ఆ హత్య దర్యాప్తు తీరుపై స్పందన ఏదీ?

బాబాయిని చంపిందెవరు – రాష్ట్రమంతా బాబాయిని చంపింది ఇంటిదొంగలే అని కోడై కూస్తున్నదని, దీనిపై సిబిఐ తీరు భిన్నంగా ఉందని దీనిపై మీ అభిప్రాయమేమిటని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి  వర్ల రామయ్య  ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డికి  బహిరంగ లేఖ రాశారు.

ఆ లేఖ వివరాలు:

సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం తెలతెల్లవారుజామున గొడ్డలితోటి, మారణాయుధాలతోటి మీ బాబాయి… వైఎస్ వివేకానంద రెడ్డి గారు పులివెందుల స్వగృహంలో దారుణహత్యకు గురైతే ఆ వార్తను, ఆ శవాన్ని ఎన్ని మార్పులు చేశారు? ఎన్ని వైపులు తిప్పారు? పత్రికలకు ఏ రకంగా మార్చి మార్చి చెప్పారో మీకు తెలుసు. ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా మీరు ఈ కేసులో సిబిఐని దర్యాప్తు నిజం కాదా? చంద్రబాబు గారు, ఆయన కుమారుడు లోకేష్,

ఆదినారాయణరెడ్డిగారు తదితరులు ఈ హత్యకు కారణమని మీరు, మీ అంతేవాసులు ఉద్ఘాటించింది నిజం కాదా? సిబిఐ దర్యాప్తు కోరుతూ సాక్షాత్తు మీరే హైకోర్టులో పిటిషన్ వేశారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పిటిషన్ ను మీరు వెనక్కి తీసుకున్నారు. ఆ మతలబేంటి ముఖ్యమంత్రి గారూ? దీనిపై సిబిఐ మిమ్మల్ని విచారణ చేసిందా? ఎప్పుడు, ఎక్కడ, ఏరోజు?
ఇంటిదొంగలు బయటపడతారేమో, సొంతమనుషులను అరెస్ట్ చేస్తారేమోనని మీరెన్నో నిద్రలేని రాత్రులు గడిపినట్లుగా పబ్లిక్ టాక్ ఉంది నిజమేనా? మీ బాబాయ్ హత్యకేసు దర్యాప్తు పైన, దర్యాప్తు సరిగా సాగడం లేదని మీ కుటుంబం రెండుగా చీలిపోయింది నిజమేనా? మీరు, మీ శ్రీమతి గారు ఒకవైపు, మీ తల్లి, మీ చెల్లి ఒకవైపు అని పులివెందులలో ఇప్పటికీ అనుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో సిబిఐ ఎవరినో నలుగురిని అరెస్ట్ చేసి తూతూమంత్రంగా చార్జిషీటు వేస్తే ఆ దర్యాప్తు, ఆ చార్జిషీటుతో మీరు ఏకీభవిస్తున్నారా? ఈ చార్జిషీటుతో ఇంటిదొంగలు రక్షింపబడినట్లేనా? ఈ సమాధానాలన్నీ రాష్ట్రప్రజలకు మీరే తెలియజేయాలి. అడుగడుగునా ఈ హత్య కేసులో ఇంటిదొంగల వైపు అందరి వేళ్లూ చూపెట్టబడినప్పుడు మీరు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత మీ భుజస్కంధాలపై ఉంది.

సిబిఐ కూడా ఈ హత్య దర్యాప్తును ప్రతిష్టాత్మకంగా తీసుకోకుండా తూతూమంత్రంగా చేయడం సరైంది కాదు. భారతదేశ వ్యాప్తంగా అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సిబిఐ ఎవరి ప్రలోభాలకో లొంగి తమ ఔన్నత్యాన్ని ఫణంగా పెట్టకూడదనేది రాష్ట్రప్రజల అభిప్రాయం. సిబిఐ చేసిన దర్యాప్తు అడుగడుగునా రాష్ట్రప్రజల ముందుంచాల్సింది. ముద్దాయిలను అరెస్ట్ చేసినపుడు వారి వివరాలు, ఈ హత్యలో వారి పాత్ర, ప్రేరేపించిన పెద్దల పేర్లు, అడుగడుగునా రాష్ట్రప్రజల ముందుంచాల్సింది. ప్రతి ప్రభుత్వ ఏజన్సీ పారదర్శకంగా ఉండి వారి చర్యలు ప్రజలకు అడుగడుగునా తేటతెల్లం చేయాల్సిన బాధ్యత సిబిఐ పై కూడా ఉంది. రహస్యంగా ఎవరిపైనో చార్జిషీటు వేశాం, పెట్టాబేడా సర్దుకొని వెళ్లిపోతామంటే రాష్ట్రప్రజలను కించపర్చినట్లే. ప్రస్తుత సిబిఐ డైరక్టర్ మంచి కార్యదక్షత, నీతి,నిజాయితీలు గల అధికారి. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రజాభిప్రాయాన్ని గౌరవించి సౌమ్యుడు, పెద్దమనిషి, అజాతశత్రువు అయిన మీ బాబాయ్ హత్య కేసు సవివరంగా దర్యాప్తు చేసి అసలు ముద్దాయిలను పట్టుకోవాలని మీరు డిమాండ్ చేయాలని కోరుతున్నాము. మీరు సంపూర్ణ విచారణకు ఆదేశించమని కేంద్రాన్ని కోరకపోతే అసలు దొంగలెవరో అదృశ్యంగానే ఉండే ప్రమాదముంది.

ధన్యవాదములతో…
ఇట్లు
తమ విధేయులు
వర్ల రామయ్య
జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు
పొలిట్ బ్యూరో సభ్యులు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *