ఎందుకు నేస్తమా, భయం
నిమ్మ రాంరెడ్డి
ఎందుకు నేస్తమా భయం
ఉంటే ఉంటవ్
పోతే వోతవ్
పిట్ట బతుకు కంటే
హాయా నీ జన్మ
పరిమళించే పువ్వుకంటే
మిన్ననా నీ బతుకు
సీతాకోక చిలుక కంటె
అందమైనదా నీ జీవితం
పచ్చటాకుకంటే
గొప్పోడివా నువ్వు
ఉంటే
ఈ గిరిగీసిన చట్రములో
జీతగాడివే నువ్వు
పోతే
మట్టి రేణువులుగానో
వానచినుకులుగానో
గాలితెమ్మరగానో
నిప్పుకణికలుగానో
బతికే ఉంటవ్
బతికిస్తనే ఉంటవ్
సత్యం వధా
ధర్మం చరా
న్యాయం హరీ
స్వార్థం సవారీ
అయిన వేళా
ఉండాలనుందా
నేస్తమా
బండరాయిలా బతుకాలనుందా
మానవా
ఎందుకంత ప్రేమ
చూస్తున్నవుగా
ఎవరొస్తండ్రు నీ వెంట
ఏమొస్తొంది నీ వెంట
నీవు చేసిన కర్మఫలాలె కదా ఇవి
సరిదిద్దుకోలేని కార్యాలు నీవి
మోయలేనంత అపకీర్తి నీది
మొదలు నరికి
నీడకోసం వెతుకులాడుతున్నవ్
నేను నేను నేను అంటూ
కాలు నేలమీద పెట్టకపోతివి
నాదీ నాదీ నాదీ అంటూ
భూగోళాన్నే నంజుకుతింటివి
సహచర జగతికి
సంకటమైతివి
సమస్తం నేనని
సంకలెగిరేస్తివి
అందుకే ఈ
క్షణం కోసం కాసులాటలు
గాలికోసం గలాటలు
అయినా
నిలబడగలుగుతున్నవా
ఏమాయె నీ తెలివి
ఎటువాయె నీ కలిమి
ఇకనైనా మారకపోతే
భయమే నీ ఆస్తి
అభద్రతే నీకు వరం
ఎందుకు నెస్తమా భయం
ఉంటే ఉంటవ్
పోతే పోతవ్