచ్చిన ఈ చట్టం శాశ్వతరూపం సంతరింప చేసుకొంది. ప్రజాస్వామ్య దేశాలలోనే అత్యంత నిరంకుశ చట్టంగా దీనిని పేర్కొనవచ్చు. ఈ చట్టం కారణంగా సాయుధదళాలకు అపరిమిత అధికారాలు లభిస్తున్నాయి. వారు ఎటువంటి దుశ్చర్యలకు పాలపడిన – అకారణంగా పౌరులను కాల్చి చంపినా, వారిని అదుపులోకి తీసుకొన్నా, వారి ఇళ్లలో సోదాలు జరిపినా న్యాయస్థానాలు ఏవీ ప్రశ్నించలేవు.
ఈ చట్టం కారణంగా సాధారణ ప్రజలు దారుణమైన హక్కుల ఉల్లంఘనలకు గురవుతున్నరని అంటూ ప్రస్తుతం కేంద్రంలో కీలక మంత్రిగా ఉన్న ఒకరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక ఆంగ్ల పత్రికలో వ్యాసం వ్రాసారు. కనీసం ఈ చట్టాన్ని ఒకసారి సమీక జరిపమని సుప్రీం కోర్ట్ సూచించినా కేంద్ర ప్రభుత్వం సాహసం చేయలేక పోతున్నది.
పాకిస్థాన్ వంటి దేశాలలో ప్రభుత్వాలు సైన్యం చేతిలో కీలుబొమ్మలని అంటుంటాము. కానీ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో కేవలం ప్రభుత్వాలు సైన్యాన్ని ప్రశ్నించే సాహసం చేయలేక పోతున్నాయి.
ఒక దేశద్రోహం (Sedition) నిబంధనలు ఏవిధంగా దుర్వినియోగం అవుతున్నాయో చూస్తున్నాము. కేవలం ప్రభుత్వ చర్యలను విమర్శించారని జర్నలిస్టులు, రచయితలు వంటి వారిని సహితం అరెస్ట్ చేస్తున్నారు. ఆ విధంగా అరెస్ట్ చేసిన వారిపై ఎటువంటి నేరారోపణ చేసి, కోర్ట్ లలో విచారణకు ప్రభుత్వాలు సాహసింపడం లేదు. సోషల్ మీడియా పోస్టింగ్ లకు కూడా అరెస్టులు జరుగుతున్నాయి. చట్టంలోలేని అధికారాలను ప్రభుత్వాలు నిరాటంకంగా పొందుతున్నాయి.
ప్రజాస్వామ్యం అంటే భిన్నాభిప్రాయాలను ఎటువంటి భయం లేకుండా చర్చింప గలగడం. కానీ మన చట్టసభలలో ఫలవంతమైన చర్చలు జరగడం లేదు. వ్యూహాత్మకంగా చర్చలకు అవకాశం లేకుండా క్షణాలలో కీలకమైన చట్టాలను ఆమోదిస్తున్నారు. సహజంగానే అటువంటి చట్టాల పట్ల నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.
ఆ విధంగా కీలకమైన వ్యవసాయ చట్టాలను తీసుకు రావడం వల్లననే సంవత్సరకాలం పాటు రైతుల నిరసనలు ఎదురయ్యాయి. దానితో ప్రభుత్వం వెనుకడుగు వేసి ఆ చట్టాలను రద్దు చేసినా, కేవలం లోక్ సభలో మూడు నిముషాలలో, రాజ్యసభలో ఐదు నిముషాలలో వాటిని రద్దు చేశారు. ఎందుకు చట్టాలు చేశారు? ఎందుకు రద్దు చేస్తున్నారు? అని చర్చించే అవకాశం ఇవ్వడం లేదు.
జవహర్ లాల్ నెహ్రు కాలంలో అధికార పక్షం సభ్యులే ప్రభుత్వ చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడేవారు. మంత్రులే అసమ్మతి వ్యక్తం చేసేవారు. అటువంటి వారందరు అరమరికలు లేకుండా పార్లమెంట్ లో సుదీర్ఘంగా చర్చలు జరుపుతూ ఉండేవారు. కానీ నేడు అర్ధవంతమైన చర్చల పట్ల ఎవ్వరు ఆసక్తి చూపడం లేదు. హక్కుల ఉల్లంఘనకు ఇక్కడనే బీజం పడుతున్నది.
ఇక ప్రజల హక్కులను కాపాడటం కోసం మనదేశంలో ఉన్నన్ని కమీషన్ లు ప్రపంచంలో మరెక్కడా లేవు. 9 జాతీయ కమీషన్ లతో పాటు సమాచార కమీషన్లు, రాష్ట్ర స్థాయి కమీషన్లు వంటివి మొత్తం 180 వరకు ఉన్నాయి. అయితే ఇవ్వన్నీ రాజకీయ సర్దుబాట్ల కోసం పదవుల పంపిణీకి ఆలంబనగా ఉంటున్నాయి తప్పా, హక్కుల పరిరక్షణలో తగు శ్రద్ద చూపలేక పోతున్నాయి.
భారత దేశం ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జరిగిన చిత్రహింసల వ్యతిరేక సదస్సుకు సంతకం చేసి సుమారు రెండు దశాబ్దాలు అవుతుంది. కానీ ఇప్పటి వరకు చిత్రహింసల నిరోధక చట్టాన్ని మన పార్లమెంట్ ఆమోదింపనే లేదు. అటువంటి చట్టం పట్ల ప్రభుత్వాలు ఆసక్తి ప్రదర్షించడం లేదు.
మానవహక్కుల కమీషన్ లలో 80 శాతంకు పైగా ఫిర్యాదులు పోలీసుల మితిమీరిన ప్రవర్తన గురించే ఉంటాయి. కానీ అటువంటి కమీషన్ ల సభ్యులుగా రిటైర్డ్ ఐపీఎస్ అధికారులను నియమించడం హక్కుల పరిరక్షణకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? పోలీస్ సంస్కరణల గురించి సుప్రీం కోర్ట్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి కూడా సుమారు రెండు దశాబ్దాలు అవుతుంది. ఈ దిశలో సహితం రాష్ట్ర ప్రభుత్వాలు ఆసక్తి కనబరచడం లేదు.
(ఇందులో వ్యక్తం చేసిన అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)