(మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి)
ఆశయం సమాజాన్ని ముందుకు నడుపుతుంది విన్నాను – ఆశయం మనిషిని బ్రతికిస్తుందని Dr MV రమణారెడ్డి గారి ద్వారా తెలుసుకున్నాను.
రమణారెడ్డి లివింగ్ లెజెండరీ. రాయలసీమ కోసం నిత్యం పరితపించే ఉద్యమ నేత. సీమ నీటి సమస్య పరిష్కారం కోసం అలుపెరుగని పోరాట యోధుడు. నన్ను బాగా అభిమానించేవారు. రమణారెడ్డి గారు రచించిన ప్రతి పుస్తకం నాకు పంపడమే కాదు ఎలా ఉన్నదని అడుగుతారు. నేను ఈ రోజు నీటి సమస్యకు సంబంధించి కాస్త పరిజ్ఞానం సంపాదించాను అంటే అది రమణారెడ్డి గారు వేసిన పునాది. ఈ మధ్య వారు కడుపు తీపి అనే అనువాద పుస్తకం నాకు పంపారు. అందులో వారు వెలుగు రేఖ పేరుతో తన అభిప్రాయం పుస్తకంలో పంచుకున్నారు. భావోద్వేగంతో కూడిన వారి మాటలు ప్రతిఒక్కరు వినాలసిందే….. ముఖ్యంగా సమాజ మార్పును కోరుకునే వారు…..
“అనువాదమే కావచ్చు కానీ తిరిగి నేను రచనా వ్యాసంగంలో ప్రవేశించెంతగా నా ఆరోగ్యం మెరుగుపడడమే ఒక వింత.
“ఈ సంవత్సరం మొదట్లో ఇక నేను ఎక్కువ రోజులు బ్రతక లేనంత తీవ్రంగా నా జబ్బు ముదిరింది హైదరాబాద్ వరకు తీసుకుపోగలమన్న నమ్మకం లేక నన్ను కర్నూలు ఆస్పత్రిలో చేర్చారు అప్పటికి నేను రాస్తూ వచ్చిన టూకిగా ప్రపంచ చరిత్ర లో 4వ భాగాన్ని ప్రచురించలేకపోతాననే దిగులే తప్ప చనిపోతాననే దిగులు నన్ను సోకలేదు.
“రెండు రోజుల చికిత్స తరువాత నా స్పెషలిస్టు డాక్టరుతో కాదుగూడదని డిశ్చార్జి చేయించుకుని ఇంటికి తిరిగొచ్చాను అప్పటికి గూడా నేను స్వయంగా లేచి కూర్చునే స్థితిలో లేను. కావలసినవారి సహాయంతో కుర్చీలో కూర్చుని కోదవున్న అధ్యాయం వారకు పూరించగలిగానేగాని అనుకున్న ముగింపుకు చేర్చలేకపోయాను.చనిపోయే ముందు ప్రచురితమైన 4వ భాగాన్ని కళ్లతో చూస్తే చాలనే తపనతో , ముగింపుకు మరో మూడు అధ్యాయాలు కొరతగా ఉన్నా దాన్ని ముద్రణకు పంపించాను పదిరోజుల తరువాత వచ్చిన ప్రతిని చూసి నా మనస్సు నిండిపోయింది.”