తెలంగాణ రాష్ట్రంలోని దళిత సమాజం అభ్యున్నతి కోసం సీఎం కెసిఆర్ అధ్యక్షతన ఆదివారంఉదయం 11:30 గంటలకు ప్రారంభమైన అఖిల పక్ష సమావేశం రాత్రి 10 పది గంటల దాకా జరిగింది.
– కాంగ్రెస్, బిజెపి, ఎంఐఎం, సిపిఎం, సిపిఐ వంటి ప్రతిపక్ష పార్టీలు సహా అధికార పక్ష నేతలు, ఆయా పార్టీలకు చెందిన దళిత ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, సీనియర్ నేతలు, మేధావులు, సీఎంఓ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
– రాష్ట్రంలోని దళిత సమాజం అభ్యున్నతికి ఇంకా ఎటువంటి చర్యలు చేపట్టాలో అభిప్రాయాలు, సూచనలు, సలహాలు, అందించండని సమావేశంలో పాల్గొన్న ప్రతీ ఒక్కరిని పేరు పేరునా ముఖ్యమంత్రి ఆహ్వానించారు.
– సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో దళితుల వెనుకబాటుతనం, అందుకు గల చారిత్రక కారణాలను సమావేశం చర్చించింది. రాజకీయాలకు అతీతంగా దళితుల అభివృద్ధి కోసం సీఎం కెసిఆర్ తీసుకున్న చారిత్రక నిర్ణయాన్ని పార్టీలకతీతంగా నేతలు అభినందించారు. సిఎం దళిత సాధికారత పథకం అమలు విజయవంతం కావడానికి తమవంతుగా సంపూర్ణ సహకారం అందిస్తామని ఎం ఐ ఎం ఎమ్మెల్యే పాషా ఖాద్రి సహా అఖిల పక్ష సభ్యులు స్పష్టం చేశారు.
– -కులరహిత సమాజ నిర్మాణానికి తెలంగాణ నాంది పలకడం ఖాయమని, అటువంటి చారిత్రాత్మక కార్యాచరణ కేవలం సీఎం కెసిఆర్ తో మాత్రమే సాధ్యమని వక్తలు ప్రకటించారు.