కేబినెట్ మంత్రి హోదాలో నియామకం
అమరావతి: రేడియేషన్ ఆంకాలజిస్టుల్లో అత్యంత అనుభవజ్ఞడు, ప్రఖ్యాత వైద్యుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సలహాదారుగా నియమితులయ్యారు. నాలుగు రోజులు కిందట ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలుసుకున్న సంగతి తెలిసిందే. ఒక ప్రఖ్యాత డాక్టర్ రాష్ట్రానికి సలహాదారుకావడం ఇది రెండో సారి.మొదటి సారి ప్రముఖ్య హృద్రోగ నిపుణుడు డాక్టర్ శ్రీనాథ్ రెడ్డిని గత ఏడాది మార్చిలో సలహా దారుగా నియమించారు. శ్రీనాథ్ రెడ్డి గతంలో ఢిల్లీలోని ఎయిమ్స్ లో కార్డియాలజీ విభాగాధిపతి గా పనిచేశారు. అనేక రాష్ట్రాలకు ఆయన పబ్లిక్ హెల్త్ సలహాదారుగా ఉన్నారు.
ఇపుడు రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ నోరి దత్రాత్రేయడిని సమగ్ర క్యాన్సర్ సంరక్షణ సలహాదారగా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. డాక్టర్ నోరికి న్ని కేబినెట్ హోదా ఉంటుంది. ఆయన రెండు సంవత్సరాలు ఈ పదవిలో ఉంటారు.
మొన్న మంగళవారం నాడు కలుసుకున్నపుడు క్యాన్సర్ నివారణ, మెరుగైన చికిత్సలో సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వానికి సలహాదారుగా ఉండాలని డాక్టర్ నోరిని ముఖ్యమంత్రి కోరారు.
రేడియేషన్ ఆంకాలజీలో డాక్టర్ నోరి దత్తాత్రేయుడుకు 43 ఏళ్ల అనుభవం ఉంది. బ్రెస్ట్ సెంటర్, గైనకాలజిక్ ఆంకాలజీ, హెడ్, మెడ, న్యూరో ఆంకాలజీ, థొరాసిక్ ప్రోగ్రాంల కోసం కొత్త టెక్నాలజీ, అడ్వాన్స్డ్ టెక్నిక్లను అభివృద్ధి చేయడంలో ఆయన కీలకపాత్ర పోషించారు.
2019లో ఆయన అపోలో హాస్పిటల్స్ కు ఇంటర్నేషనల్ డైరెక్టర్ గా నియమితులయ్యారు. అమెరికా లో ఆయన వైద్య సేవలకు అపారమయిన గుర్తింపు వచ్చింది. అక్కడ అత్యున్నత పురష్కారం ఎలిస్ ఐల్యాండ్ మెడల్ ఆఫ్ ఆనర్ (Ellis Island Medal of Honor) ఆయనకు 2014లో లభించింది. 2017లో ఇండియన్ క్యాన్సర్ కాంగ్రెస్ ఆయనను లివింగ్ లెజెండ్ ఇన్ క్యాన్సర్ (Living Legen in Cancer Care) పురష్కారంతో సత్కరించింది. క్యాన్సర్ చికిత్సలో ఆయన ఎన్నో కొత్త విధానాలు రూపొందించారు. అంతేకాదు, వాటిని భారతదేశంలో అల్పాదాయ వర్గాలకు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేశారు.
న్యూయార్క్ హాస్పిటల్ క్వీన్స్‌లో ఆంకాలజీ విభాగంలో ఆయన పనిచేశారు. వైద్యరంగంలో ఆయన చేసిన కృషికి 2015లో పద్మశ్రీ అవార్డు పొందారు.