కార్పొరేట్ కబంధ హస్తాల నుంచి విముక్తి లేదా?

(చందమూరి నరసింహారెడ్డి)

కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది . ఈ పరిస్థితులలో ప్రజలలో ఓ రకమైన ఆందోళన నెలకొంది. కొంతమందిలో ఆవేశం అధికమై వైద్య విధానాల పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వైద్యులను , వైద్య విధానాన్ని, వైద్యశాస్త్రాన్ని ఎవరూ తప్పు పట్టడం లేదు. వైద్య శాస్త్రం రోజురోజుకు ప్రగతి సాధిస్తోంది. అయితే రోగులకు అందించే వైద్యం ఖర్చు రోజురోజుకూ మోయలేని భారంగా తయారవుతోంది.

కార్పొరేట్ రంగంలో దోపిడీ పెరిగిపోయి వైద్యం పట్ల ప్రజలు విసిగిపోయి , ఆర్థికంగా చితికిపోయి అసహనంతో రగిలిపోతున్నారు. ఎన్నో కుటుంబాలు లక్షలాది రూపాయలను అప్పు చేసి ఆత్మీయులకు వైద్యం చేయించు కున్నాక వారి ఆత్మీయులను దక్కించు కోలేక, శవాల సంచులను తీసుకెళ్ల లేక వైద్యశాల లోనే వదలి వెళ్ళిన సంఘటనలు ఇటీవల కాలంలో చాలా వెలుగుచూశాయి .

వాటిని చూసినప్పుడు వైద్య శాస్త్రం పట్ల కసితో విమర్శలు రావడం సహజం.ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నిరంతరం సేవలందిస్తున్న నిస్వార్థ సేవలందించే డాక్టర్లు, నర్సులు ,వైద్యసిబ్బంది చాలా మంది ఉన్నారు వారందరికీ పాదాభివందనం.

కొన్ని స్వార్థ శక్తులు ఉన్నాయి. ఫలితంగా ఇలాంటి పరిస్థితుల్లోనే నెల్లూరు ఆనందయ్య లాంటివారిని ప్రజలు సమర్థిస్తున్నారు. కనీసం ఉచితంగా వైద్యం అందుతోందన్న భరోసా దక్కింది. కరోనా అంటే జనం ఎందుకు భయపడుతున్నారంటే లక్షల రూపాయలు అప్పు చేసి వైద్యం చేయించి కూడా సరైన ఫలితం లభించలేదని.

ఆయుర్వేద మందుతో చాలా జబ్బులు త‌గ్గిపోయాయి. అలాగ‌ని ఆయుర్వేదం అద్భుత‌మ‌ని చెప్పడం లేదు. అలోపతి పనికిరానిదని వ్యతిరేకత వ్యక్తం చేయడం లేదు. రెండూ గొప్పవే.

క‌రోనాకి జ‌నం ఎందుకు వణికి పోతున్నారంటే మ‌ర‌ణ భ‌యం మాత్ర‌మే కాదు, ఆర్థికంగా చితికిపోతామ‌ని. భూముల్ని అమ్మి కొందరు, అప్పుచేసి కొందరు , ఉద్యోగం చేసి తినీ,తినక పిల్లల ఫీజుల కోసం ,పెళ్లిల్ల కోసం దాచుకొన్న డబ్బు కార్పొరేట్ ఆసుపత్రి ఫీజులు క‌ట్టి ప్లాస్టిక్ కవ‌ర్లో శ‌వాన్ని తెచ్చుకుంటున్నారు.

క‌రోనా నుంచి కోలుకోవ‌డం సుల‌భం, వైద్య దోపిడీకి గురైతే కోలుకోవ‌డం అసాధ్యం.ఎన్నో కుటుంబాలు ఆత్మీయులను కోల్పోయి , ఆర్థికంగా చితికిపోయి వీధిన పడ్డ సంఘటనలు కోకొల్లలు. వీటిపై పరిశోధనలు చేస్తే అనేక మానవీయ సంఘటనలు వెలుగులోకి వస్తాయి.

నైపుణ్యం క‌లిగిన డాక్ట‌ర్లు ఎంద‌రో ఉన్నారు. దేవుడంటూ ఉంటే, ఆయ‌న త‌ర్వాత ప్రాణాలు కాపాడే శ‌క్తి డాక్ట‌ర్ల‌కే ఉంది. అందుకే వైద్యుడు , దేవుడు ఒక‌టే అన్నారు. కానీ డ‌బ్బు డ్రైనేజీ కాలు వ‌లాంటిది. అది అన్ని రంగాల్ని క‌లుషితం చేసింది , చేస్తోంది.

ప్రైవేట్ ఆస్ప‌త్రులు జ‌ల‌గ‌లు, మాన‌వ‌త్వం లేని రాక్ష‌సులంటూ పోస్టింగ్‌లు క‌నిపిస్తూ ఉంటాయి. కోటి డొనేష‌న్‌, కోటి చ‌దువు ఖ‌ర్చులు, ఐదారు కోట్ల‌తో ఆస్ప‌త్రి నిర్మాణం చేస్తే ఆ పెట్టుబ‌డి రిక‌వ‌రీ కోసం వైద్యం వ్యాపారం అవుతుంది. మాన‌వ‌త్వం అంటే పెట్టుబడులు రికవరీ చేసుకోలేరుకదా. అందుకే వైద్య, విద్య రంగాలను ప్రైవేటు శక్తుల నుంచి తొలగించి ప్రభుత్వాలే నిర్వహిస్తే దోపిడీకి తెరదింపవచ్చు.

కార్పోరేట్ శక్తుల కబంద హస్తాల నుంచి విద్య, వైద్య రంగాలను సమూలంగా తప్పించాలని ఏ రాజకీయ పార్టీలు పోరాటం చేయవు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రభుత్వం ఈ పని చేయలేదు. ప్రభుత్వాలు , పార్టీలు ఈ మాఫియా చెల్లించే డబ్బుతోనే నడుస్తున్నాయి. ఈ మాఫియా తలచుకుంటే ప్రభుత్వాలనే కూల్చేసే స్థాయికి చేరుకున్నాయి.

ఏ రాజకీయ పార్టీలో చూసినా ఈ రెండు రంగాల్లోని మాఫియా నాయకులు తప్పక కనిపిస్తారు. 10 పైస‌ల ఖ‌ర్చుతో చేసిన టాబ్లెట్ 10 రూపాయ‌ల‌కు అమ్ముకుంటున్న వాడు మాన‌వ‌త్వం గురించి ఎందుకు ఆలోచిస్తాడు.

ఇటీవల కరోనా కాలంలో కొన్ని మందులను కొన్ని రాజకీయ పార్టీల నాయకులు దొంగ చాటుగా దాచుకొని బ్లాక్ మార్కెట్ లో విచ్చలవిడిగా దోపిడీ చేసిన సంఘటనలున్నాయి. ఇలాంటి వారికి ప్రజల ప్రాణాలంటే ఎందుకు విలువ ఉంటుంది.

మహర్షి రాఘవ ఓ ఆర్టికల్ లో దోపిడీకి ఉదాహరణ గా ఇలా ప్రస్తావించారు. ఫీజుల దోపిడీ స‌రే, ప్రాణాలు ద‌క్కుతాయా అంటే అదీ లేదు. ఎందుకంటే మెజార్టీ ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌కి క్యాష్ మేనేజ్‌మెంట్ త‌ప్ప క్రైసిస్ మేనేజ్‌మెంట్ తెలియ‌దు.

వెంటిలేట‌ర్ల నిర్వ‌హ‌ణ‌, ఆక్సిజ‌న్ అవ‌స‌రాల‌పై అవ‌గాహ‌న లేదు. ఈ మ‌ధ్య ఒక రిటైర్డ్ త‌హ‌శీల్దార్ అనంత‌పురంలో చ‌నిపోయాడు. ఒకే వెంటిలేట‌ర్ ముగ్గురికి మార్చిమార్చి పెట్టార‌ని, రెమిడెసివ‌ర్ ఇంజ‌క్ష‌న్‌ని బ‌ళ్లారిలో రూ.50 వేల‌కి బ్లాక్‌లో కొని ఇస్తే , దాన్ని కొంచెం వాడి మిగ‌తాది వేరే వాళ్ల‌కి వేశార‌ని వాళ్ల బంధువు చెప్పాడు. ప‌రిస్థితి విష‌మిస్తే వేరే ఆస్ప‌త్రికి మారిస్తే రూ.6 ల‌క్ష‌ల బిల్లు వేసి శ‌వాన్ని ఇచ్చార‌ని చెప్పాడు. నా అనుభవం లో చూసిన మరో సంఘటన ఇది.

గుంటూరులో ఓ వైద్యశాలలో పులివెందుల ప్రాంతంలో పనిచేస్తున్న ఓ ఇంజనీరు కరోనాతో చేరితే అనవసరమైన వైద్యం నిర్వహిస్తూ కాలయాపన చేసి సుమారుగా 20 రోజులు పైగానే ఆస్పత్రిలో ఉంచుకొని 15 లక్షలకు పైగా డబ్బు తీసుకొని ఆఖరి క్షణంలో చేతులెత్తేశారు.

ఏ వైద్యం అందించింది కూడా కనీసం చెప్పలేదు. ఆ రోగిని వారి కుటుంబ సభ్యులు హైదరాబాద్ తీసుకెళ్లి చికిత్స చేయించారు అయినా ఫలితం దక్కలేదు.బిల్లు వేసి శ‌వాన్ని ఇచ్చార‌ని చెప్పాడు. బాధితుల త‌ర‌పున ఆరోప‌ణ‌ల్లో అతిశ‌యోక్తులు ఉండొచ్చు కానీ అస‌త్యాలు ఉండ‌వు. కరోనా తర్వాతనైనా ప్రజలలో సామాజిక చైతన్యం వచ్చి ప్రజలు తిరగబడితే తప్ప ఈ ప్రభుత్వాలు, ఈ రాజకీయ పార్టీలు కార్పొరేట్ రంగంనుండి విద్యా వైద్య రంగాలను తప్పించలేరు.

విద్య ,వైద్య రంగాలను కార్పొరేట్ యాజమాన్యం నుంచి తప్పించి ప్రభుత్వ ఆదీనంలో నడపాలి. ఇది ప్రజల ప్రాథమిక హక్కు. ఈనినాదం ఎలుగెత్తిచాటండి. సోషియల్ మీడియా తో ప్రజాచైతన్యం కలిగించండి. ప్రజావిప్లవం రావాలి.

Chandamuri Narasimhareddy

(చందమూరి నరసింహారెడ్డి, సీనియర్ జర్నలిస్టు, ఖాసా సుబ్బారావు అవార్డు గ్రహీత)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *