(వడ్డేపల్లి మల్లేశము)
ఈనెల 9వ తేదీన అంతర్జాతీయ స్థాయి ఆదివాసుల దినోత్సవం జరుపుకోనున్న సందర్భంలో ఖమ్మం జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో పోడు భూముల రగడ జరగడం, అటవీ అధికారులు మొక్కలు నాటే పేరుతో స్వాధీనం చేసుకుంటున్న తమ భూముల రక్షణ కోసం అధికారుల పైరైతులు దాడికి పాల్పడడం రెండు అంశాలు జరగకూడనివే.
గిరిజన,ఆదివాసీ ఉద్ధరణకు ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టినట్లు ప్రకటించినప్పటికీ గత ఐదారు సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలోని ఆదివాసీ ప్రాంతాలలో మొక్కలు నాటే పేరుతో వారి భూములను స్వాధీనం చేసే ప్రయత్నం అధికారులు, పోలీసులు చేస్తే ఆ భూములను కాపాడుకోవడానికి గిరిజనులు సిద్ధ పడ్డ సందర్భాలు అనేకం. తెలంగాణ ప్రభుత్వం గిరిజనులు పోడుభూముల సమస్యను పరిష్కరిస్తానని ఎన్నికల ముందుచెబుతున్నది. తర్వాత మర్చిపోతున్నది. నాగార్జున ఉప ఎన్నికల ముందు ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ మేరకు హామీ ఇస్తూ, గిరిజనులందరికి భూ మిహక్కుల పత్రాలు ఇస్తామన్నారు. కాని ఇవ్వలేదు. మరొక వైపు ఉన్న పత్రాలు చెల్లవని అటవీ అధికారులు 30, 40 సంవత్సరాలుగా చేసుకుంటున్న భూములనుంచి వారిని ఖాళీ చేయిస్తున్నారు. తెలంగాణ గిరిజన ప్రాంతాల్లో ఇపుడు ఇపుడు తీవ్ర ఉద్రికత్త నెలకొని ఉంది.
ఖమ్మం జిల్లా పోడు రగడ:-
ఈనెల మూడో తేదీన ఆ తర్వాత వరుసగా రెండు రోజులు ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం గుబ్బగుర్తి అటవీ ప్రాంతంలోని ఎల్లన్న నగర్కు చెందిన పోడు భూముల వ్యవహారంలో అటవీ అధికారులకు స్థానిక గిరిజన రైతులకు ఘర్షణ జరిగినట్లుగా పత్రికల ద్వారా తెలుస్తున్నది. అటవీ అధికారులను అడ్డుకొని వాళ్ళ పై రాళ్ల దాడి చేసినట్లుగా మహిళా రైతుల పై ఆరోపణ.
ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో కారకులైనటలుగా భావించి 23 మంది మహిళా రైతులను హత్యాయత్నం కేసులో రిమాండ్ చేయడం జరిగింది. మరో 33 మంది పైన కేసు నమోదు చేసినట్లు స్థానిక పోలీసులు పత్రికలకు తెలియజేశారు. ఇందులో కొందరు చంటి పిల్లల తల్లులు ఉన్నట్లు చంటి పిల్లలతో సహా రిమాండ్లో ఉన్నట్లుగా తెలుస్తుంది.
“విధి నిర్వహణలో అడ్డుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని” పోలీసులు ప్రకటించడం లోనే ఆదివాసీల భూములకు సంబంధించిన చరిత్ర, వ్యవహారము, ప్రభుత్వ విధానం తో తమకేమీ సంబంధం లేనట్లుగా కేవలం శాంతిభద్రతలను కాపాడడం తమ విధి అన్నట్లుగా పోలీసుల మాటలను బట్టి తెలుస్తున్నది.
కంటికి రెప్పలా కాపాడడ మా? ప్రజలపై కేసులు పెట్టడమా?
ప్రతి విషయాన్ని పాలనలో శాంతి భద్రతలకు ముడిపెట్టడం లోనే దశాబ్దాలు గడిచినా ప్రజల సమస్యలు ముఖ్యంగా ఆదివాసీల పోడు భూముల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. “పరిపాలన అంటే ప్రజలను కన్నబిడ్డలవలె, కంటికి రెప్పలా కాపాడాలి “అని అర్థం ఉంటే ప్రజల చేతులకు బేడీలు వేయడం, అరెస్టు చేయడం, లాకప్ డెత్లకు పాల్పడడం, హత్యాయత్నం కేసులు నమోదు చేయడం కఠిన చర్యలకు ప్రభుత్వం పాల్పడితే ఇది పరిపాలన ఎలా అవుతుంది?
ముఖ్యంగా వరంగల్, భూపాలపల్లి, ఆదిలాబాద్, ఖమ్మం వంటి గిరిజన అటవీ ప్రాంతాలలో ఈలాంటి ఘర్షణలు తరచుగా జరుగుతున్నప్పటికీ వాటిని పోలీసులకు అటవీ అధికారులకు మాత్రమే పరిమితం చేస్తే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉంటాయి. అరెస్టు చేసి, రిమాండ్ చేసి స్థానిక ప్రజలతో మరింత ఘర్షణ పూరిత వైఖరి పెంచుకోవడమే తప్ప సమస్యను పరిష్కరించి నట్టుగా ఉండదు.
స్థానిక కలెక్టర్, వ్యవసాయ అధికారులు సంబంధిత రైతులతో సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ చట్టాలు, విధానాలు ఏం చెబుతున్నాయి? అనే విషయాన్ని చర్చిస్తే తప్ప ఇలాంటి సమస్యలకు పరిష్కారం ఉండదు. ప్రభుత్వానికి కూడా గిరిజన భూములకు సంబంధించినటువంటి గత ప్రభుత్వాలు చేసిన చట్టాలను అవసరమైతే సవరించి గిరిజన రైతుల డిమాండ్లను పరిష్కరించాల్సిన బాధ్యత ఉన్నది.
ఘర్షణలకు కారణం ఏమిటి?
నాగరిక సమాజానికి దూరంగా అడవుల్లో నివసిస్తూ కాయకష్టం చేస్తూ దేశ ఉత్పత్తిలో భాగస్వాములవుతున్న టువంటి గిరిజనుల పట్ల ప్రభుత్వాలకు ప్రత్యేక విధానం ఉండాల్సిన అవసరం ఉన్నది. ప్రపంచ వ్యాప్తంగా అనేక చోట్ల ఇలాంటి వివక్షతకు గురవుతున్నారని ఆలోచనతో ఆగస్టు 9 అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం గా ఏటా జరుపుకుంటున్నాం. అలాంటప్పుడు వాళ్ళు కేవలం భూమిని మాత్రమే నమ్ముకొని బ్రతుకుతున్నారు .
కనుక వేరే ఉపాధి అవకాశాలు లేకపోవడంతో భూమి సమస్య శాశ్వతంగా పరిష్కరించవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. గిరిజన రైతుల తో పాటు రైతు సంఘాలు, ప్రజా సంఘాలు ,మేధావులు ,అఖిల పక్షాలతో ప్రభుత్వము సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలి.
ఎన్నికల సందర్భంలో ప్రభుత్వం అనేక రకాల రాయితీలను పథకాలను ప్రవేశపెడుతూ ఆయా వర్గాల ఓట్ల కోసం ఒక వైపు ఆరాట పడుతూ ఉంటే ఈ లోకంతో సంబంధం లేకుండా కేవలం తమ శ్రమను నమ్ముకున్న ఆదివాసీలను మాత్రం మనుషులుగా చూడకపోవడం బాధాకరం.
ఇటీవల హుజరాబాద్ లో జరగనున్న ఉప ఎన్నిక నేపథ్యంలో దళిత బంధు పేరుతో దళిత ఓట్ల కోసం ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం గిరిజనులకు ఏ మేరకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయో ఆలోచించవలసిన అవసరం ఉన్నది.
ఈ సంఘటనపై వివిధ వర్గాల స్పందన:-
ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి ఘర్షణ సందర్భంగా అటవీ అధికారులు పోలీసుల విధానాల పట్ల స్థానిక గిరిజన మహిళా రైతులు స్పందిస్తూ మహిళల ని చూడకుండా అందులో పిల్లల తల్లులు ఉన్నప్పటికీ అక్రమంగా అరెస్టు చేసి తప్పుడు కేసులు నమోదు చేశారని ఇది సరైనది కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
9 ఆగస్టు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం
అనేక సంవత్సరాలుగా ఈ భూములను మేము సాగు చేసుకుంటున్నామని మొక్కలు నాటడానికి తమ భూములు మాత్రమే అవసరం పడ్డాయా ?అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొన్ని నిజాలు
కొన్ని గిరిజన చట్టాల అవకాశం మేరకు, శ్రమను నమ్ముకున్న రైతులు గా విధిలేని పరిస్థితుల్లో పోడు భూములను సాగుచేసుకుంటున్న మాట వాస్తవమే. అయితే దాన్ని చట్టబద్ధంగా అమలు చేయాల్సింది పోయి అరకొరగా ఉన్నటువంటి గిరిజనుల పోడు భూముల నే ఆక్రమించుకోవడానికి మొక్కల పెంపకం, హరితహారం నెపంతో స్వాధీనం చేసుకోవడానికి సిద్ధపడటం సమంజసం కాదు.
అనేక చోట్ల ప్రభుత్వ భూములను, ఉన్నత వర్గాలు ఆక్రమించుకుంటే, ప్రభుత్వ భూములను ఇటీవల అమ్మినట్లుగా చౌకగా అమ్ముతూ ఉంటే భూస్వాములు పెట్టుబడిదారుల ఖాతాలో వందల ఎకరాలు జమ అవుతుంటే వారికి లేని ఆటంకం గిరిజన రైతులకు వచ్చిందా?
ఈ ప్రభుత్వం ఏనాడో పేదలకు గిరిజనులకు పంచిన టువంటి భూములను కూడా ఇటీవల హరితహారం పేరుతో అనేక చోట్ల అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు వంటి సంఘటనలు మనం పత్రికలో చూశాo. దళితులకు 3 ఎకరాల భూమి పంపిణీ చేస్తామని ప్రభుత్వ హామీ హామీగానే మిగిలిపోయింది. ఇక గిరిజనులు తమ ఆధీనంలో ఏనాటినుంచో ఉన్నటువంటి భూములు సాగు చేసుకుంటే వారిని ఇబ్బందులకు గురి చేసి ప్రభుత్వం రక్షణ కల్పించకపోవడం ఇదేనా గిరిజన బంధు?
పాలకులు ప్రజలతో ముఖ్యంగా రైతులతో ఘర్షణ వైఖరి అవలంబిస్తే అది ప్రభుత్వఅ ప్రతిష్ఠకు కారణమవుతుంది. పైగా ప్రజా వ్యతిరేక ప్రభుత్వం గా ముద్ర పడుతుంది. అందుకోసమే వ్యవసాయ రంగానికి సంబంధించి పేదలు, దళితులు, గిరిజనుల భూముల విషయంలో స్పష్టమైన విధానాన్ని అవలంబించి ప్రతి కుటుంబానికి నిర్ణీత భూమిని పంపిణీ చేయడానికి గాను గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన భూసంస్కరణల చట్టాన్ని వెంటనే అమలు చేసి చట్టానికి భిన్నంగా ఉన్నటువంటి భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పేద రైతులకు పంచడమే ఇలాంటి సమస్యలకు పరిష్కారం అవుతుంది.
( ఈ వ్యాసకర్త కవి రచయిత సామాజిక రాజకీయ విశ్లేషకుడు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు హుస్నాబాద్ సిద్దిపేట జిల్లా)