(జువ్వాల బాబ్జీ*)
నిన్న ,మొన్న పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలలో అఖిలపక్ష రాజకీయ పార్టీలు, ఆదివాసీ సంఘాలు కలసి పర్యటించి నిర్వాసితుల సమస్యలపైన ఐక్యంగా పోరాడతామని చెప్పారు.
ప్రభుత్వం భూ సేకరణ చట్టం ప్రకారం పూర్తిస్థాయి చర్యలు చేపట్టి న్యాయం చేసే వరకు వీరంతా ఐక్యంగా ఉండి ప్రభుత్వం మెడలు వంచుతామని ప్రకటించారు. కేవలం రాజకీయ వాగ్దానాలకే పరిమితం అవుతారా? లేదా నిర్వాసితుల తరుఫున ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతారా? అనేది తర్వాత చర్చించుకుందాం.
ఇంకా, నిర్వాసితులు ధైర్యంగా ఉండాలని తాము 5వ తేదీన విజయవాడలో చేపట్టబోయే నిరసన దీక్షకు నిర్వాసిత గ్రామాల నుండి రావాలని మద్దతు కోరారు.
ఈ రోజు నాకు పోలవరం, వి.ఆర్.పురం ,కుక్కునూరు, వేలేరుపాడు మండలాల నుండి కొంతమంది ఫోన్లు చేసి భూసేకరణ అధికారులు నిర్వాసితులను పునరావాస కాలనీలకు తరలించడానికి తేదీలతో కూడిన షెడ్యూల్ ఇచ్చినారని వాటిని పరిశీలించవలసిందిగా కోరుతూ వాట్స్అప్ లో పోస్ట్ చేశారు.
అంతేకాకుండా ఇంకా పునరావాస కాలనీలలో మీరు చెబుతున్న చట్ట ప్రకారం ఏ విధమైన చర్యలు పూర్తి చేయలేదని కాని తరలించడానికి షెడ్యూలు ప్రకటించడం మా అందరినీ ఆందోళనకు గురి చేస్తోందని మేము ఏమి చేస్తే బాగుంటుందని సలహా అడిగారు.
నిజానికి ఇది అంత సంతోషించవలసిన అంశం ఏమీ కాదు. సాధారణంగా ప్రభుత్వం తమ మాట వినని కొంతమంది నిజాయితీగల అధికారులను బదిలీ చేసేటప్పుడు, ప్రజల మెప్పు కోసం వారిని ఘనంగా సన్మానించి ,ఆ తర్వాత చడీ చప్పుడు లేకుండా ప్రాధాన్యత లేని పోస్ట్ కు బదిలీ చేస్తారు.
అలాగే మూడు రోజుల క్రితం నిర్వాసితులు ఆందోళన చేస్తున్న సందర్భంగా ప్రస్తుతం వరదల మయమైన గ్రామాలలో నిర్వాసితులు పడుతున్న బాధలను మీడియా ద్వారా పత్రికలలో టీవీలలో చూపించటంతో ప్రభుత్వం కంగారుపడి 2019లో ఇచ్చిన ఒక హామీని అంటే జీవో .ఎం.ఎస్ నెంబర్ ;350(1/8/2019 రెవిన్యూ) కొనసాగింపుగా, ప్రతి కుటుంబానికి 10 లక్షలు ప్రకటించారు దానికి జీవో. ఆర్ టి. నెంబర్ ;224 ఇచ్చారు.దాని ప్రకారం ముందుగా 41.15 పరిధిలో ఉన్న 112 గ్రామాలకు రూ. 550 కోట్లు నిధులు విడుదల చేశారు .
కొంతమంది తెలీక ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పెంచుతూ కొత్త జీవో ఇచ్చారు అంటున్నారు. కానీ ,గతంలో ఇచ్చిన జీ.ఓ కొనసాగిస్తూ ఇప్పుడు నిధులు కేటాయిస్తూ మరొక జీవో తెచ్చారు. అర్థం చేసుకోగలరు.
దీనితో అధికార పార్టీకి చెందిన నాయకులు, ప్రజలందరూ ప్యాకేజీ పెంచినందుకు సంతోషిస్తూ అధికార జగనన్న నాయకత్వం వర్ధిల్లాలి అంటూ మండల కేంద్రాలలో ప్రదర్శనలు ఆ సంతోషం ఎక్కువకాలం ఉండకుండా చావు కబురు చల్లగా చెప్పినట్టు ఈనెల అనగా జూలై 15వ తేదీ నాటికి ముంపు గ్రామాల నుండి నిర్వాసితులను పునరావాస కాలనీలకు తరలించడానికి షెడ్యూల్ ప్రకటించారు.
ఇది పిర్ర గిల్లి జోల పాడి నట్లు ఉంది. అయితే అయితే ఇది పూర్తిగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు తీర్పును దిక్కరించి నట్లుగా మీరంతా అర్థం చేసుకోవాలి.
పోలవరం ప్రాజెక్టునిర్మాణంలో 371 ఆవాస గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి. ఇది జగమెరిగిన సత్యం. ఇందులో 112 గ్రామాలు 41.5 15 పరిధిలో ఉన్నాయి. మిగిలిన 259 గ్రామాలు 45.72 పరిధిలో ఉన్నాయి.
ప్రభుత్వం డ్యాము కట్టడంలో చూపిస్తున్న శ్రద్ధ భూములు, ఇళ్లు , జీవనోపాధిని కోల్పోయి, గ్రామాలు ఖాళీ చేయవలసిన నిర్వాసితులకు భూ సేకరణ చట్టం 2013 ప్రకారం కల్పించాల్సిన కనీస సౌకర్యాలు కల్పించలేదని దీనివలన భూసేకరణ అధికారులు చట్ట ఉల్లంఘనకు పాల్పడినట్లు, అవి పూర్తి చేసే వరకు నిర్వాసితులను పునరావాస కాలనీలకు తరలించవద్దని కోరుతూ, రంపచోడవరంనకు చెందిన “శక్తి స్వచ్ఛంద సంస్థ”ఏపీ హైకోర్టు లో ప్రజా వ్యాజ్యం నంబర్ 56 /2021 దాఖలు చేయడం జరిగింది.
ఈ కేసులో పిటిషనర్ చాలా అంశాలను కోర్టు వారి ముందు పెట్టడం జరిగింది.
ప్రస్తుతం ఆ కేసు ఇంకాపెండింగ్ లోనే ఉన్నది. మార్చి 8వ తేదీన హైకోర్టు చేపట్టిన కేసు విచారణలో ముఖ్యంగా దేవీపట్నం మండలంలో, గుబ్బలంపాలెం గ్రామ నిర్వాసితులు తమకు పునరావాస కాలనీలో మంచినీరు ,టాయిలెట్స్, రోడ్స్, డ్రైనేజ్, స్మశాన వాటిక ఇలాంటి సౌకర్యాలు లేవని పిటిషనర్ ద్వారా కోర్టు దృష్టికి తెచ్చారు. కేసు విచారణ జరిపిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అరూప్ గోస్వామి గారు, నిర్వాసితులకు పునరావాస కాలనీలలో అన్ని రకాల సౌకర్యాలు పూర్తి చేయకుండా వారిని ముంపు గ్రామాల నుండి తరలించవద్దని “స్టే “విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ తరపున వాదనలు వినిపించిన ప్రభుత్వ న్యాయవాది సి.సుమన్ గారు కోర్టు స్టే విధించకుండా ఆపడం కోసం ఓరల్ సబ్మిషన్ ద్వారా ప్రయత్నం చేశారు. ప్రధాన న్యాయమూర్తి గారు మార్చి 24వ తేదీ నాటికి రాతపూర్వకమైన కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని అప్పటివరకు “స్టే “ఉత్తర్వులు జారీ చేశారు. నిర్వాసితుల అంతా గమనించ వలసినది ఏమిటంటే , ఈ” స్టే” ఉత్తర్వులు ఇంకా అమలు లోనే ఉన్నాయి.
మరి కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ,భూసేకరణ అధికారులు కోర్టు ఆదేశించిన విధముగా పునరావాస కాలనీల్లో భూసేకరణ చట్టం ప్రకారం అన్ని రకాల సౌకర్యాలు పూర్తి చేయకుండా, నిర్వాసితులను ముంపు గ్రామాల నుండి ఖాళీ చేయడానికి చర్యలు చేపడితే అది ఖచ్చితంగా “కోర్టు ధిక్కరణ” అవుతుందికదా!
అయితే చట్టాలు లేదా కోర్టు తీర్పులు ప్రజలకు అనుకూలంగా ఎన్ని ఉన్నప్పటికీ, అవి అమలు చేయవలసిన అధికారులు అమలు చేయనప్పుడు, ప్రజలు వాటిని అమలు చేయించుకోవాల్సిన బాధ్యత వారిపైనే ఉన్నది .గ్రామాలలో కి అధికారులు వచ్చినప్పుడు, భూసేకరణ చట్టం ప్రకారం మా భూములు తీసుకుని మా గ్రామాలను ఖాళీ చేయాలని చెబుతున్న మీరు …అదే చట్టప్రకారం మాకు 25 రకాల కనీస సౌకర్యాలు పునరావాస కాలనీల్లో ఎందుకు కల్పించలేదని నిలదీయాలి కదా! చట్టాలు అమలు చేయించుకుని హక్కులు సాధించుకోవాల్సిన బాధ్యత పూర్తిగా నిర్వాసితుల పైనే ఉన్నది.
చట్టాలు మీవే……. సాధించుకునే సౌకర్యాలు మీవే….. కాబట్టి పోరాడాల్సింది మీరే. అంతే కానీ ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎదురు చూసి మోసపోకండి. మీరు గ్రామాలలో పోరాడుతూ ఉంటే, మా లాంటి వారు కోర్టులలో పోరాడతారు. అలాగే హైకోర్టు” స్టే “ఉత్తర్వులు ఉన్నప్పుడు వాటిని గౌరవించకుండా మమ్ములను ఎందుకు బలవంతంగా పునరావాస కాలనీలకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారని అడగాలి. అప్పుడు మాత్రమే ప్రజలు చైతన్యవంతంగా ఉన్నారని, చట్టాల గురించి, కోర్టు తీర్పుల గురించి, అవగాహన కలిగి ఉన్నారని ,అధికారులు అర్థం చేసుకుని విధుల నిర్వహణలో బాధ్యత గా వ్యవహరిస్తారు.
నా ఉద్దేశ్యం మీ అందరికీ అర్థం అయిందనుకుంటాను.కోర్టు ఉత్తర్వుల గురించి భూసేకరణ చట్టంలో పేర్కొన్న అంశాల గురించి తెలిసి కూడా ఏమీ తెలియనట్లు మీరు ఉండి, అధికారులు ప్రలోభ పెడుతుంటే,మీరు ఏ మాత్రం మౌనంగా ఉన్నా, మీ సమస్యలు ఎప్పటికీ పరిష్కారం కావు.
చివరిగా నేను మీకు ఒక పిటిషన్ ను తయారు చేసి గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. దానిని మీరు ప్రింట్లు తీసుకొని నిర్వాసితులు అందరితో సంతకాలు తీసుకుని ,ఏ.పీ హైకోర్టు ఆదేశాల ప్రకారం, భూ సేకరణ చట్టం పరిధిలో మాకు పునరావాస కాలనీలలో 32 రకాల సౌకర్యాలు పూర్తి చేయకుండా మమ్ములను తరలించవద్దని కోరుతూ అధికారులందరికీ రిజిస్టర్ పోస్టు ద్వారా ఫిర్యాదులు పంపించండి. అనంతరం దానిని మనం కోర్టులో ఫైల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
(*జువ్వాల బాబ్జీ, అడ్వకేట్, న్యాయసలహాదారు, పోలవరం దళిత నిర్వాసితుల జాయింట్ యాక్షన్ కమిటీ,9963323968)