చెడును వెక్కిరించి,దుర్మార్గాన్ని ప్రశ్నించిన రాజకీయ వ్యంగ్యకారుడు. మార్చి 11 కె.ఎన్.వై.పతంజలి (12వ) వర్థంతి. ఈ సందర్భంగా నివాళి)
ఎన్నికలైపోయిన తర్వాత దేశమంతా ఎలాగుంటుంది?
దగా పడిన ఒక ఆడకూతురిలాగా వుంటుంది!
దొంగ నవ్వుల బ్రోకర్ని నమ్మేసి అమాయకంగా
రైలెక్కిపోయిన పల్లెటూరి పిచ్చి పిల్లలాగా ఉంటుంది
దేశం.
ఎన్నికలు పూర్తి అయిపోయిన తర్వాత దేశం
ఎలాగుంటుంది?
తీరని కోరికలతో లక్ష బ్యాలేటు పత్రాల నోమునోస్తున్న
బాలవితంతువులాగా ఉంటుంది దేశం.
గాలికి ఉబ్బిపోయిన ఒక గుడారంలాగుంటుంది.
చిరిగిపోయిన ప్రచార పత్రాల గుట్టలాగుంటుంది.
ఎన్నికలైపోయినాక ఏమౌతుంది?
అసత్య ప్రచారాల,
జయ విజయధ్వానాల ఘోష తగ్గినాక
మనకి హఠాత్తుగా మన దరిద్ర సముద్రం హోరు వినిపిస్తుంది.
మనకి భోజనం లేదని గుర్తుకొస్తుంది.
మనకి ఉపాధి లేదని, మనకి దిక్కూ, దివాణం లేదని,
మనకి తెరువూ, తీరూ లేదని మళ్లీ గుర్తుకొస్తుంది.
మనకి మళ్లీ వెనుకటి మన చక్రవర్తుల బిడ్డల పట్టాభిషేకం గుర్తుకువస్తుంది.
మన త్రివర్ణ పతాకం మీద పరాయి మనుషుల నీడల పడుతున్నాయని మనకి
మళ్లీ భయం వేస్తుంది.
పథకాలు పారడం లేదని మళ్లీ గుర్తుకొచ్చి
మనమీద మనకి జాలేస్తుంది.
సమస్యల పరిష్కారం కోసం కాక ఓట్లు నొల్లుకోవటానికి మనకి నినాదాలు వినిపించారని తెలుస్తుంది.
మనల్ని భయపెట్టి, మనల్ని భ్రమ పెట్టి, మనభయాల్ని, మన భ్రమల్ని మనకి ఎరగా
చూపి మనల్ని మనవాళ్లే వలలో వేసుకున్నారని తెలిసి మనకి కొంత బాధ కలుగుతుంది.
ఎన్నికలైపోయినాక మనల్ని ఎవరో వెక్కిరిస్తున్నట్టు అనిపిస్తుంది.
ఎవరో మనల్ని చూసి నవ్వినట్టుంటుంది.
ఎన్నికల జ్వరం తగ్గిపోయిన తర్వాత మన పూర్వస్థితి గుర్తుకొచ్చి అంతా
మునపటిలాగే చీకటిగా, ఆకలిగా, నిరాశగా, నిస్సత్తువగా, అగమ్యంగా ఉన్నట్టు
అర్థమవుతుంది.
పంచుకోలేక మనం తగువులాడుకుంటున్న రొట్టెను కోతి తినేసినట్లు తెలుస్తుంది.
పరాయి గజనీలైనా, మన సొంత నిజాములైనా ఒకటే అని బోధపడుతుంది.
శ్రీ కృష్ణదేవరాయులైనా, ఔరంగజేబైనా ఒకటేనని అర్థమవుతుంది.
మన ఇంట పుట్టిన దోమైనా, పరాయింట పుట్టిన జలగైనా మన రక్తం పీల్చే
బతుకుతాయని స్పష్టపడుతుంది.
తెలిసి తెలిసీ అయిదేళ్లకోసారి జీవితాంతం మోసపోవడం గూర్చి ఏడుపొస్తుంది.
మనమీద మనకి కొంచెం అసహ్యం వేస్తుంది.
మనమీద కొంత రోత పుడుతుంది.
మనబుద్ధి గడ్డి తింటున్నాదని తెలిసి సిగ్గేస్తుంది.
ఎన్నికల పతాకాలు విప్పేసిన తర్వాత, గుడారాలు పీకేసిన తర్వాత, పట్టాభిషేకం
మహోత్సవం ముగిసిన తర్వాత
తుపాకీ ఇంకా మనకేసే గురి పెట్టి ఉందని
తెలుస్తుంది.
మన ఓటే మనల్ని కాటేసిందని తెలుస్తుంది.
(“పతంజలి భాష్యం” నుండి)
కెఎన్ వై పతంజలి ఎవరు?
పతంజలి అసలుపేరు కాకర్లపూడి నారసింహ యోగ పతంజలి. విజయనగరం జిల్లాలోని అలమండలో మార్చి 29, 1952న జన్మించారు.11వ ఏటనే రచనా వ్యాసంగాన్ని ప్రారంభించారు. 1975 నుంచి 84 వరకు ఈనాడులో, 1984 నుంచి 90 వరకు ఉదయం పత్రికల్లో పనిచేశారు. తర్వాత ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, టి.వి – 9లో, సాక్షి పత్రిక ఆవిర్భావంలో ఎడిటర్ గా విధులు నిర్వహించారు. సింధూరం సినిమాకు మాటలు రాశారు. అందుకు వీరికి నంది పురస్కారం కూడా లభించింది.పెంపుడు జంతువులు, ఖాకీవనం, పిలక తిరుగుడు పువ్వు, గోపాత్రుడు, వీర బొబ్బిలి, ఒక దెయ్యం ఆత్మకథ, అప్పన్న సర్దార్, మేరా భారత్ మహాన్, రాజుల లోగిళ్లు..వంటి నవలు,దిక్కు మాలిన కాలేజి,చూపున్న పాట,వేట కథలు, జ్ఞాపక కథలు, శభాషో మోపాసా.. వంటి కథా సంపుటాలు,పతంజలి భాష్యం, గెలుపు సరే బతకడం ఎలా…వంటి ఇతర రచనలు చేశారు.
పతంజలి రచనలను అర్థం చేసుకోవాలంటే 1970 ల నుంచి సమాజాన్ని అవగతం చేసుకోవాలి. తెలుగునేలపై వచ్చిన సాంస్కృతిక, రాజకీయ మార్పులను, ఉద్యమాలను తెలుసుకోవాలి.బాల్యంలో భూస్వాముల ఇళ్లల్లోని గొప్పలు, యవ్వనంలో విశాఖతీరంలోని అనుభవాలు, ఉత్తరాంధ్రలోని ఉద్యమాల ప్రభావం అన్నీ వీరి రచనల్లో అంతర్గతంగా కనిపిస్తాయి. ఇంకా శ్రీశ్రీ, పురిపండ అప్పల స్వామి, కారా మేస్టారు, రావి శాస్త్రి, చెకోవ్, మొపాసా, గురజాడ, చాసో, ఆస్కార్ వైల్డ్, వేమన, సెర్వాంటిజ్ ల ప్రభావం కూడా ఉంది. అందుకే చమత్కారం, వ్యంగ్యం, విలక్షణమైన వచనశైలి వీరి సొంతం. పాత్రచిత్రణ, సన్నివేశాల కల్పన, సంభాషణలు… సరికొత్తగా మెరుస్తుంటాయి. ప్రతి రచనలో అంతుచిక్కని లోతు, అర్థం చేసుకున్నంత విస్తృతి కనిపిస్తుంది.
‘ఖాకీవనం’లో ప్రభుత్వం తరపున ప్రజలపై ధౌర్జన్యం చేసే వాళ్లే అధికార వర్గాన్ని నిలదీయడం చూడొచ్చు. వీరబొబ్బిలిలో రాజుల లోగిళ్లలో పుట్టి పెరిగి వారి మాటలతో పాటు, మర్యాదలు, పెంకితనాన్ని నేర్చుకున్న గ్రామసింహం (కుక్క) తీరును వ్యంగ్యంగా అర్థం చేసుకోవచ్చు. నావల్ల ఈ దివాణానికి కళ, కాంతి అని విర్రవీగే కుక్క అది. చూపున్న పాట కథలో గుడ్డివాడు తన ప్లూటులో విప్లవాన్ని ఉద్దేశించే పాట పాడితే… అది పోలీసును ఎలా భయపెడుతుందే వివరించారు. నువ్వే కాదు… నవలికలో డబ్బు మనుషుల్ని ఎలాంటి దైన్యానికి దిగజారుస్తుందో తెలియజేశారు. న్యాయం, మీడియా అన్నీ వ్యవస్థలూ అవినీతి మయం అయ్యాయని రుజువు చేశారు. అసలు పతంజలి సృష్టించిన పాత్రలు వెక్కిరిస్తాయి, చమత్కారంగా సంభాషిస్తాయి, పాఠకుల గుండెలను బరువెక్కిస్తాయి, తర్కంతో మెప్పిస్తాయి. మానవ స్వభావం, ఆశలు, నిరాశలు, అన్నీ వ్యవస్థీకృతం అని చెప్పకనే చెప్తాయి. మనల్ని మేడిపండు వొలిచినట్లు వొలిచి మనలోని లోపాల్ని పురుగుల్లా బైటకు చూపెడతాయి.
తన రచనల గురించి పతంజలి స్వయంగా చెప్తూ- నేను వ్యంగ్యాన్ని ప్రత్యేకంగా రాయను, మనుషుల్లో ఉన్నదే రాస్తాను అంటారు. చెడును. దుర్మార్గాన్ని వెక్కిరిస్తే నాకు సంతోషం. వ్యంగ్యంలో నా బాధ, క్రోధం ఉంటాయి.”నా బండ బుద్ధికి,అది అన్యాయం అని తోస్తేనూ..అది ఘోరం అనిపిస్తేనూ..అది పరమ అధర్మం అనిపిస్తేనూ..రాసేస్తానూ”అన్న పతంజలి 2009లో మరణించారు.
–PDSO