‘రామ రామ రామ’ అంటే అది సహస్రనామాలతో సమానం! ఎలాగంటే…?

 

విష్ణుసహస్రనామం-రామతత్త్వం

శ్రీరామచంద్రుడు మహదైశ్వర్య సంపన్నుడు (పరర్థి). అతడే స్పష్టమైన పరతత్త్వం(పరమస్పష్టః).ఆయన కడు సంతుష్టాంతరంగుడు(తుష్టః). పరిపూర్ణుడు(పుష్టః). అతనిచే చూడబడటంకానీ, మనం ఆయనదర్శనం చేసుకోవడం కానీ శుభప్రదం(శుభేక్షణః). తన రూపంతోనూ గుణం తోనూ ప్రజలనురమింప జేస్తాడు(రామః). అతిక్లిష్టమైన వరాలను
ప్రసాదించే దేవతలనూ, కోరి తీసుకొనే రాక్షసులను కూడా
తననుండి విరమింపజేస్తాడు(విరామః).

అతనికి విషయ వాంఛలందు ఆసక్తిలేదు(విరతః).యోగులకు అమృతత్వాన్ని ప్రసాదించేవాడు. దోషంలేనిఅర్చిరాదిమార్గంకలవాడు(మార్గః).

భక్తులకు విధేయుడుగఉంటాడు(నేయః). దుర్మార్గులపట్ల వినయ విధేయతలు లేనివాడు(అనయః).వీరుడు(వీరః).

పరాక్రమవంతుడు.మహాశక్తిమంతుడు(శక్తిమతాంశ్రేష్ఠః).ధర్మస్వరూపుడు(ధర్మః). ధర్మజ్ఞులలో శ్రేష్టుడు(ధర్మవిదంత్తమః). పదార్థాలన్నిటికీ ఒకదానితో ఒకటిగాసంబంధంకలుగజేస్తాడు(వైకుంఠః).

ఆయనపరమపావనుడు(పురుషః).ప్రాణులన్ని టికీ జీవనమైనవాడు(ప్రాణః) . జీవులకు ప్రాణమునిచ్చే వాడు(ప్రాణదః).

తన కల్యాణగుణాలచే జీవులన్నిటినీ తనకు లోబడిఉండేటట్లు చేసేవాడు(ప్రణవః) . దశదిశల వ్యాపించిన యశశ్చంద్రికలుకలవాడు(పృథుః).

శ్రీమన్నారాయణునిఅవతారం. విష్ణుసహస్రనామాలలో ౩౮౯పరర్థి నుంచి ౪౧౦పృథుః వరకు ఉండే నామాలలో రామతత్త్వం వివరించబడింది.

శ్రీవిష్ణు సహస్రనామ ఫలశ్రుతిలో శివుడు
పార్వతికి- శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే,
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని
అని చెప్తాడు.

రామ రామ రామ అని మూడు సార్లు అంటే అది సహస్రనామాలతో సమానం అని భావంఈ అంశాన్ని పూర్వులు ఇలా వివరించినారు:

అక్షరాలకు అంకెలు సంకేతం.ఆ విషయం అక్షరాంక గణితం సుస్పష్టం చేసింది.

‘రామ’ నామంలో రెండు అక్షరాలు ఉన్నాయి.అవి:
‘రా’ , ‘మ’. వర్ణమాలలోని అక్షరాలను ఒక కోణంలో అచ్చులు,
క,చ,ట,త,ప-అనే పంచవర్గాక్షరాలుగా,  య, ర, ల , వ,శ,ష, స, హ – అనే అపంచవర్గీయాక్షరాలుగా  విభజితం.

ఆయా అక్షరాలు కొన్ని అంకెలకు సంకేతం.
‘రామ’ శబ్దంలోని ‘ర’ అపంచవర్గీయాక్షరంలో రెండవది
(య,ర). ‘మ’ అక్షరం పంచవర్గాలలోని ‘ప’వర్గాక్షరాలలో-
(ప,ఫ,బ,భ,మ)- ఐదవది. అంటే రా మ = రా(౨),మ(౫)
రామ- ౨×౫= ౧౦
రామ,రామ,రామ-అంటే ౨×౫, ౨×౫ ౨×౫= ౧౦౦౦
రామ ౨×౫= ౧౦
రామ ౨×౫= ౧౦
రామ ౨×౫= ౧౦
రామ ౧౦×రామ ౧౦×రామ ౧౦= ౧౦౦౦ సహస్రం
రామ రామ రామేతి, సహస్రనామ తత్తుల్యం
రామ రామ రామ

 

సమర్పణ: వైద్యం వేంకటేశ్వరాచార్యులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *