(సి ఎస్ షరీఫ్)
అమితాబ్ బచ్చన్, సూపర్ స్టార్. అమితాబ్ బచ్చన్ అనగానే ప్రేక్షకులకు డాన్, షోలే, దీవార్, చిత్రాలే గుర్తుకు వస్తాయి. అయితే అమితాబ్ బచ్చన్ కు ఒక ప్రత్యేక రూపం తెచ్చి,, అతడి నట జీవితానికి బలమైన పునాది నిర్మించిన “జంజీర్” (మే 11, 1973 విడుదల) చిత్రం సాధారణంగా గుర్తుకు రాదు.
17 చిత్రాలు, వీటిలో రెండు మాత్రమే కొద్దిపాటిగా చెప్పుకొ దగ్గ చిత్రాలు (బాంబే టు గోవా, ఆనంద్). ఐదింటిలో అయిదు నిముషాల అతిధి పాత్రలు, పది ఫ్లాపులు, ఇదీ 1973 వరకు ఒక నటుడిగా అమితాబ్ బచ్చన్ ప్రొఫైల్. అపజయాల మీద అపజయాలతో, సినీ సాగరం మధ్యలో నిలబడిపోయి, ఇంకొక్క అపజయం కల్గితే అలహాబాద్ (ఇంటికి) వెళ్ళి పోవాలని నిర్ణయించుకున్న అమితాబ్ బచ్చన్ జీవితం లోకి కి “జంజీర్” చిత్రమొక నావలా వచ్చింది. అది అతడ్ని ఒడ్డుకి చేర్చడమే కాకుండా, అతడి రూపం లో, ప్రేక్షకులకు “యాంగ్రీ యంగ్ మాన్” అనే ఒక కొత్త తరహా పాత్రనూ, పరిచయం చేసింది.
దీని తరువాత అమితాబ్ బచ్చన్, దీవార్ (1975), షోలే (1975), త్రిశూల్ (1978), డాన్ (1978), కాలా పత్థర్ (1979), శక్తి (1982) మొదలైన చిత్రాల్లో యాంగ్రీ యంగ్ మాన్ గా కనిపించాడు. సలీం- జావేద్ ల రచన లో ఇలాంటి కథలు ఎన్నో వచ్చాయి. దాదాపు అటువంటి సినిమాలన్నింటిలోనూ అమితాబ్ హీరో గా నటించాడు. అన్నీ హిట్ చిత్రాలే. సలీం-జావేద్ అమితాబ్ లు ఒకర్నొకరు బలపర్చుకున్నారు. ఈ చిత్రాలతో. అమితాబ్ బచ్చన్ విజయవంతమైన చిత్రాల జాబితా పెరిగింది.
జంజీర్ చిత్రం అమితాబ్ బచ్చన్ జీవితం లో ఒక చరిత్ర సృష్టించింది. అయితే ఈ చిత్రం అమితాబ్ కి కాకతాళీయంగా దొరక లేదు. ఆ దొరకడం వెనక కూడా ఓ పెద్ద చరిత్రే వుంది. నిజానికి ఈ కథ లొ హీరో, చిన్నప్పుడు తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి పగ తీర్చుకోవాలని రగిలిపోతూ, నేరస్తులను తన వ్యక్తిగత శతృవులుగా పరిగణించే ఒక బలమైన ఇన్స్పెక్టర్. సినిమా మొత్తం, హీరో, కోపం తో బిగిసి పోయిన గంభీరమైన ముఖం తో, “ఇతడికి జీవితం లో నవ్వు అనేది వుందని తెలుసా?” అని అనుమానం కల్గించే లా, వుంటాడు.
ఈ కథ తయారైనప్పుడు, హీరో గా అందరిదృష్టి, ధర్మేంద్ర పై వుంది. ధర్మేంద్ర, బాలీవుడ్ చిత్రసీమలో “హీ మాన్” గా పరిగణింపబడతాడు. అప్పట్లో ధర్మేంద్ర చాలాకాలం మిగతా చిత్రాల షూటింగుల్లో వుండిపోయి, ఈ చిత్రానికి సమయం కేటాయించ లేక పోయాడు. అందువల్ల చిత్రనిర్మాణం సిందిగ్ధంలో పడిపోయింది. నిర్మాతా దర్శకుడు ప్రకాష్ మెహ్రా కి ఈ అలసత్వం అసహనాన్ని పెంచింది. ఇద్దరూ మంచి మాటలతో చర్చించుకున్నారు. ధర్మేంద్ర ఈ చిత్రాన్ని వదిలేశాడు. ప్రకాష్ మెహ్రా, మరో హీరో కోసం వెతకడం మొదలు పెట్టాడు.
అతడి దృష్టి, నిజ జీవితం లో ఇన్స్పెక్టర్ గా పనిచేసి వున్న రాజ్ కుమార్ మీద పడింది. బాలీవుడ్ చిత్రరంగం లో రాజ్ కుమార్ అంటే దాదాపు అందరూ జడుసుకునే ఓ మొండివాడు. ఊరందరిదీ ఒక దారైతే ఉలిపి కట్టెది మరో దారి.
ఇతడి భావాల మీదా ప్రవర్తన మీదా అనేకమైన కథనాలున్నాయి. ఒక దర్శకుడు తలకు రాసుకునే హెయిర్ ఆయిల్ వాసన నచ్చక ఇతడు ఒక చిత్రాన్ని వదిలేశాడంటారు. చిత్రబృందం ఊహించినట్లే, రాజ్ కుమార్ మడతపేచీ పెట్టాడు. జంజీర్ చిత్రపు షూటింగ్, బాంబే (ఇప్పటి ముంబై) లొ కాకుండా, మద్రాసు (ఇప్పటి చెన్నై) లో చేస్తే, తాను నటిస్తానన్నాడు. చిత్రకథ మొత్తం ముంబై అధారంగా ఉండటం తో ప్రకాష్ మెహ్రా దీనికి ఒప్పుకోలేదు. ఫలితంగా రాజ్ కుమార్ ఈ చిత్రాన్ని వదిలేశాడు.
హీరో కోసం వేట కొనసాగింది. ముచ్చటగా మూడో హీరో దేవానంద్ ను సంప్రదించారు. అప్పట్లొ దేవానంద్ రొమాంటిక్ హీరో పాత్రల వైపే ఎక్కువ మొగ్గు చూపే వాడు. అతడు ఎక్కువ చర్చ లేకుండానే “నో” చెప్పేశాడు. చిత్రాన్ని వదిలేశాడు.
ఈ చిత్రా నికి “నో” చెప్పినందుకు, అమితాబ్ బచ్చన్ సతీమణి జయభాదురి, 2007 లో ఒక బహిరంగ సభలో దేవానంద్ కు ధన్యవాదాలు అర్పించింది.
ఇక హీరో ల జాబితాలో మిగిలింది ధగ ధగా తారా పథం లో వెలిగిపోతున్న రాజేష్ ఖన్నా. జంజీర్ కథా రచయితలు సలీం జావేద్ లకు దగ్గరి వాడు. అయితే రాజేష్ ఖన్నా మీద ఒక రొమాంటిక్ హీరో ముద్ర బలంగా వుండింది. అందుకే సలీం జావేద్, ప్రకాష్ మెహ్రా లు రాజేష్ ఖన్నా విషయం లో నెమ్మదించారు. నిశ్శబ్దంగా వుండిపోయారు.
చివరికి ఈ చిత్రం అమితాబ్ బచ్చన్ దగ్గరికి వచ్చింది. అమితాబ్ బచ్చన్ అంతవరకు దుండగులతో పోరాటాలు జరిపే ఒక బలమైన నాయకుడి గా కనిపించలేదనే చెప్పాలి. అయితే “బాంబే టు గోవా” చిత్రం లో చూయింగ్ గం నములుతూ అమితాబ్ బచ్చన్ ఫైట్ చేసే ఓ సన్నివేశం చూసి సలీం జావేద్ లు గుర్తొచ్చి ‘ఫరవాలేదు లాగొచ్చులే’ అనుకున్నారట.
రచయితలు, అమితాబ్ బచ్చన్ నటనకంటే తమ కథా బలాన్నే నమ్ముకుని ఈ చిత్రానికి అమితాబ్ బచ్చన్ ను కథా నాయకుడి గా అంగీకరించారట. చిత్రం తయారయింది, విడుదలయింది., అఖండ విజయాన్ని సాధించింది. సినిమా కథల్లో, హీరో పాత్ర రూపు రేఖల్లో, ఒక నూతన ఒరవడిని సృష్టించింది.
చిత్ర సీమ, చిత్ర విచిత్రాల నిలయం. అనుకున్నామని జరుగవు అన్నీ, అనుకో లేదని ఆగవు కొన్ని. సినిమా రంగం లో ఒక సినిమా ఒకర్ని రాత్రికి రాత్రే సూపర్ స్టార్ గా మారిస్తే , మరొక లక్షాధికారిని భికారి గా మార్చేయ వచ్చు. అప్పట్లో హీరోలు అందరూ కాదన్న సినిమా అమితాబ్ కు అదృష్టమయింది. సినిమా సూపర్ హిట్టయింది.జంజీర్ ఫెయిలయితే, సొంతవూరు అలహాబాద్ పోవాలనుని పెట్టెబేడ సర్దుకున్న అమితాబ్ బాంబేలో పెటిలయ్యాడు. బాలివుడ్ రారాజు అయ్యాడు. హిందీ చిత్రసీమకు ఒక కొత్త వ్యక్తి పరిచయమయ్యాడు.అతనే యాంగ్రీ యంగ్ మన్. అమితాబ్ యాంగ్రీ యంగ్ మన్ అనే పేరును తర్వాత వచ్చిన దీవార్, త్రిశూల్, శక్తి పదిల పర్చాయి.
ఈ స్టొరీ రాస్తున్నప్పుడు, ఎందుకో ఘంటసాల పాడిన ఈ పాట గుర్తుకు వచ్చింది నాకు.
కోరిక ఒకటి జనించు, తీరక ఎడద దహించు, కోరనిదేదో వచ్చూ, శాంతి సుఖాలను తెచ్చు
ఏది శాపమో, ఏది వరమ్మో తెలిసీ తెలియక అలమటించుటే
ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నమూ ………..