(వి. శంకరయ్య)
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నదీ జలాల వివాద పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ఒక పక్క కొన్ని చర్యలు గైకొంటున్నా అవి ఆచరణలో సత్ఫలితాలు ఇవ్వక పోగా మరింతగా వివాదాల పీట ముడి బిగుసుకొంటోంది.
ఇందుకు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ కూడా ఒక కారణంగా వుంది. రోగమొకటైతే పది రకాల మందులు కేంద్రం దట్టించడం కూడా వికటించడానికి కారణంగా వుంది. వాస్తవంలో జూరాల నుండి శ్రీ శైలం నాగార్జున సాగర్ జలాశయాల వరకే రెండు రాష్ట్రాల మధ్య వివాదం ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం వివాద మున్నంత వరకే పరిమితం కాకుండా గోదావరి బేసిన్ నుండి కృష్ణ బేసిన్ వరకు కృష్ణ బేసిన్ నుండి పెన్నా బేసిన్ వరకు గల అన్ని కాలువలు రెగ్యులేటర్లపై బోర్డుల ఆధిపత్యాన్ని స్థిరీకరించుతూ నోటిఫికేషన్ జారీ చేసింది! గమనార్హమైన అంశమేమంటే అసలు ఈ నోటిఫికేషన్ నే తెలంగాణ ప్రభుత్వం గుర్తించడం లేదు. అధికార యుతంగా ఔను చెప్పదు. కాదని చెప్పడం లేదు.
ఆంధ్ర తెలంగాణల మధ్య ట్రిబ్యునల్ తుది తీర్పు వచ్చేంత వరకు బోర్డుల పరిధి కూడదని ఏడేళ్లుగా ముఖ్యమంత్రి కెసిఆర్ అభ్యంతరం పెడుతున్నారు. అయితే ఆంధ ప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ ను స్వాగతించినా కొన్ని మినహాయింపులు కోరనున్నది. ఉదాహరణకు పెన్నా బేసిన్ లోని కాలువలు రెగ్యులేటర్ లు విధిగా తొలగించమని ఆంధ్ర ప్రదేశ్ కోరవచ్చు. ఇందుకు తెలంగాణ ససేమిరా అంటుంది.
ఈలాంటివే పరస్పరం రెండు రాష్ట్రాల విభేదించే అంశాలు నోటిఫికేషన్ లో చాలా వున్నాయి. కేంద్ర ప్రభుత్వం జాగ్రత్త పడి వివాదాలకు కేంద్ర బిందువులుగా వున్న కృష్ణ నదిపై వున్న ప్రాజెక్టుల వరకే బోర్డు పరిధి నోటిఫై చేసి వుంటే బాగుండేది. మున్ముందు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ యెడల ఏ వైఖరి తీసుకుంటుందో ఏమో గాని లేని రగడను కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ లో పొందు పర్చింది.
ఆ మాట కోస్తే నోటిఫికేషన్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కాలికి వేయ వలసినది మెడకు మెడకు వేయ వలసినది కాలికి వేస్తోంది. గోదావరి కృష్ణ నదీ బోర్డుల సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు జరిగితే ముందుగా బోర్డుల పూర్తి స్థాయి సమావేశం ఏర్పాటు కోరింది. తీరా ఆ సమావేశం ఏర్పాటు చేస్తే అధికారులకు వెసులుబాటు లేదని గైరు హాజరైంది. అంతే కాదు. శ్రీ శైలం సాగర్ టెయిల్ పాండు వద్ద విద్యుదుత్పత్తి చేయ వద్దని బోర్డుతో పాటు తాము లేఖలు రాసినా తెలంగాణ నిలుపుదల చేయలేదని పార్లమెంటు లో కేంద్ర మంత్రి నిస్సహాయంగా ప్రకటన చేశారు. మున్ముందు తెలంగాణ ఏ వైఖరి తీసుకుంటుందో ఇప్పుడు ఎవరూ చెప్ప లేని పరిస్థితి నెలకొని ఉంది.
ఇదిలా ఉండగా శ్రీ శైలం జలాశయం ఎగువ భాగంలో రెండు రాష్ట్రాలు నిర్మించుతున్న ప్రాజెక్టులు కోర్టు మెట్లెక్కినాయి. ఇక కనుచూపు మేర రెండు రాష్ట్రాల మధ్య సాగునీటి వివాదం సామరస్యం గా పరిష్కారమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ పనులతో మొదలైన జల వివాదం ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి దిండి పథకాలకు మిన్నాగులాగా చుట్టు కొన్నది. తమలపాకు తలుపు చెక్క సిద్దాంతం వికటాట్టహాసం చేస్తోంది. ఈ సందర్భంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కొన్ని కీలకాంశాలను గమనం లోనికి తీసుకోవడం లేదు.
1)ఆంధ్ర ప్రదేశ్ లో గొంతెండి పోతున్న రాయలసీమ తెలంగాణకు చెంది దక్షిణ తెలంగాణ ప్రాంతాలకు సాగు తాగు నీరు అందాలంటే రెండు రాష్ట్రాలు సామరస్యానికి లాకు లెత్తక తప్పదని గుర్తించడం లేదు.
2)శ్రీ శైలం ఎగువ భాగంలో రెండు రాష్ట్రాలకు అవసరాలు ఎక్కువ! నీటి లభ్యత తక్కువ అనే స్ప్రహ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించడం లేదు.
3)ఈ జంఝాటకంలో రోజులు గడచి బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమలులోనికి వస్తే ఎగువ రాష్ట్రాలు లబ్ది పొంది దిగువన వున్న తాము తీవ్రంగా నష్ట పోవడం ఖాయమని భావన ఎవ్వరిలోనూ వ్యక్తం కావడం లేదు.
పోతు రెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ కు అనుమతులు లేవని తెలంగాణకు చెందిన ఒక వ్యక్తి గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించగా తెలంగాణ ప్రభుత్వం పార్టీగా చేరింది. తుదకు పోతు రెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ పనులకు బ్రేక్ పడింది. వాస్తవంలో ఈ పథకం పై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అంతగా నిధులు వ్యయం చేయలేదు. ఆ మాట కొస్తే ఆంధ్ర ప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాగునీటి రంగం పూర్తిగా పడ కేసింది. వచ్చే ఎన్నికల నాటికి సాగు నీరు పుష్కలంగా అందించి రైతులను మెప్పించి తిరిగి గెలుపు గుర్రం ఎక్కుతామనే లక్ష్యం వైకాపా ప్రభుత్వానికి లేదు. జగన్మోహన్ రెడ్డి తనను నవ రత్నాలే గట్టెక్కించుతాయని విశ్వసిస్తున్నారు . పోతు రెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ పనులు నిలిచి పోయినంత మాత్రాన వచ్చే పెద్ద నష్టమేమీ లేదని భావిస్తున్నారు.
అయితే తెలంగాణ పరిస్థితి వేరు. దాదాపు 35 వేల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మింప బడుతున్న పాలమూరు రంగారెడ్డి దిండి పథకాలు గ్రీన్ ట్రిబ్యునల్ ముందుకు వెళ్ళాయి. సరికి సరి అన్నట్లు పోతు రెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ పనులు నిలుపుదలకు ప్రైవేటు వ్యక్తి గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించినట్లే పాలమూరు రంగారెడ్డి పథకాలకు వ్యతిరేకంగా ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన వ్యక్తి గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించగా తాజాగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేస్తూ అసలు ఈ పథకాలకు అనుమతులే లేవని తాగునీటి పథకాలని చెబుతూ భారీ ఎత్తున సాగునీటి పథకాల నిర్మాణం సాగిస్తున్నారని అఫిడవిట్ లో ఆరోపించింది. ఇదంతా పరిశీలించితే గాజు కొంపల్లో బతికే వారు ఇతరుల ఇళ్ల పై రాళ్లు రువ్వ కూడదనే భావన రెండు రాష్ట్రాలకు ఏ కోశాన కనిపించక పోవడం విశేషం.
ఇదిలా వుండగా ఎవరైనా సరే కోర్టుల కెక్కితే కొళ్ల పోవడం తప్ప బాగు పడింది లేదు. ఇందుకు కావేరి వివాదమే తార్కాణం. తుదకు శాంతి భద్రతల సమస్యగా పలుమార్లు తయారైంది. ఆఖరుగా ట్రిబ్యునల్ తీర్పు పక్కన పెట్టి సుప్రీంకోర్టు సమస్యను పరిష్కరించింది. ఈ ఉదంతం దృష్టిలో పెట్టుకొనే ఇటీవల సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ యన్ వి రమణ మధ్యవర్తిత్వంతో సమస్య పరిష్కారానికి సూచన చేసిన సమయంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించి వుంటే ఎంతో హుందాగా వుండేది. ఒక వేళ తెలంగాణ ప్రభుత్వం మొండిగా వ్యవహరించి వుంటే ఇప్పుడు నోటిఫికేషన్ సందర్భంగా ఏకాకి అయినట్లు పరపతి పోయి వుండేది. ఇటీవల వరకు జల వివాదాల సందర్భంగా తెలంగాణ దూకుడుకు అనుగుణంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం స్పందించ లేదనే అప ప్రద వున్నా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్రతి పాదన అంగీకరించవలసి వుండినది.
కోర్టుల కెక్కడంలో ఇప్పుడు ఏ రాష్ట్రమూ తక్కువ తినడం లేదు. పోతు రెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ పనులతో మొదలైన కోర్టు కేసులు పాలమూరు రంగారెడ్డి దిండి పథకాలకు చుట్టుకొని తుదకు సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. ఇదే పరిస్థితి కొనసాగితే దక్షిణ తెలంగాణ ప్రాంతం ప్రజల అసంతృప్తి ఆగ్రహాన్ని కేవలం ఆంధ్రోళ్ల సెంట్ మెంట్ తో ముఖ్యమంత్రి కెసిఆర్ ఎంతో కాలం నెట్టుకు రాలేరు.
మరో వేపు కోట్లాది రూపాయలు అప్పులు చేసి ఉత్తర తెలంగాణలో భారీ ఎత్తున ప్రాజెక్టులు నిర్మించుతూ మరో వేపు కోర్టు కేసులతో దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులను ఎంత కాలమని అటకెక్కించ గలరు.? పోతు రెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ పనులకు బ్రేక్ పడినట్లే పాలమూరు రంగారెడ్డి దిండి పథకాల నిర్మాణానికి కోర్టుల పరంగా బ్రేక్ లు పడక తప్పదు. అయితే గియితే కోర్టు కేసులో ఓడి పోయిన వ్యక్తి కోర్టు వద్దనే ఏడిస్తే గెలుపొందిన వ్యక్తి ఇంటి వద్దకు వచ్చి విలపించిన సామెత ఇరు రాష్ట్రాలకు తప్పదేమో.
గత ఏడేళ్లుగా కేంద్రంతో తెలంగాణ ముఖ్యమంత్రి సఖ్యతగా లేక పోయినా కేంద్ర జల వనరుల శాఖలో తెలంగాణకు మంచి లాబీ వుండినది. ఫలితంగానే ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన పలు పథకాలు పూర్తిగా మార్పుచేసి నిర్మాణం చేపట్టినా ఏదో విధంగా అడ్డ దారుల్లో పాక్షికంగానైనా అనుమతులు పొందే వారు. ఇందుకు కాళేశ్వరం ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి పథకాలే నిదర్శనం. ఇప్పటికి పాలమూరు రంగారెడ్డి పథకం తొలి దశ తాగునీటి పథకం రెండవ దశ సాగునీటి పథకంగా వుంది.
కేంద్ర ప్రభుత్వం గోదావరి కృష్ణ నదుల బోర్డుల పరిధి నోటిఫై చేయడం తదుపరి పరిణామాల్లో కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం సహకరించక పోవడంతో మునుపటి లాగా తెలంగాణ ప్రభుత్వానికి సాగునీటి ప్రాజెక్టుల విషయంలో వెసులుబాటు లభించక పోవచ్చు. నదీ జలాల రగడ ఇదే విధంగా కొనసాగితే ఏదీ ఏమైనా వచ్చే ఎన్నికల నాటికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకరు రాయలసీమ నుండి మరొకరు దక్షిణ తెలంగాణ నుండి వ్యతిరేకత ఎదుర్కొన తప్పదు
వి. శంకరయ్య విశ్రాంత పాత్రికేయులు 9848394013
(’వార్త‘ సౌజన్యంతో)