ఆంధ్ర ప్రాజక్టుల మీద తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఉన్నత స్తాయి సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ నీళ్ల కోసం పడుతున్న కష్టాలను గురించి గంభీరోపన్యాసం చేశారు. ఆంధ్రా వాళ్లు తెలంగాణలో వ్యవసాయాన్ని దండగ చేశారని అన్నారు.
తాను స్నేహ హస్తం సాచినా ఆంధ్ర ముఖ్యమంత్రి పెడచెవిన పెట్టడం పట్ల సిఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
సిం కెసిఆర్ ప్రసంగ పాఠం ఇదే…
‘‘ ప్రకృతి రీత్యా తెలంగాణ భూభాగం సముద్ర మట్టానికి ఎగువన ఉన్నది. చుట్టూ నదులు ప్రవహిస్తున్నా కూడా గ్రావిటీ ద్వారా సాగునీటిని తీసుకునే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో లిఫ్టులను ఏర్పాటు చేసుకొని, నీటిని ఎత్తిపోసుకోవాల్సిన దుస్థితి తెలంగాణ ఉంది. దశాబ్దాల సమైక్య పాలనలో తెలంగాణ వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసిన వలస పాలకులు ఎత్తిపోతల పథకాలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. తద్వారా తెలంగాణ వ్యవసాయాన్ని దండుగలా మార్చి, తెలంగాణ రైతులకు అన్యాయం చేసిండ్రు. పోరాటం చేసి సాధించుకున్న నూతన తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణమే ప్రధమ ప్రాధాన్యతగా కాళేశ్వరం వంటి ఎత్తిపోతల ప్రాజెక్టులను చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సాగునీటి గోసను తీర్చింది. దీంతో అత్యధిక దిగుబడులతో తెలంగాణ రాష్ట్రం నేడు దేశానికే అన్నపూర్ణగా నిలిచింది. ఇదంతా కూడా లిఫ్టుల ద్వారా నదీజలాలను ఎత్తిపోయడం ద్వారా మాత్రమే సాధ్యమైంది. ఈ నేపథ్యంలో రాబోయే కాలంలో కృష్ణా, గోదావరి నదులపై మరిన్ని ప్రాజెక్టులను నిర్మించుకోబోతున్నాం. రెండు పంటలకూ నీరందాలంటే.. జల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల ద్వారా కేటాయించబడిన నీటిని, విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగించుకుంటాం. పలు ట్రిబ్యునల్స్ ద్వారా రాజ్యాంగబద్దంగా తెలంగాణకు కేటాయించబడిన నదీ జలాలను సాగునీటికోసం వాడుకోవడంతోపాటు, సాగునీటిని ఎత్తిపోసుకోవాల్సిన అనివార్యతను అధిగమించడానికి కావాల్సిన జల విద్యుత్ ఉత్పత్తి కోసం కూడా తప్పకుండా కేటాయించబడిన నీటిని వినియోగించుకుంటాం. ఇదే విషయాన్ని రాష్ట్ర కేబినెట్ తీర్మానించింది కూడా. దీనికి వ్యతిరేకంగా ఎవరి అభిప్రాయాలనూ తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోదు. తెలంగాణ వ్యవసాయం కోసం, రైతుల సంక్షేమం కోసం ఎవరితోనైనా, ఎంతవరకైనా పోరాడుతాం’’ అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. నదీ జలాలమీద తన పొరుగు రాష్ట్రాలకు కేటాయించబడిన వాటాలను హక్కుగా వినియోగించుకోవడానికి తెలంగాణ రాష్ట్రం సంపూర్ణంగా సహకరిస్తుందని, అయితే కేటాయింపులు లేని నికరజలాలను దౌర్జన్యంగా వాడుకుంటామంటే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోబోరని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు.
దశాబ్దాలపాటు తెలంగాణ సాగునీటికి గోస పడ్డదనీ, స్వయంపాలనలోనూ అటువంటి పరిస్థితిని ఎట్టి పరిస్థితిలో రానివ్వబోమన్నారు. బచావత్ ట్రిబ్యునల్ ఏర్పాటై 17 ఏండ్లు కావస్తున్నా, తెలంగాణకు కృష్ణా జలాల్లో నీటివాటాను నిర్ధారించకపోవడంపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ నీటి వాటా కోసం అవసరమైతే కేంద్రంతో పోరాడుతామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
బేసిన్ అవసరాలు పూర్తిగా తీరిన తర్వాతనే, ఇంకా సర్ ప్లస్ వాటర్ వుంటే, అవుటాఫ్ బేసిన్ అవసరాల మీద దృష్టి పెట్టాలనేది సహజ న్యాయమన్నారు. దీన్ని ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం విస్మరించడం సరికాదన్నారు. తెలంగాణ చేపట్టిన లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టుల నేపథ్యంలో.. జల విద్యుత్ ఉత్పత్తి అవసరం పెరిగిందన్నారు. జల విద్యుత్ తో లిఫ్టులను నడిపి తద్వారా తెలంగాణ సాగునీటిని ఎత్తిపోసుకుంటుందని సిఎం స్పష్టం చేశారు.
సాగునీటితోపాటు, సాగునీటిని ఎత్తిపోసుకునేందుకు జలవిద్యుత్ ఉత్పత్తిని కూడా తెలంగాణకు కేటాయించిన నీటి ద్వారానే జరుపుకుంటుందని, ఇందులో ఎవరూ అభ్యంతరం తెలపడానికి వీల్లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ట్రిబ్యునళ్ల ముందు, కేఆర్ఎంబీ వంటి బోర్డుల ముందు, న్యాయస్థానాల్లోనూ ప్రజాక్షేత్రంలోనూ తెలంగాణ ప్రభుత్వం తన వాణిని వినిపిస్తుందన్నారు.
‘‘ తెలంగాణలో ఆంధ్రా మాదిరిగా కాలు అడ్డం పెట్టుకొని నీళ్లు పారించుకునే పరిస్థితి లేదు. నీటిని లిఫ్టుల ద్వారా ఎత్తి పోసుకోవాలె. తెలంగాణలో 30 లక్షలకు పైగా బోరు మోటార్లున్నాయి. తెలంగాణ మొత్తం విద్యుత్తులో 40శాతం విద్యుత్తు సాగునీటి అవసరాలకే వినియోగించబడుతున్నది. తెలంగాణకున్న భూపరిస్థితుల (terrain) దృష్ట్యా సాగునీరే కాదు, విద్యుత్ ఉత్పత్తి కోసం కూడా నీరు అవసరం..’ అని ముఖ్యమంత్రి వివరించారు.
ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు పోతిరెడ్డిపాడుకు వరద జలాలను మాత్రమే వాడుకుంటామని అసెంబ్లీలో, అసెంబ్లీ బయట అనేకసార్లు ప్రకటించారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు కూడా నాడు అదే విషయం చెప్పారు. నేడు మాట మార్చి పోతిరెడ్డిపాడు పేరుతో తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తామంటే తెలంగాణ ప్రజలు సహించబోరు’’ అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఎంతో సంయమనంతో పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రతో చర్చలు జరిపి, వారికి ఇబ్బంది లేని విధంగా, సహకరిస్తూ నిర్మాణం చేసిందని, ఇదే పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ విషయంలో కూడా అవలంభించేందుకు తమ స్నేహ హస్తం సాచినామని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. అయినా వారు పెడచెవిన పెట్టడం పట్ల సిఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.