(వడ్డేపల్లి మల్లేశము)
ప్రభుత్వాలు ఏ చర్య తీసుకున్నా ,ఏ నడవడిక నడిచిన రాజ్యాంగ పరిధిలో మాత్రమే కొనసాగాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగ రచన లోనూ రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ కు సమర్పిస్తున్న సందర్భంలోనూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పాలకులకు అనేక సూచనలు చేయడం జరిగింది.
వాటిని అనుసరించకపోవడం కారణంగా సొంత ఎజెండాతో ఎన్నికల కోసం మాత్రమే పని చేస్తున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వాలు ఎన్నికల స్తేనే ప్రజలు గుర్తుకురావడం, వరాలు ప్రకటించడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమే.
ఇక 1949 నవంబర్ 25 ,26 తేదీలలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్‌కు రాజ్యాంగాన్ని సమర్పిస్తున్న సందర్భంలో చేసిన వ్యాఖ్యలు పాలకులకు ,ప్రజలకు, వివిధ రాజకీయ పార్టీలకు, ప్రజా సంఘాలకు, పౌరులకు శిరోధార్యం.
1) రాజ్యాంగ లక్ష్యాలు, ఆదర్శాలు విధానాలకు విఘాతం కలగకుండా రాజ్యాంగానికి కట్టుబడి లక్ష్య సాధన మార్గంలో చిత్తశుద్ధిగా వ్యవహరించాలి.
2) రాజకీయాలలో హీరో వర్షిప్ అంటే వ్యక్తిపూజ నిషేధం. భజన, పాలాభిషేకాలు వంటి వ్యక్తి వాదానికి స్థానం లేదని సూచించారు.
3) రాజకీయ ప్రజాస్వామ్యoమాత్రమే ఈ దేశానికి చాలదు. సామాజిక ,ఆర్థిక ప్రజాస్వామ్యము తోనే ఈ దేశములో నిజమైన ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది.
పాలాభిషేకాల సంస్కృతిని ఖండించాలి:
స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రం లోనూ, కేంద్ర ప్రభుత్వం లోనూ గత ఏడు సంవత్సరాల వరకు ఏనాడు కూడా పాలాభిషేకాలకు స్థానం లేదు .ఈ దేశంలో.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత గత ఏడు సంవత్సరాలుగా ఏదైతే రాజ్యాంగంలో సూచించబడిన పైన తెలిపిన రెండవ సూత్రానికి భిన్నంగా వ్యక్తివాదం, వ్యక్తిపూజ, హీరో వర్షిప్ విచ్చలవిడిగా కొనసాగుతుండడం రాజ్యాంగ ఉల్లంఘన కిందికే వస్తుంది.
మూడ విశ్వాసం లో మంచి చెడుల విచక్షణ మరచి వ్యక్తిని గౌరవించడం, వ్యక్తిని ఆరాధించడం ,వ్యక్తిని అభిమానించడం, వ్యక్తిని ఆకాశానికి ఎత్తడం వంటి లక్షణాలు తప్ప సామూహిక వాదం అనేదానికి ఆస్కారమే లేదు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం.
గత ఏడు సంవత్సరాలుగా ప్రభుత్వం లో జరిగినటువంటి వివిధ కార్యక్రమాల సందర్భంలోనూ, బడ్జెట్ కేటాయింపులు గాని, ప్రజలకు సంబంధించిన విషయంలో ప్రభుత్వం ప్రకటన చేస్తే వెంటనే కిందిస్థాయి కార్యకర్తల తో సహా పై స్థాయిలో ఉన్న మంత్రులు కూడా అభిషేకాలకు పాల్పడడం ఒక దురాచారంగా కొనసాగుతున్నది.
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకం కింద నిధులను ఖాతాలలో తమ చేస్తున్న సందర్భంగా ఈ పథకాన్ని సమర్థిస్తూ ప్రశంసిస్తూ స్వయంగా అనేకమంది మంత్రులు రాష్ట్ర స్థాయిలో వివిధ ప్రాంతాలలో ముఖ్యమంత్రి గారి ఫ్లెక్సీకి పాలాభిషేకాలు చేయడం హాస్యాస్పదం. రాష్ట్రంలో ఒక వినూత్న పరిపాలన తీసుకువచ్చే క్రమంలో ప్రజలను, ఆలోచింప చేయడం, ప్రజాస్వామ్యబద్ధంగా జీవించడం, స్వతంత్ర ఆలోచనా విధానాన్ని ప్రోత్సహించే బదులు ప్రభుత్వమే స్వయంగా వ్యక్తి ఆరాధనకు పాల్పడుతూ ప్రజలను ఆ వైపుగా తీసుకెళ్లడం దేనికి సంకేతం?
ప్రచార ఆర్భాటాలు పనిచేయవు:-
ప్రభుత్వం తీసుకుంటున్న అనేక కార్యక్రమాలు కూడాసాధారణ,అట్టడుగు వర్గాలకు కాకుండా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి 20 శాతం మంది గురించి మాత్రమే పట్టించుకున్నట్లు గా ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.
అలాంటి సందర్భంలో గుంటలు ,1,2ఎకరాలు నామమాత్రపు వ్యవసాయ భూమి ఉన్న వారికి ఫలితము దక్కకపోగా పదులు,వందలు, వేలాది ఎకరాలు ఉన్నటువంటి బడా భూస్వాములు పెట్టుబడిదారులు, జాగీర్దార్ల కు మాత్రమే రైతు బంధు పథకం ద్వారా లబ్ధి చేకూర్చడం నిజంగా రైతులకు బంధువే అవుతుందా?
పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో కాయకష్టం చేస్తూ క్షేత్రస్థాయిలో పని చేస్తున్నటువంటి శ్రమజీవులు, బక్కచిక్కిన రైతులు ,కౌలు రైతులు అయినప్పటికీ కూడా వారికి రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్నటువంటి దాఖలాలు మనం చూడవచ్చు. కానీ మన రాష్ట్రంలో దానికి భిన్నంగా కౌలు రైతులకు ఎలాంటి ప్రయోజనం జరగకపోగా భూమి ఉన్నటువంటి రైతుల శాతం చాలా తక్కువ .కనుక దాని వల్ల మెజారిటీ ప్రజానీకం కన్న పెట్టుబడిదారులు,భూస్వామ్య వర్గాలకు మాత్రమే ఎక్కువ ఫలితం చేకూరుతుంది.
సాగుచేస్తున్న భూమికి మాత్రమే రైతుబంధు ఇవ్వడం న్యాయం .అది కూడా పరిమితి విధించడం ద్వారా కొద్దిమందికి మాత్రమే వర్తింప చేయాలి .కానీ గుట్టలు, చెట్లు, నివాస స్థలాలకు కూడా ఆ భూమి యజమానికి రైతుబంధు పేరున కోట్లాది రూపాయలు కట్టబెట్టడం బంగారు తెలంగాణకు సంకేతమే నా?
వ్యవసాయ రంగానికి కేటాయించిన 25 వేల కోట్ల లో దాదాపుగా పదిహేను వేల కోట్ల రూపాయలను ఏటా రైతుబంధు పేరున ఖర్చు చేస్తూ అది కూడా రిజర్వు బ్యాంకు తదితర సంస్థల నుండి అప్పులు చేసి ఉన్నత వర్గాలకు కొప్పు పెట్టడం ఎంతవరకు సమంజసం?
ఐదు నుండి పది ఎకరాల లోపు వారికి మాత్రమే ఒక పరిమితిని విధించడం ద్వారా అదికూడా క్షేత్రస్థాయిలో వ్యవసాయము జరుగుతున్నటువంటి భూములకు మాత్రమే మరీ ముఖ్యంగా కౌలు రైతులు అప్పులు చేసి పంట పండించే రైతుల తో పాటు ప్రభుత్వానికి చేయూతనిస్తూ ఉన్నవారిన మర్చిపోవడం బాధాకరం.
పాలాభిషేకాల కు బదులు పునరాలోచన చేయాలి:-
శాసన సభ్యులు, మంత్రులు ,పార్టీ కార్యకర్తలు, ప్రజలు, సానుభూతిపరులు ఇక నుండి పాలాభిషేకాల కు స్వస్తి పలికి ఈ పథకం లో ఉన్నటువంటి లోపాలను సవరించే దిశగా ప్రభుత్వంపై ఒత్తిడితేవలసిన అవసరం ఎంతో ఉంది.అప్పులుతెచ్చి కోటీశ్వర్ల జేబులునింపడమేమిటి?రాష్ట్రాన్ని అప్పుల ఊ బిలోధింపడమేమిటి?పేద,దనికుల మధ్యన అంతరాలు పెంచడమెందుకు?
పెద్దఎత్తున విమర్శ రాకముందే అఖిలపక్షాలు,రైతుసంఘాలు, ప్రజాసంఘాలతో సమీక్ష జరిపి భూపరిమితి విధించే తక్షణ నిర్ణయం తీసుకోవాలి.
గ్రామీణ ప్రాంత రుణ ఉచ్చులో చిక్కి అప్పుల ఊబిలో కునారిల్లి పోతున్న టువంటి పేద వర్గాలకు ప్రయోజనం చేకూరేలా సంస్కరించి ఈ పథకాన్ని వర్తింపజేయాలి.ఇంకా భూమిలేనివారికి భూసంస్కరణలు అమలుచేయడం ద్వారా భూములుపంచి ప్రభుత్వం తన సామాజిక
భాధ్యతను చాటుకోవాలి.
కలెక్టర్ స్థాయి అధికారులు ,ఉన్నత ఉద్యోగులు, శాసనసభ్యులు ,మంత్రులు ,అక్రమ సంపాదన కలిగిన వారంతా కూడా ఈ రైతు బంధు ప్రభుత్వ సొమ్ము కు ఆశపడి ఇంతవరకు పొందిన డబ్బును నిర్బంధంగా వసూలుచేసి ప్రభుత్వ ఖాతాకు జమచేసి పేదలకు చెందేలా చూడాలి.
ప్రభుత్వం ఈ సంస్కరణలను ప్రవేశ పెట్టడం ద్వారా పేద ఉన్నత వర్గాల మధ్యన పెరిగిపోతున్న అంతరాలు తగ్గించే ప్రయత్నం చేయడంతో పాటు పేద వారి కోసమే ఏర్పడ్డ ప్రభుత్వం గా పేరు తెచ్చుకోవాలంటే ఉన్నత వర్గాల నుండి తిరిగి రాబట్ట వలసిన అవసరం ఎంతగానో ఉన్నది. కాయకష్టం చేస్తున్న బక్కచిక్కిన రైతన్నలు కౌలు రైతులు అయినా సరే వారికి కూడా ఈ రైతుబంధు పథకాన్ని వర్తింపజేయాలి. అప్పుడే దీని యొక్క ప్రయోజనం నెరవేరినట్లు.
ప్రభుత్వం యొక్క గౌరవం ,మర్యాద, పరువు ప్రతిష్ట అట్టడుగు వర్గాలకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మాత్రమే పెరుగుతుంది. కానీ ప్రచారం ద్వారా మాత్రం కాదు. అందులో పాలాభిషేకాలు అనేది రాజ్యాంగంలో నిషేధించబడిన వ్యక్తిపూజకు విరుద్ధమైనది.
( ఈ వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు కవి రచయిత సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)
వడ్డేపల్లి మల్లేశంగారి పాలాభిషేకాల గురించిన వ్యాసం .చాలా స్పూర్తి దాయకంగా వుంది. ఇలాంటి వ్యాసాలు ఇంకా ఆయన నుండి రావాలని కోరుకుంటున్నాను