– రాఘవ శర్మ
నిలువెల్లా గాయాలు
ఒళ్ళంత కప్పేసిన ముసుగు
రక్త మోడుతున్న వ్రణాలు
కళ్ళకు గంతలతో గాంధారి
తొంగి చూశావా
ఎదురుగా యమభటులు
‘బైటికెందు కొచ్చావ్ సైతాన్ ‘
నిశ్శబ్ధంగా పుచ్చలోకి దూరిన బుల్లెట్
మళ్ళీ కుప్ప కూలిన గాంధారం
పిచ్చెక్కిన ‘ మత్తు ‘ చేతిలో
మద మెక్కిన తుపాకులు
మొన్న రూబుల్ వెళ్ళి పోయింది
నిన్న డాలర్ నిష్క్రమించింది
ఇప్పుడు యువాన్ కన్నేసింది
మరి రూపాయి ?
అదింకా పాపాయే!
పక్కనే ‘ పవిత్ర ‘ బల్లెం
ఎంత మంది కన్నేశారో !
ఎంతమంది చెరబట్టారో!
చుట్టూ అగ్ర పెత్తనం
ఎంతకాలం ఈ స్వైర విహారం !?
పారి పోకు గాంధారీ
విదేశీ విమానాల వెంట
వాటి కిటికీలు పట్టుకుని
వాటి చక్రాలు పట్టుకుని
గాలిలో ప్రాణాలు వదలకు
పారి పోకు ..
ఎక్కడి కెళ్ళినా విజాతి వే!
ఎక్కడికెళ్లినా
శిబిరాల్లో శరణార్థి వే!
ఎక్కడికెళ్లినా
చేయిచాచే అనాథవే !
ఎక్కడికెళ్లినా
పౌరసత్వంలేని ప’రాయి’వే !
గాయ పడిన ఓ గాంధారమా !
నిలబడు
నీ నేల పైనే నిలబడు
కళ్ళకు గంతలు తీసేయ్
కాళ్ళకు సంకెళ్ళు తెంచెయ్
ముసుగులు చించెయ్
వెన్నెముక లేని పాలకులను
వెన్ను విరిచే మూకలను
నిలువ రించు
శత్రు గుండెలు గుభేల్ మనే లా
నీ గాంధారాన్ని వినిపించు
(ఆలూరు రాఘవ శర్మ, కవి,రచయిత, విమర్శకుడు, జర్నలిస్టు)