(వడ్డేపల్లి మల్లేశము)
ప్రభుత్వ రంగానికి, ప్రైవేటు రంగానికి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంటుంది. ఈ విషయాన్ని ప్రభుత్వాలు నిరంతరము గమనించి లాభాపేక్ష, వ్యాపార ధోరణి కాకుండా సర్వత్ర అన్ని రంగాలలోనూ సిబ్బంది, వేతనాలు ,నియామకము, ఖర్చులు, ఉద్యోగంలో క్రమబద్దీకరించడం వంటి విషయాలలో లాభనష్టాల తో సంబంధం లేకుండా ప్రజా అవసరం, సేవలను మాత్రమే దృష్టిలో ఉంచుకొని వ్యవహరించవలసి ఉంటుంది.
ఇటీవలి కాలంలో ప్రభుత్వాలు ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలలో ప్రభుత్వాలు ప్రకటించే పథకాల అమలుకు సంబంధించి తాత్కాలికంగా ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవడం పథకము గడువు కాగానే వారిని ఉద్యోగాల నుంచి తొలగించడం నిరసన తెలిపి, ఉద్యోగాలను శాశ్వతం చేయమని పోరాటం చేస్తే అరెస్టు చేయించడం, లాఠీఛార్జికిపాల్పడడం పరిపాటైపోయింది.
పోలీసులు సైతం తమ హక్కుల కోసం పోరాడే అటువంటి ఉద్యోగులు, కార్మికుల విషయంలో హక్కులు, న్యాయాన్ని ఆలోచించకుండా ప్రభుత్వం ఆదేశించ గానే అరెస్టు చేయడం, లాఠీఛార్జికి పాల్పడడం తరచుగా జరుగుతున్నది. ఇది చాలా విచారకరం. పోలీసులు ప్రజల సేవ కోసమే కానీ ప్రభుత్వాలు, నాయకుల రక్షణ కోసం మాత్రమే కాదని గుర్తించవలసిన అవసరం ఉందని పోలీసు శాఖకు ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
నర్సులు ప్రగతి భవన్ ముట్టడి ఎందుకు?
గత సంవత్సర కాలంగా భారతదేశంలో కరోనా విశృంఖలత్వం కొనసాగుతున్న వేళ తెలంగాణ రాష్ట్రం లోపల ప్రభుత్వ పరంగా జరుగుతున్నటువంటి చికిత్సలో భాగంగా నర్సులను 1640 మందిని తాత్కాలిక పద్ధతిలో నియామకం చేసుకోవడం జరిగింది.
గత సంవత్సర కాలంగా ప్రాణాలకు తెగించి యుద్ధ వీరులు గా వైద్యసేవలు అందించినటువంటి నర్సులను తెలంగాణ ప్రభుత్వం శాశ్వత ప్రాతిపదికన క్రమబద్ధీకరించే బదులు ఉద్యోగం నుండి తొలగించడంతో ఇందుకు నిరసనగా నర్సులు7.7.21 బుధవారం రోజున ప్రగతి భవన్ ముట్టడికి పిలుపు ఇవ్వడం జరిగింది.
అందులో భాగంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టినప్పుడు నర్సుల యొక్క డిమాండ్ లోని న్యాయబద్ధత ను కూడా ఆలోచించకుండా అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్ల కు తరలించినట్లు గా మీడియా ద్వారా తెలుస్తున్నది. ఇక్కడ అరెస్టు చేయడం అనే అంశం ముఖ్యం కాదు. కానీ అవసర కాలంలో సేవలు చేయించుకొని కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతున్న వేళ వేతనాలను తప్పించుకోవడానికి నిర్ధాక్షిణ్యంగా నర్సులను ఉద్యోగం నుండి తొలగించడం వైద్య సిబ్బందిని అవమానించడమే అవుతుంది.
అరెస్టు చేసి ఆ తర్వాత విడుదల చేస్తారు కావచ్చు .కానీ ఇంత కాలం పని చేసి తక్షణమే ఉపాధిని కోల్పోయినప్పుడు వారి ఆవేదన, నిరాశా,నిస్పృహలు వర్ణనాతీతం.అందులో నుండే పుట్టింది వారిలో ప్రతి ఘటన ఆలోచన.
ప్రభుత్వాలకు ఇది ఆనవాయితీయే
వివిధ సందర్భాలలో ప్రభుత్వ ఉద్యోగులు, వైద్యులు, కార్మికులు, ఉద్యోగ సిబ్బంది తమ హక్కుల రక్షణ కోసం, న్యాయబద్ధమైన డిమాండ్ల సాధన కోసం ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసన ప్రదర్శనలు, ప్రభుత్వ కార్యాలయాలు, అసెంబ్లీ, సచివాలయ ముట్టడికి పాల్పడిన సందర్భంలో ఉమ్మడి రాష్ట్రం లోనూ తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కూడా ఒకే పద్ధతిలో పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జి, బాష్పవాయు ప్రయోగం కాల్పులకు సైతం తలపడిన సందర్భాలు లేకపోలేదు.
ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అంగన్వాడీ కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేసినప్పుడు గుర్రాల తో దాడి చేయిస్తే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా లాఠీచార్జి ,అరెస్టులకు పాల్పడి చిత్రహింసలకు గురి చేయడం లో ఔచిత్యం ఏమున్నది?
నర్సుల ప్రాధాన్యత గుర్తించి వెంటనే ఉద్యోగం లోకి తీసుకోవాలి
ఇటీవల జూనియర్ డాక్టర్లు సైతం కరోనా చికిత్స జరుగుతున్న కాలంలో తమ వేతనాల పెంపుదల కోసం చేసిన పోరాటం సందర్భంగా ప్రభుత్వం హామీ ఇచ్చి శాంతింప చేసింది. అలాగే కరోనా చికిత్సలో భాగంగా దేశవ్యాప్తంగా దాదాపుగా 500 పైగా వైద్యులతో పాటు వందలాది మంది నర్సులు కూడా కరోనాకు బలి కావడాన్ని అటు ప్రభుత్వ0 ఇటు సమాజము గుర్తించవలసిన అవసరం ఉన్నది.
కరోనా చికిత్స తో పాటు సాధారణ పరిస్థితులలో కూడా వైద్యరంగంలో నర్సులు పని చేయడం కత్తిమీద సాము లాంటిది. నర్సులు కూడా తమ వృత్తిలో భాగంగా అనేక రకాల ఒత్తిడులకు, వివిధ రకాల దాడులకు బలి అవుతున్న నేపథ్యంలో వృత్తి యొక్క స్వభావాన్ని, ప్రాధాన్యతను గుర్తించి ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుని తొలగించిన నర్సులను క్రమబద్దీకరించడం సమంజసమని వైద్య సిబ్బంది, వైద్యులు ,సామాజిక కార్యకర్తలు, ప్రజా సంఘాల వారు, వివిధ రాజకీయ పక్షాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి
కరోనా లో కీలక యుద్ధవీరులు నర్సులే:-
ప్రైవేటు రంగంతో పాటు ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో కూడా వైద్య చికిత్సలో నర్సుల దే కీలక పాత్ర. రోగిని వైద్యులు పరీక్షించిన అనంతరం వారికి నిరంతరము సపరిచర్యలు చేయడంతోపాటు డిశ్చార్జ్ అయ్యేంతవరకు కంటికి రెప్పలా చూసుకునేది నర్సులే. ఈ విషయం ప్రభుత్వాలకు, వైద్యులకు ,ప్రజలకు, రోగులకు, సమాజానికి అందరికీ తెలిసిందే.
అలాంటప్పుడు ప్రభుత్వం అవసరం తీరగానే వీరిని ఉద్యోగం నుండి తొలగించడం బాధాకరం మాత్రమే కాదు. బాధ్యతారాహిత్యం కూడా.
ప్రభుత్వాలు ముఖ్యంగా అత్యవసరమైన వైద్య రంగంలోని ఉద్యోగులకు నర్సులకు ఇలాంటి షాక్ ఇవ్వడం సమంజసం కాదు. అనేక అట్టడుగు, వెనుకబడిన వర్గాల నుండి నర్సు ఉద్యోగాలకు ఎంపికయ్యి పనిచేసిన వీరిని లాభనష్టాల బేరీజు వేయకుండా ప్రభుత్వం వెంటనే తిరిగి ఉద్యోగంలోకి తీసుకుని తన యొక్క ఔచిత్యం చాటు కోవాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది.
ప్రభుత్వము ప్రతిష్ట , పంతాలకు పోకుండా నర్సుల న్యాయబద్ధమైన డిమాండ్లను మానవతా దృక్పథంతో ఆలోచించి సానుకూల నిర్ణయం తీసుకోవడమే ప్రభుత్వం ముందున్న ఏకైక మార్గం. లేకుంటే ప్రభుత్వ ప్రతిష్ట మసకబారే ప్రమాదం ఉంటుంది. ఈ విషయంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని, పౌర సమాజం యావత్తూ నర్సులకు అండగా ఉండాలని మనసారా కోరుకుందాం.
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకులు, సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు. హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)