తిరుమలకు మెట్లెక్కుతూ ఎపుడైనా వెళ్లారా, ఇవిగో ఆ విశేషాలు!

(రాఘవశర్మ)

తిరుమలకు వెళ్ళే అలిపిరి మెట్ల దారికి విరామం ప్రకటించారు. జూన్ ఒకటవ తేదీ మంగళవారం నుంచి రెండు నెలల పాటు ఈ దారిని మూసేస్తున్నారు.

మెట్ల దారిలో రేకులతో కప్పు వేయడానికి, చిన్న చిన్న మరమ్మతులు చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. సాధారణ రోజులలో రోజుకు లక్ష మంది భక్తులు తిరుమలకు వెళుతుంటే, వారిలో ఇరవై వేల మంది ఈ అలిపిరి మెట్ల దారిలోనే నడుచుకుంటూ తిరుమల వెళుతుంటారు.

కరోనా మహమ్మారి పుణ్యమాని దేశమంతా కర్ఫూ, లాక్ డౌన్ వంటి ఆంక్షలు ఉన్నప్పటికీ, తిరుమలలో ఎలాంటి ఆంక్షలు లేవు. కాక పోతే తిరుమలకు వెళ్ళే భక్తుల సంఖ్యను గణనీయంగా తగ్గించేశారు.

దర్శనం టికెట్టు ఉంటే తప్ప కొండకు అనుమతించడం లేదు. ఇప్పుడు రోజుకు పదివేల మంది భక్తులు తిరుమలకు వెళుతుంటే, వారిలో రెండు వేల మంది ఈ అలిపిరి మార్గంలోనే నడుచుకుంటూ వెళుతున్నారు.

అలిపిరి మార్గానికి ప్రత్యామ్నాయంగా తిరుపతికి పడమర దిక్కున ఉన్న శ్రీనివాస మంగాపురం నుంచి వెళ్ళే శ్రీవారి మెట్టుమార్గాన నడిచి వెళ్ళాలి.


తిరుపతి జ్ఞాపకాలు -34


పురాతనమైన ఈ అలిపిరి మెట్ల దారిని ఒక్క సారి గుర్తుచేసుకుందాం. ‘అదివో.. అల్లదివో..’ తిరుమలకు వెళ్ళే అలిపిరి దారి. ఎంత దూరం నుంచి చూసినా కనిపించే గాలి గోపురం.. అక్కడక్కడా మండపాలు, గోపురాలు..తూర్పు నుంచి పడమరకు విస్తరించిన తిరుమల కొండ.

ఆదిపడి.. అంటే తొలిమెట్టు. అదే అలిపిరి మెట్ల దారి.

కోమలమ్మ

అలిపిరి దారిలో తిరుమల వెళ్ళాలంటే తొమ్మిది కిలోమీటర్లు నడవాలి.  సాధారణ నడకైతే దాదాపు మూడున్నర గంటల నుంచి నాలుగు గంటలు పడుతుంది. నడక మొదలు పెడితే ముందు కోమలమ్మను దర్శించుకోవాలి. ఆమె స్వామి భక్తురాలు.

మొదటి మెట్టు ఎడమవైపే నమస్కరిస్తున్నట్టు గోడకు ఆమె విగ్రహం చెక్కి ఉంటుంది. ఆ విగ్రహానికి అభిముఖంగా కుడివైపు గోడకు చెక్కిన శ్రీనివాసుడి విగ్రహాన్ని కోమలమ్మ నిత్యం ఆరాధిస్తున్నట్టే ఉంటుంది.

తన ఆస్తినంతా దేవుడికి సమర్పించిన మహా భక్తురాలు కోమలమ్మ. టీటీడీ పాత హుజూరాఫీసు, కొత్త హుజూరాఫీసు స్థలం, దాని ఎదురుగా ఉన్న పాలిటెక్నిక్ కాలేజీ స్థలం, పాత మెటర్నిటీ ఆస్పత్రి, ఆమె పేరుతో వెలిసిన కోమలమ్మ సత్రం; ఇవ్వన్నీ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆమె సమర్పించినవే! తొలి మెట్టులోనే ఆమెను దర్శించుకుంటాం.

పాదాల మండపం
మొదటి మండపం నేల మీద సాష్టాంగపడిన మాలదాసు, అతని ముగ్గురు భార్యలు

ఆ తరువాత మొదటి గోపురం వస్తుంది. దీన్నే పాదాల మండపం అంటారు. తిరుమలకు నడిచి వెళ్ళే భక్తులు ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి మరీ ముందుకు కదులుతారు.

ఆ పక్కనే లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంటుంది.

ఆ మండపం దాటితే మాలదాసు, అతని ముగ్గురు భార్యలు ఎదురుగా కొండ ముందు సాష్టాంగపడుతున్నట్టు నేలపైన చెక్కిన చక్కని శిల్పాలు కనిపిస్తాయి.

ఈ మాలదాసు స్వామి వారికి తోలు చెప్పులు ఇచ్చినట్టు ప్రతీతి.ఇది దాటాక చక్కని శిల్ప సౌందర్యం ఉట్టిపడే పెద్దగాలి గోపురం వస్తుంది.ఇది రెండు అతస్తులు ఉంటుంది.ఈ గాలిగోపురాన్ని శ్రీకృష్ణదేవరాయలు నిర్మింప చేశా డు.

ఇది దాటాక కుడివైపున పెద్ద బండరాయి కనిపిస్తుంది.దీన్ని మోకాళ్ళ రుద్దుడు గుండు అంటారు.మొదటి మండపం పక్కనే ఈ గుండు ఉంటుంది.

మెట్లు ఎక్కుతుంటే కాళ్ళు నొప్పి పుడతాయి కనుక, కాళ్ళను ఈ గుండుకు రాస్తే మోకాళ్ళ నొప్పులు గగ్గుతాయని కొందరు భక్తుల విశ్వాసం.అందుకే దీనికా పేరు వచ్చింది.

దారి పొడవునా వచ్చే భక్తులకు ధైర్యం చెప్పడానికన్నట్టు ఆ పక్కనే ఒక పెద్ద బండరాయికి ఆంజనేయ స్వామిని చెక్కారు.

అలి పిరి దారిలో కొండ అంచుల అందాలు

అదిగో మరొక పెద్ద గాలిగోపురం. తొలి గాలిగోపురం లాగానే ఇది కూడా పెద్ద పెద్ద రాళ్ళపైన చెక్కిన అందమైన శిల్పాలతో నిర్మించారు. మైసూరు మహారాజు దీన్ని నిర్మించడం వల్ల దీనికి మైసూరు గాలిగోపురం అని పేరొచ్చింది.అది దాటాక పూరేడు మండపం వస్తుంది. దీన్నే రాజవోలు మండపం అని కూడా అంటారు. ఇక్కడికి 600 మెట్లు ఎక్కినట్టు లెక్క.

మరికొంత దూరం వెళ్ళాక యలక్కాల మండపం వస్తుంది. ఈ ప్రాంతంలో వెలగ చెట్లు ఎక్కువగా ఉండడం వల్ల దీనికి యలక్కాయల మండపం అని పేరొచ్చింది. ఇక్కడి వరకు 1150 మెట్లు ఉన్నాయి.

ఈ యలక్కాయల మండపం నుంచి వెనక్కి చూస్తే సుందరమైన తిరుపతి నగరాన్ని వీక్షించవచ్చు.ఈ మండపం దాటాక చదరం వస్తుంది. ఇక్కడ కుమ్మర దాసు చక్రాల నమూనా ఉన్నది.

చదరానికి ఎడమ పక్కన రెండు ఫర్లాంగుల దూరంలో ఒక పెద్ద కోనేరు వస్తుంది. ఒకప్పుడు ఈ కోనేరు నీటితోనే ఇక్కడ సారా కాచేవాళ్ళు. ఇప్పుడా ప్రాంతానికి వెళ్ళనీయడం లేదు.

ఇక్కడ నుంచి చూస్తే అందమైన కొండ పేటు(అంచు) కనిపిస్తుంది. చుట్టూ పచ్చని చెట్లతో నిండిన వాతావరణం ఎంతో రమణీయంగా ఉంటుంది.

గాలిగోపురం

అల్లంత దూరం నుంచి కూడా కనిపించే గాలిగోపురం అదిగో! నడక మొదలు పెట్టిన 45 నిమిషాల నుంచి గంట లోపల ఈ గాలిగోపురం వరకు వచ్చేస్తాం. గాలి గోపురం దగ్గరకొచ్చేసరికి రివ్వున వీస్తున్న గాలికి చెమటపట్టిన శరీరమంతా చల్లబడుతుంది. ఎంత హాయిగా ఉంటుందో! ఆ చల్లని గాలికి సేదదీరుతాం.

గాలిగోపురం నుంచి వెనక్కి చూస్తే తిరుపతి నగరమంతా కనిపిస్తుంది. దూరంగా తిరుచానూరు ఆలయ గోపురం, నగరం నడిబొడ్డున గోవిందరాజస్వామి ఆలయ గోపురం కనిపిస్తాయి. తూర్పు వైపు అనేక నీటి తటాకాలు కనిపిస్తాయి. రాత్రిపూట తిరు నామాలు కనిపించడానికి గోపురానికి లైట్లు అమర్చారు. ఈ నడక దారి మెట్లతో పాటు గాలి గోపురాన్ని కూడా 17వ శతాబ్దంలో మట్లకుమార అనంత రాయలు నిర్మించాడు.

మండపం లోపలంతా చెక్కిన చక్కని శిల్పాలు ఎంతో రమణీయంగా ఉంటాయి. దీన్ని చుక్కల పర్వతం అని కూడా అంటారు. ఆకాశంలో చుక్కలను (నక్షత్రాలను) తాకినట్టుంటుంది కనుక జనవ్యవహారంలో ఈ పేరు నానుతుండేది.

పురాతనమైన కోనేరు

గోపురం లోపల సీతాలక్ష్మణ ఆంజనేయ సమేత రాముల వారి గుడి ఉంది. ఈ ఆలయంలో ఉత్తర భారతీయులు పూజలు చేస్తుంటారు. దీనికి ఎడమవైపున అద్భుతమైన కోనేరు ఉంది. గాలిగోపురం ఉన్న ప్రాంత మంతా టీటీడీ ఆధీనంలో కాకుండా, గాలిగోపురం మఠం ఆధీనంలో ఉంది.

దేవాదాయ, ధర్మాదాయ శాఖ పర్యవేక్షణలో ఈ మఠమే దీన్ని నిర్వహిస్తోంది. గోపురం దాటాక పెద్ద మండపం నుంచి ముందుకు సాగితే ఎడమవైపున రాతితో నిర్మించిన పురాతన కోనేరు కనిపిస్తుంది.ఇది దిగుడు బావి లాంటిది.

గాలిగోపురం వరకు ఏటవాలుగా మెట్లు ఎక్కడమే కష్టం. ఇక్కడ నుంచి నడక సాఫీగా సాగుతుంది. కాకపోతే కొద్దిగా మెట్లుంటాయి. దీన్ని చిట్టెక్కుడు అంటారు.

ఏడోమైలు వద్ద ఎత్తైన ఆంజనేయుడి విగ్రహం

ఈ చిట్టెకుడు దాటితే ఏడోమైలు మండపం వస్తుంది. దీన్నే మామండూరు మండపం అని కూడా అంటారు. పి.వి.ఆర్.కే ప్రసాద్ టీటీడీ ఈవోగా ఉన్న రోజుల్లో ఇక్కడే ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టించారు. ఒకప్పుడు ఇక్కడ పోలీస్ స్టేషన్ కూడా ఉండేది. ఇప్పుడు ఔట్ పోస్టు మాత్రమే ఉంది.

నడకదారిలో ఏడో మైలు వచ్చామంటే సగం దూరం వచ్చినట్టే లెక్క. ఏడోమైలు దగ్గరే జింకల పార్కు వస్తుంది. ఇది దాటాక దొంగల మండపం వస్తుంది. ఒకప్పుడు ఈ మండపం దగ్గర దొంగలు దారి దోపిడీ చేసేవారట. అందుచేత దీనికా పేరు వచ్చింది. యాత్రికుల్లో ఆ భయం ఇప్పటికీ ఉంది. కనుక, విషయం తెలిసిన వాళ్ళు వంటరిగా కాకుండా గుంపులు గుంపులుగా వెళుతుంటారు. అప్పుడప్పుడు ఇక్కడికి అడవి జంతువులు వస్తుంటాయి.

దీని తరువాత కొత్త మండపం వస్తుంది. తరువాత ముగ్గుబావి వస్తుంది. అక్కడ ఉండే ముగ్గుబావి మండపం దగ్గరకొచ్చేసరికి 2,840 మెట్లు ఎక్కినట్టు లెక్క. ముగ్గుబావి దాటాక ఒక మనోహరమైన బృందావనం కనిపిస్తుంది. పెద్ద ఊడల మర్రిచెట్టు, తాండవ కృష్ణుడి విగ్రహం ఉంటాయి.

విశ్రాంతి తీసుకోడానికి మర్రి చెట్టు చుట్టూ సిమెంటు బెంచీలు ఏర్పాటు చేశారు. నడిచి వెళ్ళే భక్తులకు అలిపిరిలో దివ్య దర్శనానికి టోకెన్లు ఇస్తే, గాలిగోపురం వద్ద వేలిముద్రలు వేసి, ఫొటో తీసుకుంటారు. ముగ్గుబావి వద్ద టోకెన్లపై స్టాంపు వేస్తారు. తరువాత నరసింహస్వామి గుడి వస్తుంది.

ఇక్కడే ఎర్రచందనం దుంగ మీద నరసింహస్వామి దారు శిల్పం చెక్కారు. నరసింహస్వామి ఆలయం వద్ద మూడురోడ్ల కూడలి. ఈ ఆలయం నుంచి ఎదురుగా తిరుమలకు బస్సులు వెళ్ళే రోడ్డు వస్తుంది. ఈ రోడ్డు గుండానే భక్తులు నడిచి తిరుమలకు వెళుతున్నారు.

ఎడమ దిక్కు నుంచి తిరుమలకు వెళ్ళే పాత నడక దారి ఒకటి ఉండేది. దీన్ని ఇటీవల పునరుద్ధరించినప్పటికీ ఎవరూ ఈ మార్గాన వెళ్ళడం లేదు. ఈ దారి గుండానే నామాల గవి, గంటామండపం వెళ్ళవచ్చు. ఈ దారికి అన్నమయ్య మార్గం అని పేరు పెట్టారు కానీ, ఏనాడూ అన్నమయ్య ఈ మార్గాన వెళ్ళిన దాఖలా లేదు. ఈ దారిలోనే ఆంజనేయ స్వామి గుడి వస్తుంది.

అక్కగా ర్లు గుడి పై న దిగిన మర్రి ఊ డలు

బస్సులు వెళ్ళే రోడ్డు మార్గంలో వెళుతుంటే ఎడమవైపు ఎత్తైన కొండ పేటు. ఆ పేటు నుంచి నిరంతరం జాలువారే నీటి ధార. కుడివైపున లోతైన లోయ పేరు అవ్వాచారి కోన. ఈ లోయలో ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. నడకదారి భక్తులు కొందరు ఈ అవ్వాచారి కోనలోకి దిగి ప్రమాద వశాత్తు పడిపోవడం, ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం వల్ల, అటు వెళ్ళకుండా ఎత్తైన ఇనుప కంచె ఏర్పాటు చేశారు.

తిరుమలలో అరుదుగా కనిపించే బెట్టుడత

చాలా అరుదైన బెట్టుడుతలు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తాయి. ఈబెట్టుడుతలు 5 కిలోల బరువుంటాయి. ఇక్కడ కోతులు, కొండముచ్చులు ఎక్కువగా ఉంటాయి. అవ్వాచారి కోనలోనే ‘అన్నమయ్య మార్గం’ నుంచి నడిచి వచ్చే భక్తుల కోసం ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఏర్పాటు చేశారు. తరువాత అక్కగార్ల గుడి వస్తుంది.

అక్కగార్ల గుడి పైన కొండ పేటు నంచి దిగిన చెట్ల వేర్లు గుడికి జటాజూటాలలాగా కనిపిస్తాయి. ఇది దాటితే దారి మలుపు తిరిగి ఎదురుగా మోకాలి మిట్ట గోపురం కనిపిస్తుంది. మోకాలి మిట్ట నుంచి ఎడమవైపుగా తిరుమలకు వెళ్ళే ఘాట్ రోడ్డు కనిపిస్తుంది. ఈ మోకాలి మిట్టకు వెళ్ళాలంటే ఒకప్పుడు అవ్వాచారి కోనలో దిగి ఎక్కాల్సి వచ్చేది.

ఇప్పుడా ఎక్కడం, దిగడం లేకుండా కొంతమటుకు మట్టితో లోయను పూడ్చేసి, వెడల్పైన రోడ్డు నిర్మించారు. ఇది చాలా పెద్దపని.

అవ్వాచారి కోన దాటగానే మోకాలిమిట్ట గోపురం వస్తుంది.ఇక్కడి నుంచి మెట్లు నిటారుగా ఎక్కాలి. ఈ మిట్ట ఎక్కేసరికి మోకాళ్ళు నొప్పులు పుడతాయి కనుక దీనికి మోకాలి మిట్ట అన్న పేరు వచ్చింది. ఈ గోపురం దాటితే రామానుజ సన్నిధి గుడి వస్తుంది. గుడి నుంచి అరగంట నడిస్తే చాలు తిరుమల చేరుకుంటాం.

దారిలో ఇరువైపులా చెట్లు, పెద్ద పెద్ద బండ రాళ్ళలోకి వాటి వేర్లు దిగిన వైనం వింత గొలుపుతాయి. ముందుకు వెళితే వరుసగా నాలుగు జి.ఎన్.సి మండపాలు వస్తాయి. ఇక తిరుమల వచ్చేసినట్టే.

వీటిలో రెండవ మండపం దాటాక బాట గంగమ్మ ఆలయం వస్తుంది. ఈ నాలుగు మండపాలు దాటి ముందుకు సాగితే రామకోటి స్థూపాలు, లేపాక్షి వస్తాయి.

కళ్యాణ కట్ట, పెద్ద మర్రిచెట్టు వద్ద కూడలి వస్తాయి.ఎడమవైపునకు వెళితే వైకుంఠం క్యూకాంప్లెక్స్, ఎదురుగా వెళితే బేడి ఆంజనేయ స్వామి గుడి వస్తాయి. ఎదురుగా శ్రీవారి ఆలయం.

తిరుమల శ్రీవారి ఆలయం

దాని ముందు గొల్ల మండపం.కష్టమైనా ఈ నడకదారిలో వెళ్లడం కూడా ఒక అనుభూతే. దారి పొడవునా మెట్ల పైన సిమెంటు కాంక్రీటుతో షెల్టర్లు నిర్మించారు. ఇవి నిర్మించాక అడవిలో నడిచినట్టు కాకుండా, కాంక్రీటు వనంలోనే సాగినట్టు ఉంటుంది.

ఇప్పుడు ఆ కాంక్రీట్ షెల్టర్ ల స్థానం లో రేకులు వేస్తున్నారు. ఈ షెల్టర్లు నిర్మించకముందు నడిచి వెళ్ళిన వారికి, ఈ షెల్టర్ల కింద నడవడం అంత ఆనందాన్ని కలిగించదు. ఆ పాత నడక దారి అందాలే వేరు.

(ఆలూరు రాఘవ శర్మ, సీనియర్ జర్నలిస్టు, తిరుపతి)

One thought on “తిరుమలకు మెట్లెక్కుతూ ఎపుడైనా వెళ్లారా, ఇవిగో ఆ విశేషాలు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *