(వడ్డేపల్లి మల్లేశం)
ప్రతి అంశానికి ఉన్న ప్రాధాన్యతను బట్టి విస్తృత ప్రచార అవసరాన్నిబట్టి ప్రపంచవ్యాప్తంగా జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు నిర్ణయించబడి నిర్వహించబడుతూ ఉన్నవి. ప్రత్యేకమైన దృష్టి పెట్టడం ద్వారా ఆ అంశంపై ప్రజల దృష్టిని నిలపడానికి ప్రజల పరంగా శ్రద్ధ తీసుకోవడానికి ప్రభుత్వపరంగా తగు చర్యలు తీసుకోవడానికి ఈ దినోత్సవాలు వేదికలు అవుతున్నాయి. యువతను, ఉత్సాహవంతుల ను, స్వచ్ఛంద కార్యకర్తలను, విద్యావంతులను తట్టి లేపుతున్నాయి.
రక్తదాతల దినోత్సవం ఉద్దేశాలు
ప్రపంచవ్యాప్తంగా రక్తం విలువను ప్రజలందరికీ తెలపడానికి ,దాని అవసరాన్ని గుర్తించడానికి దాని తయారీ పుట్టుక అత్యవసర సందర్భాల్లో దాని యొక్క అవసరం ఎలా నిండు ప్రాణాలను కాపాడుతుందో, రోగులకు ఏరకంగా ఉపయోగపడుతుందో, చావు బతుకుల్లో ఉన్న వారిని ఎలా రక్షించవచ్చు కృత్రిమంగా తయారు చేయలేము కనుక రక్తం ఒకరినుండి మరొకరికి దాన్ని ఇవ్వడం తప్ప ప్రత్యామ్నాయ మార్గం లేదనే విశ్వ సత్యాన్ని నొక్కి చెప్పడం ఈ దినోత్సవం యొక్క ఉద్దేశ్యాలు.
చరిత్ర
ప్రపంచములో ప్రతి అంశానికి మూలం, చరిత్ర ,ప్రత్యేక కారణం, సందర్భం ఉన్నట్లే ప్రపంచ రక్తదాతల దినోత్సవం నిర్వహించడానికి కూడా కొన్ని కారణాలు కొన్ని మౌలిక అంశాలు లో నిక్షిప్తమై ఉన్నాయి. మనిషి వైజ్ఞానిక జైత్రయాత్రలో 1901 సంవత్సరం ఒక మైలు రాయి.
ఆయేడాది ఆస్ట్రియా దేశానికి చెందిన శాస్త్రవేత్త కార్ల్ లాండ్ స్టీనర్ (Karl Landsteiner) మనిషిరక్తానికి చెందిన ఒక రహస్యాన్ని చేధించాడు. అది మనుషుల రక్తం ఒకే రంగులో ఎర్రగా ఉన్నా, అది ఒకటి కాదని, నాలుగురకాలనే సత్యాన్ని (A, B, AB, O) ఆవిష్కరించారు. అంతేకాదు, మనిషి రక్తంలో ఎగ్లుటిన్స్ అనే కణాలు కూడా ఉన్నాయని కనుగొన్నాడు.
దీనితో మనిషి ఆరోగ్యం ఒక మహర్ధలోకి ప్రవేశించింది. మనిషిరక్తం రహస్యం తెలియగానే, ఒక మనిషి నుంచి మరొక మనిషికి ఈ గ్రూపులను రక్తం ఎక్కించవచ్చని ఆయన కనుగొన్నాడు. రక్తమార్పిడి(Blood Transfuion)చికిత్స మొదలయింది. లాండ్ స్టీనర్ బ్లడ్ టైపింగ్ ధియరీ అనుసరించి 1907లో న్యూయార్క్ మౌంట్ సినాయ్ హస్సిటల్ కు చెందిన రూబెన్ ఓటెన్ బెర్గ్ (Reuben Ottenberg)మొదటి రక్తమార్పిడి చేశారు.
తర్వాత అవయవ మార్పిడి కూడా లాండ్ స్టీనర్ పరిశోధన ఫలితమే. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో వేలాది మంది సైనికులు విపరీత రక్తస్రావం నుంచి బయటపడి బతికి బట్టకట్టింది ల్యాండ్ సీనర్ బ్లడ్ గ్రూపింగ్ ప్రకారం రక్తం ఎక్కించినందునే. అప్పటి నుంచి రక్తం ఎక్కించడం సర్వసాధరణమయింది. సాటి మనిషి ప్రాణాలు కాపాడేందుకు రక్తం అసరం, ఎవరైనా ముందుకువచ్చి రక్తం ఇవ్వవచ్చనే పిలుపు వచ్చింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ సమాచారం ప్రకారం భారతదేశంలో యేటా 20లక్షల యూనిట్ల రక్తం కొరత వస్తున్నది. దేశంలో కేవలం 1 శాతం మంది మాత్రమే రక్తదానానికి ముందుకు వస్తున్నారు.
శరీరంలోని ప్రతికణానికి ఆహారం సరఫరా చేయడేం కాదు, మనిషిలోకి ప్రవేశించే రోగకారక శ్రతులను సంహరించే తెల్ల రక్తకణాలను మోసుకుంటూ వెయిన్స్, అర్టరీలు, కాపిల్లరీస్ గుండా రకం ప్రతిమనిషిలో 60,000 మైళ్ల జైత్రయాత్ర చేస్తుంది. ఇది భూమి చుట్టుకొలతకంటే రెండింతలు కంటే ఎక్కువ. ఇలాంటి రక్త రహస్యం కనిపెట్టిన వాడు ల్యాండ్ స్టీనర్.
బ్లడ్ గ్రూప్స్ కనుగొన్నందుకు 1930లో ల్యాండ్ స్టీనర్ కు నోబెల్ బహుమతి వచ్చింది. 1943లో గుండెపోటుతో ల్యాండ్ స్టీనర్ చనిపోయారు.
అందుకే ల్యాండ్ స్టీనర్ గౌరవార్ఠం ఆయన జయంతి జూన్ 14ను బ్లడ్ డోనార్ డే (Blood Donor Day)గా జరపాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇంటర్నేషన్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ సొసైటీస్, రెడ్ క్రెసెంట్ సొసైటీస్ సంయుక్తంగా నిర్ణయించాయి. మొదటి ‘ప్రపంచ రక్తదాత దినోత్సం’ 2005 జూన్ 14న జరిగింది.
రక్తాన్ని ఎందుకు దానం చేయాలి
రక్తం ఆయా వ్యక్తుల శరీరాలలో సహజంగా తయారయ్యే ద్రవపదార్థం .దీనిని ఏ రకంగానూ కృత్రిమంగా తయారు చేయ లేము. ఒకరి రక్తాన్ని మరొకరికి ఇవ్వడాన్ని రక్త దానం అంటారు . రక్తదానం ద్వారా మాత్రమే రక్తాన్ని సమీకరించు కునే అవకాశం ఉన్నది. అత్యవసర ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాపాయ పరిస్థితులు ఉన్నవారికి రక్తం అవసరం ఉన్నప్పుడు సహజంగా వ్యక్తం తక్కువ ఉన్న వారికి శస్త్రచికిత్సల సందర్భంలో రోగులకు రక్తం అవసరం పడుతుంది సహజంగా ఆ అవసర సందర్భంలో రోగులు కుటుంబీకుల నుండి గాని బంధువుల నుండి గాని రక్తాన్ని తీసుకొని రోగికి అవసరమైన రక్తాన్ని వాడి దగ్గర గల దానితో శస్త్రచికిత్సను పూర్తిచేస్తారు. అయితే ఇది మాత్రమే రోగులు అవసరాలకు సరిపోవడం లేదు కనుక రక్తదానం ప్రత్యేక శిబిరాల ద్వారా సేకరించే కార్యక్రమం రెడ్ క్రాస్ సంస్థ లు స్వచ్ఛంద సంస్థలు సినిమా కళాకారులు నిర్వహిస్తున్నారు. రక్త దానం చేయాలంటే 18 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల వారు మాత్రమే అర్హులు 50 కిలోల కంటే బరువు తక్కువ ఉన్న వారికి రక్తదానం చేసే అర్హత లేదు ఇందులో” ఓ” గ్రూప్ రక్తం అందరికీ ఉపయోగపడుతుంది. అందుకే వీరిని విశ్వదాత అంటారు ఏ బి గ్రూప్ రక్తం కలవారిని విశ్వ గ్రహీత అని అంటారు. అవసరాన్ని బట్టి ఆయా వ్యక్తుల రక్తం వినియోగిస్తారు.
భారతదేశంలో 7 శాతం మంది ప్రజలు ‘O నెగటివ్’ గ్రూప్ రక్తం ఉన్నవాళ్లు, వాళ్లేవరికైనా రక్తం దానం చేయవచ్చు. ఎమర్జీన్సీలో ఈ రక్తమే దిక్కు. ఇమ్యూన్ డెఫిసియన్సీ తో పుట్టే పిల్లలకు ఈ రక్తం ఎక్కిస్తారు. అందుకే రెడ్ క్రాస్ ఈ గ్రూప్ వాళ్లని ‘హీరోస్ ఆప్ బేబీస్’ (Heroes of Babies) అని పిలుస్తుంది.
రక్తదానం- అపోహలు వివరణ
రక్తదానం చేసిన వ్యక్తి అనారోగ్యానికి గురి అవుతాడు అని ,బలహీనంగా బక్కచిక్కి పోతారు అని ,కోలుకోవడం చాలా ఇబ్బంది అని రక్తం తీసినప్పుడు చాలా నొప్పిగా ఉంటుందని ,ఎయిడ్స్ లాంటి క్రిములు సోకే ప్రమాదం ఉంటుందని సహజంగా ప్రజల్లో యువతలో రక్తదానం చేసే వారిలో అనుమానాలున్నాయి. కానీ శాస్త్రీయ పద్ధతిలో సురక్షితమైన టువంటి విధానాల ద్వారా రక్త సేకరణ జరుగుతుందని సున్నితమైన పరికరాల ద్వారా నొప్పి కలిగించకుండా వైద్య నిపుణుల పర్యవేక్షణలోనే రక్త సేకరణ కార్యక్రమం కొనసాగుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రక్తదానం గతంలో చేసిన వారికి కూడా ఇలాంటి దుష్పరిణామాలు జరగలేదని ఎందరో అనేకసార్లుసందర్భాల్లో ఇచ్చిన అవకాశాలు ఉన్నాయని వారు వివరణ ఇస్తున్నారు. సేకరించిన రక్తాన్ని బ్లడ్ బ్యాంకులలో పూర్తి సురక్షిత పద్ధతులలో నిల్వచేసి అవసరానుగుణంగా వినియోగిస్తారని తెలుస్తున్నది. కనుక అపోహలు మనము కలిగి ఉండడమే కాకుండా రక్తదానం చేసేవారి లోపల కూడా అపోహలు కలిగించి ఆటంకపరిచ వద్దని కోరుతున్నారు.
రక్త నిల్వల పరిస్థితి -కొన్ని గణాంకాలు
భారత సోషల్ మీడియా రక్తం నిల్వలపై ఆందోళన వ్యక్తం చేస్తూ యువత రక్త దానం చేయాలని అందుకు ప్రజలు ఎక్కువగా చొరవ చూపాలని అప్పుడే దేశం లోని రక్త అవసరాలను తీర్చగలిగే ఎంతో మందికి మేలు జరుగుతుందని కోరింది తన భారీ టార్గెట్ లో 60 మిలియన్ల మంది ని రక్తదానం వైపు మళ్ళించాలని అంచనాగా. పెట్టుకుందని గణాంకాలు చెబుతున్నది. సోషల్ మీడియా రక్త దానం పై ప్రచారాన్ని ముమ్మరం చేస్తూ ప్రజల్లోకి వెళుతున్నది ప్రజల అవసరాలు తీర్చడం కోసమే.
మెడికల్ జర్నల్” ది లాంసెంట్” పరిశోధన ప్రకారం ప్రపంచములోని రక్తము నిలువలేని దేశాలలో భారతదేశం కూడా ఒకటని కొరతతో ఇబ్బందులు పడుతుందని దేశంలో నలభై ఒక్క మిలియన్ యూనిట్ల రక్తం కొరత ఉందని తెలిపింది. రక్తం అందుబాటులోకి రావడం కంటే లేదా సరఫరా కంటే డిమాండ్ నాలుగు వందల శాతం ఉందని. రక్తదానం ద్వారా అనేక మరణాలను ఆపవచ్చని ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరించి జీవం పోయాలని ఈ జర్నల్ విజ్ఞప్తి చేసింది.
ముగింపు
రక్తం యొక్క అవసరాలను దృష్టిలో ఉంచుకొని అనేక ప్రాణాలను కాపాడడం లో భాగంగా వైద్యశాలలు ,ప్రభుత్వము ,స్వచ్ఛంద సంస్థలు, రెడ్‌క్రాస్ సంస్థ ,రాజకీయ పార్టీలు కూడా శిబిరాలను ఏర్పాటు చేసి ఆరోగ్యవంతుల నుండి అన్ని రకాల గ్రూపుల రక్తాన్ని సేకరించడానికి బాధ్యతగా పెట్టుకోవాలి. ఈ విషయంలో అందరూ ముందుకు రావాలి ప్రధానంగా యువత స్వచ్ఛందంగా మంచి ఆలోచనతో దేశ ప్రజలకు సేవ చేసే అవకాశం అని భావించి రక్తం ద్వారా అనేక మంద ప్రాణాలను కాపాడవచ్చు అనే ఆలోచనతో ముందుకు రావాలని సమాజం యువత కు పిలుపునిచ్చింది. అంతర్జాతీయ రక్తదాతల దినోత్సవం సందర్భంగా నైనా ఈ ఆలోచన అమలు చేస్తే దేశంలో రక్తం యొక్క కొరతను నివారించిన వాళ్ళమే కాకుండా ఎంతోమందికి ప్రాణం పోయ గలుగుతాము.
(వడ్డేపల్లి మల్లేశం, సామాజిక విశ్లేషకులు, హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట)