పదవీ విరమణ వయసు పెంపు తప్పు: తెలంగాణ నిరుద్యోగుల కోసం ఒక టీచర్ వాదన

(వడ్డేపల్లి మల్లేశము)

తెలంగాణ  రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయసు పెంపు ప్రతిపాదన తరచుగా పత్రికల్లో కనపడుతూ ఉన్నది. బిశ్వాల్ గారి మొదటి పే కమిషన్ రిపోర్టు కూడా ఇదే సిఫార్స్ చేసింది. ఉద్యోగులు ఉపాధ్యాయులు వ్యతిరేకత రాకుండా పైగా వారి మద్దతును కూడ గట్టుకునే క్రమంలో  రాష్ట్ర ప్రభుత్వము ఈ ప్రకటన జరుగుతున్నట్లుగా మనకు తెలుస్తున్నది.

ఎవరి డిమాండ్ ఇది:

కూలీలు తమ కూలీని  పెంచాలని, ఉద్యోగులు తమ వేతనాలను పెంచాలని కార్మికులు  కనీస వేతనాలను పెంచాలని కోరుతున్న ప్రతిపాదన ప్రభుత్వ ముందు అనేక సంవత్సరాలు గా ఉన్నది.

దాదాపుగా 40 సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి పార్ట్టైమ్ స్వీపర్ల వ్యవస్థ ఇప్పటికి నాలుగు వేల రూపాయల వేతనం కూడా దాటలేదు. అంటే వారి జీవితాల పట్ల ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు గాని, ప్రభుత్వాలకు గానీ ఎంత చిత్తశుద్ది ఉందో దీనిని బట్టి తెలుస్తుంది.

ఇంకా ఇప్పటికీ స్కావెంజర్ 1500, 2500 వేతనాలతోని వెట్టి చాకిరీ చేస్తూ పాఠశాలల్లో విద్యా సంస్థల్లో దిక్కు మొక్కు లేని అనాధ లా  జీవితాలను కొనసాగిస్తున్నా కూడా అటు ప్రభుత్వానికి ఇటు ఉద్యోగ సంఘాలకు కనిపించడం లేదు.

కానీ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఏనాడు కూడా డిమాండ్ చేయనటువంటి ఉద్యోగ విరమణ వయస్సు పెంపుదల గురించి మాత్రం తరచుగా పత్రికల్లో రావడం జరుగుతున్నది. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఆ విషయంపై పెదవి విప్పకపోవడం తాము దాన్ని కోరడం లేదన్నట్టుగా ప్రజల దృష్టి మరల్చడానికి చేస్తున్నా ప్రయత్నంగా చెప్పవచ్చు.

ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల బాధ్యులను అడిగినప్పుడు మేమైతే డిమాండ్ చేయలేదని,  వ్యక్తిగతంగా అది మాకు ఇష్టం లేదని చాలా మంది చెబుతుంటారు. కానీ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు  ఉద్యోగ విరమణ వయసు పెంపుదల గురించి నోరెత్తకుండా ఉండటం ఆ పెంపుదలను ఆశించినట్లే కదా!

విరమణ వయస్సు పెంపుదల ఎవరి ప్రయోజనం కోసం:-

భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఉన్నంత మాత్రాన దాన్ని  చట్టబద్ధం చేయాల్సిన అవసరం తెలంగాణలో లేదు. పైగా ఉద్యోగులు ఉపాధ్యాయులు సామాజిక బాధ్యత కలిగిన వారు కనుక ఈ రాష్ట్రంలో నిరుద్యోగులుగా ఉన్న వారికి ఉపాధి కల్పించాల్సిన బాధ్యత  ఉన్నవారు. ఇలాంటి విషయాన్ని చర్చించి ప్రభుత్వాన్ని ఒప్పించ వలసిన కర్తవ్యం కూడా సంఘాల పైన ఉన్నది. కానీ ఉద్యోగ కల్పన గురించి ఆలోచన గాని చర్చ గాని జరగడం లేదు ఇది బాధాకరం.

రాష్ట్రంలో ఇప్పటికి 1,91,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు  ఇపుడు వెల్లడయింది. ఇపుడు పెరిగిన కార్యాలయాల పని భారాన్ని దృష్టిలో ఉంచుకుంటే మరిన్ని ఉద్యోగాలు సృష్టిస్తే దాదాపుగా రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశం ప్రభుత్వం చేతిలో ఉంది. ఇప్పటికిప్పుడు ప్రభుత్వం మూడు సంవత్సరాలు అదనంగా  ఉద్యోగ విరమణ వయసు పెంచడానికి సిద్ధపడితే ఉద్యోగ విరమణ చేసే వారుండు. మరొక వైపు  ప్రభుత్వం  ఉన్న ఖాళీలు భర్తీ చేయదు. అపుడేమవుతుంది?  నిరుద్యోగులు నిరుత్సాహం నిర్వేదంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ ప్రమాదాన్ని బుద్ధిజీవులు గా మనం గుర్తించవలసిన అవసరం ఉన్నది.

కనుక ఉద్యోగ విరమణ వయసు పెంపు ప్రతిపాదన ఏ రకంగానూ సమాజానికి, నిరుద్యోగులకు మేలు కాదు.  కేవలం కొన్ని కుటుంబాల మద్దతు కోసం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం లక్షలాది కుటుంబాలను చీకట్లోకి నెట్టడమే అవుతుంది.

ఏ సంఘాలు డిమాండ్ చేయకపోయినా ప్రభుత్వం రెండోసారి ఎన్నికైన సందర్భంగా ఈ ప్రతిపాదన చేసినట్టుగా మనకు కథనాల ద్వారా తెలుస్తున్నది. కానీ ప్రభుత్వం కూడా నిరుద్యోగుల గురించి ఆలోచించాలి కానీ ఉద్యోగంలో ఉన్న వారికి అదనపు ప్రయోజనం కోసం ఆరాటపడ వలసిన అవసరం లేదు

ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల కు విజ్ఞప్తి:

సామాన్య ప్రజానీకం రైతులు కార్మికులు అట్టడుగు వర్గాల వారు అనేక ఇబ్బందులతో ఒకవైపు కాలం వెళ్లదీస్తుంటే సమాజం  పోకడలను చూసి ఆరాటపడి, ఆవేదన చెంది, ప్రభుత్వంపై ఒత్తిడి చేయవలసింది పోయి ఉద్యోగ విరమణ వయసు పెంపు ప్రతిపాదన పట్ల ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు స్పందించక పోవడం బాధాకరం.

అర్ధాకలితో ఇబ్బందులతో పొట్టకూటి కోసం అనేక పాట్లు పడుతున్నటువంటి నిరుద్యోగుల యొక్క ఆర్తనాదాలు చూసైనా ఉద్యోగ సంఘాలు ఉద్యోగ విరమణ పెంపు ప్రతిపాదనను ప్రభుత్వానికి తెలియజేసి రద్దు చేసుకోవాల్సిందిగా కోరినట్లయితే ఉద్యోగ సంఘాలు సామాజిక బాధ్యతలు నిర్వహించిన వాళ్ళవుతారు సమాజము వారి కృషిని అభినందిస్తూ ఉంది.
ఇప్పటికీ అసమానతలు అంతరాలు వివక్ష తో కూడుకున్న సమాజం సమానత్వం దిశగా కొనసాగించవలసిందిగా పోయి కడుపు నిండిన వారికి అన్నం పెట్టడం ఎవరి ప్రయోజనం కోసమో ప్రభుత్వాలు, బుద్ధిజీవులు, మేధావులు, సామాజిక కార్యకర్తలు ఆలోచించవలసిన అవసరం ఉన్నది.
రాష్ట్రంలో నిరుద్యోగులు గా ఉన్నటువంటి యువత కూడా తమ కర్తవ్యాన్ని గుర్తించి ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం ద్వారా మాత్రమే పరిష్కారాన్ని చూడగలము నిరుద్యోగ యువతకు ఉపాధి ని పొందగలము. ఈ విషయంలో యువత సమాజం యొక్క సహకారాన్ని పొందడం ద్వారా మాత్రమే ఈ లక్ష్యాన్ని సాధించవచ్చు.

ఇందులో ఉన్న అసలు సమస్య ఏమిటంటే ఉద్యోగానికి అర్హత వయసు కూడా పెరిగి చివరికి ఉద్యోగానికి అక్కరకు రాకుండా పోయినప్పుడు వాళ్ళ కన్నీరు చూడడానికి మీరు సిద్ధంగా ఉంటారా?
వాళ్ల జీవితాల్లో వెలుగులు నింపడానికి వారికి నైతిక మద్దతు ఇస్తారా? కన్నీరు తుడిచే మానవతా వాదానికి పట్టం కట్టండి. మానవతావాదులు గా మిగిలి పొండి. ఇదే మీకు నా విజ్ఞప్తి!

Vaddepalli Mallesam

(ఈ వ్యాసకర్త సామాజిక విశ్లేషకుడు, కవి, రచయిత. సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట, మొబైల్ నెం. 9014206412)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *