ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పదోన్నతుల కోసం అసోషియేట్ ప్రొఫెసర్లు ఏళ్ళ తరబడి ఎదురు చూస్తున్నారు. ఆ ప్రక్రియ ఎట్టకేలకు చేపట్టారు. మంచిదే. కానీ, లోపభూయిష్టమైన నిర్ణయాల వల్ల ఖాళీలన్నీ భర్తీ కావడం లేదు. “సీనియారిటీ” ప్రాతిపదికన అర్హుల జాబితాను రూపొందించారు. “స్క్రీనింగ్ కమిటీ” ఆ జాబితా మొత్తాన్ని ఆమోదించకుండా ఆ కమిటీ సమావేశం నాటికి ఉన్న ఖాళీల సంఖ్య మేరకే ఆమోదించింది. తర్వాత మరికొందరు ప్రొఫెసర్లు రిటైర్ కావడంతో ఖాళీల సంఖ్య పెరిగింది.
పదోన్నతుల ప్రక్రియ మొదలయ్యే నాటికి ఖాళీల సంఖ్య ఎక్కువ, పదోన్నతులకు “స్క్రీనింగ్ కమిటీ” ఆమోదం పొందిన వారి సంఖ్య తక్కువ. దానికి తోడు, పదోన్నతుల కోసం నిర్వహించిన ఇంటర్యూలకు హాజరైన అసోషియేట్ ప్రొఫెసర్లలో కొందరు తమకు అనుకూలమైన కాలేజీలో పోస్టింగ్ లభించక పోవడంతో పదోన్నతి అవకాశాన్ని వదులుకొన్నారు. పర్యవసానంగా ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులన్నీ భర్తీ కాలేదు. వాటిని భర్తీ చేయడానికి ప్రభుత్వం మళ్ళీ ప్రక్రియ ఎప్పుడు చేపడుతుందో! పదోన్నతులకు అర్హులైన అసోషియేట్ ప్రొఫెసర్లు ఇంకెన్నేళ్ళు నిరాశగా ఎదురుచూడాలో!
అసోషియేట్ ప్రొఫెసర్లకు పదోన్నతులు లభిస్తే తప్ప అసిస్టెంట్ ప్రొఫెసర్లకు పదోన్నతులు లభించవు. ఖాళీల ప్రాతిపదికన పదోన్నతులు ఇచ్చే విధానమే లోపభూయిష్టమైనది. తాము పనిచేస్తున్న డిపార్టుమెంట్ లో ఖాళీ ఏర్పడకపోతే సర్వీసు మొత్తంలో ఒక్క పదోన్నతి కూడా లేకుండా “రిటైర్” అయిన వారు ఎంతో మంది ఉన్నారు. ఒకేసారి ఉద్యోగంలో చేరిన వారిలో కొందరేమో ముందుగానే పదోన్నతులు పొందుతున్నారు, కొందరికేమో ఆ అవకాశం లభించక వివక్షతకు గురౌతున్నారు. విశ్వవిద్యాలయాల్లో ఈ తరహా లోపభూయిష్టమైన విధానాన్ని అమలు చేయడం లేదు. సర్వీసును బట్టీ “ఆటోమేటిక్ ప్రమోషన్స్” విధానం అమలులో ఉన్నది.
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో నిబంధనల మేరకు ఉండాల్సిన అసిస్టెంట్ ప్రొఫెసర్లు/అసోషియేట్ ప్రొఫెసర్లు/ప్రొఫెసర్లు ఉండడం లేదు. కొందరు “డెప్యుటేషన్స్” మీద వారికి సౌలభ్యంగా ఉన్న చోటికి బదిలీ చేయించుకొని, అధ్యాపకులుగా పని చేయాల్సిన వారు అధ్యాపకేతర ఉద్యోగాలు చేస్తున్నారు. జీతం మాత్రం వైద్య కళాశాలల నుండే పొందుతుంటారు.
ఆ ప్రొఫెసర్/అసోషియేట్ ప్రొఫెసర్/అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు సాంకేతికంగా ఖాళీగా లేనట్లే, అందువల్ల, ఆ పోస్టుల్లో ఎవరినీ కొత్తగా నియమించడానికి వీల్లేదు. పర్యవసానంగా వైద్య విద్యా బోధనకు నిబంధనలకు సరిపడా అధ్యాపకులు, ఆచార్యులు ఉండరు. పనిచేస్తున్న అధ్యాపకులపై పని భారం పడుతుంది, వత్తిడికి గురౌతుంటారు. ఆ మేరకు విద్యార్థులు నష్టపోతుంటారు. కానీ, సమస్య ఎవరికీ పట్టదు. మౌలిక సమస్యలు, నిధుల కొరతతో పాటు అధ్యాపకుల కొరతతో నడుస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాలల్లో విద్యా ప్రమాణాలేలా మెరుగౌతాయి?
-టి.లక్ష్మీ నారాయణ కన్వీనర్, ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక