రానా దగ్గుబాటి నటించిన ‘అరణ్య‘ తాజా పైరసీ టార్గెట్ అయింది. నిన్న మార్చి 26 న విడుదలైన ఈ మూవీ తెలుగు తమిళ వెర్షన్స్ వివిధ పైరసీ సైట్లలలో ప్రత్యక్షమైంది. తమిళ్ రాకర్స్ తో బాటు మూవీ రూల్జ్, ఇసిమిని, మాస్టామిలాన్, మూవీస్డా, తమిళగన్, మూవీస్పూర్, కుట్టిమోవీస్, ఎమ్పి 4 టామిస్ వంటి అనేక పైరసీ వెబ్సైట్స్ లో బాహాటంగా దుకాణం పెట్టేసింది. టెలిగ్రామ్ లో కూడా డౌన్ లోడ్స్ కి ద్వారాలు తెరిచేశారు.
అసలే అంతంత మాత్రం ప్రేక్షకాదరణ పొందిన ఈ మూవీ, ఆన్లైన్లో లీక్ కావడంతో బాక్సాఫీస్ కలెక్షన్ల పై భారీ ప్రభావితం చూపే అవకాశముంది. దాదాపు ప్రతీ సినిమా పైరసీ బారిన పడుతోంది. ఇది సర్వ సాధారణమైపోయి నిర్మాతలు చర్యలు తీసుకోవడం కూడా మానేశారు. ప్రేక్షకులే సైబర్ సెల్ కీ, నిర్మాతలకీ ట్విట్టర్ ద్వారా తెలియజేయాలని డిజిటల్ మీడియా వర్గాలు సూచిస్తూంటాయి. స్పందించే ప్రేక్షకులెవరుంటారో తెలియదు. ఆన్ లైన్లో లీకయిన ఈ సినిమాలనే ఓటీటీ కంపెనీలు కొనుగోలు చేస్తాయి. ఈ కంపెనీలు కూడా పైరసీని పట్టించుకోవు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు సాగుతోంది.