నవులూరు పుట్ట: హిందువులకు నాగేంద్ర స్వామి, ముస్లింలకు నాగుల్ మీరా

మత సామరస్యానికి ప్రతీక, మహిమాన్వితం, సంతాన ప్రదాతగా ప్రాచుర్యం

 

పుట్టని పూజించడమనేది భారతదేశమంతా అనాదిగా వస్తున్న ఆచారం.ఒకపుడు దేశమంతా ఉండినా, ఇపుడు దక్షిణ భారతదేశంలో బాగా ప్రాచుర్యంలో ఉన్న సంప్రదాయం. పుట్టని పూజించడమంటే నాగదేవతని పూజించడం. నాగుల ను పూజించేందుకు తెలుగు వారికి ఏకంగా ‘నాగుల చవితి’ పండగే ఉంది.  వేదకాలంలో  పుట్టలను పూజించడం చాలా ఎక్కువగా ఉండేదని చెబుతారు. పుట్ట పూజకి ఎంత ప్రాముఖ్యం ఉండేదంటే జీవితంలో ప్రతిఘట్టానికి, పుట్టుక నుంచి చావుదాకా అంటే పుట్టుక, వివాహం, సంతానం, జబ్బులు.. ఇలా ప్రతిదశలో పుట్ట పూజ చేసే వారు. పుట్ట ఆరాధన  చాలా పురాతన కాలం నుంచి వస్తున్నా సంతానం కోసం పుట్ట చుట్టూ దంపతులు పదక్షిణ చేయడం ప్రాచీన కాలం నుంచి వస్తున్న అనవాయితీ అని ప్రఖ్యాత మానవసమాజ పరిశోధకుడు జాన్ సి ఇర్విన్ (John C. Irwin ) ఒక పరిశోధనా పత్రం (The Sacred Anthill and the Cult of the Primordial Mound)  లో పేర్కొన్నారు. పుట్ట మన్నును తీసుకువచ్చి నాగపడిగ రూపంలో బొమ్మ తయారు చేసి వివాహ సమయంలో నూతన దంపతుల చేత పూజచేయించే పద్థతి గురించి ఇర్విన్ ప్రస్తావించారు. మరొక ఆచారం ఏమిటంటే, దంపతులిద్దరు పుట్ట చుట్టు ప్రదక్షిణ చేస్తూ నాటకం మాడతారు. ఇందులో పెళ్లికూతురు తప్పించుకుపోయేందుకుప్రయత్నిస్తుంది. అపుడు వరుడు ఆమె పట్టుకుని పారిపోకుండా నివారిస్తాడు. గర్భధారణ కోసం పుట్ట చుట్టూ నాట్యమాడే వారని కూడా ఇర్విన్ రాశాడు.

Sacred “anthill” photographed beside the Madras-Kanchipuram road, Tamil Nadu. (Photo by John C Irwin, January 1979)

అయితే, ప్రాచీన అడవి జాతులలో  ఈ ఆచారం కనిపించినా, ఇది ముఖ్యంగా హిందూ సంప్రదాయం. అయితే, పుట్టని ఇదే ఉద్దేశంతో అంటే సంతాన ప్రాప్తికోసం ముస్లింలు కూడా ఆరాధించడమనేది గుంటూరు జిల్లాలో ఉంది. ఇదొక విచిత్రం.  ఈ పుట్ట దేవుడు హిందువులకే కాదు, ముస్లింలలో  కూడా సంతాన ప్రదాత అయి మతసామరస్యానికి ప్రతీకగా నిలబడ్దాడు. దీని మీద ప్రత్యేక కథనం.

(సాయిశ్రీ, మంగళగిరి)

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరు గ్రామంలోని శ్రీ పుట్ట నాగేంద్రస్వామి ఆలయం ఇలా మత సామరస్యానికి, హిందూ ముస్లిం ఐక్యతకు అద్దం పడుతుంది.

మంగళగిరి రైల్వేస్టేషన్ సమీపంలో ఒకటిన్నర ఎకరాల మామిడి తోటలో ఉన్న శ్రీ నాగేంద్రస్వామి వారి ఆలయం ప్రసిద్ధి గాంచింది. అందుకే గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఇది నవులూరు పుట్టతోటగా పేరొందింది. స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ప్రధాన ఆలయం పుట్ట. గర్భగుడికి బయట వైపున జెండా చెట్టు వుంది.

పుట్ట దేవాలయం బయట జెండా చెట్టు (Pic credit: Sai Sri)

హిందువులు శ్రీ నాగేంద్రస్వామి పేరుతోను, ముస్లింలు ’నాగుల్ మీరా‘ పేరుతో సందర్శించి స్వామివారిని పూజిస్తారు.

నవులూరులో 1940వ దశకంలో వెలసిన ఈ నాగేంద్రుని ఉనికిపై అనేక చిత్రమైన సంఘటనలు ప్రచారంలో ఉన్నాయి. స్వయం వ్యక్తమైన శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారి సేవలో మల్లయ్య అనే భక్తుడు సోది అనే ప్రత్యేకశైలిలో అనుగ్రహం పాటలాగా చెప్పడం ఆనవాయితీ. అనేక రుజువులు చూపి సత్యం చాటుకున్న ఈ స్వామి భక్తులు మతసామరస్యానికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తారు. వాస్తు బలమైన ఈ నాగేంద్రుడు ప్రత్యేకించి సంతాన ప్రదాతగా విశేష ప్రాచుర్యం పొందారు. స్వామి వారిని సేవించే పుణ్య స్త్రీల మనోవాంఛితములెల్ల సఫలం చేసే కరుణామూర్తిగా, దుష్టశక్తుల పాలిట కాలనాగై కాటు వేయగల దుష్ట శిక్షకునిగా పేర్కొంటారు.

నవులూరు పుట్టకు పూజలు చేస్తున్న హిందూవులు, ముస్లింలు (credit: Sai Sri)

ఆదివారం పర్వదినం. గురువారం ప్రత్యేకం. పాలు పొంగళ్లు, ప్రదక్షిణ వారాలు, పుట్టు వెంట్రుకలు, పోగులు కుట్టుట, అన్నప్రాశాది మొక్కుబడులు నిత్యం జరుగుతుంటాయి. నాగుల చవితి, నాగపంచమి, కార్తీక మాసాల్లో భక్తులు విశేష సంఖ్యలో వస్తుంటారు. దేవస్థానం వారు భక్తులకు వివాహ శుభకార్యాలు జరిపేందుకు 2008లో కల్యాణ మంటపం కట్టించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *