గౌరవనీయులైన ప్రధానమంత్రిగారికి,
విషయంః తెలంగాణలో ఎమర్జెన్సీ మరియు వేలకోట్ల దోపిడి గురించి.
నా పేరు రఘు గంజి. తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుగా పనిచేస్తున్నాను. నిన్న ఉదయం నా ఇంటి సమీపంలో కొందరు నన్ను కిడ్నాప్ చేశారు. ఐదు అంశాల గురించి వార్తల ప్రసారం ఆపితేనే నేను ప్రాణాలతో బతుకుతానని చెప్పారు. ఆ తర్వాత కిడ్నాప్ చేసినవారు పోలీసులని తెలిసింది. సోషల్ మీడియాలో నా కిడ్నాప్ అంశం వైరల్ కావడంతో నన్ను వారు కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపించారు. ప్రస్తుతం నేను జైలు నుంచి మీకు ఈ లేఖ రాస్తున్నాను.
కిడ్నాప్ చేసిన పోలీసులు.. నన్ను వార్తలు ప్రసారం చేయొద్దని కోరిన 5 అంశాలు
1. పుప్పాలగూడ కాందీశీకుల భూమి ఆక్రమణ
2. ఐడీపీఎల్ 500 ఎకరాల ఆక్రమణ
3. ఐకియా ముందు 43 ఎకరాల భూమి ఆక్రమణ
4. ప్రాజెక్టుల దోపిడి
5. కార్పొరేట్ హాస్పిటల్స్‌లో కరోనా ట్రీట్‌మెంట్ దోపిడి
1. పుప్పాలగూడలో 100 ఎకరాల కాందీశీకుల భూమి ప్రస్తుతం ఆక్రమణకు గురవుతోంది. ఈ భూమి విలువ రూ.50 వేల కోట్లు. రైతులను బెదిరించి, నకిలీ పత్రాలు సృష్టించి ఈ భూకబ్జా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అధికార పార్టీ నేతలు, వారి బంధు మిత్రులు. చట్ట వ్యతిరేకంగా అక్రమ నిర్మాణాలకు అనుమతిలిస్తున్నారు. నేను ఆ విషయం గురించి రిపోర్ట్ చేయకూడదట.
2. ఐడీపీఎల్/ హిందుజ /గల్ప్ ఆయిల్‌కు చెందిన 500 ఎకరాల భూమిని మింగుతున్నారు ప్రభుత్వ పెద్దలు. దీని విలువ రూ.10 వేల కోట్లు. ఈ విషయం గురించి కూడా నేను మాట్లాడకూడదట
3. హైటెక్ సిటీ సమీపంలో ఐకియాకు ముందు యూఎల్‌సీకి సరెండర్ చేసిన 35,36,47,53 సర్వే నెంబర్ల భూమి ప్రభుత్వం చేతిలో నుంచి ప్రైవేట్ చేతిలోకి ఎలా వచ్చిందో ప్రశ్నించకూడదట.
4. రాష్ట్రంలో మిషన్ భగీరథతో పాటు ప్రాజెక్టులన్నింటిలో రూ.60 వేల కోట్ల అవినీతి జరిగింది. ఆ డబ్బంతా రాజకీయ నాయకులకు చేరింది. పక్క రాష్ట్రం కర్నాటకతో పోలిస్తే అదే కాంట్రాక్టర్ చేసిన రేట్లతో పోలిస్తే తెలంగాణ ప్రాజెక్టుల్లో విపరీత దోపిడి జరిగింది. ఆ ప్రాజెక్టులు, టెండర్ల దోపిడి గురించి నేను మాట్లాడకూడదట.
5. కరోనా సమయంలో విపరీతమైన దోపిడికి తెగబడి శవాలతో వ్యాపారం చేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులపై కథనాలను తక్షణం ఆపివేయాలట.
ప్రధానమంత్రిగా మిమ్మల్ని ఈ అంశాలపై దృష్టి సారించాలని కోరుతున్నాను. కనీస పౌరహక్కులు, పత్రికా స్వేచ్ఛలేని తెలంగాణ పరిస్థితిని మీరు మారుస్తారని ఆశిస్తున్నాను. నా ప్రాణాలకు భద్రత లేదు, నాకు రక్షణ కలిపించాలని కోరుతున్న
గౌరవంతో
రఘు గంజి,
హుజూర్‌నగర్ జైలు నుంచి.