(వడ్డేపల్లి మల్లేశము)
రాజ్యాంగం మేరకు భారతదేశంలో పార్లమెంటుకు లోక్సభ రాజ్యసభ పేరుతో రెండు సభలు ఉన్నప్పటికీ ప్రత్యక్షంగా ప్రజలతో ఎన్నుకోబడే లోక్సభ సభ్యులు సమర్థులు ,నీతిమంతులు ఉండాలి. అపుడే ఆ పాలన అర్థవంతంగా నే కాకుండా ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రజల పక్షాన పనిచేస్తుంది.
అలాగే రెండవది రాజ్యసభ లేదా ఎగువ సభ. ఇక్కడి సభ్యులు ప్రజలతో ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఎన్నుకోబడతారు .
అయినప్పటికీ పెద్దల సభగా పేరున్న ఈ సభ లోక్సభ చేసిన చర్చలు ఆమోదించిన బిల్లులపై మరొక్కసారి పునరాలోచన చేయడానికి ఉద్దేశించినది .కనుక రాజ్యసభ సభ్యులు కూడా మరింత సమర్థులు నీతిమంతులు అయితే తప్ప పార్లమెంటు చేసే చట్టాలకు నిండు ధనము ఉండదు.
రాజ్యాంగం మేరకు ఈ రెండు సభల సంయుక్త రూపమే పార్లమెంటు. కనుక దేశ ప్రజానీకానికి సంబంధించి దిశానిర్దేశము చేసే అత్యున్నత రాజ్యాంగబద్ధ సంస్థగా విలువలతో కూడిన వ్యవస్థగా దేశ ప్రజానీకానికి ఆదర్శంగా ఉండాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది.
పార్లమెంటు సభ్యుల వ్యక్తిత్వములో పారదర్శకత:
ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ ఎన్ వి రమణ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మాట్లాడుతూ ప్రస్తుత పార్లమెంటు బిల్లుల ఆమోదం, చట్టాల రూపకల్పనలో తొందర పాటుగా వ్యవహరిస్తున్నదని దానివల్ల న్యాయవ్యవస్థపై పెను భారం పడుతుందని చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా జాగ్రత్తగా దేశ ప్రజానీకం పరిశీలించవలసిన అవసరం ఉన్నది.
పార్లమెంటు ఉభయ సభల సభ్యులు వ్యక్తిగత విలువల పరంగా ఎంత పారదర్శకంగా ఉంటే ఆమోదించే బిల్లులు చేసే చట్టాలు అంత అర్థవంతంగా ఉంటాయి.
పార్లమెంటు సభ్యుల యొక్క వ్యక్తిత్వ విలువలను బట్టి సభలో జరిగిన చర్చలు, ప్రజల గురించి చేసే ఆలోచనలు, పాటించే ప్రమాణాలు ఆధారపడి ఉంటాయి. నైతిక విలువలు లేని, నేరాలు ఆరోపించబడిన, ప్రజా జీవితం అంతగా లేని కార్పొరేట్ వ్యక్తులు, పెట్టుబడిదారులు అవినీతిపరులు సభలో ఉంటే నీతివంతమైన పారదర్శక పాలన ఎలా సాధ్యమవుతుంది?
ఈ రకమైన ప్రశ్నలు పౌర సమాజం, ప్రజలు, విభిన్న వర్గాల వారు, ప్రజా సంఘాలు తమకు తాము వేసుకుంటే తప్ప ఈ దేశం యొక్క మనుగడ లేదా గమనము ఏరకంగా ఉందో తెలియదు. ప్రజాస్వామ్య ఉనికి ప్రశ్నార్థకం అవుతుంటే చూస్తూ ఊరుకుంటే చట్టసభలలోని సభ్యులతో పాటు ప్రజలను కూడా నేరస్తులుగా నే పరిగణించవలసి ఉంటుంది.
స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో విద్యావంతులు, న్యాయవాదులు, న్యాయకోవిదులు, మేధావులు చట్టసభల సభ్యులు గా ఉన్నారు .కనుక రాజ్యాంగాన్ని అనుసరించి చక్కటి పాలన అందించిన టువంటి అనుభవాలు మనకు ఉన్నాయి.
రాజ్యాంగంలో పొందుపరిచిన పరిరక్షణ లను కాపాడి ప్రజలకు నీతివంతమైన పాలన అందించాలంటే అభ్యుదయవాదులు, సామాజిక బాధ్యత కలిగిన సభ్యుల వల్లనే సాధ్యమవుతుంది.
నేటి పార్లమెంటు ముఖచిత్రం
ప్రస్తుత పార్లమెంటు లో లోక్ సభ సభ్యుల లోపల 83 శాతం మంది అవినీతిపరులే ఉన్నట్టుగా ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం తన నివేదికలో ఇటీవల పేర్కొనడం ఆందోళన కలిగించే విషయం. ప్రధానంగా లోకసభ సభ్యుల పైన సాగిన ఈ కమిటీ యొక్క అధ్యయనం అనేక చేదు నిజాలను తెలియజేయడం భారత పార్లమెంటు ఏ వైపుగా పయనిస్తుందో హెచ్చరించినట్లు అయింది. అంతేకాకుండా 33 శాతం మంది సభ్యుల పైన క్రిమినల్ కేసులు ఉన్నట్లుగా ప్రకటించిన ఈ కమిటీ 2014లో లోక్సభకు ఎన్నికైన టువంటి 521 మంది సభ్యుల లో 430 మంది అవినీతిపరులు అని తేల్చి చెప్పింది. వీరిలో అత్యధికంగా 227మంది బిజెపి, 37 మంది కాంగ్రెస్, 29 మంది A.I.A.D.M.K పార్టీకి చెందిన వారు ఉన్నట్లు నిర్ధారించింది
. 33 శాతం మంది పై క్రిమినల్ కేసులు నమోదైనట్లు ఎన్నికల సందర్భంగా తమ అఫిడవిట్ల లో నమోదు చేయడాన్ని బట్టి ఈ దేశంలో అవినీతి పరులు ,నేరగాళ్లు కూడా పరిపాలన చేయవచ్చునని తెలుస్తున్నది. ముఖ్యంగా క్రిమినల్ కేసులు నమోదు అయిన వారిలో హత్యాయత్నం కేసులు, హత్య కేసులు, కిడ్నాప్ వంటి భయంకరమైన నేరాలకు పాల్పడిన వారు ఉండడం గమనార్హం.
నేరగాళ్లు అవినీతిపరులు ఏ వర్గాల ప్రయోజనాల కోసం పని చేస్తారో ఊహించిన ప్పుడు నిజాలు చాలా భయంకరంగా ఉంటాయి .
ఇవాళ దేశంలో కొనసాగుతున్నది అదే తంతు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పదవి బాధ్యతలు స్వీకరించినప్పుడు తమ అవినీతిని నేర స్వభావాన్ని మరిచిపోయి ప్రమాణం చేయడం సిగ్గు చేటు. ఇలాంటి పరిస్థితుల్లో వివిధ అంశాలపైన ఎలాంటి చర్చలు జరుగుతాయి ?ఎవరి ప్రయోజనం కోసం చట్టాలు రూపొందుతాయి? మనం సులభంగా గ్రహించవచ్చు.
అవినీతిపరులను అనుమతిద్దామా?
సమాజంలో క్రమంగా విలువలు పడిపోయిన కొద్దీ ఏ రకంగా కలుషితం అవుతుందో అదే రకంగా చట్టసభలు కూడా కలుషితం అవుతున్న విషయాన్ని గమనించ వలసిన అవసరం ఉన్నది. వ్యక్తిగత ప్రయోజనాలు, స్వార్థ రాజకీయాలు, గుండాయిజం, మూర్ఖత్వం, ఇవన్నీ నేర స్వభావాన్ని పెంచడమే కాకుండా అవినీతిపరులుగా మార్చుతున్నవి. దీనికి పౌరసమాజం బాధ్యత కూడా ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ కొంత ఉన్నది.
ప్రజల యొక్క చైతన్యం ,చిత్తశుద్ధి అంకితభావం పైన మాత్రమే చట్టసభల భవిష్యత్తు ఆధారపడి ఉన్నది .ఇలాగే కొనసాగితే ప్రపంచంలో భారత దేశ ప్రతిష్ట దిగజారి పోవడమే కాకుండా ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు భిన్నమైన పాలన కొనసాగితే ప్రజాస్వామ్యానికి అర్థం ఏమిటి?
అనేక అంతరాలు, అసమానతలు, వివక్ష దోపిడీలు, దౌర్జన్యాలు వికటాట్టహాసం చేస్తూ ఉంటే రాజకీయంలో గుండాయిజం రౌడీయిజం రాజ్యమేలుతుంటే సామాన్య ప్రజానీకానికి రక్షణ ఉంటుందా? కాబట్టి అవినీతిపరులు నేరగాళ్ల యొక్క పాలన కు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. అంటే ముందుగానే చట్టసభలలోకి ప్రవేశించకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత దేశ ప్రజలపై ఉన్నది. అందుకు ఎన్నికలు, ఎన్నికల వేళ ప్రజలు తీసుకునే నిర్ణయాలు, ప్రజల ఒత్తిడి చోదక శక్తులుగా పనిచేస్తాయి.
పార్లమెంట్ సభ్యుల ప్రక్షాళన ఎలా?
ప్రజా ఉద్యమాల ద్వారానే నీతివంతమైన పాలన అనివార్యమని అనేక రుజువులు చరిత్రలో ఉన్నప్పటికీ అన్ని వేళలా ప్రజా ఉద్యమాలు సఫలమవుతాయన్న దాఖలాలు లేవు. అట్లని ప్రజా ఉద్యమాలు నీరుగారితే ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఆశించడం అవివేకమే అవుతుంది. భారతదేశంలో న్యాయవ్యవస్థ అనేక సందర్భాలలో ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై నా చురకలు అంటించిన సందర్భాలు ఉన్నాయి.
ప్రశ్నించడాన్ని అనేక సందర్భాల్లో సమర్థించిన భారత సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నలతోనే పారదర్శక పాలన సాధ్యమవుతుందని తేల్చిచెప్పింది కూడా.
ప్రస్తుత పార్లమెంట్ లోని అవినీతి గణాంకాలను బట్టి రాబోయే కాలంలో దీనికి అడ్డుకట్ట వేయడానికి న్యాయవ్యవస్థ ఎన్నికల సంఘo ప్రభుత్వానికి మార్గదర్శకాలతో పాటు స్పష్టమైన రూలింగ్ ఇస్తే తప్ప ఈ పరిస్థితుల్లో మార్పు వచ్చే అవకాశం కనిపించడం లేదు. అంటే న్యాయవ్యవస్థకు ఎన్నికల సంఘానికి ఈ విషయంలో క్రియాశీల పాత్ర ఉన్నదని చెప్పక తప్పదు.
సుపరిపాలన అందించే క్రమంలో పాలకులే అవినీతిపరులైన ప్పుడు అనివార్యంగా రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగాన్ని పరిరక్షించే క్రమంలో న్యాయవ్యవస్థ ఈ రకమైనటువంటి చొరవ చూపవలసిన అవసరం ఎంతగానో ఉన్నది.
ఇక ఎన్నికల సంఘం కూడా ఎన్నికల సందర్భంలో ఉదాసీనంగా వ్యవహరించడం, అధికార పార్టీ లకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం, కటువుగా వ్యవహరించకపోవడం వంటి ఆరోపణలను ఎదుర్కొంటున్నది. గతంలో శేషన్ గారు ప్రధాన ఎన్నికల కమిషనర్ గా పని చేసినప్పుడు రాజ్యాంగ పరిధికి లోబడే అనేక నూతన నిర్బంధాలను అమలు చేసి చూపారు. ప్రస్తుతం ఎన్నికల సంఘం కూడా కఠినమైన మార్గదర్శకాల వలన అవినీతిపరులు నేరగాళ్లు పార్లమెంటులోకి ప్రవేశించకుండా చొరబడకుండా అడ్డుకట్ట వేయడానికి తెగువ చూపాల్సిన అవసరం ఉన్నది
దానిని ఎన్నికల సంఘం న్యాయ వ్యవస్థ సామాజిక బాధ్యతగా స్వీకరిస్తే తప్ప ఈ మార్పు సాధ్యం కాదు.
ఓటరే కీలకం
లోక్ సభ సభ్యుల ఎంపిక తో పాటు రాజ్యసభ సభ్యుల ఎంపిక విషయంలోనూ ప్రత్యక్షంగా పరోక్షంగా ఓటర్లే బాధ్యులు అవుతున్న వేళ ఓటరు నిర్ణయం క్రియాశీలకంగా, నీతివంతంగా, పారదర్శకంగా, హేతుబద్ధంగా, భారత ప్రజాస్వామిక విలువలకు అనుకూలంగా ఉండవలసిన అవసరం ఉన్నది.
అంతేకాకుండా ప్రజాస్వామిక సంస్కరణల సంఘం, సుపరిపాలన కమిటీలు వంటి అనేక ప్రజా సంఘాలు కూడా ఏర్పడి ప్రజా చైతన్యానికి కృషి చేయవలసిన అవసరం భవిష్యత్తులో ఎంతగానో ఉన్నది.. ఈ అవినీతి సామ్రాజ్యం మీద ముప్పేట దాడి జరిగితే తప్ప ఈ సంస్కరణలు సాధ్యం కాదు.
కార్పొరేట్ శక్తులు ఇటీవలికాలంలో తమ ఆస్తులను, సంపదను రక్షించుకోవడానికి రాజకీయాల్లోకి వస్తున్న కారణంగా చట్టసభల్లో కి అక్రమంగా చొరబడు తున్నట్లు తెలుస్తున్నది. అందుకే క్రమంగా పరిపాలన గాడి తప్పుతూ అనేక వర్గాలకు రక్షణ లేకుండా అవినీతి పెరిగి పోవడాన్ని మనం గమనించవచ్చు.
( ఈ వ్యాసకర్త సామాజిక విశ్లేషకుడు, సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు, హుస్నాబాద్, జిల్లా సిద్దిపేట, తెలంగాణ)