అమరావతి పాదయాత్రకు అనుమతి ఇవ్వరా?

 

‘డీజీపీ గారు, మనది ప్రజాస్వామ్య వ్యవస్థే కదా!

(టి.లక్ష్మీనారాయణ)
న్యాయస్థానం విచారణలో ఉన్న సమస్యపై ఉద్యమం చేయడం నేరమా? “అమరావతి రాజధాని పరిరక్షణ” కోసం దాదాపు రెండు సంవత్సరాలుగా సాగుతున్న ఉద్యమం శాంతియుతంగానే నిర్వహించబడుతున్నది కదా? అలుపెరగని ఆ ఉద్యమంలో అంతర్భాగంగా ఒక పోరాట రూపంగా “న్యాయస్థానం నుండి దేవస్థానం” అన్న నినాదంతో పాదయాత్ర నిర్వహించుకోవడానికి అమరావతి రాజధాని పరిరక్షణ సమితి మీ అనుమతి కోసం దరఖాస్తు చేస్తే అసంబద్ధమైన కారణాలతో అనుమతి నిరాకరించడం సమంజసమేనా?
కోవిడ్ నిబంధనలు అమలులో ఉన్నాయి, వాటిని ఉద్యమ నిర్వాహకులు అమలు చేయలేరన్న నిర్ధారణకు మీకు వచ్చి, అనుమతి నిరాకరణకు ఒక కారణంగా చూపెట్టారు. అంత వరకు ప్రజలు అర్థం చేరుకొంటారు. ఆ విషయంలో నిర్వాహకులు పటిష్టమైన చర్యలు తీసుకొని కోవిడ్ నిబంధనలను పాటించమని షరతు విధిస్తే సరిపోతుంది కదా!
దేశంలో పలు ఎన్నికలు జరిగాయి. మన రాష్ట్రంలో కూడా తిరుపతి లోక్ సభ స్థానానికి ఉపఎన్నిక, స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. బద్వేల్ శాసనసభ స్థానానికి ఉపఎన్నిక జరగబోతున్నది. ఎన్నికలు జరగని స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే సన్నాహాల్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉన్నదని మీరే ప్రస్తావించారు. రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు పలు సమస్యలపై ఆందోళనలు చేస్తున్నారు. ర్యాలీలు, భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూనే ఉన్నారు. వాటన్నింటికీలేని అభ్యంతరం అమరావతి ఉద్యమకారుల పాద యాత్రకు మాత్రమే ఎందుకు? పొరుగు రాష్ట్రం తెలంగాణలో శ్రీమతి షర్మిల పాదయాత్రకు అక్కడి ప్రభుత్వం అభ్యంతరం చెప్పలేదే!
మీరు కోవిడ్ నిబంధనల వరకే పరిమితం కాకుండా మరికొన్ని అంశాలను కూడా ప్రస్తావించారు. మూడు రాజధానుల అంశం న్యాయస్థానం పరిథిలో ఉన్నదని, దాని మీద ఆందోళనకు అనుమతించడం వీలుకాదన్న ధోరణితో మరొక ప్రస్తావన చేశారు. న్యాయస్థానంలో విచారణ జరుగుతున్న సమస్యపై ఆందోళన, ఉద్యమం చేయకూడదని మన రాజ్యాంగం, చట్టాల్లో ఉన్నదా?
రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన మూడు రాజధానుల విధానానికి వ్యతిరేకంగా పాదయాత్ర నిర్వహిస్తే ప్రాంతీయ తగాదాలు పెచ్చరిల్లే ప్రమాదం ఉందని మీరు పేర్కొనడం తీవ్ర అభ్యంతరకరం. ఒకవైపున ఈ అంశం న్యాయస్థానం పరిథిలో ఉన్నదని చెబుతూనే ఆ సమస్యపై ఉద్యమకారులు పాదయాత్ర చేస్తే ప్రజల మధ్య శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉన్నదని డీజీపీగా మీరు ప్రస్తావించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
మన రాష్ట్ర రాజధాని అమరావతి అని శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసినప్పుడు రాష్ట్రంలో ఎక్కడైనా ఒక చిన్న నిరసన ఆందోళన జరిగిందా? అంటే రాష్ట్ర ప్రజలందరూ శాసనసభ తీర్మానాన్ని స్వాగతించారనే కదా!
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న అప్రజాస్వామిక నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజలు శాంతియుతంగా ఉద్యమం చేసే హక్కు ఉన్నది. ఆ హక్కును రాష్ట్ర ప్రజలు సంపూర్ణంగా బలపరుస్తున్నారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థపై ఉన్నది. అలా అని శాంతియుత ఉద్యమాలకు అనుమతించం అంటే అది రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమే అవుతుంది.
మీరు మరొక ప్రస్తావన కూడా చేశారు. పాదయాత్ర మార్గంలో ఉన్న గ్రామాల్లో, పట్టణాల్లో వివిధ రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఘర్షణలకు అవకాశం ఉంటుందన్న అనుమానాన్ని కూడా వ్యక్తం చేశారు. మనది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, బహుళ పార్టీ వ్యవస్థ. వివిధ రాజకీయ పార్టీలు ఉంటాయి. ఎవరి రాజకీయ విధానాలు, సిద్దాంతాలు వారికి ఉంటాయి. భిన్నాభిప్రాయాలు ఉంటాయి. అంత మాత్రాన శాంతి భద్రతలకు భంగం కలిగించేలా తగాదాలు పడతాయా? ఒకవేళ ఎక్కడైనా ఒక ఘటన జరిగే అవకాశం ఉన్నదనుకొంటే దాన్ని నివారించడానికి పోలీసు వ్యవస్థ నివారణా చర్యలు తీసుకోవచ్చు. అంతేగానీ ప్రజాస్వామిక హక్కుకు భంగం కలిగిస్తారా!
తిరుమలలో రాజకీయ కార్యకలాపాలు నిషిద్ధమని పేర్కొన్నారు. నిజం. పాదయాత్ర ముగింపు సందర్భంగా తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించాలని నిర్వాహకులు తలపెట్టారేగానీ తిరుమలలో కాదని భావిస్తున్నాను. కావాలంటే దానిపై అమరావతి పరిరక్షణ కమిటీ నుండి స్పష్టత తీసుకోవచ్చు. పాదయాత్రలో పాల్గొన్న వారిలో దేవునిపై భక్తి విశ్వాసాలున్న వారు తిరుమలకు వెళ్ళి మొక్కు చెల్లించుకోవచ్చు. దానికి అభ్యంతరం లేదు కదా!
టి.లక్ష్మీనారాయణ
సామాజిక ఉద్యమకారుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *